భార‌త సైనికులు సోషల్ మీడియా యాప్‌లు ఉపయోగిస్తే ప్రమాదం ఏంటి?

ఫేస్‌బుక్ వినియోగంపై గ‌తంలో కూడా భార‌త సైన్యం చాలా ఆదేశాలు జారీచేసింది

ఫొటో సోర్స్, GETTY IMAGES/TAUSEEF MUSTAFA

ఫొటో క్యాప్షన్, ఫేస్‌బుక్ వినియోగంపై గ‌తంలో కూడా భార‌త సైన్యం చాలా ఆదేశాలు జారీచేసింది
    • రచయిత, శుభం కిశోర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సోష‌ల్ మీడియా యాప్‌ల‌ను సైనికులు ఉప‌యోగించ‌కుండా విధించిన నిషేధంపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాక‌రించింది. నిషేధాన్ని స‌వాల్‌చేస్తూ సీనియ‌ర్ సైన్యాధికారి దాఖ‌లుచేసిన పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

ఫేస్‌బుక్ అంతగా ఉప‌యోగించాల‌ని అనుకుంటే... రాజీనామా స‌మ‌ర్పించే అవ‌కాశం ఉండ‌నే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

త‌మ కుటుంబ స‌భ్యులు విదేశాల్లో ఉన్నార‌ని, వారితో మాట్లాడేందుకు ఈ సోష‌ల్ మీడియా యాప్‌లు చాలా ముఖ్య‌మ‌ని పిటిష‌న్‌లో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పీకే చౌధ‌రి కోరారు. సైన్యం ఇటీవ‌ల జారీచేసిన ఆదేశాన్ని వెన‌క్కు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు.

అయితే సోష‌ల్ మీడియా అకౌంట్ల‌న్నీ డిలీట్ చేయాల‌ని కోర్టు సూచించింది. వీటిని కావాలంటే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత మ‌ళ్లీ తెర‌చుకోవ‌చ్చ‌ని సూచించింది.

ఆ ఆదేశంలో ఏముంది?

ఈ నెల మొద‌టివారంలో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిల‌ట‌రీ ఇంటెలిజెన్స్ ఒక ఆదేశాన్ని విడుద‌ల చేసింది. భార‌త సైన్యంలో ప‌నిచేస్తున్న 13 ల‌క్ష‌ల మంది సైనికులు 89 యాప్‌ల‌ను ఉప‌యోగించ‌కూడ‌ద‌ని దీనిలో సూచించింది. జులై 15 క‌ల్లా యాప్‌ల‌న్నీ అన్ఇన్‌స్టాల్ చేయాల‌ని పేర్కొంది. అమెరికా సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం లాంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

సున్నిత‌మైన స‌మాచారం విదేశీ నిఘా సంస్థ‌ల‌కు చిక్కకుండా ఉండేందుకే ఈ ఆదేశాన్ని జారీ చేసిన‌ట్లు సైన్యం వివ‌రించింది.

ఇటీవ‌ల ప్ర‌భుత్వం కూడా టిక్‌టాక్‌, వీచాట్ స‌హా 59 చైనా యాప్‌ల‌పై నిషేధం విధించింది.

ఫేస్‌బుక్ వినియోగంపై గ‌తంలో కూడా భార‌త సైన్యం చాలా ఆదేశాలు జారీచేసింది. మ‌రోవైపు వాట్సాప్ వినియోగాన్ని కూడా సైనికులు త‌గ్గించుకోవాల‌ని సూచించింది.

సోష‌ల్ మీడియా యాప్‌ల నిషేధంపై సైన్యంలో చ‌ర్చ జ‌ర‌గ‌డం ఇదేమీ తొలిసారి కాదు

ఫొటో సోర్స్, ISTOCK

ఫొటో క్యాప్షన్, సోష‌ల్ మీడియా యాప్‌ల నిషేధంపై సైన్యంలో చ‌ర్చ జ‌ర‌గ‌డం ఇదేమీ తొలిసారి కాదు

సోష‌ల్ మీడియాతో ముప్పు ఎంత‌?

ఈ సోష‌ల్ మీడియా యాప్‌ల‌తో వ్య‌క్తిగ‌త స‌మాచారం చోరీ అయ్యే ముప్పుంది. చోరీకి గురయ్యే డేటాతో దేశం మొత్తానికీ ముప్పు సంభ‌వించే అవ‌కాశ‌ముంది.

సైన్యంలో ప‌నిచేసే వారి డేటా చోరీకి గుర‌య్యే ముప్పు చాలా ఎక్కువ‌. ఈ యాప్‌లు చాలాసార్లు లొకేష‌న్‌ను ట్రాక్ చేస్తాయి. కొన్నిసార్లు మైక్‌ల‌ను ఇవి త‌మ ఆధీనంలోకి తీసుకుంటాయి. దీంతో భ‌ద్ర‌త‌కు భారీ ముప్పు సంభ‌వించే అవ‌కాశ‌ముంది.

"ఈ యాప్‌లు చాలా అనుమ‌తులు అడుగుతాయి. మ‌నం పూర్తిగా చూడ‌కుండానే ఓకే అని కొట్టేస్తాం. ఫోన్‌లోని మైక్‌లు, లొకేష‌న్‌, ఫొటోల‌ను ఈ యాప్‌లు త‌మ ఆధీనంలోకి తీసుకుంటాయి. సైనికుడి లొకేష‌న్‌ను ఫోన్‌లోని ఫొటోల సాయంతో గుర్తుప‌ట్టొచ్చు. దీంతో దేశ భ‌ద్ర‌త ముప్పులో ప‌డే అవ‌కాశ‌ముంది" అని సైబ‌ర్ నిపుణుడు ప‌వ‌న్ దుగ్గ‌ల్ వివ‌రించారు.

