వికాస్ దుబే, దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ల మధ్య తేడా ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
హైదరాబాద్‌లో గత ఏడాది దిశ (వెటర్నరీ డాక్టర్)పై అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు నిందితుల ‘ఎన్‌కౌంటర్’.. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ‘ఎన్‌కౌంటర్’ ఒకేలా అనిపిస్తాయి.
రెండు ఘటనల్లోనూ న్యాయ సూత్రాల పవిత్రత దెబ్బతిన్నదని న్యాయ నిపుణులు చెబుతున్నప్పటికీ రెండూ పూర్తిగా భిన్నమైనవి.
ఈ ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ 'బీబీసీ'తో మాట్లాడుతూ ''తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన లాకప్ డెత్ వంటివి కానీ, ఎన్‌కౌంటర్లు కానీ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఏ అధికారి కూడా.. చివరికి పోలీసులు కూడా చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు'' అన్నారు.

హైదరాబాద్ ఎన్‌కౌంటర్
గత ఏడాది చివర్లో హైదరాబాద్ శివారుల్లోని శంషాబాద్ సమీపంలో ఒక పశువైద్యురాలిపై అత్యాచారం చేసి చంపేశారని ఆరోపణలున్న ఇద్దరు లారీ డ్రైవర్లు, వారి సహాయకులు ఇద్దరిని పోలీసులు ఒక రోజు తరువాత అరెస్ట్ చేశారు.
బాధితురాలి శవం తగలబెట్టిన ప్రదేశానికి 2019 డిసెంబరు 6న నిందితులను పోలీసులు తీసుకెళ్లారు.
ఆ సమయంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల నుంచి రివాల్వర్లు లాక్కునేందుకు ప్రయత్నించారని.. దాంతో మిగతా పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో నలుగురూ చనిపోయారని పోలీసులు చెప్పారు.
ఆ అత్యాచారం, ఎన్‌కౌంటర్ రెండూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న కాల్పుల్లో హతమార్చడంపై ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అలాంటి ప్రజా స్పందన సినిమాల్లో చూపించే తక్షణ న్యాయానికి ఉన్న మద్దతుపై ఎన్నో ప్రశ్నలను రగిలించింది.
ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పరిచింది. సుప్రీంకోర్టు దీనిపై విచారణకు 2020 జనవరిలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుకార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను నియమించింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేఖా బల్దోత్, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ ఆ కమిషన్‌లో సభ్యులు.
''తెలంగాణ హైకోర్టు కేంద్రంగా పనిచేయడానికి మాకు కార్యాలయ వసతి కల్పించారు. అయితే, కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా మేం ఇంకా అక్కడి నుంచి పని ప్రారంభించలేకపోయాం. ఈ కేసు విచారణకు అవసరమైన పత్రాలన్నీ సేకరించాం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక మా పని ప్రారంభమవుతుంది'' అని కార్తికేయన్ 'బీబీసీ హిందీ'కి చెప్పారు.

అలాంటిదే కానీ భిన్నమైనది..
లాకప్ డెత్‌లు, ఎన్‌కౌంటర్లు కొత్తేమీ కాదు. 1970ల చివర్లో, 1980ల్లో కూడా నక్సలైట్లు, గ్యాంగ్‌స్టర్లతో తలపడినప్పుడు గతంలో చాలా ఎన్‌కౌంటర్లు జరిగాయి.
కానీ, ఇప్పుడు వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కానీ హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ కానీ వాటన్నిటికీ పూర్తిగా భిన్నమైనది. దుబే గ్యాంగ్‌స్టర్ అయినప్పటికీ రాజకీయాలతో బాగా సంబంధాలున్నవాడు.
''దుబే రాజకీయంగా శక్తిమంతుడే అయినప్పటికీ తనను నడిపించేవారి రాజకీయ మనుగడ ప్రయోజనాల కోసం తాత్కాలికంగా మౌనంగా మారిన గ్యాంగ్‌స్టర్. కానీ, హైదరాబాద్ కేసు నిందితులు అలా కాదు, వారు దుర్బలమైన వర్గాల నుంచి వచ్చారు. నిరుద్యోగ, నిరుపేద నేపథ్యం వారిది. కాబట్టి వారిని అంతం చేసినా సమాజం నుంచి పెద్దగా నిరసన స్వరాలు వినిపించవ''ని హైదరాబాద్‌కు చెందిన సామాజికవేత్త, న్యాయవాది కల్పన కన్నబీరన్ 'బీబీసీ హిందీ'తో అన్నారు.

