పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నిజంగా కేసులు తగ్గుతున్నాయా? టెస్టులు తక్కువగా చేయడం వల్లే తగ్గినట్లు కనిపిస్తోందా

దక్షిణాసియాలోని చాలా దేశాల్లో మే, జూన్ నెలల్లో కేసులు పతకా స్థాయికి చేరిన అనంతరం.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

భారత్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌ తర్వాతి స్థానం భారత్‌దే.

భారీగా జనాభా ఉండే దేశాల్లో కేసులు పెరగడం సాధారణమే. అయితే పొరుగునున్న దేశాలూ కోవిడ్-19కు ప్రభావితమయ్యాయి.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, అఫ్గానిస్తాన్.. ఇలా అన్ని చోట్లా కేసులు విపరీతంగా నమోదయ్యాయి.

గ్లోబల్ హాట్‌స్పాట్

20 రోజులకు ఒకసారి రెట్టింపవుతున్న కేసులతో భారత్ నేడు గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారింది. ఇప్పటికీ ఇక్కడ రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

అయితే, దక్షిణాసియాలోని మిగతా దేశాల్లో కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా దేశాల్లో మే, జూన్ నెలల్లో కేసులు పతాక స్థాయికి చేరిన అనంతరం ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

దక్షిణాసియాలొ కరోనావైరస్ కేసుల వివరాలు

ఫొటో సోర్స్, Empics

ఈ ప్రాంతంలో రెండో హాట్‌స్పాట్‌గా మారిన పాకిస్తాన్‌లో కేసులు తగ్గుముఖం పట్టడం సందేహాలకు తావిస్తోంది.

జూన్ మధ్యలో అక్కడ దాదాపు రోజుకు 6,000 కేసులు నమోదు కాగా జులై మధ్యనాటికి రోజుకు 2,000కు పడిపోయింది.

అయితే, ఇక్కడ వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని చెప్పడం తొందరపాటు అవుతుందని నిపుణులు అంటున్నారు. కొందరైతే గణాంకాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

జులై 16నాటికి బంగ్లాదేశ్‌లో కేసుల సంఖ్య 1,96,323కు పెరిగింది. జూన్ మధ్య నుంచి జులై ప్రారంభం వరకూ ఇక్కడ గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

అఫ్గానిస్తాన్‌లో శరీర ఉష్ణోగ్రతను కొలుస్తున్న భద్రతా సిబ్బంది

ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రతి 28 రోజులకు ఇక్కడ కేసులు రెట్టింపు అవుతున్నాయి.

మిగతా దేశాలతో పోల్చినప్పుడు అఫ్గానిస్తాన్‌లో డబ్లింగ్ రేటు కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ 41 రోజులకు ఒకసారి కేసులు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఈ అధికారిక గణాంకాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తంగా చూస్తే శ్రీలంక, నేపాల్‌లలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల తీవ్రత కొంచెం తక్కువగా కనిపిస్తోంది. నేపాల్‌లో వంద రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. ఇక్కడ కేసులు ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లోనే నమోదయ్యాయి.

తాజా గణాంకాల ప్రకారం.. కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలా కేసులలను గుర్తించకపోవడం వల్లే కేసులు తగ్గిపోయినట్లు అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఏప్రిల్ నుంచి శ్రీలంకలో కేసులు పెరుగుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇవి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇక్కట కఠినమైన లాక్‌డౌన్ విధించారు. కరోనావైరస్ సోకిన వారిని కలిసిన వారిని వెంటవెంటనే పట్టుకొని క్వారంటైన్‌కు తరలించారు.

"ఇక్కడ ప్రజారోగ్య అధికారులు, పోలీసులు, నిఘా విభాగం అధికారులు, స్థానిక పరిపాలనా విభాగం అధికారులు కలిసి పకడ్బంధీగా వైరస్ సోకినవారిని కలిసిన వారిని, వారితో మాట్లాడిన వారిని ఐసోలేషన్‌లో పెట్టారు"అని బీబీసీ సింహళ ప్రతినిధి సరోజ్ పథిరానా చెప్పారు.

త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కూడా శ్రీలంక ఎత్తివేసింది.

శ్రీలంకలోని రైల్వే స్టేషన్‌లో శరీర ఉష్ణోగ్రతను కొలుస్తున్న సిబ్బంది

టెస్టులు తక్కువ

ప్రపంచ జనాభాలో మూడో వంతు దక్షిణాసియాలోనే ఉంది. అయితే కేసుల విషయానికి వస్తే.. మొత్తం కేసుల్లో 11 శాతం మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి.

"ప్రతి పది లక్షల మందిలో నమోదైన కేసుల పరంగాచూస్తే భారత్‌తోపాటు మిగతా దక్షిణాసియా దేశాల్లోనూ కేసుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పరీక్షలు చాలా తక్కువగా నిర్వహిస్తున్నారు" అని వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ వ్యాఖ్యానించారు.

