సోలార్ ఆర్బిటర్: సూర్యుడిపై ‘క్యాంప్ ఫైర్’.. ఇంత దగ్గరగా సూర్యుడిని ఫొటోలు తీయడం ఇదే తొలిసారి

సూర్యుడిపై క్యాంప్ ఫైర్

ఫొటో సోర్స్, Solar Orbiter/EUI Team (ESA & NASA)

ఫొటో క్యాప్షన్, బాణం గుర్తు చూపిస్తున్నది ఒక క్యాంప్ ఫైర్. కింద ఎడమవైపున ఉన్న వృత్తం.. దాని సైజును ఉదహరిస్తోంది
    • రచయిత, జొనాథన్ ఆమోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సూర్యుడి ఉపరితలానికి 7 కోట్ల 70 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తీసిన సరికొత్త ఫొటోలు ఇప్పటివరకూ కెమెరాలతో సూర్యుడిని అతి దగ్గర నుంచి తీసిన చిత్రాలు అయ్యాయి.

ఈ ఫొటోలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఇసా)కి చెందిన సోలార్ ఆర్బిటర్(సోల్ఓ) ప్రోబ్ నుంచి వచ్చాయి. దానిని ఈ ఏడాది మొదట్లో ప్రయోగించారు.

బ్రిటన్ అసెంబుల్ చేసిన సోలార్ ఆర్బిటర్ తీసిన ఫొటోల్లో ‘కాంప్ ఫైర్స్’ అనే చిన్న మంటలు కూడా కనిపిస్తున్నాయి.

సూర్యుడిపై ఉన్న భారీ మంటల పరిమాణంలో ఇవి లక్షల వంతులో ఉంటాయి. వీటిని భూమిపై నుంచి టెలిస్కోప్‌తో కూడా చూడవచ్చు.

అయితే, ఈ మంటలు అదే మెకానిజంతో వస్తున్నాయా అనే దానిలో స్పష్టత లేదు. కానీ ఈ అంతుపట్టని తాపన ప్రక్రియలో ఈ సన్నటి మంటల ప్రమేయం ఉండవచ్చు. అవి నక్షత్రాల బయటి వాతావరణాన్ని (కొరోనాను) దాని ఉపరితలం కంటే వేడెక్కేలా చేస్తాయి.

“దానితో పోలిస్తే, సూర్యుడిపై ఉన్న చల్లటి ఉపరితలం దాదాపు 5,500 డిగ్రీలు ఉంటుంది. దాని చుట్టూ వాతావరణం పది లక్షల డిగ్రీలకు పైగా అత్యంత వేడిగా ఉంటుంది” అని ఇసా ప్రాజెక్ట్ శాస్త్రవేత్త డానియెల్ ముల్లెర్ వివరించారు.

అమెరికా భౌతిక శాస్త్రవేత్త యుజీన్ పార్కర్ “భారీ సంఖ్యలో ఉన్న చిన్న చిన్న మంటలు నిరంతరం వేడెక్కించే మెకానిజానికి కారణమవుతాయి. అది కొరోనా వేడెక్కేలా చేస్తుంది” అని తన సిద్ధాంతంలో చెప్పారు.

“వాటి పాత్ర ఏదైనా, కాంప్ ఫైర్స్ కచ్చితంగా చిన్నవిగా ఉంటాయి. ఇప్పటివరకూ వాటిని మనం ఎందుకు మిస్సయ్యాం అనేది అవి మనకు వివరించవచ్చు” అని బెల్జియం రాయల్ అబ్జర్వేటరీకి చెందిన, ఈయూఐపై పరిశోధనలు చేస్తున్న ప్రధాన పరిశోధకుడు డేవిడ్ బెర్ఘమాన్స్ అన్నారు.

“వాటిలో అత్యంత చిన్నవి మన పిక్సెల్స్ లా కనిపిస్తున్నాయి. ఆ ఒక పిక్సెల్ 400 కిలోమీటర్లకు సమానంగా ఉంటుంది. అది ప్రాదేశిక రిజల్యూషన్. అంటే, అవి దాదాపు కొన్ని ఐరోపా దేశాల పరిమాణంలో ఉన్నాయి. అలాంటివి చిన్నవి కూడా ఉండచ్చు” అని ఆయన మీడియాకు చెప్పారు.

