సంతానోత్పత్తి రేటు: జనాభా తగ్గిపోతోంది.. చైనా సహా ఈ దేశాల్లో సగానికి సగం పడిపోయే ప్రమాదం.. దీనిని అరికట్టేదెలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘెర్
- హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ కరస్పాండెంట్
ప్రపంచవ్యాప్తంగా అనూహ్య రీతిలో శిశుజననాల సంఖ్య తగ్గిపోవడం వ్యవస్థ మీద తీవ్రప్రభావం చూపిస్తుందని పరిశోధకులు అంటున్నారు.
సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడమంటే అంటే జానాభా సఖ్య తగ్గిపోవడం. ఈ శతాబ్దం చివరికొచ్చేసరికి అంటే 2100నాటికి ప్రపంచంలోని అనేక దేశాల్లో జనాభా సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.
2100కల్లా స్పెయిన్, జపాన్లతో సహా 23 దేశాల్లో జనాభా సగానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు.
అలాగే అన్ని దేశాల్లోనూ ఒకే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
అసలేం జరుగుతోంది?
సంతానోత్పత్తి రేటు అంటే సగటున ఒక మహిళ జన్మనివ్వగలిగే శిశువుల సంఖ్య. ఈ రేటు గణనీయంగా తగ్గిపోతోంది.
ఈ సంఖ్య సుమారుగా 2.1 కన్నా తగ్గిపోతే, జనాభా పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది.
1950లో స్త్రీల జీవితకాలంలో ప్రసవాల రేటు సగటున 4.7 ఉండేది.
2017నాటికల్లా ఈ రేటు సగానికి అంటే 2.4 కు పడిపోయిందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యువేషన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనం ప్రకారం 2100కల్లా ఈ రేటు 1.7కు పడిపోవచ్చని అంచనా.
ఫలితంగా 2064 సంవత్సరానికి భూమి మీద మనుషుల సంఖ్య 9.7 బిలియన్లు అంటే 970 కోట్లకు చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2100కి 880 కోట్లకు పడిపోతుందని అంటున్నారు.
ఇది చాలా పెద్ద విషయమని, జనాభా సహజంగా తగ్గిపోయే పరిస్థితులవైపు ప్రపంచం ప్రయాణిస్తోందని ప్రొఫెసర్ క్రిస్టోఫర్ ముర్రే బీబీసీతో అన్నారు.
"ఇది అసాధారణమైన విషయం. జనాభా అధిక శాతంలో తగ్గిపోవడమనేది ఊహించడానికే కష్టం. జనసమూహాలను వెతుక్కుని గుర్తుపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు" అని ఆయన అన్నారు.

సంతానోత్పత్తి రేటు ఎందుకు తగ్గిపోతోంది?
స్త్రీలు అధిక సంఖ్యలో చదువు, ఉద్యోగం వైపు మొగ్గు చూపడం, ఫలితంగా ప్రసవాల సంఖ్య తగ్గించుకోవడం, గర్భనిరోధక సాధనాలు ఎక్కువగా అందుబాటులోకి రావడం ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ విధంగా చూస్తే సంతానోత్పత్తి రేటు తగ్గడమనేది మానవ పురోగతిని సూచిస్తుందని చెప్పుకోవచ్చు.
ఏ దేశాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది?
జపాన్ జనాభా 2017 నుంచీ శతాబ్దం చివరికొచ్చేసరికి 128 మిలియన్ల నుంచీ 53 మిలియన్ల కన్నా తక్కువ సంఖ్యకు చేరుతుందని అంచనా.
ఇటలీ కూడా ఇంచుమించు ఇలాంటి తరుగుదలనే ఎదుర్కోబోతోంది. ఇటలీ జనాభా 61 మిలియన్ల నుంచీ 28 మిలియన్లకు పడిపోయే అవకాశం ఉంది.
