పాకిస్తాన్‌లో వేల మంది మాయం: బలూచిస్తాన్‌లో గల్లంతైన ఈ విద్యార్థైనా ప్రాణాలతో తిరిగివస్తారా...

- రచయిత, ఇలియాస్ ఖాన్
- హోదా, ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి
సనా బలూచ్ కనిపించకుండా పోయి దాదాపు మూడు నెలలు అవుతోంది. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో చాలా మంది విద్యార్థుల్లానే ఆయన కూడా ఇంటికి వెళ్లారు. మిగతావారి లాగే ఆయన భవిష్యత్తుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోని ఖరాన్ అనే చిన్న పట్టణంలో సనా బలూచ్ జన్మించారు. ఇస్లామాబాద్‌లో ఉన్న ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఆయన పీజీ చేస్తున్నారు. సనా ప్రతిభావంతుడైన విద్యార్థి. ఖరాన్ శివారుల్లో మే 11న ఆయన కనిపించకుండాపోయారు.
ఇలా బలూచిస్తాన్‌లో వ్యక్తులు కనిపించకుండాపోవడం ఇదేమీ కొత్త కాదు. వేల మంది ఇలాగే గల్లంతయ్యారు.
ఖనిజ వనరులు బాగా ఉన్నప్పటికీ బలూచిస్తాన్ ఓ పేద ప్రాంతంగానే ఉంది.
స్వయంప్రతిపత్తి కోసం స్థానికులు చేస్తున్న ఉద్యమాలను దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం దారుణంగా అణచివేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను పాక్ సైన్యం తోసిపుచ్చుతోంది.
గత కొన్నేళ్లలో బలూచిస్తాన్‌లోని సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల్లో ‘నిర్బంధ’ కేంద్రాలు విపరీతంగా పెరిగినట్లు కథనాలు వచ్చాయి.
‘‘చట్టాలకు అతీతంగా మనుషులను తీసుకువెళ్లి, ఈ కేంద్రాల్లో పెట్టి హింసిస్తుంటారు. విచారిస్తుంటారు’’ అని పాకిస్తాన్ మానవహక్కుల కమిషన్ ఆరోపించింది. బలూచిస్తాన్‌లో కొన్నేళ్లుగా వేల మంది గల్లంతయ్యారని మానవహక్కుల కార్యకర్తలు అంటున్నారు.
ఖరాన్‌లోని ఓ నిర్బంధ కేంద్రంలోనే సనా బలూచ్‌ను ఉంచినట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు. అయితే, తన వివరాలు బయటకు వెల్లడించవద్దని ఆ వ్యక్తి బీబీసీని కోరారు.
సనా బలూచ్ ఎక్కడున్నారో వారి కుటుంబ సభ్యులు తెలియదంటున్నారు. అయితే వాళ్లు ఆయన ఆచూకీ కోసం కోర్టును గానీ, అధికారులను గానీ ఆశ్రయించలేదు.
ఇది సనా గురించి వారికి పట్టింపు లేక కాదు.
‘‘మీరు బలూచిస్తాన్‌లో ఉంటే ఆ పని చేయరు. మంచి జరగాలని, మౌనంగా వేచి చూస్తారు. షహ్దాద్ ముంతాజ్ తల్లిదండ్రుల్లా’’ అని ఓ వ్యక్తి అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
షహ్దాద్ ముంతాజ్ కూడా బలూచిస్తాన్‌కు చెందిన ఓ విద్యార్థి. 2015 ఆరంభంలో ఆయన కనిపించకుండా పోయారు. ఆయన కుటుంబం ఈ విషయం గురించి మౌనంగా ఉంది. కొన్ని నెలల తర్వాత షహ్దాద్ ఇంటికి తిరిగివచ్చారు.
కానీ, ఆయనకు చివరికి ఏం జరిగిందనేది కొందరికి హెచ్చరికగా మిగిలింది.
సనా బలూచ్ గల్లంతవ్వడానికి పది రోజుల ముందు, అంటే మే 1న పాకిస్తాన్ సైన్యంతో ఎదురుకాల్పుల్లో షహ్దాద్ మరణించారు.
వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) షహ్దాద్‌ను తమ సభ్యుడిగా ప్రకటించుకుంది. ‘‘పాకిస్తాన్ సైన్యం, దాని హంతక ముఠా సభ్యుల’తో పోరాడుతూ షహ్దాద్ ప్రాణాలు వదిలినట్లు పేర్కొంది.
