సుల్తానా డాకూ: సంపన్నులను దోచి పేదలకు పంచిన ఇండియన్ ‘రాబిన్ హుడ్’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అకీల్ అబ్బాస్ జాఫ్రీ
- హోదా, కరాచీ చరిత్రకారుడు, బీబీసీ కోసం
సంపన్నుల సంపద దోచుకోవడం, పేదలకు పంచడం అనే మాట గుర్తుకురాగానే మనకు 14వ శతాబ్దం నాటి ‘రాబిన్ హుడ్’ పేరు గుర్తుకొస్తుంది. అతడు తన సహచరులతో కలిసి బ్రిటన్ కౌంటీ నాటింగ్‌హామ్ షైర్‌లో షేర్‌వుడ్ అడవుల్లో ఉండేవాడు.
అతడు సామాన్యుడు. కానీ క్రూరుడైన నాటింగ్‌హామ్ షరీఫ్ అతడి భూమిని బలవంతంగా లాక్కుంటాడు. దాంతో అతడు దోపిడీలు మొదలుపెడతాడు.
రాబిన్ హుడ్ గురించి ఎన్నో నవలలు రాశారు. చాలా సినిమాలు కూడా వచ్చాయి. అయినా, తను అసలు నిజ జీవితంలో ఉన్నాడా, లేదా అనే సందేహం ఉంది.
అయితే భారత్‌లో కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది. అతడు కూడా సంపన్నులను దోచుకుని పేదలకు సాయంగా నిలిచేవాడని చెప్పుకుంటారు. అతడే సుల్తానా డాకూ(డాకూ అంటే దొంగ). అతడిని 96 ఏళ్ల క్రితం 1924 జులై 7న ఉరికంబానికి ఎక్కించారు.
సుల్తానా డాకూ మతం గురించి కచ్చితంగా ఏదీ చెప్పలేం. చాలామంది అతడు ముస్లిం అంటారు. కానీ, కొంతమంది చరిత్రకారులు మాత్రం అతడు హిందూ మతాన్ని అనుసరించాడని చెబుతారు. ఎందుకంటే అతడు భాతో సమాజానికి చెందినవాడని, వారు హిందూ మతాన్ని విశ్వసిస్తారని చెప్పారు.
సుల్తానా మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఉర్దూలో మొదటి డిటెక్టివ్ నవలా రచయిత, అప్పటి ప్రముఖ పోలీస్ అధికారి జఫర్ ఉమర్ అతడిని ఒకసారి అరెస్టు చేయగలిగాడు. దానికి అతడు ఐదు వేల రూపాయల బహుమతి కూడా అందుకున్నాడు.
జఫర్ ఉమర్ కూతురు హమీదా అఖ్తర్ హుస్సేన్ రాయ్ పురీ తన పుస్తకం ‘నాయాబ్ హై హమ్’(మేం అరుదైన వాళ్లం)లో జఫర్ ఉమర్ ఒక ఎన్‌కౌంటర్ జరిగినపుడు సుల్తానాను అరెస్టు చేశాడని చెప్పారు.
అప్పుడు సుల్తానాపై దోపిడీలు మినహా ఎలాంటి హత్యారోపణలూ లేవు. దాంతో, అతడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
అతడిని అరెస్టు చేసినందుకు వచ్చిన బహుమతి డబ్బును జఫర్ ఉమర్ తన సిపాయిలకు, స్థానికులకు పంచేశాడు. ఆ తర్వాత ఆయన ఉర్దూలో చాలా డిటెక్టివ్ నవలలు రాశారు. వాటిలో మొదటి నవల ‘నీలీ ఛత్రీ’(నీలం గొడుగు). అందులో ప్రధానంగా సుల్తానా డాకూ కథను రాశారు.

ఫొటో సోర్స్, '20TH CENTURY: YEAR BY YEAR'
సుల్తానా దోపిడీల తీరు
విడుదలైన తర్వాత సుల్తానా మళ్లీ ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. నజీబాబాద్, సాహిన్‌పూర్‌లో చురుగ్గా ఉండే వాళ్లందరినీ తనతో చేర్చుకున్నాడు. నమ్మకస్తులైన ఇన్ఫార్మర్లతో పథకాలు రచించి దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. ఆ వేగులు అతడికి బాగా డబ్బున్న వాళ్ల గురించి సమాచారం ఇచ్చేవారు.
