క‌రోనావైర‌స్‌: రష్యా గూఢచారులు 'కోవిడ్‌-19 వ్యాక్సీన్ ప‌రిశోధ‌న‌ల‌ను హ్యాక్ చేస్తున్నారు' - బ్రిటన్ ఆరోపణ

ఎన్ఎస్ఎస్సీ అడ్వయిజరీ

ఫొటో సోర్స్, Getty Images

బ్రిట‌న్‌, అమెరికా, కెన‌డాల్లో క‌రోనావైర‌స్ వ్యాక్సీన్‌ త‌యారీకి ప్ర‌య‌త్నిస్తున్న సంస్థ‌ల‌ను ర‌ష్యా హ్యాకర్లు ల‌క్ష్యంగా చేసుకుంటున్న‌ట్లు నిఘా వ‌ర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ర‌ష్యా నిఘా విభాగంలో భాగంగా ఈ హ్యాక‌ర్లు ప‌నిచేస్తున్నట్లు 'దాదాపు నిర్ధరణ అయింది' అని యూకే నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ సెంట‌ర్ (ఎన్‌సీఎస్‌సీ) వెల్ల‌డించింది.

ఏ సంస్థ‌ల‌ను హ్యాక‌ర్లు ల‌క్ష్యంగా చేసుకున్నారు? ఏదైనా స‌మాచారాన్ని చోరీ చేశారా అనే వివ‌రాల‌ను సంస్థ వెల్ల‌డించ‌లేదు.

వ్యాక్సీన్ ప‌రిశోధ‌న‌ల‌కు హ్యాక‌ర్ల వ‌ల్ల ఎలాంటి అవ‌రోధాలు ఎదురుకాలేద‌ని పేర్కొంది.

"క‌రోనావైర‌స్‌తో పోరాడుతున్న వారిని ర‌ష్యా నిఘా విభాగం ల‌క్ష్యంగా చేసుకుంటోంది. దీన్ని స‌హించేది లేదు" అని యూకే విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వ్యాఖ్యానించారు.

"కొంద‌రు త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా నిర్ల‌క్ష్య ధోర‌ణిలో ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బ్రిట‌న్‌, దేశ మిత్ర ప‌క్షాలు మాత్రం ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ను వైర‌స్ నుంచి కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా శ్ర‌మిస్తున్నాయి"

ఈ క్రింది భ‌ద్ర‌తా సంస్థ‌ల బృందం హెచ్చ‌రిక‌ల‌ను విడుద‌ల చేసింది:

  • బ్రిట‌న్‌కు చెందిన ఎన్‌సీఎస్‌సీ
  • కెన‌డియ‌న్ క‌మ్యూనికేష‌న్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీఎస్ఈ)
  • ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఫ‌ర్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్‌), సైబ‌ర్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్ర‌‌క్చ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ)
  • ద యూఎస్ నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ)

విశ్లేష‌ణ

గోర్డెన్ కొరేరా, ‌భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి

ఇటీవ‌ల కాలంలో ప‌శ్చిమ దేశాల భ‌ద్ర‌తా సంస్థ‌లు త‌మ దేశాల్లోని సంస్థ‌ల‌పై దాడులు చేసే హ్యాక‌ర్ల‌పై దృష్టి పెడుతున్నాయి. దాడుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

అయితే తాజా ఆరోప‌ణ‌లు చాలా అసాధార‌ణ‌మైన‌వి. వీటిని నేరుగా ర‌ష్యా గూఢ‌చారులే ల‌క్ష్యంగా చేస్తున్నారు. ఇదివ‌ర‌కు కొన్ని ప్ర‌భుత్వాలు హ్యాక‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయ‌ని చెప్పేవారు.

మ‌రోవైపు హ్యాక‌ర్లు కూడా అత్యంత సున్నితంగా ప్ర‌జ‌లు భావించే అంశాల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదివ‌ర‌క‌టిలా ఏదో కంపెనీ లేదా ప్ర‌భుత్వ డేటాపై వారు దృష్టి పెట్ట‌డం లేదు.

మ‌రోవైపు ఈ హెచ్చ‌రిక‌ల గురించి అంత ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏమీలేదు.

క‌రోనావైర‌స్ వ్యాక్సీన్ ప‌రిశోధ‌న‌, వ్యాధి సంక్ర‌మ‌ణ‌కు సంబంధించిన ఇత‌ర అంశాలపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిఘా విభాగాలు దృష్టిసారిస్తుంటాయి. ప‌శ్చిమ దేశాల గూఢచారులు కూడా దీనిపై ప‌నిచేస్తుంటారు.‌

సాఫ్ట్‌వేర్‌ల‌లో లోపాల వ‌ల్ల హ్యాక‌ర్లు చొర‌బ‌డ‌గ‌లిగార‌ని బ్రిట‌న్‌, అమెరికా, కెన‌డా సంస్థ‌లు చెబుతున్నాయి. వెల్‌మెస్‌, వెల్ మెయిల్‌గా పిలిచే మాల్‌వేర్ల‌ను అప్‌లోడ్ చేసి.. ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకు‍ంటార‌‌ని వివ‌రిస్తున్నాయి.