అయితే, షహ్దాద్‌ను బీఎల్ఏ తమ సభ్యుడిగా ప్రకటించుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
షహ్దాద్ నిజంగానే మిలిటెంట్‌గా మారాలని ఇన్నాళ్లూ అనుకుంటూ ఉన్నారా? తన కుటుంబం, బంధువులు, స్నేహితులు, లెక్చరర్లకు తెలియకుండా, ఈ విషయాన్ని దాచి పెట్టారా? ఒకవేళ అదే నిజమైతే, ఆయన్ను మొదట అదుపులోకి తీసుకున్నవాళ్లు ఎందుకు విడిచిపెట్టారు?
సనా బలూచ్ కూడా షహ్దాద్ బాటలోనే ఉన్నారా?
ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం... దశాబ్దాలుగా బలూచిస్తాన్‌కు, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య దెబ్బతిని ఉన్న సంబంధాలను, ఈ ప్రాంతంలో విద్యావంతులవుతున్న యువతపై అది చూపుతున్న ప్రభావాన్ని గమనించాల్సి ఉంటుంది.
బలూచిస్తాన్ సమస్యలో అక్కడ విస్తారంగా ఉన్న సహజ వనరులు ఒక్కటే అంశం కాదు. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం ఉన్న ఈ ప్రావిన్సుది, ఆ దేశ జనాభాలో మాత్రం 5.9 శాతం వాటానే.
బలూచిస్తాన్‌లో ఖనిజ సంపద సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.
దశాబ్దాలుగా సంక్షోభంలో ఉన్న దక్షిణ అఫ్గానిస్తాన్ ప్రాంతంతో బలూచిస్తాన్ సరిహద్దు పంచుకుంటోంది. ఆ సంక్షోభం ప్రభావం బలూచిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోనూ ఉంటుంది.

షహ్దాద్ బాగా చదువుకున్నారు. సామాజికంగా క్రియాశీలంగా ఉండేవారు. తన సొంత పట్టణం తౌర్బత్‌లో ఓ ప్రముఖ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పాకిస్తాన్ మానవహక్కుల కమిషన్‌కు ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేశారు. ఈ ప్రాంతంలో వ్యక్తులు కనిపించకుండాపోవడం పెద్ద సమస్య. ఈ ఘటనలకు సంబంధించి షహ్దాద్ నివేదికలు అందించేవారు.
అయితే, 2015లో ఆయనే కనిపించకుండాపోయారు. అయితే, ఆయన అదృష్టవంతుల్లో ఒకరని స్థానిక విశ్లేషకుల్లో ఒకరు అన్నారు.
‘‘తాను మారానని, తమ జాతీయవాద ఉద్యమం తప్పని చెప్పి తనను బంధించినవారికి షహ్దాద్ నచ్చచెప్పగలిగారు’’ అని అభిప్రాయపడ్డారు.
షహ్దాద్ విడుదలైన తర్వాత 2016లో ఇస్లామాబాద్‌లోని కైద్ ఏ ఆజాం యూనివర్సిటీ (క్యూఏయూ)లో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. నిర్బంధంలో తన అనుభవాల గురించి అక్కడ తన సహవిద్యార్థితో ఆయన వివరాలు పంచుకున్నారు.
ఆ సహవిద్యార్థి తన పేరును గోప్యంగా ఉంచాలన్న షరతుపై బీబీసీతో మాట్లాడారు.
‘‘రాజకీయ ఉద్యమం వల్ల నష్టాలు వస్తయాని అక్కడ నూరిపోస్తున్నారని... చదువుపై దృష్టి పెట్టి, ఉద్యోగం సంపాదించుకోవాలని చెబుతున్నారని షహ్దాద్ చెప్పారు. పాకిస్తాన్ శత్రువుల ఉచ్చులో చిక్కుకుని, నినాదాలతో సమయం ఎందుకు వృథా చేసుకుంటున్నావని ప్రశ్నించారని అన్నారు’’ అని ఆ విద్యార్థి వివరించారు.
