గురజాడ అప్పారావు... ఆధునిక స్త్రీ ఆయన ప్రతినిధి: అభిప్రాయం

ఫొటో సోర్స్, gurajada.org
- రచయిత, ఎస్. కాత్యాయని
- హోదా, బీబీసీ కోసం
మంచికో చెడుకోగానీ... 'గురజాడ' అంటే 'కన్యాశుల్కం' నాటకమేనన్న అవగాహన ఒకటి తెలుగు సాహిత్యంలో బాగా వ్యాపించింది.
కన్యాశుల్కానికి ముందూ, వెనకా శూన్యమే అనేటంత ఉన్మత్త ప్రేమాలాపాలు ఒక వైపునా... బాపనోళ్ళ కోసం రాసుకున్న బ్రాహ్మణ రచయిత అనే నిరాధారమైన విమర్శ మరొక వైపునా కొంత కాలంగా సాగుతూనే ఉన్నాయి. ఒక రచయితను కానీ, గ్రంథాన్ని గానీ అధ్యయనం చెయ్యటానికి పనికొచ్చే ప్రామాణిక విధానాలు రూపొందని పరిస్థితి వల్లా, అసలు అధ్యయనం చెయ్యాల్సిన అవసరం లేకుండానే అంచనాలను ప్రకటించేందుకు తగిన వెసులుబాటు తెలుగు సాహిత్య రంగంలో పుష్కలంగా ఉండటం వల్లా పై ధోరణులు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి.
మానవుల భౌతిక జీవనాన్ని ఇతివృత్తంగా తీసుకున్న ఏ సాహిత్యం నుంచి అయినా కనీసం రెండు ప్రయోజనాలను ఆశించటం సహజం. ఒకటి, ఆ రచన తన సమకాలంలోని వాస్తవానికి ప్రాతినిథ్యం వహించడం, రెండోది, ఆనాటి సమాజమూ, సాహిత్యమూ ఒక్క అడుగైనా ముందుకు నడవటానికి పనికొచ్చే దృక్పథాన్ని అందించటం. ఆ దృక్పథంలో హేతుబద్ధత, స్వేచ్ఛా కాంక్ష, కొత్త విలువలను అందించే ప్రత్యామ్నాయ ప్రతిపాదనా వ్యక్తమయినప్పుడు దాన్ని స్థూలంగానైనా ఆధునికమని పిలవొచ్చు. అలాంటి ఆధునిక దృక్పథాన్ని తన రచనలన్నిటి ద్వారా అందించిన రచయితగా గురజాడ ఈనాటికీ తన ప్రాసంగికతను నిలుపుకున్నారు.

ఫొటో సోర్స్, amazon.in
నిర్దిష్టమైన ఒక చారిత్రక దశలోని ఒక వర్గపు జీవితాన్ని నిశితమైన విమర్శతో, విశాలమైన కాన్వాస్‌పై చిత్రించిన రచనగా 'కన్యాశుల్కం' ప్రాచుర్యాన్ని పొందింది. నాటకంగానూ, సినిమాగానూ దృశ్యమాధ్యమంలోకి కూడా రావటంతో జనానికి మరింత చేరువైంది. దీని ఫలితంగా, బహుశా తెలుగులో మరే రచన మీదా జరగనన్ని అధ్యయనాలు కన్యాశుల్కంపై జరగటం ఒక మంచి విషయమే. కానీ, ఆయన ఇతర రచనల్లోని విలువైన అంశాలపై తగినంత చర్చ జరగకపోవడం వల్ల గురజాడ సాహిత్య వ్యక్తిత్వం సంపూర్ణంగా వ్యక్తం కాకపోయే ఇబ్బంది కూడా ఏర్పడింది.
గురజాడ లేఖలు, డైరీలు, రాయాలనుకున్న అంశాలను గూర్చిన చిత్తుప్రతులతో సహా ఆయన మొత్తం సాహిత్యాన్ని పరిశీలంచితే ఆయన తన కాలాన్ని దాటి ఎంత ముందుకు చూడగలిగారో అర్థమవుతుంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ప్రాచీన భారతీయ సాహిత్యం నుంచి, పాశ్చాత్య సాహిత్యంతో లోతైన పరిచయం దాకా విస్తరించిన అధ్యయనం గురజాడది. ఫ్రెంచ్ విప్లవాన్నీ, సాహిత్యాన్నీ గురించిన అవగాహన, ఇతర దేశాల్లో జరుగుతున్న ప్రజాస్వామిక రాజకీయోద్యమాల గురించి తెలుసుకోవటమూ ఆయన దృష్టిని విశాలం చేశాయి, ప్రజాస్వామికమైన సాహిత్య దృక్పథాన్ని ఇచ్చాయి. ఆ వెలుగులో భారతీయ సామాజాన్నీ, సమస్యలనూ ఆయన పరిశీలించారు. కొన్ని పరాష్కారాలను ప్రతిపాదించారు.