కన్నబీరన్ చెప్పినట్లు నిరసన స్వరాలు వినిపించకపోవడమే కాదు వారిని ఎన్‌కౌంటర్ చేయడంపై ప్రజలు సంబరాలు చేసుకున్నారు కూడా.
ఇలాంటి ఘటనలో ఆ మనుషులెవరన్నది కాదు పోలీసులెలా ప్రవర్తించారన్నది చూడాలని కన్నాభిరాన్ అన్నారు. ''న్యాయసూత్రాల అమలుకు రాజ్యాంగ నిబంధనలు ఉన్నా లేనట్లే వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు. అగ్రవర్ణాలు అంటరానితనం పాటించడాన్ని మంచి పనిగానే భావిస్తారు. ఏ రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఈ దేశాన్ని నిర్మించుకున్నామో దాన్నే విస్మరిస్తామా?'' అని ప్రశ్నించారు కన్నబీరన్.
''హైదరాబాద్‌లో దిశ అత్యాచార ఘటన నిందితుల విషయానికొస్తే.. ఎవరిని చంపారనే విషయంలో ఎవరికీ సమాధానాలు అవసరం లేదు. వారికి ఈ సమాజంలో గుర్తింపు లేదు. వారు పూర్తిగా అనామకులు. పైకి పంపించేయడానికి తగినవారు. వారిలో ఏ ఒక్కరి పేరైనా మీకు గుర్తుందా? కానీ, పదేళ్ల తరువాత కూడా వికాస్ దుబే పేరు గుర్తుంటుంది. దుబే ఎవరిని చంపాడో మీకు తెలుసు.. అక్కడే తేడా వస్తుంది. ప్రజలు వ్యవస్థపై నమ్మకం కోల్పోవడానికి సంబంధించిన సమస్య కాదిది.. ఇది పూర్తిగా భిన్నమైన సంకేతాన్నిస్తుంది'' అన్నారు కన్నబీరన్.
''హింసాత్మక స్థితిని ఇది సూచిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులకు చంపడానికి అన్ని అధికారాలిచ్చేశారు.. అందుకే యోగి ప్రభుత్వాన్ని ఎన్‌కౌంటర్ గవర్నమెంట్ అంటారు. ఉత్తరప్రదేశ్‌లోని హింసా చక్రం చాలా భయానకమైనది. పోలీసులకు పూర్తిగా కట్లు వదిలేశారు.. చంపమని సూచిస్తే చాలు చంపేస్తారు వారు. ఒక్కోసారి వారు కూడా చనిపోతున్నారు. యూపీ పోలీసులు ప్రాణాలు తీయడంతో పాటు ఒక్కోసారి బలి పశువులూ అవుతుంటారు'' అన్నారు కన్నబీరన్.
''న్యాయం జరగడంలో ఆలస్యమవుతున్న కారణంగానే ఇలాంటి తక్షణ న్యాయాలకు ప్రజల మద్దతు ఉంటోందనడం కరెక్టు కాదు. నిందితులు ఎవరైనా సరే, సరైన దర్యాప్తు, విచారణ జరగాల''ని జస్టిస్ గౌడ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ వ్యాక్సిన్: ‘టీకాను పరీక్షించేటపుడు ప్రాణాలు కూడా పోవచ్చు..’ - వాలంటీర్‌గా వెళ్లిన భారతీయుడి అనుభవాలు
- BBC INVESTIGATION: అలీగఢ్‌లో ముస్లిం యువకుల ఎన్కౌంటర్లో వాస్తవమెంత?
- దిశ అత్యాచారం, హత్య: ‘ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా, కొలీగ్‌గా గుర్తించండి’
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన
- సర్కెగూడ ఎన్కౌంటర్లో మరణించింది గిరిజనులేనని తేల్చిన జ్యుడిషియల్ కమిటీ
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయి: ‘‘ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతుర్ని భయంతో పెంచడమేనా?’’
- విజయవాడ శ్రీలక్ష్మి హత్య నుంచి వరంగల్ పసిపాప అత్యాచారం, హత్య వరకు.. కేసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








