కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సారా గిల్‌బర్ట్ ఎవరు

ఫొటో సోర్స్, University of Oxford, John Cairns
''మేం చాలా త్వరగా పనిచేయాల్సి వస్తోంది'' అని ప్రొఫెసర్, వ్యాక్సినాలజిస్ట్ సారా గిల్బెర్ట్ చెబుతున్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆమె వీలైనంత త్వరగా కరోనావైరస్ వ్యాప్తికి కళ్లెం వేసే టీకాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య ఇప్పటికే 15 మిలియన్లకు మించిపోయింది. మృతుల సంఖ్య 6,30,000కు దాటిపోయింది.
ఐదేళ్లు పట్టే చాలా టీకా అభివృద్ధి దశలను పటిష్ఠమైన 300 మంది పరిశోధకుల బృందంతో సారా పరుగులు పెట్టించారు.
''కేవలం నాలుగు నెల్లలో ఆ దశలను మేం దాటేశాం'' అని ఆమె చెప్పారు.
ఇక్కడి ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. మనుషులపై చేపట్టిన ఫలితాల్లో టీకా సురక్షితంగా పనిచేస్తోందని, ఇది వైరస్‌పై పోరాడే రోగ నిరోధక స్పందనలను క్రియాశీలం చేయగలుగుతోందని వెల్లడైంది.
మనుషులకు ఇచ్చేందుకు ఈ టీకా సిద్ధమైందని ఇప్పుడే చెప్పలేం. ఈ ఏడాది చివరి వరకూ మరికొన్ని దశలను ఇది దాటుకు రావాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా టీకా అభివృద్ధికి మనం చేరువలో ఉన్నామనే ఆశలను ఈ టీకా చిగురింప చేస్తోంది.
మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్న 22 శక్తిమంతమైన టీకా ప్రయోగాలు ఆక్స్‌ఫర్డ్ బృందానికి గట్టి పోటీ ఇస్తున్నాయి. మరో 100 టీకా ప్రయోగాలు తొలి దశల్లో ఉన్నాయి.
సారా గిల్‌బెర్ట్ ఎవరు?

ఫొటో సోర్స్, University of Oxford, John Cairns
కరోనావైరస్‌కు టీకా అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న రేస్‌లో ప్రొఫెసర్ సారా ప్రథమ స్థానంలో ఉన్నారు.
ఆక్స్‌ఫర్డ్‌లోని ఆమె పరిశోధకుల బృందం.. స్వీడన్‌కు చెందిన ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్సియాతో కలిసి 1077 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.
ఈ టీకా తీసుకున్న వాలంటీర్లలో శక్తిమంతమైన వ్యాధి నిరోధక స్పందనలను పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు కరోనావైరస్‌తో పోరాడగలిగే యాంటీబాడీలు, టీ-కణాలను ఈ టీకా ఉత్పత్తి చేయగలుగుతోందని రుజువైంది. దీంతో సారా సైన్స్ సెలబ్రిటీ అయిపోయారు.
కరోనావైరస్‌ను ఈ టీకా పూర్తిగా అడ్డుకోగలదని ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ ఈ పరిశోధన ప్రపంచ దేశాల్లో ఆశలు చిగురింపజేస్తోంది. తర్వాతి దశలో భాగంగా ఈ టీకా పెద్ద సంఖ్యలో మనుషులపై ప్రయోగిస్తున్నారు.
వార్తల్లో సారా పేరు చక్కర్లు కొడుతోంది. తమకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటూ ఆమెకు కుప్పలుతెప్పలుగా అభ్యర్థనలు వస్తున్నాయి.
అయితే, చాలామంది పరిశోధకుల్లానే ఆమె తన పని తను చేసుకుపోతున్నారు. చాలావరకు కెమెరాలకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచంలో ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్‌గా ఆమె చాలామందికి సుపరిచితురాలు.
రెండు దశాబ్దాలకుపైనే ఆమె పరిశోధనలతో ల్యాబ్‌లో గడిపారు. టీకాలు తయారుచేస్తూ.. భవిష్యత్ పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యువ శాస్త్రవేత్త
తను మొదట్నుంచీ వైద్య పరిశోధకురాలు కావాలనే కలలు కన్నట్లు ప్రొఫెసర్ సారా చెప్పారు. అయితే దీన్ని ఎలా మొదలు పెట్టాలో 17 ఏళ్ల వయసులో తనకు అర్థం కాలేదని ఆమె వివరించారు.
యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలో బయోలజీ డిగ్రీతో ఆమె తొలి అడుగులు పడ్డాయి. బయోకెమెస్ట్రీలో ఆమె పీహెచ్‌డీ చేశారు.
ఆ తర్వాత బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. అప్పుడే ఔషధాల తయారీ గురించి ఆమె తెలుసుకున్నారు.
1994నాటికి ఆక్స్‌ఫర్డ్‌లో సీనియర్ పోస్ట్ ఆమెకు దక్కింది. జెనెటిక్స్, హోస్ట్-పారాసైట్స్, మలేరియాపై ఆమె పరిశోధనలు చేశారు.
తమ పరిశోధనలు వ్యాక్సీన్ అభివృద్ధి వైపుగా ఆమెను నడిపించాయి.