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ నేపథ్యంలో పుట్టిపెరిగిన వ్యక్తిగా, ఆ కుటుంబాల్లోని స్త్రీల దయనీయ స్థితిపై సహానుభూతిని చూపటం గురజాడకు సహజమైన పరిణామం. అతి బాల్య వివాహలూ, నిర్బంధ వైధవ్యాలూ, అతి కఠినమైన నైతిక చట్రాలూ, ఆర్థిక పరాధీనతలతో నలిగిపోతున్న ఆ స్త్రీలకు మద్దతుగా నిలవటాన్ని తన ప్రధాన కర్తవ్యంగా స్వీకరించింది ఆయన సాహిత్యం ముఖ్యంగా కన్యాశుల్కం.
ఆ నాటకమూ, మరికొన్ని రచనలూ బ్రాహ్మణుల జీవితాలను 'గురించి' రాసినవనే మాట నిజమే కానీ, కొందరు విమర్శకులు భావిస్తున్నట్టుగా, ఆ కుల ప్రయోజనాల 'కోసం' ఎంత మాత్రమూ కాదు. బ్రాహ్మణ సంప్రదాయాల్లోని కరడుగట్టిన పితృస్వామ్య కుటుంబాలను బహిర్గతం చెయ్యడమన్నది సమాజంపై బ్రాహ్మణాధిపత్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమే. గురజాడ దృక్పథానికి ప్రాతినిధ్యం వహించినవి పీడితులైన స్త్రీల పాత్రలే తప్ప, పురుష పాత్రలు కావు. చివరికి, గౌరవనీయుడిగా కొంత ఆధిక్యత పొందిన సౌజన్యారావు సైతం మధురవాణి చేతిలో పరాజయం పొందిన వారే.

ఫొటో సోర్స్, find.uoc.ac.in
గురజాడ రచనల్లోని కమలిని, కన్యక, పూర్ణమ్మ, నాంచారమ్మ, వెంకమ్మ, మీనాక్షి, బుచ్చమ్మ లాంటి స్త్రీ పాత్రలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పితృస్వామిక ఆధిపత్యాన్ని నిరసించినవే. ఇక మధురవాణి, సరళ అయితే గురజాడ విమర్శ నాత్మక దృక్పథానికి ప్రతిధులే. అహంకారులుగా, అవినీతిపరులుగా, మోసకారులుగా తీవ్ర విమర్శకు గురైన పాత్రలన్నీ అగ్రవర్ణ పురుషులవి మాత్రమే. గురజాడ సాహిత్యం మొత్తాన్నీ వెదికి చూసినా ఏ ఒక్క స్త్రీ పాత్ర మీద గానీ, పీడిత కులాల పాత్రపై గానీ చిన్నచూపు కనబడదు.
"స్త్రీల కన్నీటి గాథలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవటం కూడా ఓ ప్రధాన కారణమే" అని గుర్తించిన గురజాడ, పీడిత కులాల జీవితాల్లో కూడా ఆ సమస్యకున్న ప్రాధాన్యాన్ని గమనించారు. ఆర్థిక స్వాలంబనను కల్పించే ఆధునిక విద్యను వారందరికీ అందించాలని ఆశించారు. అందుకు పనికొచ్చే విద్యా ప్రణాళిక గురించి ఆలోచించారు.
"పాటక జనాలను అభివృద్ధికి తెచ్చేందుకు పాతబడిన విద్యలు పనికిరావు, వారి స్థితిగతులను చక్కబరచి అభివృద్ధికి తేవడం ప్రజాస్వామిక లక్షణం" అనే స్పష్టత ఉంది కాబట్టే "ప్రత్యక్ష జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషమ సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఈ వేద విజ్ఞానం ఒక్క పిసరు అక్కరకు రాదు" అన్నారు. పాఠ్య ప్రణాళికల్లో మతసంబంధమైన ప్రాచీన సాహిత్యాన్ని బోధించడం వలన యువతంరంలో కుల, మతాల సంకుతితవ్వం ప్రబలుతుందని ఆందోళన పడ్డారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SURESH KOLICHALA
భాషా సాహిత్యాలను గురించి గురజాడకు స్పష్టమైన ఆలోచనలున్నాయి. సామాన్య ప్రజలను విద్యకు దూరంచేసే భాషా, వ్యాకరణ నియమాల స్థానంలో మాండలికాలతో సహా, సరళమైన భాషా ప్రయోగాలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఆచరణాత్మకంగా కృషి చేశారు.