సుల్తానా డాకూ ప్రతి దోపిడీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, దాన్ని విజయవంతంగా అమలు చేసేవాడు. అదే సమయంలో ఉన్న ప్రముఖ వేటగాడు జిమ్ కార్బెట్ కూడా చాలా రచనల్లో అతడి గురించి రాశాడు.
సుల్తానా డాకూ ఎవరికీ భయపడేవాడు కాదు. ఎవరినైనా దోచుకోవాలంటే ‘నేను వస్తున్నా’నని వారికి ముందే సమాచారం పంపేవాడు.
దోపిడీలు చేస్తున్నప్పుడు సుల్తానా వీలైనంత వరకూ రక్తపాతం లేకుండా చూసుకునేవాడు. కానీ ఎవరైనా ఎదురు తిరిగితే, వారిని చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు.
అతడు తన శత్రువులను హత్య చేసినపుడు వారి చేతికి మూడు వేళ్లను కూడా కోసే వాడని చెబుతారు. సంపన్నులైన షావుకార్లు, జమీందార్ల అరాచకాలకు బలైన ప్రజలు అతడు క్షేమంగా ఉండాలని ప్రార్థించేవాళ్లు. సుల్తానా ఎక్కడ దోపిడీ చేసినా, వాటిని అక్కడే ఉన్న పేదలకు పంచేసేవాడు.

ఫొటో సోర్స్, FAMILY COLLECTION: JALILPUR BIJNOR
సుల్తానా డాకూ కోసం ఇంగ్లిష్ అధికారి
సుల్తానా డాకూ దోపిడీలు వరసగా చాలా ఏళ్లు కొనసాగాయి. కానీ, అప్పుడు ఆంగ్లేయుల పాలన ఉండేది. ఈ పరిస్థితిని ఎక్కువ కాలం భరించలేకపోయిన వారు మొదట భారత పోలీసులతో సుల్తానాను పట్టుకోవాలని చూశారు. కానీ వేగులు, పేద ప్రజల సాయంతో అతడు వారికి దొరక్కుండా మెరుపులా తప్పించుకునేవాడు.
ఆంగ్లేయులు చివరికి సుల్తానా డాకూను పట్టుకోడానికి బ్రిటన్ నుంచి ఫ్రెడ్డీ యంగ్ అనే ఒక అనుభవజ్ఞుడైన పోలీస్ అధికారిని భారత్ పిలిపించాలనుకున్నారు.
అతడు మొదట భారత్ చేరుకోగానే సుల్తానా వేగులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించాడు. అతడు, తన ముఠా సభ్యులతో ఎలా తప్పించుకున్నాడో, ఆ ఘటనల గురించి విస్తృత సమాచారం సేకరించాడు.
సుల్తానా తప్పించుకోవడం వెనుక పోలీసుల పాత్ర కూడా ఉందనే విషయం తెలుసుకోడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. మనోహర్ లాల్ అనే ఒక పోలీస్ సుల్తానాకు సాయం చేస్తున్నట్టు అతడికి తెలిసిపోయింది. సుల్తానాను అరెస్టు చేయడానికి జరిగే ప్రతి ప్రయత్నం గురించి అతడు ముందే సమాచారం అందించేవాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే సుల్తానా జారుకునేవాడు.
ఫ్రెడ్డీ యంగ్ సుల్తానా డాకూను అరెస్ట్ చేయడానికి ఒక తెలివైన ఎత్తు వేశాడు. మొదట అతడు మనోహర్ లాల్‌ను దూరంగా బదిలీ చేయించాడు. తర్వాత నజీబాబాద్‌లో కొందరి సాయంతో సుల్తానాకు సమాచారం అందించే నమ్మకస్తుడు మున్షీ అబ్దుల్ రజాక్‌ను తనవైపు తిప్పుకోగలిగాడు.
సుల్తానా డాకూ స్థావరం నజీబాబాద్ దగ్గర ఒక అడవిలో ఉండేది. దానిని కజలీ బన్ అనేవారు. ఆ అడవి చాలా దట్టంగా, క్రూరమృగాలతో నిండి ఉండేది. కానీ సుల్తానాకు ఆ అడవిలో ప్రతి అంగుళం తెలుసు.
అడవిలో అతడి స్థావరం ఉన్న ప్రాంతంలో పగలు కూడా చీకటిగా ఉండేది. సుల్తానా వేషాలు మార్చడంలో కూడా సిద్ధహస్తుడు.