‘‘ఇదంతా ఆయన్ను హింసిస్తూ, వాళ్లు చెప్పేవారు. ఆయన్ను తన్నేవాళ్లు. కర్రలతో కొట్టేవాళ్లు. చంపేస్తానని బెదిరించేవాళ్లు. దూషించేవాళ్లు. నిద్ర పోనిచ్చేవాళ్లు కాదు. ఆహారంగా ఓ రకమైన పప్పు ధాన్యాన్ని మాత్రమే ఇచ్చేవాళ్లు’’ అని వివరించారు.
అందుకే ఆ పప్పు ధాన్యమంటే షహ్దాద్ అసహ్యించుకునేవారని, వాటిని చూస్తే నిర్బంధంలో ఉన్న రోజులు తనకు గుర్తుకువస్తాయని అనేవారని చెప్పారు.
కానీ, షహ్దాద్ జాతీయవాదం వదల్లేదు. యూనివర్సిటీలో ఆయన కార్యకలాపాల్లో అది స్పష్టంగా కనిపించింది. యూనివర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్‌లో షహ్దాద్ చేరారు.
కరుడుగట్టిన మతతత్వ విద్యార్థులతో జరిగిన ఘర్షణలో ఓసారి గాయపడ్డారు.
యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన సమయంలో షహ్దాద్‌తో పాటు మరికొందరు విద్యార్థులు అరెస్టయ్యారు.

షహ్దాద్ బలూచ్ హక్కుల కోసం ‘గట్టిగా మాట్లాడే’ వ్యక్తని ఆయన స్నేహితుడు చెప్పారు. ఇటాలియన్ మార్క్సిస్టు అంటోనియో గ్రామ్‌స్కి రాసిన ప్రిసన్ నోట్‌బుక్స్ పుస్తకాన్ని ‘బైబిల్’లా భావించేవారని అన్నారు.
‘‘ఉపాధ్యాయులతో, విద్యార్థులతో షహ్దాద్ వాదోపవాదాలు కొనసాగుతూనే ఉండేవి. పుస్తకంలో ఉదహరించిన ఆధిపత్య సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం బలూచ్ ప్రజల స్థానిక దృక్పథాన్ని ఎలా నాశనం చేస్తుందో వివరించేవారు’’ అని చెప్పారు.
ఇలాంటి భావనలు బలూచిస్తాన్‌లో చాలా మందికి ఉన్నాయి. 1947లో పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటైనప్పటి నుంచి ఇవి ఉన్నాయి.
బ్రిటన్ భారత్‌ను రెండు దేశాలుగా విభజించినప్పుడు, ఉపఖండంలో ఉన్న సంస్థానాలకు ఈ రెండింటిలో దేనిలోనైనా చేరే లేదా స్వతంత్రంగా ఉండే అవకాశాన్ని ఇచ్చింది.
ప్రస్తుతం బలూచిస్తాన్‌గా ఉన్న కలాత్ సంస్థానం స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. కానీ, తొమ్మిది నెలల తర్వాత పాకిస్తాన్ బలవంతంగా దీన్ని తమలో కలుపుకుంది.
దీంతో బలూచ్ హక్కుల ఉద్యమం మొదలైంది. క్రమంగా ఇది వామపక్ష జాతీయవాదం వైపు, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో సాయుధ వేర్పాటువాదంవైపు మళ్లింది.
అప్పటి నుంచీ బలూచిస్తాన్‌లో సంఘర్షణ కొనసాగుతోంది. తమ ప్రాంతంలోని విస్తారమైన సహజ వనరులపై, ముఖ్యంగా సుయి ప్రాంతంలోని గ్యాస్ నిక్షేపాలపై వచ్చే ఆదాయంలో తమకు అధిక వాటా ఉండాలన్న డిమాండ్లు దీనికి ఆజ్యం పోశాయి.
తాజా సంఘర్షణ 2000ల ఆరంభంలో అప్పటి సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ హయాంలో జరిగిన ఎన్నికలతో మొదలైంది. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలున్నాయి.
అప్పుడు బలూచిస్తాన్‌లో రేగిన అశాంతి, 2005లో సుయిలో ఓ వైద్యురాలిపై సైనికుడు అత్యాచారం చేసిన ఘటనతో హింసాత్మక రూపం తీసుకుంది. ఆ కేసులో ఎవరినీ దోషులుగా తేల్చలేదు. తిరుగుబాటును అణిచివేసేందుకు వేల సంఖ్యలో సైనికులను ప్రభుత్వం రంగంలోకి దింపింది.