మెటిస్ పరికరం

ఫొటో సోర్స్, Solar Orbiter/Metis Team (ESA & NASA)

ఫొటో క్యాప్షన్, మెటిస్ అనే పరికరం ఒక కొరోనా గ్రాఫ్. సూర్యుడి నుంచి విడుదలయ్యే కాంతిని అడ్డుకుని, దాని బయట ఉండే వాతావరణాన్ని చూసేందుకు సహాయపడుతుంది. వివిధ ఫ్రీక్వెన్సీల్లో వివిధ విషయాలు తెలుస్తుంటాయి

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) ఈ ఉపగ్రహాన్ని ఫిబ్రవరిలో అమెరికాలోని కేప్ కనవెరల్ నుంచి రాకెట్ ద్వారా ప్రయోగించింది. సూర్యుడి గతిశీల ప్రవర్తనకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టాలనే లక్ష్యంతో దీనిని పంపించారు.

సూర్యుడి ఉద్గారాలు భూమిపై చాలా తీవ్ర ప్రభావాలను కలిగిస్తాయి. అవి వెలుతురు, వెచ్చదనం ఇవ్వడాన్ని మించిపోయాయి.

తరచూ అవి విఘాతం కలిగిస్తుంటాయి, తమలో ప్రవేశించిన అయస్కాంత క్షేత్రాలతో చార్జ్ అయిన అణువులు విస్ఫోటం చెందడం వల్ల అవి ఉపగ్రహాల్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ ట్రిప్ అయ్యేలా చేస్తాయి. రేడియో కమ్యూనికేషన్లను క్షీణించేలా చేస్తాయి.

ఈ అంతరాయాన్ని మరింత మెరుగ్గా ఊహించేందుకు సోల్ఓ శాస్త్రవేత్తలకు సాయం చేయచ్చు.

“కారోనావైరస్ వల్ల ఏర్పడిన పరిస్థితి ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండడం ఎంత ముఖ్యమనేది నిరూపించింది. ఆ కనెక్టివిటీలో శాటిలైట్స్ ఒక భాగం” అని బ్రిటన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ సైన్స్ హెడ్ కరోలిన్ హార్పర్ అన్నారు.

“అంటే మనం సూర్యుడి గురించి మరింత తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం దాని వాతావరణాన్ని, దానిపై అంతరిక్ష వాతావరణాన్ని ఊహించగలం. అది మనం ఇక్కడ భూమిపై వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకున్నామో అలాగే ఉంటుంది”.

సూర్యుడి భిన్నమైన కోణాలు

ఫొటో సోర్స్, Solar Orbiter/EUI Team; PHI Team/ESA & NASA

ఫొటో క్యాప్షన్, సూర్యుడు అగ్నిగోళంలా ఎందుకు మండిపోతున్నాడో తెలుసుకునేందుకు సోలార్ ఆర్బిటర్‌లోని వివిధ పరికరాలు సహకరిస్తాయి. సెన్సార్లు సూర్యుడి వాతావరణంలోని భిన్నమైన విషయాలను పరిశీలిస్తుంటాయి

సోలార్ ఆర్బిటర్ సూర్యుడి చుట్టూ కొన్ని వరుస లూప్స్ సెట్ చేసుకుంది. అవి దానిని క్రమంగా సూర్యుడికి ఇంకా దగ్గరికి వెళ్లగలిగేలా చేశాయి. చివరకు 7 కోట్ల 70 లక్షల కిలోమీటర్ల కంటే దిగువకు వెళ్లాక అది వేరయ్యింది.

“అది సోల్ఓను బుధుడి కక్ష్యలోకి ఉంచుతుంది. గురువారం వచ్చిన ఫొటోలను అది ఇటీవల దాటిన పెరిహెలియాన్ అనే ప్రాంతం నుంచి తీశారు. ఇది శుక్రుడి కక్ష్యలో ఉన్నప్పుడు జూన్ మధ్యలో జరిగింది.

పోలిక చెప్పాలంటే, భూమి సూర్యుడికి నుంచి సగటున 14.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

కొత్త ఫొటోలను ఇప్పటివరకూ ఎప్పుడూ తీయనంత దగ్గర నుంచి తీసినప్పటికీ, అవి ఇప్పటివరకూ పొందిన అత్యధిక రిజల్యూషన్‌వి మాత్రం కాదు. ఆ విషయంలో భూమిపై ఉన్న అతిపెద్ద సోలార్ టెలిస్కోపులు సోల్ఓను ఎప్పుడూ ఓడిస్తాయి.

