లెబనాన్: రాజధానిలో భారీ పేలుడు.. 135 మంది మృతి

ఫొటో సోర్స్, EPA
లెబనాన్ రాజధాని బేరూత్‌లో భారీ పేలుడు సంభవించింది. 135 మంది ఈ పేలుడులో చనిపోయారని, 4 వేల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్పారు.
బేరూత్‌లోని ఓ పోర్టులో ఈ పేలుడు జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలో దట్టమైన పొగ మేఘం కమ్ముకోవడం కనిపించింది.
అక్కడి ఓ గోదాంలో ఆరేళ్లుగా విధ్వంసక పదార్థాలు నిల్వ ఉంచడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భద్రత చర్యలు లేకుండా 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేయడం‘ ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాద’ని లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు.
పేలుడుకు ఎలా జరిగిందన్న విషయంపై విచారణ సాగుతోంది. బాధ్యులకు ‘గరిష్ఠ శిక్ష’ తప్పదని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది.

ఫొటో సోర్స్, REUTERS
పేలుడు బాధితులతో స్థానికంగా ఆసుపత్రులు నిండిపోయాయని చెబుతున్నారు. ఘటనలో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.
మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు దేశ అధ్యక్షుడు ప్రకటించారు. దాదాపు రూ.496 కోట్ల అత్యవసర నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పేలుడు శబ్దం 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వినిపించింది.
ఘటనాస్థలంలో మృతదేహాలు కనిపించాయని, పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని, బేరూత్ పోర్టు కార్యకలాపాలు కొనసాగే పరిస్థితి లేదని బీబీసీ జర్నలిస్ట్ ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఎక్కడ చూసినా పగిలిన అద్దాలే: హది సస్రల్లా, ప్రత్యక్ష సాక్షి
''మొదట మంటలు కనిపించాయి. పేలుడు సంభవిస్తుందని నేను అనుకోలేదు. లోపలికి వెళ్లా. బాగా దగ్గరగా వెళ్లినందుకనుకుంటా, నా వినికిడి శక్తి పోయింది. కొన్ని సెకన్ల తర్వాతే, తిరిగివచ్చింది. అప్పుడే ఏదో జరిగిందని నాకు అర్థమైంది.మా చుట్టూ ఉన్న కార్లు, దుకాణాలు, భవనాల అద్దాలన్నీ పగిలిపోయాయి.

ఫొటో సోర్స్, EPA
బేరూత్‌లో ఉన్నవారంతా ఒకరికొకరు ఫోన్ చేసుకుని ఏం జరిగిందనేది ధ్రువీకరించుకుంటున్నారు. ఎటుచూసినా అద్దాల ముక్కలే. భవనాలు ఊగిపోయాయి. పెద్ద చప్పుడు వినిపించింది.మేం దిగ్భ్రాంతికి గురయ్యాం. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రభావం ఏదో ఒక ప్రాంతం వరకే ఉంటుంది. ఈ పేలుడు తీవ్రత మాత్రం మొత్తం బేరూత్‌లో, దాని అవతలి ప్రాంతాల్లోనూ కనిపించింది''

నగరమంతా అంధకారంగా మారింది. జనాలు రక్తంతో తడిసి కనిపించారు.
- సున్నివా రోస్, జర్నలిస్ట్
''రోడ్లపై మొత్తం అద్దాల ముక్కలు, ఇటుకలు, సిమెంట్లు శ్లాబులు పడిఉన్నాయి. ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. అంబులెన్స్‌లు వెళ్లడం చాలా కష్టమైంది.పోర్టు దగ్గరికి వెళ్లాక, నన్ను సైన్యం ఆపేసింది. రెండో సారి కూడా పేలుడు జరగొచ్చని, దూరంగా ఉండాలని సూచించింది.సాయంత్రం పొద్దుపోయే దాకా పొగ వెలువడుతూనే ఉంది. నగరమంతా అంధకారంగా మారింది. జనాలు రక్తంతో తడిసి కనిపించారు. ఓ 86 ఏళ్ల ముసలావిడకు... తాను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో ఓ వైద్యుడు చికిత్స చేయడం చూశా. పాత పద్ధతిలో పెద్దపెద్ద రాళ్లతో కట్టుకున్న ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాళ్లు కార్లపై పడ్డాయి.నా ఫ్లాట్‌లోనూ అద్దాలన్నీ పగిలిపోయాయి. చాలా నష్టం జరిగింది.

ఫొటో సోర్స్, Reuters
అమ్మోనియం నైట్రేట్ అంటే?అమ్మోనియం నైట్రైట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ, దాన్ని ఎక్కువగా పంటలకు ఎరువుగా, విధ్వంసక పదార్థంగా ఉపయోగిస్తుంటారు.దీనికి నిప్పు తోడైతే చాలా ప్రమాదం. అమ్మోనియం నైట్రైట్ పేలినప్పుడు నైట్రోజెన్ ఆక్సైడ్, అమ్మోనియా లాంటి విషవాయువులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.అమ్మోనియా నైట్రేట్‌కు మండే స్వభావం ఎక్కువ. అందుకే దీన్ని నిల్వ ఉంచడంపై చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. నిల్వ ఉంచుకునే చోట మంటలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి. డ్రైనేజీ, పైపుల లాంటి ఇతర మార్గాలు కూడా ఉండకూడదు. ఇలా ఉంటే పేలుడు ముప్పు ఇంకా పెరుగుతుంది.
రాజకీయ సంక్షోభంలో లెబనాన్ప్రస్తుతం లెబనాన్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. 1975-1990 తర్వాత దేశంలో తలెత్తిన అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో వీధుల్లో నిరసనలు జరుగుతున్నాయి.రోజూ విద్యుత్ కోతలు, తాగు నీటి కొరత, ప్రజా వైద్య వసతుల లేమి వంటి సమస్యలను జనం ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా రాజకీయ ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాలకవర్గం సొంత ఆస్తులు కూడబెట్టుకుందని, దేశ సమస్యలను పరిష్కరించే సంస్కరణలేవీ అమలు చేయలేకపోయిందని చాలా మంది ఆరోపిస్తున్నారు.ఇటీవల లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతత చోటుచేసుకుంది. గత వారం హిజ్బొల్లా తమ భూభాగంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
అయితే, బేరూత్ పేలుడుతో తమ దేశానికి ఏ సంబంధమూ లేదని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి బీబీసీతో అన్నారు.ఇదివరకు లెబనాన్ మాజీ ప్రధాని హరిరి హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే తాజా పేలుడు జరిగింది. ఈ హత్య కేసులో నెదర్లాండ్స్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పు కూడా త్వరలోనే రానుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