ఆ తర్వాత ఏళ్లలో బలూచిస్తాన్‌లో సైనిక వ్యవస్థలు పెరిగాయి. ప్రావిన్సులోని అనుమానిత జాతీయవాదులను గుర్తించే ప్రైవేటు నిఘా వ్యవస్థలకు ఇవి ఆర్థికంగా అండ అందిస్తున్నాయని చాలా హక్కుల సంఘాలు ఆరోపించాయి. అలా గుర్తించినవారిని చట్ట ప్రకారం కోర్టుల ముందు ప్రవేశపెట్టకుండా, సైన్యం ఇలా ‘గల్లంతు’ చేస్తోందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.
బలూచిస్తాన్‌లో లౌకికవాద ప్రాంతాలుగా ఉన్న చోట్లకు ఇస్లామిస్ట్ మిలిటెంట్లను ప్రభుత్వం చొప్పించిందని ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక నేరస్థుల ముఠాలను, నిర్బంధ కేంద్రాల్లో ‘మారిన’ మాజీ తిరుగుబాటుదారులను ‘హంతక ముఠాల’ నిర్వహణ కోసం సైన్యం వాడుకుంటోందని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ హంతక ముఠాలు స్థానికంగా జాతీయవాదులను, వేర్పాటువాదులను గుర్తించి సైన్యానికి ఉప్పందిస్తాయి.
యూరప్‌లో ఉన్న బలూచిస్తాన్ మానవహక్కుల కౌన్సిల్ (హెచ్‌ఆర్‌సీబీ) అంచనాల ప్రకారం... 2000 నుంచి కనీసం 20వేల మంది కార్యకర్తలు ‘గల్లంతయ్యారు’. వారిలో 7వేల మంది చనిపోయారు.
అయితే, బలూచిస్తాన్‌లో తమ ఉల్లంఘనల గురించి వచ్చిన ఆరోపణలను పాకిస్తాన్ అధికార వర్గాలు ఎప్పుడూ తోసిపుచ్చుతూనే ఉన్నాయి.
సైన్యం అధికార ప్రతినిధిని, పాకిస్తాన్ మానవహక్కుల మంత్రిని స్పందన కోసం బీబీసీ సంప్రదించింది. కానీ, వారి నుంచి స్పందన రాలేదు.
బలూచిస్తాన్‌లో ‘మనుషుల గల్లంతు’, ‘నిర్బంధ కేంద్రాలు’, ‘హత్యల’ గురించి ఆరోపణలపై పాకిస్తాన్ సైన్యం ఎప్పుడూ దాటవేత ధోరణే ప్రదర్శించింది.
వందల సంఖ్యలో చోటుచేసుకున్న రాజకీయ కార్యకర్తల, సాయుధ వేర్పాటువాదుల హత్యలు... తిరుగుబాటు ముఠాల పరస్పర ఘర్షణల్లో జరిగినవని ప్రావిన్సులోని ప్రభుత్వం ఇదివరకు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, PAcific press
అణిచివేత విధానం, సైన్యాన్ని అదుపు చేసి బలూచిస్తాన్‌లోని సమస్యలపై దృష్టి పెట్టడంలో పార్లమెంటు, న్యాయవ్యవస్థ వంటి ఇతర ప్రభుత్వం సంస్థలు విఫలమవడం... గిరిజన మూలాల నుంచి అతివాదంవైపు వెళ్లేలా బలూచ్ జాతీయవాద బృందాలను ప్రేరేపిస్తోందని హక్కుల కార్యకర్తలు అంటున్నారు.
బలూచ్ జాతీయవాద రూపాలన్నింటినీ నామరూపాల్లేకుండా చేసి, తిరిగి అది వేళ్లూనుకునే అవకాశాలు లేకుండా చేసే ప్రయత్నంలో పాకిస్తాన్ సైన్యం మధ్య తరగతి వర్గాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుందని 2013లో అమెరికాకు చెందిన ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే మేదో సంస్థ నివేదిక ఇచ్చింది.
షహ్దాద్ ముంతాజ్ అలాంటి మధ్య తరగతి వర్గానికి చెందినవారే.
షహ్దాద్‌తో పరిచయమున్న వారెవరూ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకీ పడతారని అనుకోలేదని చెబుతున్నారు.