స్పెయిన్, పోర్చుగల్, థాయ్‌లాండ్, సౌత్ కొరియా దేశాల్లో ఈ శతాబ్దం ముగిసే సమయానికి జనాభా సగానికి సగం పడిపోతుందని అంచనా వేస్తున్నారు.
"ఇది అవాక్కైపోయే విషయం" అని ప్రొఫెసర్ ముర్రే బీబీసీతో అన్నారు.
ప్రస్తుతం అధిక జనాభా కలిగిన చైనా మరో నాలుగేళ్లల్లో 140 కోట్లకు చేరుకుంటుందని గణాంకాలు సూచిస్తున్నాయి. కానీ 2100నాటికి సగానికి సగం అంటే 73.2 కోట్లకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. అప్పటికి భారతదేశం ప్రథమస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. 2100 నాటికి భారతదేశ జనాభా 109 కోట్లు ఉంటుందని అంచనా.
యూకే జనాభా 2063నాటికి 75 మిలియన్లకు చేరుకుని, 2100 నాటికి 71 మిలియన్లకు పడిపోతుందని అంచనా.

ఫొటో సోర్స్, BBC Sport
జనాభా తగ్గిపోవడం సమస్య ఎందుకవుతుంది?
ఇది మంచి పరిణామమే కదా అని మనం అనుకోవచ్చు. జనాభా తగ్గితే కాలుష్యం తగ్గుతుంది, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి, అటవీ సంపద పెరుగుతుంది. ఇదంతా భూమికి మంచిదే కదా అనుకోవచ్చు.
"అది కొంతవరకూ నిజమే. కానీ సమస్య మొత్తం జనాభాలోని వయసుల మధ్య అంతరం వల్ల ఉత్పన్నమవుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగి యువకుల సంఖ్య తగ్గడం ఆందోళన చెందాల్సిన విషయమే" అని ప్రొఫెసర్ ముర్రే అన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం
- అయిదేళ్లలోపు పిల్లల సంఖ్య 2017 నుంచీ 2100 నాటికి 681 మిలియన్ల నుంచీ 401 మిలియన్లకు పడిపోతుంది.
- 80 యేళ్లు దాటిన వారి సంఖ్య 2017 నుంచీ 2100కి 141 నుంచీ 866 మిలియన్లకు పెరుగుతుంది.
"ఇది వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నాకిప్పుడు 8 యేళ్ల కూతురు ఉంది. తను పెద్దయ్యేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది" అని ప్రొఫెసర్ ముర్రే చెప్పారు.
వృద్ధులు అధికంగా ఉన్న వ్యవస్థలో ఎవరు ఎక్కువ టాక్సులు కడతారు? వృద్ధుల బాధ్యత ఎవరు తీసుకుంటారు? వారి ఆరోగ్యం సంగతేమిటి? ఉద్యోగం చేస్తున్నవారు రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు అని ప్రొఫెసర్ ముర్రే అన్నారు.
పరిష్కార మార్గాలేమిటి?
గతంలో యూకేలో తగ్గుతున్న శిశుజననాల సంఖ్యను భర్తీ చెయ్యడానికి దేశంలోకి వలసలను ప్రోత్సహించారు.
అయితే ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లోనూ జనాభా శాతం తగ్గిపోతున్నప్పుడు ఈ వ్యూహం పనిచెయ్యకపోవచ్చు.
"ముందు ముందు వలసదారుల కోసం దేశాలు పోటీ పడే పరిస్థితి రావొచ్చు."
కొన్ని దేశాల్లో ప్రసవం తరువాత తల్లికి, తండ్రికి కూడా ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వడం, శిశుసంరక్షణ, సంక్షేమ పథకాలు ప్రవేశపెటడం, ఆర్థిక ప్రోత్సహకాలు ప్రకటించడంలాంటి విధానాలను రూపొందించినప్పటికీ ఇవి స్పష్టమైన పరిష్కార మార్గాలని చెప్పలేము అని ప్రొఫెసర్ ముర్రే అభిప్రాయపడ్డారు.