కానీ, ప్రోబ్ బాగా దగ్గరగా చేరుకోడానికి ఆరు రిమోట్ సెన్సింగ్ పరికరాలను, నాలుగు ఇన్-సిటు పరికరాలను ఉపయోగించింది. దానిని ఒక భిన్న స్థాయికి తీసుకెళ్లింది.

“సోలార్ ఆర్బిటర్ కేవలం హై రిజల్యూషన్ ఫొటోల కోసమే సూర్యుడికి దగ్గరగా వెళ్ల లేదు. అది సూర్యుడిపై గాలిలో భిన్నంగా, తక్కువ కల్లోలం ఉన్న భాగానికి దగ్గరగా వెళ్తోంది. అంత దగ్గర నుంచి సిటులో ఉన్న అణువులు, అయస్కాంత క్షేత్రంపై అధ్యయనం చేస్తోంది. అదే సమయంలో అది సూర్యుడి ఉపరితలంపై రిమోట్ డేటా కూడా తీసుకుంటోంది. దాని కోసం అది వెంటనే దాని చుట్టూ తిరుగుతోంది. వేరే మిషన్ లేదా టెలిస్కోప్ అలా చేయలేవు” అని ఇసా శాస్త్రీయ, అన్వేషణ సీనియర్ సలహాదారు మార్క్ మెక్ మెకాఘ్రియన్ బీబీసీతో అన్నారు.

సూర్యుడిపై ఉష్ణోగ్రత

ఫొటో సోర్స్, Solar Orbiter/EUI Team (ESA & NASA)

ఫొటో క్యాప్షన్, సూర్యుడి కింది వాతావరణంలో ఉష్ణోగ్రతలు పది వేల డిగ్రీల నుంచి లక్ష డిగ్రీల వరకూ ఉంటాయి. ఇక్కడ ఉండే హైడ్రోజన్‌ను లైమన్ ఆల్ఫా అని పిలిచే కాంతి పుంజం నుంచి ఈయూఐ సేకరిస్తోంది

సోలార్ ఆర్బిటర్ సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్లడానికి, ఇంకా కొన్నేళ్లు పడుతుంది.

మిషన్ ముందుకు వెళ్లేకొద్దీ, సోల్ఓ శుక్రుడి గురుత్వాకర్షణ సాయంతో గ్రహాల పైనుంచి తనకు తానుగా ఎగరగలుగుతుంది. అలా, అది సూర్యుడి ధ్రువాలను మరింత సులభంగా చూడగలదు అని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చకి చెందిన సమీ సోలంకి అంటున్నారు. ఆయన లాంటి వారు వాటిని ‘టెర్రా ఇంకాగ్నిటా’ అనడానికి ఇష్టపడుతున్నారు.

మనం చివరకు సూర్యుడి అయస్కాంతత్వం మూల సిద్ధాంతాల గురించి ధ్రువాల దగ్గర మాత్రమే తెలుసుకోగలం.

“సూర్యుడు ఉత్పత్తి చేసే అన్ని చర్యలకూ అయస్కాంత క్షేత్రమే కారణం అని మనకు తెలుసు. కానీ ఆ అయస్కాంత క్షేత్రం ఎలా ఉత్పత్తి అవుతుందో మనకు తెలీదు” అని సోలంకి చెప్పారు.

“మన భూమిలోపల ఉన్నఅలాంటి డైనమోనే సూర్యుడి లోపల అలా చేస్తోందని మనం అనుకుంటున్నాం. కానీ అది ఎలా పనిచేస్తుందో మనకు నిజంగా తెలీదు. కానీ అందులో ధృవాలు కీలక పాత్ర పోషిస్తాయని మనకు తెలుసు”.

వీడియో క్యాప్షన్, సూర్యుడిపై గత పదేళ్లలో వచ్చిన మార్పులు ఇవీ..

ఈ మిషన్‌లో ఇసా ప్రధాన భాగస్వామి, అమెరికా స్పేస్ ఏజెన్సీలో సోలార్ ఆర్బిటర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ హోలీ గిల్బెర్ట్ ముందు ముందు తెలిసే సైన్స్ గురించి ఉత్సాహంగా ఉన్నారు.

“మనం మొదట వచ్చిన ఫొటోల సాయంతోనే కొన్ని కనుగొనగలిగినప్పుడు, సూర్యుడికి మరింత దగ్గరగా, కాంతి మండలం బయటకు వెళ్లినపుడు మనం ఇంకా ఎన్ని అన్వేషించవచ్చో ఊహించండి. అది చాలా ఉత్తేజితంగా ఉంటుంది” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)