'దిశ' అత్యాచారం,హత్య: విజయవాడ శ్రీలక్ష్మి హత్య నుంచి వరంగల్ పసిపాప అత్యాచారం, హత్య వరకు... కేసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి?

షాద్‌నగర్ సమీపంలో పశు వైద్యురాలు దిశపై లైంగిక దాడి చేసి, హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
తక్షణమే శిక్ష విధించాలంటూ కొందరు, ఎన్‌కౌంటర్ చేయాలంటూ మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా డిమాండ్లు కనిపిస్తున్నాయి.
'దిశ' నిందితులను జైలుకు తరలించే క్రమంలోనూ ప్రజలు భారీస్థాయిలో ఆందోళన నిర్వహించారు. నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రజల నుంచి ఇదే తరహా డిమాండ్‌లు వినిపించాయి.
గుంటూరులో శ్రీలక్ష్మి హత్య ఘటన నుంచి హాజీపూర్ సీరియల్ మర్డర్‌ల వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనేక కేసుల్లోనూ ప్రజలు ఇదే విధంగా స్పందించారు.
తక్షణం శిక్ష విధించాలని, ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, గతంలోనూ ఇదే తరహాలో సంచలనం సృష్టించిన కేసుల్లో దోషులుగా రుజువైన వారికి కోర్టులు ఎలాంటి శిక్ష విధించాయి? ఆ కేసుల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

ఫొటో సోర్స్, Reuters
క్లాస్ రూంలోనే హత్య చేసిన మనోహర్ ఎక్కడ?
2004లో విజయవాడకు చెందిన ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని యెల్చూరి మనోహర్ క్లాస్‌రూంలోనే హత్య చేశాడు. తనను ప్రేమించలేదనే కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడు మనోహర్‌కు ఉరిశిక్ష విధించాలంటూ పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి.
ట్రయల్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. అయితే, తీర్పుపై మనోహర్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. దీనిని సవాల్ చేస్తూ 2005లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.
జస్టిస్ హర్జీత్ సింగ్ బేడీ, జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ చంద్రమౌళి ప్రసాద్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం మనోహర్‌కు హైకోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించింది.

హాజీపూర్ హత్యలు- ఇంకా విచారణలోనే
ఇటీవల సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహాలో డిమాండ్‌లు వినిపించాయి. అతనికి మరణశిక్ష విధించాలంటూ ఆందోళనలు కూడా జరిగాయి. గ్రామస్తులు అతని ఇంటిని ధ్వంసం చేశారు.
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌కి చెందిన మర్రి శ్రీనివాస రెడ్డి లిఫ్టు మెకానిక్‌గా పనిచేసేవాడు. 2015 నుంచి 2019 వరకు నలుగురు మైనర్లపై అత్యాచారం చేసి, హత్యలు చేసినట్లు ఇతనిపై అభియోగాలు నమోదయ్యాయి. పోలీసులు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉరి నుంచి యావజ్జీవం
ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన కూడా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
హోటల్‌లో పనిచేసే ప్రవీణ్ ఈ ఏడాది జూన్ 19న అర్ధరాత్రి హన్మకొండలోని కుమార్‌పల్లిలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి తర్వాత మరణించింది.
ఈ కేసులో నిందితుడైన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ ఆందోళనలు జరిగాయి.
ఈ కేసుకు సంబంధించి ఘటన జరిగిన 51 రోజుల వ్యవధిలోనే వరంగల్ కోర్టు తీర్పు వెలువడింది. దోషిగా తేలిన పోలేపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించింది.
అయితే, దీనిపై ప్రవీణ్ తరఫు వ్యక్తులు హైకోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన హైకోర్టు నిందితుడికి విధించిన మరణశిక్షను జీవితకాల శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది.
ఇవి కూడా చదవండి:
- వరంగల్: బర్త్ డే పార్టీ అని పిలిచి అత్యాచారం... బాధితురాలి మృతి
- షాద్ నగర్ బాధితురాలి సోదరి: ‘‘నిజంగా ఆ సీరియస్‌నెస్ నాకు తెలియదు.. ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- భోపాల్ విషాదానికి 35 ఏళ్లు... ఫోటోలు చెప్పే విషాద చరిత
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- జయాబచ్చన్: 'అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపాలి’
- మా అమ్మకు వరుడు కావలెను
- గురజాడ అప్పారావు... ఆధునిక స్త్రీ ఆయన ప్రతినిధి
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయి: ‘‘ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతుర్ని భయంతో పెంచడమేనా?’’
- అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ పేరును 'దిశ'గా మార్చిన పోలీసులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









