జమ్మూకశ్మీర్: ఏడాది గడిచినా తిరిగిరాని కశ్మీరీలు ఎందరో, ఇంతకీ వారు ఏమయ్యారు?

ఫొటో సోర్స్, Mukhtar Zohoor
2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను రద్దు చేసింది. ఈ వివాదాస్పద నిర్ణయానికి ముందే ప్రభుత్వం వేల మందిని అదుపులోకి తీసుకుంది. ఏడాది తరువాత తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారంటూ వారిలో చాలామందిపై కేసులు మోపారు. ఇప్పటికీ వారంతా దేశంలో అనేక చోట్ల జైళ్లల్లో మగ్గుతున్నారు. ఈ అంశంపై బీబీసీ హిందీ ప్రతినిధి మాజిద్ జహంగీర్ అందిస్తున్న కథనం.
ఆగస్టు 6 అర్థరాత్రి తస్లీమా వనీ కుటుంబం గాఢ నిద్రలో ఉండగా తలుపుల మీద దబదబా బాదుతున్న శబ్దాలు వినిపించాయి.
అది, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మరుసటి రోజు. ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించింది. అక్కడ అసాధారణ కర్ఫ్యూ విధించారు. కమ్యూనికేషన్ సౌకర్యాలు నిలిపివేశారు.
"సైన్యానికి చెందిన ఉమ్మడి భద్రతా దళాల బృందం, పోలీసులు కలిసి తలుపు తెరవమని అరుస్తూ దబదబా బాదుతున్నారు. మాకు చాలా భయమేసింది."
"నన్ను లోపలికి పంపించేసి నా కొడుకులు ఇద్దరినీ బయటికి పిలిచి 15 నిముషాలు విచారించారు. తరువాత వాళ్లు వెళ్లిపోయారు" అని తస్లీమా వనీ తెలిపారు.
కానీ వాళ్లు వెళ్లిన కాసేపటికి మళ్లీ వచ్చి వనీ పెద్ద కొడుకు నదీంను పిలిచి ఆ పక్కనున్న ఇంటికి దారి చూపించమని అడిగారు. అలా వాళ్లు తీసుకెళ్లిన తరువాత నదీం తిరిగి రాలేదు. అదే ఆమె తన పెద్ద కొడుకుని చివరిసారి చూడడం.