మన దేశపు కావ్యాలలో దేవతలనూ, రాచకుటుంబీకులనూ, వారి విలాసాలనూ వర్ణించటం తప్ప "తక్కువ జాతి వారిని గూర్చి వర్ణించి రాయరు. కవిత్వమున రాయదగిన చర్యలు అట్టి తక్కువ మనుషుల బతుకులలో ఉండనేరవని మన దేశపు కవుల అభిప్రాయం", అనడమేగాక సంఘ బహిష్కృతమైన మధురవాణి, సరళలను ప్రధాన పాత్రలుగా సృష్టించారు. మర్యాదస్తుల సమాజంపై వారితో తీవ్ర విమర్శలు చేయించారు.
దేవుడు, కులం, మతం వంటి విషయాల చుట్టూ సంప్రదాయ సమాజం నిర్మించిన మిత్‌ను చెదరగొట్టిన ఎన్నో పాత్రలను గురజాడ సృష్టించారు. దేశమంతా ఐక్యంగా నిలబడాలని ప్రబోధిస్తూ, ఆచరణలో కులజాడ్యాన్ని వదులకోలేని వాళ్ల గురించి చెబుతూ... " దేశ మాతృ పుత్రత్వాద్భ్రాతృత్వం లెక్షర్లలోనూ, రాతలలోనే కాని, చర్చలలోనూ, ఆలోచనలలోనూ, సిగపట్ల గోత్రత్వమూ స్వప్రయోజక పరత్వమే మెండేమో? మాలవాండ్లు కనబడగానే భ్రాతృత్వం చాలా దూరం పలాయణం చేస్తుంది" అనేది ఆయన పరిశీలన.

ఫొటో సోర్స్, Aruna Gurajada
ఫ్రెంచ్ విప్లవం గురించి తెలుసుకోవడం గురజాడ భావాలపై గొప్ప ప్రభావం చూపిందనిపిస్తుంది. "పనివంటి వస్తువ లేదు" అంటూ శ్రమ విలువను గౌరవపరచడమే కాదు, వంటిళ్ళలో వృధా అవుతున్న స్త్రీల శ్రమకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ వంటశాలలను ప్రతిపాదించారు. "ఆమె అబల అని మీరంటారు. అర్థంలేని మాట. మన దేశంలోని రైతు కుటుంబంలో స్త్రీ, పురుషుడి కంటే బలమైనదీ, గట్టిదీ, ఓపికగలదీను" అని శ్రామిక వర్గాల స్త్రీలను సమాజానికి ఆదర్శంగా నిలబెడతారు.
సంప్రదాయ కుటుంబాలలో స్త్రీలపై పెత్తనం ఎటూ సాగుతూనే ఉంది. దాంతోపాటుగా స్త్రీలు విద్యావంతులవుతూ, బయట సమాజంలో అడుగు పెడుతున్న క్రమంలో కొత్త ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉందని గురజాడ గ్రహించారు. "పురుషుడికి బుద్ధిమాంద్యం, క్రూరత్వం" పెరుగుతున్నాయి కనుక స్త్రీలు తమ రక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్వాలంటారు. "బయటకు వెళ్ళే సమయంలో ప్రతి స్త్రీకి ఆయుధం ఉండాలి" అనగలిగినంతగా స్త్రీల భద్రత గురించి తపించిన గురజాడ ప్రాసంగికత ఇవాళ ఇంకెంతగా పెరగాలి?
కులుం, మతం, పితృస్వామ్యం, ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కొనసాగినంత కాలమూ గురజాడ అందించిన ఆధునిక, ప్రజాస్వామిక దృక్పథం అవసరమవుతూనే ఉంటుంది. మన సమస్యల ప్రతిఫలనాలూ, పరిష్కారాల ప్రతిపాదనలూ ఆయన సాహిత్యంలో వెదుక్కోవాల్సే ఉంటుంది. నిజమైన ఆధునికతను అన్వేషించేందుకు ఆయన సాహిత్యం ఒక దారిదీపంగా వెలుగుతూనే ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే: శివసేన ఎలా మారింది? ఎందుకు మారింది?
- బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే: శివసేన ఎలా మారింది? ఎందుకు మారింది?
- తెలుగు టెకీ సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్‌ను నంబర్-1 కంపెనీగా ఎలా మార్చారు...
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- గోడలు, గార్డులు లేని జైలు... పని చేసుకుని బతికే ఖైదీలు
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- ఈ బడిలోని ముస్లిం చిన్నారులు సంస్కృతం అలవోకగా మాట్లాడుతారు
- జేఎన్‌యూ: ఆగని విద్యార్థుల ఆందోళన... ఫీజుల పెంపుపై విద్యార్థులు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