మున్షీ అబ్దుల్ రజాక్ సలహాతో సుల్తానా స్థావరాన్ని అన్నివైపుల నుంచీ చుట్టుముట్టిన ఫ్రెడ్డీ యంగ్ అతడు ఎటూ వెళ్లలేకుండా చేశాడు. మున్షీ కూడా అటు సుల్తానాతో టచ్‌లో ఉంటూనే అతడి వివరాలన్నీ ఫ్రెడ్డీకి అందించేవాడు.
ఒక రోజు మున్షీ ఒక ప్రాంతానికి రావాలని సుల్తానాకు చెప్పాడు. అక్కడ ముందే పోలీసులు మాటు వేశారు. సుల్తానా రాగానే శామ్యూల్ పారిస్ అనే ఒక ఇంగ్లిష్ అధికారి అతడిని తన సిపాయిలతో కలిసి అదుపులోకి తీసుకున్నాడు. సుల్తానా వారిపై కాల్పులు జరపాలనుకున్నాడు. కానీ పోలీసులు అతడి రైఫిల్ లాక్కున్నారు.
తర్వాత సుల్తానా పారిపోవాలనుకున్నాడు. కానీ పోలీసులు అతడి కాళ్ల మీద రైఫిల్ బట్‌తో కొట్టి కింద పడేలా చేశారు. తర్వాత సుల్తాన్‌ను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌ను ఫ్రెడ్డీ యంగ్ లీడ్ చేశాడు. దాంతో తర్వాత అతడికి ప్రమోషన్ ఇచ్చి భోపాల్ జైలు ఐజీగా పంపించారు.
సుల్తాన్‌ను అరెస్టు చేసిన తర్వాత, అతడిని ఆగ్రా జైలుకు తీసుకొచ్చారు. అతడి నేరాలపై విచారణ నడిచింది. సుల్తాన్ సహా 13 మందికి మరణ శిక్ష విధించారు. సుల్తానా మిగతా అనుచరుల్లో చాలా మందికి జీవిత ఖైదు, కాలాపానీకి పంపే శిక్ష కూడా విధించారు.
1924 జులై 7న సుల్తానాకు ఉరిశిక్ష వేశారు. కానీ సంపన్నుల గుండెల్లో అతడంటే భయం, సామాన్యుల్లో అతడంటే గౌరవం చాలాకాలంపాటు చర్చల్లో నిలిచింది.

ఫొటో సోర్స్, PARAMOUNT PICTURES / RD FILMS
దోపిడీ దొంగ, పోలీసు మధ్య స్నేహం
సుల్తానా డాకూ ఆంగ్లేయులను చాలా ద్వేషించేవాడు. ఆ ద్వేషంతోనే అతడు తన కుక్కను రావ్ బహదూర్ అని పిలిచేవాడు. ఆంగ్లేయ పాలకులకు విశ్వాసంతో మెలిగిన భారతీయులకు దానిని ఒక గౌరవనీయ బిరుదులా ఇచ్చేవారు.
సుల్తానా గుర్రం పేరు చేతక్. అతడిపై విచారణ జరుగుతున్న సమయంలో ఆంగ్లేయ పోలీస్ అధికారి ఫ్రెడ్డీ యంగ్‌తో అతడికి స్నేహం ఏర్పడిందని జిమ్ కార్బెట్ చెప్పారు. సుల్తానా అరెస్ట్ కావడానికి కారణం అయిన ఫ్రెడ్డీ అతడి కథ విని ఎంత చలించి పోయాడంటే, డాకూకు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకోడానికి సాయం కూడా చేశాడు. కానీ ఆ దరఖాస్తును రద్దు చేశారు.
చనిపోయాక తన ఏడేళ్ల కొడుకును ఉన్నత చదువులు చదివించాలని సుల్తానా ఫ్రెడ్డీ యంగ్‌ను కోరాడు. అతడు సుల్తానా కోరికను గౌరవించాడు. సుల్తానాకు మరణశిక్ష విధించిన తర్వాత అతడి కొడుకును ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ పంపించాడు.
చదువు పూర్తైన తర్వాత సుల్తానా కొడుకు భారత్ తిరిగొచ్చాడు. ఐసీఎస్ పరీక్ష పాసై, పోలీసు విభాగంలో ఒక ఉన్నతాధికారి అయ్యాడు. ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా రిటైర్ అయ్యాడు.