లాగిన్ అయ్యేట‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తున్న నెపంతో సిబ్బందిని హ్యాక‌ర్లు మోసం చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇవి స్పీయ‌ర్ ఫిషింగ్ దాడుల‌ని పేర్కొన్నారు.

  • ఫిషింగ్‌ వ్య‌క్తిగ‌త‌ వివ‌రాల‌ను సేక‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా ఫిషింగ్ ఈ-మెయిళ్లు సిద్ధంచేస్తారు.
  • స్పీయ‌ర్ ఫిషింగ్ ఇవి పూర్తిగా వ్య‌క్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేసే ‌దాడులు. ఒక్కోసారి తాము బాగా విశ్వ‌సించే వ్య‌క్తి నుంచి వ‌చ్చిన‌ట్లుగా మెయిళ్ల‌ను పంపిస్తారు. ఇందులో కొంత వ్య‌క్తిగ‌త‌ స‌మాచారాన్ని కూడా జోడిస్తారు. దీంతో ఎలాంటి అనుమాన‌మూ రాదు.

అయితే ఈ దాడుల్లో ర‌ష్యన్ల‌తోపాటు మ‌రికొంద‌రు కూడా ఉండే అవ‌కాశ‌ముంద‌ని సైబ‌ర్ నిపుణులు అంటున్నారు.

"అలాంటివాళ్లు చాలా మంది ఉంటారు. అమెరికాలో వీరి సంఖ్య త‌క్కువేమీ ఉండ‌దు. చైనాలో కూడా.. "అని కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీ కంప్యూట‌ర్ లేబ‌రేట‌రీ ప్రొఫెస‌ర్ రాస్ ఆండెర్స‌న్ వ్యాఖ్యానించారు.

"వారు ఎప్పుడూ ఇలాంటి స‌మాచారాన్ని చోరీ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు."

Cozy Bear

ఫొటో సోర్స్, Crowdstrike

ఎవ‌రు బాధ్యులు?

హ్యాకింగ్ గ్రూప్‌ ఏపీటీ29 ఈ దాడిని చేప‌ట్టిన‌ట్లు ఎన్‌సీఎస్‌సీ పేర్కొంది. ఈ గ్రూప్‌నే ద డ్యూక్స్‌, కోజీ బీర్ అని కూడా పిలుస్తుంటారు.

ఈ గ్రూప్‌.. ర‌ష్యా నిఘా విభాగంతో క‌లిసి ప‌నిచేస్తోంద‌ని తాము 95 శాతం క‌చ్చిత‌త్వంతో చెప్ప‌గ‌ల‌మ‌ని ఎన్‌సీఎస్‌సీ వివ‌రించింది.

కోజీ బీర్‌ను 2014లో తొలిసారిగా ముప్పున్న హ్యాక‌ర్లుగా అమెరికన్ సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ గుర్తించింది.

ఈ గ్రూప్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు హ్యాకింగ్ విధానాల‌ను మారుస్తోంద‌ని పేర్కొంది.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో అమెరికా డెమోక్ర‌టిక్ నేష‌న‌ల్ క‌మిటీ (డీఎన్‌సీ) స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్‌చేసిన‌ట్లు ఈ గ్రూప్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

2017లో నార్వే లేబ‌ర్ పార్టీ, ర‌క్ష‌ణ‌, విదేశాంగ శాఖ, దేశ జాతీయ భ‌ద్ర‌తా సేవ‌ల వెబ్‌సైట్ల‌ను హ్యాక్‌ చేసిన‌ట్లు గ్రూప్‌పై ఆరోప‌ణ‌లున్నాయి.

సైబ‌ర్ దాడుల నుంచి ర‌క్ష‌ణ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో ఎన్‌సీఎస్‌సీ పేర్కొంది.

కెన‌డా, అమెరికా, యూకేల‌లో కోవిడ్‌-19 వ్యాక్సీన్‌తో సంబంధ‌మున్న సంస్థ‌ల‌పై ఏపీటీ29 దాడి చేసింది. డేటా చోరీతోపాటు కోవిడ్‌-19 టీకా ప‌రీక్ష‌లు, మేధో సంప‌త్తి హక్కుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని శోధించిందని పేర్కొంది.

మ‌రోవైపు 2019 యూకే ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకొనేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు యూకే ప్ర‌భుత్వం ఆరోపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)