స్వీడన్ కొంతవరకూ ప్రయత్నించి సంతానోత్పత్తి రేటును 1.7 నుంచీ 1.9 కు పెంచగలిగింది. కానీ మిగతాదేశాలు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రసవాల సంఖ్యను పెంచలేకపోయాయి.
"జనాభా తరుగుదలను అరికట్టేందుకు పరిష్కారమార్గాలు కనుక్కోలేకపోతే మానవజాతి అంతరించే ప్రమాదం ఉంది. కానీ దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇది జరగడానికి కొన్ని శతాబ్దాలు పట్టొచ్చు" అని ప్రొఫెసర్ ముర్రే అన్నారు.
అయితే ఈ భయాందోళనలవల్ల మహిళల సాధికారత, చదువు, ఉద్యోగావకాశాలపై వేటు పడే ప్రమాదం ఉందని, అలా జరగకుండా చూసుకోవాలసిన బాధ్యత ప్రభుత్వాలకుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
దీనిపై ప్రొఫెసర్ స్టెయిన్ ఎమిల్ వొల్సెట్ స్పందిస్తూ "జనాభా తరుగుదలను అరికట్టే దిశలో రూపొందించే విధానాలు మహిళల హక్కులను కాలరాసే ప్రమాదం ఉంది. స్త్రీల ఆరోగ్యం, సంక్షేమం, హక్కుల విషయంలో రాజీ పడకూడదు. ప్రభుత్వాలు మహిళా సాధికారతను ప్రోత్సహించాలి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా సంగతేంటి?
ప్రపంచంలో అనేక దేశాల్లో జనాభా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది కానీ ఆఫ్రికాలో ట్రెండ్ మరోలా ఉంది.
2100నాటికి ఆఫ్రికాలో జనాభా మూడు రెట్లు పెరిగి 3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఆఫ్రికా నుంచి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. చాలా దేశాల్లో ఆఫ్రికా సంతతి కనిపిస్తుంది. జాత్యహంకార సమస్యలు పెరగొచ్చు. వీటిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి అని ప్రొఫెసర్ ముర్రే అభిప్రాయం వ్యక్తం చేసారు.
మేమిద్దరం మాకిద్దరు నినాదం ఒక పరిష్కారమవుతుందా?
ప్రసవాల రేటు 2.1 వద్ద నిలదొక్కుకోవడం జనాభా తరుగుదలను అరికట్టలేదని పరిశోధకులు భావిస్తున్నారు. ఇద్దరు తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ, పుటిన అందరూ యుక్తవయసు వచ్చేవరకూ జీవించి ఉంటారని కచ్చితంగా చెప్పలేము. శిశు మరణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో ఈ పరిష్కారం అస్సలు పనికిరాదు. పుట్టినవారిలో మగపిల్లల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటప్పుడు స్త్రీ-పురుష నిష్పత్తిలో తేడాలు రావొచ్చు.
నిపుణులు ఏమంటున్నారు?
అంచనా వేస్తున్న ఈ గణాంకాలు సగం వరకూ నిజమైనా కూడా రాబోయే కాలంలో వలసలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. అనేక దేశాలకు వలస వచ్చే జనాభా ప్రధానం అవుతుంది. ప్రపంచ రాజకీయాల దిశ, గమనంపై పునరాలోచన చెయ్యాల్సిన ఆవశ్యకత ఉంది. మానవత్వం పెంపొందే దిశగా విధానాలు రూపొందించుకోవాలి అని యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్)లో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఇబ్రహీం అబూబాకర్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- కండలు పెంచే ప్రయత్నంలో సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారు
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
- సంతానోత్పత్తి కేంద్రాల మూసివేత.. తల్లులు కాలేమేమోనని భయపడుతున్న మహిళలు
- టొమాటోలు తింటే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందా?
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- మహిళలు మద్యం తాగితే పిల్లలు పుట్టరా?
- అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు
- అబార్షన్ పిల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజూ 10 మంది మృతి
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