వెండితెరపై సుల్తానా డాకూ
సుల్తానా జీవితం ఒక కాల్పనిక పాత్రగా మిగిలిపోయింది. జనం అతడిని చాలా ఇష్టపడేవారు. సుల్తానా మంచితనం సాహితీవేత్తలను, రచయితలను ఆకర్షించింది. ఆ తర్వాత అతడి గురించి హాలీవుడ్, బాలీవుడ్, లాలీవుడ్ మూడు రంగాల్లో సినిమాలు నిర్మించారు.
హాలీవుడ్‌లో సుల్తానా డాకూపై తీసిన సినిమా ‘ద లాంగ్ డ్యుయెల్’. అందులో యుల్ బ్రేనర్ సుల్తానా పాత్ర పోషించాడు.
పాకిస్తాన్‌లో ఇదే పాత్రపై 1975లో పంజాబీ భాషలో ఒక సినిమా వచ్చింది. అందులో సుల్తానా పాత్రను నటుడు సుధీర్ చేశాడు.
సుల్తానా పాత్ర గురించి సుజీత్ సరాఫ్ ‘ద కన్ఫెషన్ ఆఫ్ సుల్తానా డాకూ’(సుల్తానా డాకూ నేరాంగీకారం) అనే పేరుతో ఒక నవల కూడా రాశారు.

ఫొటో సోర్స్, PAKISTAN CHRONICLE
భూపత్ డాకూ తర్వాత అమీన్ యూసుఫ్
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో ఇద్దరు దోపిడి దొంగలు కలకలం సృష్టించారు. వారిలో ఒకరు భూపత్ డాకూ. అతడు జునాగఢ్‌కు చెందినవాడు.
జునాగఢ్ ఒక సంపన్న రాజ్యం. అది అలా ఉండడం దొంగలకు కలిసొచ్చింది. పాకిస్తాన్ ఏర్పడక ముందే జునాగఢ్‌ను వణికించిన దోపిడి దొంగల్లో హీరా ఝీనా, భూపత్ డాకూ అగ్రస్థానంలో ఉంటారు.
వీరి దోపిడీలకు సంబంధించి ఎన్నో ఘటనలు జానపథ కథల్లా జనం నోట్లో నానాయి. భూపత్ డాకూ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అక్కడికి వెళ్లిపోయాడు. 1952లో తన ముగ్గురు సహచరులతో కలిసి పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడ్డాడు.
భూపత్ డాకూ భారత్‌లో దోపిడీలు, హత్యలతో కలకలం సృష్టించాడు. అతడిపై 200కు పైగా హత్య, దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. భారత ప్రభుత్వం భూపత్ తలపై 50 వేల రూపాయల బహుమతి కూడా ప్రకటించింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత్‌లో ఇన్ని నేరాలు చేసినా, అతడిపై భారీ బహుమతి ఉన్నా పాకిస్తాన్‌లో భూపత్ డాకూ ఎలాంటి క్రిమినల్ నేరాలూ చేయలేదు. దాంతో పర్మిట్ లేకుండానే పాకిస్తాన్‌లోకి వచ్చాడని, లైసెన్స్ లేకుండానే ఆయుధం ఉంచుకున్నాడనే ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు.
పాకిస్తాన్‌లో భూపత్ డాకూ అరెస్ట్ గురించి తెలీగానే, భారత ప్రభుత్వం అతడిని తమకు అప్పగించాలని కోరింది. కానీ అప్పటికి రెండు దేశాల మధ్య నేరస్థులు అప్పగింతకు సంబంధించి ఎలాంటి ఒప్పందం లేదు. దాంతో భూపత్ డాకూ పాకిస్తాన్‌లోనే ఉండిపోయాడు.
ఈ కేసు ఎంత కీలకంగా మారిందంటే అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని మొహమ్మద్ అలీతో అతడి అప్పగింత గురించి స్వయంగా మాట్లాడారు.
మొహమ్మద్ అలీ ‘‘మేం అతడిని సరిహద్దుల వరకూ తీసుకురాగలం, అక్కడ భారత పోలీసులు అతడిని అరెస్ట్ చేయొచ్చు’’ అని చెప్పారు. కానీ ఈ వార్త ప్రెస్‌కు లీకవడంతో పాకిస్తాన్ తన ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది.
భూపత్ డాకూ ఏడాది వరకే బయటున్నాడు. తర్వాత అతడు ఇస్లాం మతం స్వీకరించాడు. అమీన్ యూసుఫ్‌గా పేరు మార్చుకున్నాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత అతడు ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతడికి ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్లు పుట్టారు. తర్వాత అతడు కరాచీలో పాల వ్యాపారం ప్రారంభించాడు.