సోష‌ల్ మీడియా యాప్‌ల నిషేధంపై సైన్యంలో చ‌ర్చ జ‌ర‌గ‌డం ఇదేమీ తొలిసారి కాదు.

"గ‌త 8-10 ఏళ్ల నుంచీ ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. మిగ‌తా దేశాల్లోనూ ఈ చ‌ర్చ ఉంది. ప్ర‌తి సైనికుడికీ ఫోన్ ఉంటుంది. దీన్ని ఎలా ఉప‌యోగించాలో సైన్యం ప‌క్కా మార్గ‌ద‌ర్శ‌కాలు ఇస్తుంది. ఒకవేళ నిషేధం విధించినా.. అది స‌హేతుక‌మైన చ‌ర్యే అయ్యుంటుంది"అని విశ్రాంత లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ హెచ్ఎస్ ప‌నాగ్ వివ‌రించారు.

హ‌నీ ట్రాప్ ముప్పు

సోష‌ల్ మీడియా యాప్‌ల‌తో హ‌నీట్రాప్ ముప్పు పెరుగుతుంద‌ని ప‌నాగ్ వివ‌రించారు.

"ఫేక్ అకౌంట్లు క్రియేట్‌ చేసుకొని అమ్మాయిల్లా... ఒంటరిగా ఉండే సైనికుల‌తో మాట్లాడ‌టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడే చూస్తుంటాం. దీనికి సంబంధించి చాలా కేసులు న‌మోద‌వుతుంటాయి" అని ప‌నాగ్ వివ‌రించారు. అయితే నిషేధాన్ని అమ‌లు చేయ‌డం అంత తేలిక‌కాద‌ని ఆయ‌న అభిప్రాయ‌పడ్డారు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియా యాప్‌ల‌తో సైన్యంతోపాటు సాయుధ బ‌ల‌గాలు, పోలీసుల‌కూ ముప్పుంటుంద‌ని ప‌వ‌న్ వివ‌రించారు.

"డేటా చౌర్యం, హ‌నీట్రాప్‌లు అన్నిచోట్లా జ‌రుగుతుంటాయి. ఇలాంటి వాటిని అరిక‌ట్టేందుకు ప్ర‌తి విభాగం తీవ్రంగా ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది. స‌రిహ‌ద్దుల్లో ప‌నిచేస్తుంటారు కాబట్టి.. సైన్యానికి ఈ ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. వ్యూహాల‌ను రూపొందించే అధికారుల స‌మాచారం లీకైనా.. దేశ భ‌ద్ర‌త ముప్పులో ప‌డుతుంది" అని ఆయ‌న వివ‌రించారు.

"సోష‌ల్ మీడియా యాప్‌ల‌తో హ‌నీట్రాప్ ముప్పు పెరుగుతుంది"

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, "సోష‌ల్ మీడియా యాప్‌ల‌తో హ‌నీట్రాప్ ముప్పు పెరుగుతుంది"

ఇదేమీ తొలిసారి కాదు

సోష‌ల్ మీడియా లేన‌ప్పుడు కూడా సైనికులు పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌ల జాబితా పెద్ద‌దే ఉంటుంది.

"ఇదేమీ కొత్త‌కాదు. నేను 50ఏళ్ల క్రితం సైన్యం చేరాను. అప్పుడు కెమెరానూ ముప్పుగానే చూసేవారు. కెమెరా ఉంటే.. ముందు దాన్ని రిజిస్ట‌ర్ చేసుకోమ‌నేవారు. ట్రాన్సిస్ట‌ర్లు, రేడియోల విష‌యంలోనూ సైన్యం జాగ్ర‌త్త తీసుకొనేది. సోష‌ల్ మీడియా నేడు స‌మ‌స్య‌గా మారింది. దీన్ని స‌రైన అవ‌గాహ‌న‌తో ప‌రిష్క‌రించొచ్చు. ముప్పు మ‌రీ పెరిగితే నిషేధం విధించ‌డ‌మే ఏకైక మార్గం"అని ప‌నాగ్ వివ‌రించారు.

ఇత‌ర దేశాల్లోనూ..

భార‌త్‌లో మాత్ర‌మే కాదు.. సోష‌ల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ల వినియోగానికి సంబంధించి చాలా దేశాలు మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాయి.

2019 నుంచి సోష‌ల్ మీడియా యాప్‌ల దుర్వినియోగం ముప్పు వ‌ల్ల సైన్యికులు విధుల్లో ఉన్న‌ప్పుడు స్మార్ట్‌ఫోన్లు ఉప‌యోగించ‌కూడ‌ద‌ని ర‌ష్యా సూచించింది. అంతేకాదు వీరు ఫొటోలు తీసుకోవ‌డం, వీడియోలు తీయ‌డం, ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగించ‌డం లాంటివి చేయ‌కూడ‌దు.

అయితే, ఇక్క‌డ బేసిక్ ఫోన్ల‌ను ఉప‌యోగించొచ్చు.

అమెరికా కూడా సైనికుల సోష‌ల్ మీడియా వినియోగంపై చాలా నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. 2018లో ఓ ఫిట్‌నెస్ సంస్థ‌.. సైనికుల వ్యాయామానికి సంబంధించిన స‌మాచారం ఇత‌రుల‌కు షేర్‌ చేసింది. దీంతో భ‌ద్ర‌త‌పై చాలా చ‌ర్చ న‌డిచింది.

దీంతోపాటు సైనికుల ఫోన్‌ల‌లో చైనా యాప్ టిక్‌టాక్ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని అమెరికా స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)