చైనా: ‘8 కోట్ల జనాభాలో 17 మందే పేదలు’ అంటున్న ప్రభుత్వం

చైనా

ఫొటో సోర్స్, Getty Images

పేదరిక నిర్మూలన అనేది చైనా ప్రభుత్వ ప్రధాన ఎజెండాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అక్కడ అన్ని ప్రావిన్సులూ రకరకాల పథకాల్ని అమలు చేస్తున్నాయి. అవన్నీ సత్ఫలితాల్ని ఇస్తున్నాయని ఆ దేశం చెబుతోంది.

కానీ, ఇప్పుడు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సు విడుదల చేసిన గణాంకాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ ప్రావిన్సు జనాభా 8 కోట్ల పైమాటే. ప్రస్తుతం అక్కడ పేదల సంఖ్య చాలా తగ్గిపోయిందని, కేవలం 17 మంది పేదలు మాత్రమే అక్కడ మిగిలున్నారని ప్రభుత్వం అంటోంది.

భారతీయ కరెన్సీలో చూస్తే ఏటా రూ.62 వేల రూపాయల(6వేల యన్‌లు) కంటే తక్కువ సంపాదన ఉన్నవారిని అక్కడి ప్రభుత్వం పేదలుగా పరిగణిస్తోంది. 17మంది మాత్రమే అంతకంటే తక్కువ సంపాదిస్తున్నారని అంటోంది.

ఈ లెక్కలపై ఆన్‌లైన్‌లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ అసలు నిరుద్యోగులు, బిచ్చగాళ్లే లేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

చైనాలోని ధనిక ప్రావిన్సుల్లో జియాంగ్సు ఒకటి. 2020కల్లా పేదరికాన్ని దూరం చేయాలని ఆ ప్రావిన్సు లక్ష్యంగా పెట్టుకుంది. 2019 చివర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో అక్కడి ప్రభుత్వం 25లక్షల మందినిపైగా పేదరికం నుంచి బయటపడేసి ఆ లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నట్లు చెప్పింది.

దారిద్ర్య రేఖ కంటే దిగువున ఉన్న ఆ 17 మందిలో నలుగురికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, మిగతా అందరికీ పనిచేసే శక్తి ఉందని అధికారులు చెబుతున్నారు.

1949 నాటికి ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా చైనా ఉండేది
ఫొటో క్యాప్షన్, 1949 నాటికి ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా చైనా ఉండేది

మరోపక్క కాస్త నెమ్మదిగా ముందుకెళ్తున్నప్పటికీ, చైనా ఆర్థిక వ్యవస్థ ఏటా 6శాతం మేర వృద్ధి సాధిస్తోంది.

జియాంగ్సు ప్రావిన్సు తాజాగా విడుదల చేసిన ఈ గణాంకాలపై ఆన్‌లైన్‌లో ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఎంత పక్కాగా లెక్కిస్తే మాత్రం, మరీ అంత కచ్చితంగా 17మందే ఉన్నారని ఎలా చెబుతారంటూ చైనా సోషల్ మీడియా వేదికైన వీబోలో కామెంట్లు చేస్తున్నారు.

అధికారిక గణాంకాలను గమనిస్తే గత కొన్ని దశాబ్దాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కానీ, పేదరికం పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. అసమానతలు కూడా పెరిగిపోయాయి.

అత్యంత పేదరికంతో జీవిస్తున్నవారి కథలు ఎప్పటికప్పుడు దేశాన్ని విస్మయపరుస్తూనే ఉన్నాయి.

2019లో ఒక చైనీస్ విద్యార్థిని ఐదేళ్లపాటు రోజుకు కేవలం 20 రూపాయలతో జీవించిన కథ అనేకమందిని కలవరపెట్టింది. ఆ తరువాత ఆమెకు చాలామంది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

2018లో ఒక విద్యార్థి స్కూలుకు గడ్డకట్టుకుపోయిన జుట్టుతో వెళ్లిన ఘటనను కూడా అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు.

బాలుడు

ఫొటో సోర్స్, People's Daily

చైనాలో పేదరికానికి నిర్వచనం ఒక్కో ప్రావిన్సులో ఒక్కోలా ఉంటుంది. కానీ, ఏడాదికి 23,500 కంటే తక్కువ సంపాదిస్తున్నవారినే ఎక్కువ ప్రావిన్సులు పేదలుగా గుర్తిస్తున్నాయి. ఆ ప్రమాణం ప్రకారం చూస్తే 2017 నాటికి చైనాలో దాదాపు 3 కోట్ల మందే పేదరికంలో జీవిస్తున్నారు.

కానీ, చాలా ప్రావిన్సులు పేదరిక ప్రమాణాలను పెంచుకుంటూ వెళ్లాయి. జియాంగ్సు ప్రావిన్సునే తీసుకుంటే అక్కడ ఆ ప్రమాణం రూ.62వేల రూపాయలుగా ఉంది. ప్రపంచ బ్యాంకు నిర్వచించిన దారిద్ర్య రేఖ ప్రమాణాలకంటే ఇది ఎక్కువే.

2020 చివరికల్లా తీవ్రమైన పేదరికాన్ని దేశంలో లేకుండా చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది.

చైనా జాతీయ గణాంక విభాగ లెక్కల ప్రకారం అక్కడ ఏటా సగటున ప్రతి పౌరుడు ఏడాదికి దాదాపు రూ.2.8లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 1990లో ఓ మాదిరి అసమానతలు ఉన్న దేశంగా నిలిచిన చైనా, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక అసమానతలు ఉన్న దేశాల్లో ఒకటిగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)