వరంగల్: బర్త్ డే పార్టీ అని పిలిచి అత్యాచారం... బాధితురాలి మృతి

ఫొటో సోర్స్, Getty Images
వరంగల్లో ఒక యువతి మీద పరిచయస్తుడే అత్యాచారం చేశాడు. బాధితురాలు అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు.
జనగామ జిల్లా నమిలికొండకు చెందిన నిందితుడు హన్మకొండలోని ఒక కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతనికి హన్మకొండలో ఉండే ఒక ఇంటర్ చదువుతున్న అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
ఆమె తల్లితండ్రులు చిరు వ్యాపారులు. ఆమె చదువుకుంటూనే తల్లితండ్రులకు వ్యాపారంలో సాయం చేసేది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ ఆరు నెలలుగా పరిచయం ఉంది. బుధవారం ఆమె పుట్టినరోజు కావడంతో తనను కలవాలని సాయి కోరాడు. ఆమె ఒప్పుకుంది.
''ఆరు నెలలుగా వారిద్దరికీ పరిచయం ఉంది. ఫోన్లో మాట్లాడేవాడు'' అని బీబీసీతో చెప్పారు వరంగల్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్.

బయటకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో బయటకు వెళ్లింది ఆ అమ్మాయి. అతనితో ఫోన్లో టచ్‌లో ఉండి అతను చెప్పినట్టుగా కాజీపేటలో కలిసింది. వారిద్దరూ కారులో చిన్న పెండ్యాల దగ్గర్లోని రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై నిందితుడు అత్యాచారం చేశాడు. ఆ యువతి మరణించింది.
''ఆమె శరీరంపై గాయాలు లేవు కానీ, షాక్ వల్ల చనిపోయి ఉంటుందని మేము భావిస్తున్నాం'' అని వివరించారు కమిషనర్.
అయితే తప్పించుకోవడం కోసం నిందితుడు విఫలయత్నం చేశాడు. అక్కడ నుంచి శరీరాన్ని తీయడానికి తన ఇద్దరు మిత్రుల్ని పిలిచాడు. వారు ఘటనా స్థలానికి వచ్చి, మృతదేహాన్ని చూసి, అతనికి సాయం చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో నిందితుడు అమ్మాయి శరీరాన్ని తన కారులో ఎక్కించుకుని బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కారులో తిరిగాడు.
సాయంత్రం ఒక షాపులో ఆమెకు చుడీదార్ కొన్నాడు. రక్తస్రావం జరగడంతో, అమ్మాయి వేసుకున్న బట్టలకు రక్తం అంటింది. దీంతో ఆమె వేసుకున్న లంగా, ఓణీ తీసేసి తాను కొన్న చుడీదార్ వేశాడు. అనంతరం రాత్రి 9 గంటల తరువాత వరంగల్‌లోని హంటర్ రోడ్ సమీపంలో ఒక ఫంక్షన్ హాల్ దగ్గర మృతదేహాన్ని వదిలేసి, తన సొంతూరు వెళ్లిపోయాడు.

అమ్మాయి ఇంటికి రాకపోవడంతో, తెలిసిన చోట వెతికిన కుటుంబ సభ్యులు.. రాత్రి వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి 9.30 - 10 గంటల మధ్య గుర్తు తెలియని మృతదేహం గురించి పోలీసులుకు ఫోన్ వచ్చింది. బంధువుల సహాయంతో అది బాధితురాలి మృతదేహమే అని పోలీసులు గుర్తించారు.
''ఫోన్ కాల్స్, ఇతర సమాచారం, విచారణ ఆధారంగా అనుమానితుడిని గుర్తించాం. అతని సొంతూరు ఘనపూర్ వెళ్లి, అరెస్ట్ చేశాం'' అని కమిషనర్ రవీందర్ తెలిపారు.
నిందితుడు పోలీసు విచారణలో నేరం అంగీకరించాడని, నిందితుడి నుంచి కారును స్వాధీనం చేసుకున్నామని, అతడిని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి.
- ‘దళితుడిని పెళ్లాడిందని తల్లిదండ్రులే చంపేశారు’
- మహారాష్ట్ర: బీజేపీకి అధికారాన్ని దూరం చేసిన ఆ ఆరు తప్పులు.. ఈ పరాభవానికి ఫడణవీస్ ఒక్కరే బాధ్యులా?
- మీ పెంపుడు కుక్కతో జాగ్రత్త... ముద్దులు పెడితే ప్రాణాలు పోతున్నాయి
- బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే: శివసేన ఎలా మారింది? ఎందుకు మారింది?
- ఆంధ్రప్రదేశ్: స్కూల్లోనే పిల్లల కాళ్లను తాళ్లతో బంధించారు.. ఎందుకు?
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు
- "ఆర్టీసీ మహిళా కార్మికుల కన్నీళ్లు చూసి మా ఆవిడ ఏడ్చేసింది.. ఉబికివస్తున్న కన్నీటిని నేను ఆపుకున్నాను"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








