అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో ఈ ఫొటోతో చైనాను ఆటాడుకున్నారా? జిన్‌పింగ్‌ను ఇబ్బంది పెట్టారా?

ఫొటో సోర్స్, TWITTER/MIKE POMPEO
- రచయిత, కెర్రీ అలెన్
- హోదా, బీబీసీ మానిటరింగ్
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు చర్చనీయంగా మారింది.
పాంపియో తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో తన పెంపుడు కుక్క మెర్సర్ కొన్ని బొమ్మలతో ఆడుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు.
ఆ బొమ్మలన్నిటి మధ్య 'విన్నీ ద పూ' బొమ్మ కూడా ఉంది. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ను కొందరు వ్యంగ్యంగా 'విన్నీ ద పూ'తో పోల్చుతారు.
దాంతో పాంపియో ట్వీట్ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
మరోవైపు చైనా నెటిజన్లలో మైక్ పాంపియోకు అబద్ధాల కోరు అనే ముద్ర ఉంది.
అయితే.. మైక్ పాంపియో ట్వీట్‌పై చైనా నెటిజన్లు స్పందించే అవకాశాలు చాలా తక్కువే. జిన్ పింగ్ నిక్ నేమ్‌లపై అక్కడ సెన్సార్‌షిప్ ఉండడంతో అంతా గమ్మున ఉన్నారు.
చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అధికారులను అపహాస్యం చేసే వ్యంగ్యనామాలు, అమర్యాదకర వ్యాఖ్యలను అక్కడి ప్రభుత్వం సెన్సార్ చేస్తుంది.
అయితే, చైనా నెటిజన్లేమీ తక్కువ కాదు. ఎన్ని ఆంక్షలున్నా తమ నాయకులను ఇలాంటి వ్యంగ్యనామాలతో ప్రస్తావించడం కోసం ఎప్పటికప్పుడు క్రియేటివిటీ చూపిస్తుంటారు.
2013లో జిన్‌పింగ్ శరీరాకృతిని కార్టూన్లలోని ఎలుగుబంటి 'విన్నీ ద ఫూ'తో పోల్చుతూ వచ్చిన సరదా ఫొటోలు అంతర్జాతీయంగా పాపులర్ అయ్యాయి.
చైనా అధ్యక్షుడికి ఈ మారుపేరు చాలా వేగంగా ప్రచారం అయిపోయింది. పిల్లలు ఆడుకునే బొమ్మ కావడంతో ఈ బొమ్మ ఆధారంగా జరుగుతున్న అపహాస్యాన్ని సెన్సార్ చేయడం కష్టమైంది.
గతంలో అధ్యక్షుడిగా ఉన్న జియాంగ్ జెమిన్ విషయంలో ఇలాంటి మారుపేర్లను, అపహాస్యాన్ని అడ్డుకునే వ్యూహాలు విజయవంతవమయ్యాయి. ఆయన్ను టోడ్ వంటి మారుపేర్లతో ప్రస్తావించేవారు.

ఫొటో సోర్స్, Empics
'విన్నీ ద పూ' పేరుతో చైనాలో అంత ఇబ్బంది ఉందా?
ఒక్క మాటలో చెప్పాలంటే.. నిజంగా అక్కడ అది చాలా ఇబ్బంది పెడుతుంది.
చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో 'విన్నీ పూ' అనే పదంపై చాలాకాలంగా సెన్సార్‌షిప్ ఉంది.
అక్కడి సెర్చ్ ఇంజిన్లలో 'విన్నీ' అని కొడితే ప్రభుత్వ ఆమోదం ఉన్న లింకులే కనిపిస్తాయి.
ఆ సెర్చ్‌కు సంబంధించిన కొన్ని రిజల్ట్స్ ఇవ్వడం లేదన్న డిస్‌క్లెయిమర్ కూడా కనిపిస్తుంది.
విన్నీ పూ, జిన్‌పింగ్‌లను తలపించే అంశాలున్నాయన్న కారణంగా తైవాన్‌కు చెందిన ఒక వీడియో గేమ్‌ను చైనా 2019లో యాప్ స్టోర్ల నుంచి తొలగించింది.

ఫొటో సోర్స్, AFP/WEIBO
పాంపియో పోస్ట్ చేసిన ఫొటోలో కుక్క ఎవరు?
పాంపియో పెంపుడు కుక్క, దాని ఆట బొమ్మలున్న ఈ ఫొటో చాలా మామూలు ఫొటోయే అనిపిస్తుంది. కానీ, అందులో అంతర్లీనంగా కొన్ని ప్రస్తావనలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో అమెరికా లేదా పాంపియోను సూచించేలా కుక్కను ఆయన ఎంచుకుని ఉండొచ్చు.. చైనాలో కుక్క అనే పదాన్ని దురుసైన వ్యక్తులు, దేశాలను ఉద్దేశించి వాడుతారు.
గతంలో హాంకాంగ్ నిరసనకారులు పోలీసులనుద్దేశించి కుక్క అనే మాటను వాడారు.
చైనా టెలికాం దిగ్గజ సంస్థ హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాన్‌జూను అమెరికా విజ్ఞప్తి మేరకు కెనడా అరెస్టు చేసినప్పుడు కెనడాను చైనాలో 'కుక్క కాలు' అని వ్యంగ్యంగా అనేవారు. అక్కడ అమెరికాను కుక్కతో పోల్చుతూ.. అమెరికా చెప్పినట్లు చేసిన కెనడాను కుక్క కాలుగా అభివర్ణించారు.
చైనాలో ఏనుగు ఆట బొమ్మలను భారత్‌కు పరోక్ష సూచనగా వాడుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజలేమంటున్నారు?
పాంపియో ట్వీట్‌పై ట్విటర్లో పెద్ద ఎత్తున స్పందించారు. చైనా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తూ అనేక మంది మీమ్స్ పోస్ట్ చేశారు.
పాంపియో చైనాతో ఎలా ఆడుకుంటున్నారో చూడండంటూ కామెంట్లు పెట్టారు.
చైనాలో ట్విటర్‌ను నిషేధించడం వల్ల... చైనా ప్రస్తుత, గత నాయకత్వాలపై వ్యాఖ్యలు చేయడంపై ఆంక్షలు ఉన్నందున ఆ దేశ నెటిజన్లు పెద్దగా దీనిపై ప్రతిస్పందించలేదు.
అయితే, ఏ మాత్రం అవకాశం దొరికినా చైనా నెటిజన్లు పాంపియోను లక్ష్యంగా చేసుకుంటుంటారు.
కోవిడ్ -19, హాంకాంగ్, జిన్ జియాంగ్ ప్రావిన్స్‌లకు సంబంధించి చైనా విషయంలో పాంపియో ఇటీవల కాలంలో చేస్తున్న ప్రకటనలపై మే నెల నుంచి చైనా మీడియా ఆయన్ను అబద్ధాల కోరు, దుష్టుడు అంటోంది.
అస్సలు నమ్మకూడని వ్యక్తులకు సూచనగా చైనా మీడియాలో పాంపియో పేరు తరచూ వాడుతారు.
అయితే, చైనాపై దాడికి పాంపియో వేసిన ఈ ఎత్తుగడకు మాత్రం చైనా నుంచి ఎలాంటి సమాధానం లేదు.
ఇవి కూడా చదవండి:
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