అమీన్ యూసుఫ్ జైల్లో తన కథను కాలు వానిక్ అనే సహచరుడితో రాయించాడు. దానిని జాఫర్ మన్సూర్ ఉర్దూలోకి అనువదించాడు. 1996 సెప్టెంబర్ 28న చనిపోయిన అతడిని కరాచీలోనే ఖననం చేశారు.

ఫొటో సోర్స్, PAKISTAN CHRONICLE
మొహమ్మద్ ఖాన్ డాకూ
1960వ దశకంలో పంజాబ్‌లో మరో దోపిడీ దొంగ కథలు చాలా జనాదరణ పొందాయి. అతడి పేరు మొహమ్మద్ ఖాన్.
మొహమ్మద్ ఖాన్ 1927లో డర్నాల్‌లో పుట్టాడు. అతడు సైన్యంలో హవల్దారుగా ఉండేవాడు. అతడి సమాజంలో ఒక గొడవలో సోదరుడు హత్యకు గురవడంతో ప్రతీకారంతో అతడు తన ప్రత్యర్థుల్లో ఒకరిని చంపి పరారయ్యాడు.
పోలీసులు అతడిని మోస్ట్ వాంటెడ్ నేరస్థుడుగా ప్రకటించారు. అతడు పరారైన సమయంలో అతడి ప్రత్యర్థులు మొహమ్మద్ మరో సోదరుడిని కూడా చంపేశారు. ఆ తర్వాత అతడు ప్రతీకారంతో రగిలిపోయాడు. ఒక ముఠాను ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని చంపుతూ, దోపిడీలు చేయడం మొదలెట్టాడు. తర్వాత పోలీసులకు, ప్రత్యర్థులకు ముందే చెప్పి మరికొందరిని హత్య చేశాడు.
మొహమ్మద్ డాకూ ఉన్న గ్రామంలో అతడి అనుమతి లేకుండా పోలీసులు, అధికారులు ఎవరూ ప్రవేశించేవారు కాదు. నవాబ్ ఆఫ్ కాలాబాగ్ మలిక్ అమీర్‌కు ఆయనతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అమీర్ పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్‌గా ఉన్నంతవరకూ అతడిపై ఎవరూ చేయి వేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. 1963 నుంచి 1966 వరకూ మొహమ్మద్ ఖాన్ హవా కొనసాగింది.
నవాబ్ ఆఫ్ కాలా బాగ్ గవర్నర్‌గా మలిక్ అమీర్ పదవి ముగియడంతో మొహమ్మద్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
1968 సెప్టెంబర్ 12న మొహమ్మద్ ఖాన్‌కు నాలుగు సార్లు మరణశిక్ష, 149 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మొహమ్మద్ వాటిపై హైకోర్టుకు వెళ్లాడు. తన కేసును స్వయంగా వాదించాడు.
దర్యాప్తు అధికారికి తనతో శత్రుత్వం ఉందని, అందుకే కల్పిత ఆరోపణలు చేశాడని నిరూపించాడు. దాంతో హైకోర్టు మొహమ్మద్ ఖాన్‌కు రెండు మరణ శిక్షలు రద్దు చేసింది.
1976 జనవరి 8న అతడికి ఉరిశిక్ష వేయాలని ఆదేశించారు. కానీ ఆ శిక్ష వేయడానికి 5 గంటల ముందు హైకోర్టు ఆ మరణ శిక్ష నిలిపివేయాలని ఆదేశించింది.
1978లో మొహమ్మద్ ఖాన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. బేనజీర్ భుట్టో ప్రభుత్వం 60 ఏళ్లకు పైబడిన ఖైదీల శిక్షను రద్దు చేసినట్లు ప్రకటించడంతో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
1995 సెప్టెంబర్ 29న అతడు మృతిచెందాడు. పూర్వీకులకు చెందిన ఢోక్ మసాయబ్, తిలా గంగ్ జిల్లా చక్వాల్‌లో అతడిని ఖననం చేశారు.
మొహమ్మద్ ఖాన్ జీవిత ఘటనల మీద డైరెక్టర్ కైఫీ ‘మొహమ్మద్ ఖాన్’ అనే ఒక పంజాబీ సినిమా తీశాడు. అందులో లీడ్ రోల్ సుల్తాన్ రాహీ చేశాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