ఫొటో సోర్స్, Reuters
పనిచేస్తూనే కుటుంబాన్ని నడిపిస్తూ..
1998లో ప్రొఫెసర్ సారా.. ముగ్గురు కవలలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఏడాది ఆమె యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా మారారు.
''కుటుంబాన్ని వృత్తిని సమన్వయం చేసుకోవడం చాలా కష్టం. ఎవరి సాయమూ లేకపోతే ఇది అసాధ్యమని అనిపిస్తుంది. నాకు ముగ్గురు పిల్లలున్నారు. వారి నర్సరీ ఫీజులు.. నా జీతం కంటే ఎక్కువ''అని సారా చెప్పారు.
పిల్లల్ని చూసుకోవడం కోసం కెరియర్‌ను పక్కన పెట్టేయాలని సారాకు జీవిత భాగస్వామి సూచించారు. అది చాలా కష్టంగా అనిపించిందని ఆమె వివరించారు.
''18 వారాలు మాత్రమే ప్రసూతి సెలవులు ఇచ్చారు. నెలలు నిండకముందే ముగ్గురు పిల్లలు పుట్టారు. వారిని చూసుకోవడం చాలా కష్టంగా అనిపించింది'' అని ఆమె వివరించారు.
''శాస్త్రవేత్త అయితే, అన్ని రోజులూ గంటలపాటు పనిచేయాల్సిన అవసరం ఉండదు. అదే అన్నింటికంటే గొప్పగా అనిపించేది.''
2004నాటికి ఆమె యూనివర్సిటీ రీడర్‌గా మారారు. మూడేళ్ల తర్వాత వెల్‌కమ్ ట్రస్ట్‌కు చెందిన ఫ్లూ వ్యాక్సీన్ ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. తన పరిశోధన బృందానికి అవసరమైన నిధులను వెల్‌కమ్ ట్రస్టే సమకూర్చింది.

ఫొటో సోర్స్, Science Photo Library
కుటుంబం నుంచి సాయం
ముగ్గురు కవల పిల్లలు పెరిగేకొద్దీ.. పనులు తేలిక అయ్యాయని సారా వివరించారు.
''ఇప్పుడు నేను ల్యాబ్‌కు హెడ్ అయినప్పటికీ.. కుటుంబాన్ని కూడా హాయిగా చూసుకోగలుగుతున్నా''అని ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె పిల్లల వయసు 21.
ముగ్గురు పిల్లలూ సారాలానే బయోకెమిస్ట్‌లు అయ్యారు.
అంతేకాదు, కోవిడ్-19కు టీకా కనుగొనేందుకు సారా చేస్తున్న ప్రయత్నాల్లో వారు కూడా పాలుపంచుకుంటున్నారు. టీకా ఎక్కించుకొనేందుకు వచ్చిన వాలంటీర్లలో ఆమె ముగ్గురు పిల్లలూ ఉన్నారు.
''18 నుంచి 55 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులకు మేం టీకా ఇవ్వాలి'' అని సారా బీబీసీతో చెప్పారు.
తమకు మంచి వాలంటీర్లు దొరకాలని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. కుటుంబం నుంచి తనకు దక్కుతున్న మద్దతుపై ఆమె చాలా సంతోషంగా ఉన్నారు.
''టీకా ప్రయోగం గురించి ఎలాంటి దిగులూ లేదు. ఇలాంటివి ఇంతకుముందు చాలాసార్లు ప్రయోగించాం. కాబట్టి ఎలాంటి భయమూ లేదు.''
''ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సీన్ తయారీపై మేం మొత్తం దృష్టి కేంద్రీకరించాం. వీలైనంత త్వరగా వ్యాక్సీన్ తయారుచేసి వైరస్‌కు కళ్లెం వేయాలి''అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