మొత్తం టెస్టుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉన్నా.. జనాభాతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువగా కనిపిస్తాయి.

ఉదాహరణకు భారత్ ఇప్పటివరకు 10.3 మిలియన్ల టెస్టులు చేసింది. పాకిస్తాన్ 1.6 మిలియన్ల పరీక్షలు నిర్వహించింది.

అయితే తలసరి పరీక్షల ప్రకారం చూస్తే.. ఈ రెండు చాలా దేశాల కంటే వెనుకబడి ఉన్నాయి.

దేశాల వారీగా తలసరి పరీక్షలు

ముఖ్యంగా ఇటీవల పాక్, బంగ్లాదేశ్‌లలో నిర్వహిస్తున్న టెస్టుల సంఖ్య తగ్గుతోంది. ఇవి నమోదవుతున్న పాజిటివ్ కేసులపై ప్రభావం చూపిస్తున్నాయి.

పాకిస్తాన్.. కేసులు పతాక స్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 31,000 పరీక్షలు నిర్వహించింది. అయితే జూన్ చివరి వారం నుంచి పరీక్షల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. మరోవైపు లక్షణాలు లేకపోతే అసలు పరీక్షలు నిర్వహించడం లేదు.

ఒక్క ఇస్లామాబాద్‌లోనే వైరస్‌సోకి ఎలాంటి లక్షణాలూ కనపడనివారు దాదాపు 3,00,000 మంది ఉంటారని ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది.

బంగ్లాదేశ్‌లోనూ పరీక్షల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇక్కడ నకిలీ పరీక్షల కుంభకోణం వెలుగుచూసింది. దీంతో నిజంగా పరీక్షలు చేస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

నేపాల్ జులై 16నాటికి దాదాపు 3,00,000 పరీక్షలు నిర్వహించింది. జులై నుంచి రోజూ 10,000 పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు మాత్రం 4,000ను దాటడం లేదు.

అఫ్గానిస్తాన్‌లో పరీక్షల సమాచారం అందుబాటులో లేదు. అయితే అధికారికంగా విడుదల చేస్తున్న గణాంకాల కంటే కేసులు చాలా ఎక్కువగా ఉండొచ్చని రెడ్ క్రిసెంట్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది.

కేసులతో పరీక్షలను పోల్చి చూస్తే..

కేసుల కంటే పరీక్షలు 10 నుంచి 30 రెట్లు ఎక్కువగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది.

అయితే, దక్షిణాసియా దేశాలు దీన్ని అంతగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌తో సమానమైన జనాభా కలిగిన రష్యా, జపాన్ టెస్టులు ఎక్కువగా చేస్తున్నాయి. ఇక్కడ 32 (రష్యా), 26 (జపాన్) టెస్టులకు ఒక పాజిటివ్ కేసు వస్తోంది.

బంగ్లాదేశ్‌లో ప్రతి ఐదు పరీక్షల్లో ఒకరికి పాజిటివ్ వస్తోంది. ఇది డబ్ల్యూహెచ్‌వో సూచించిన దానికంటే చాలా తక్కువ.

జూన్ 14 వరకు నేపాల్‌లో ప్రతి 25 పరీక్షలకు ఒక పాజిటివ్ కేసు వచ్చింది. ఆ తర్వాత సమాచారం అందుబాటులో లేదు.

అనుమానాస్పద గణాంకాలు

గణాంకాల ప్రకారం చూస్తే.. చాలా చోట్ల కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆరోగ్య రంగంపై చాలా తక్కువగా ఖర్చుపెట్టే ఈ దేశాల్లో గణాంకాల వాస్తవికతపై సందేహాలు ఎక్కువవుతున్నాయి.

"చాలా దేశాల్లో మరణాలు సరిగా నమోదు కావడంలేదు. మరణాలకు వేరే కారణాలను చూపిస్తున్నారు" అని యార్క్ వర్సిటీలోని ప్రజారోగ్య నిపుణుడు ప్రొఫెసర్ కమ్రాన్ సిద్దిఖీ వివరించారు.

మరణాలు సరిగా నమోదు కాకపోయినా.. పశ్చిమ దేశాలతో పోల్చినప్పుడు తేడా స్పష్టంగా తెలుస్తుందని డాక్టర్ జమీల్ వ్యాఖ్యానించారు.

"ఇక్కడ మరణాలు తక్కువగా నమోదు కావడానికి జనాభాలో ఎక్కువ మంది యువకులు ఉండటమే కారణం. అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో పోల్చినప్పుడు దక్షిణాసియాలో యువ జనాభా ఎక్కువ" అని సిద్దిఖీ కూడా వివరించారు.

దక్షిణాసియా దేశాల్లో సగటు వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉంటుంది.

పరిశోధనలో సాయం చేసిన వారు వాలియూర్ రెహ్మాన్ మిరాజ్ (ఢాకా), రామ పరాజులి (కాఠ్‌మాండూ)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.