2018లో మాస్టర్స్ పూర్తి చేసిన షహ్దాద్ ఎం.ఫిల్ కోర్సులో చేరారు. ఓ స్నేహితుడితో కలిసి లాహోర్ వెళ్లి, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవ్వాలని కూడా ఆయన ప్రణాళికలు వేసుకున్నారు.
షహ్దాద్ తీవ్రంగా స్పందించిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన మరో స్నేహితుడు అన్నారు.
‘‘కొందరు కార్యకర్తలు గల్లంతైనప్పుడు, వారి శరీరాలు ముక్కలుముక్కలుగా దొరికినప్పుడు, పాత్రికేయులు, ఉపాధ్యాయుల హత్యలు జరిగినప్పుడు... ‘ప్రభుత్వానికి తుపాకుల భాషే అర్థమవుతుంది’ అని షహ్దాద్ అనేవారు’’ అని ఆయన చెప్పారు.
జనవరి ఆఖర్లో చివరగా షహ్దాద్‌ను ఆయన స్నేహితులు చూశారు. అప్పుడు ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు లాహోర్ పయనమయ్యారు. ఆ తర్వాత వారికి షహ్దాద్ అందుబాటులో లేరు.
మే 1న బలూచిస్తాన్‌లోని షార్పరోడ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో షహ్దాద్ ప్రాణాలు కోల్పోయారు.
షహ్దాద్ ముంతాజ్ సహా వందల మంది బలూచ్ కార్యకర్తలకు, ఇప్పుడు సనా బలూచ్ కేసుకు మధ్య పెద్ద తేడాలేవీ కనిపంచడం లేదు.
సనా కూడా గట్టి జాతీయవాది. బీఎన్‌పీ-ఎమ్‌లో క్రియాశీల సభ్యుడు. బలూచి సాహిత్యంలో మాస్టర్స్ చేశారు. ఇస్లామాబాద్‌లోని అల్లామా ఇక్బాల్ ఓపెన్ యూనివర్సిటీ (ఏఐఓయూ)లో ఎం.ఫిల్ చేస్తున్నారు.
ఎం.ఫిల్‌లో సనా దాదాపు థీసిస్ పూర్తి చేశారని ఆయన ఉపాధ్యాయుల్లో ఒకరు బీబీసీతో చెప్పారు.
‘‘మే చివర్లో ఆయన దాన్ని సమర్పించాల్సి ఉంది. కరోనావైరస్ లాక్‌డౌన్‌తో యూనివర్సిటీ మూసేశారు. దీంతో ఇంటికి వెళ్లారు’’ అని అన్నారు.
ఖరాన్‌లో ఉన్నప్పుడు సనా బలూచ్ రాజకీయ కార్యకలాపాలు కొనసాగించేవారని క్వెట్టా (బలూచిస్తాన్ రాజధాని)లోని బీఎన్‌పీ-ఎమ్ సభ్యుల్లో ఒకరు చెప్పారు.
‘‘జాతీయ గుర్తింపు కార్డుల కోసం పత్రాలు నింపడంలో స్థానిక గ్రామస్థులకు సాయపడటం... స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగంతో వారి సమస్యలను పరిష్కరించడం వంటివి చేసేవారు’’ అని వివరించారు.
ఇకపై సనాకు ఏమవుతుందన్నదానిపై స్పష్టత లేదు.
ఏదో ఒక మూరుమూల ప్రాంతంలో సనా మృతదేహం దొరుకుతుందా?
లేక తనకున్న పరిచయాల ద్వారా జాతీయవాదులపై నిఘా పెట్టడంలో అధికార వర్గాలకు సాయం చేసేందుకు ఆయన అంగీకరిస్తారా?
లేక ‘మారిపోయి’ ఇంటికి తిరిగివచ్చి, కొంత కాలం తర్వాత షహ్దాద్‌లా తుపాకీ పడతారా?
కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కానీ, అంతవరకూ దీనంగా నిరీక్షించడం తప్ప సనా కుటుంబం వద్ద వేరే మార్గం లేదు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
- కరోనావైరస్: పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసే మనుషులు ఏడు రకాలు
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- కరోనావైరస్: లాక్‌డౌన్ తర్వాత వైరస్ బారిన పడకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా? శాఖాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా?
- ఇండియా లాక్‌డౌన్: వైజాగ్, కోల్‌కతా మినహా దేశమంతా విమాన సర్వీసులు... ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలేంటంటే?
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