వాళ్లు నదీంను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. తరువాత దాదాపు 1000 కి.మీ. దూరంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ జైలుకి బదిలీ చేశారు.
నదీం ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఓజీడబ్ల్యూ) గా పనిచేస్తున్నారని అభియోగం మోపుతూ తయారుచేసిన ఒక అధికారిక పత్రాన్ని బీబీసీ కూడా చూసింది. ఓజీడబ్ల్యూ అంటే సాయుధ తిరుగుబాటు దళాలకు వసతులు పర్యవేక్షిస్తూ, వ్యూహ రచనకు సహాయం చేసేవాళ్లుగా భద్రతా దళాలు పేర్కొన్నాయి.
2014 ఎన్నికల్లో ఓట్లు వేయొద్దని పిలుపునిస్తూ నదీం పోస్టర్లు అతికించినట్టు కూడా ఆరోపించారు. అప్పటికి అతడికి 15 ఏళ్లు.
"నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. అతడు తీవ్రవాది కాదు. తనెప్పుడూ చట్ట విరుద్ధమైన పనులు చెయ్యలేదు. నా కొడుకుని విడిచిపెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను" అని తస్లీమా వనీ తెలిపారు.
తస్లీమా వనీ భర్త మొహమ్మద్ అష్రఫ్ వనీ జైల్లో ఉన్న తన కొడుకు నదీంను గడచిన ఏడాదిలో ఒకే ఒక్కసారి కలవగలిగారు.
నదీంలాగే ఎంతోమంది కశ్మీరీలను గతేడాది ఆగస్టు 5కు ముందే అదుపులోకి తీసుకున్నారు.
నిరసన బృందాలతో, మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంతమందిని జైలులో పెట్టారు. కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పటికీ గృహ నిర్బంధంలో ఉన్నారు.
ఈ చర్యలపై జాతీయ, అంతర్జాతీయ విమర్శలు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదం పెరిగిందని, ఇక్కడ శాంతిభద్రతలను కొనసాగించడానికి ఈ అరెస్టులు తప్పలేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
నదీంతో సహా చాలా మందిని వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ చట్ట ప్రకారం అధికారికంగా కేసు పెట్టకుండా రెండేళ్లు నిర్బంధంలో ఉంచొచ్చు.
అయితే ఈ అణచివేతలో భాగంగా ఎంత మంది కశ్మీరీలను అదుపులోకి తీసుకున్నారు? ఎంతమందిని అదుపులో పెట్టారు? అనేది స్పష్టంగా తెలీదు.
ఆ ఏడాది ఆగస్టు 4 నుంచి 5,161 మందిని అదుపులోకి తీసుకున్నామని 2019 నవంబర్ 20న పార్లమెంటుకు ప్రభుత్వం తెలిపింది. అయితే వీరిలో ఎంత మందిని పీఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేశారు? ఇప్పటికీ ఎంత మంది జైల్లో ఉన్నారు? అనేది అస్పష్టం.
"అదృశ్యమైన" కశ్మీరీల తల్లిదండ్రుల బృందంతో కూడిన ఒక సంస్థ పరిశీలించిన కోర్టు రికార్డుల ప్రకారం.. పీఎస్ఏ చట్టం కింద అదుపులోకి తీసుకున్న 662 మంది నిర్బంధాన్ని సవాలు చేస్తూ 2019లో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిల్లో 412 పిటిషన్లు గతేడాది ఆగస్టు 5 తరువాత నమోదయ్యాయి.
ఈ అరెస్టులపై సమాచారం ఇవ్వాలని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్‌ను బీబీసీ కోరింది. అయితే ఇది చాలా సున్నితమైన విషయమని, దీనిపై డేటాను ఇవ్వలేమని ఆయన తెలిపారు.
భయాన్ని సృష్టించడానికే ఈ అరెస్టులు చేశారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
"ప్రజలు తమ గొంతు ఎత్తకుండా ఉండటానికే ఈ అరెస్టులు చేశారు. చాలామందిని పీఎస్ఏ చట్టం కింద నిర్బంధించారు. వారిలో కొంతమందిని విడుదల చేశారు. భయాన్ని సృష్టించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఆందోళనలకు దిగకూడదన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు" అని శ్రీనగర్‌కు చెందిన హక్కుల కార్యకర్త పర్వేజ్ ఇమ్రోజ్ తెలిపారు.
"ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తుందని ప్రభుత్వానికి తెలుసు. దీనికి వ్యతిరేకంగా వాదనలు వినే ఉద్దేశం వారికి లేదు" అని శ్రీనగర్‌కు చెందిన జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యతా హరూన్ రెషి అన్నారు.

ఫొటో సోర్స్, Mukhtar Zohoor
అయితే విడుదలైన కొంతమంది నిర్బంధంలో తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.
స్థానిక ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ 'ద కశ్మీరియత్' సంపాదకుడు ఖమర్ జమాన్ ఖాజీని కొన్ని ట్వీట్లకు "అర్థాలు చెప్పమని" పిలిచిన కొన్ని రోజుల తరువాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
ఆగస్టు 5కు ముందు చాలా రహస్యంగా ఆ ప్రాంతాన్నిసైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. ఆరోజు వరకూ ఆ నిర్ణయం గురించి ప్రభుత్వం బయటికి తెలియనివ్వలేదు.
రాష్ట్రంలోకి అదనంగా వచ్చిన సైనిక బృందాల గురించి జులై 26న ఖాజీ చేసిన ట్వీట్లను గమనించిన స్థానిక పోలీసులు ఆ మర్నాడు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 8న ఆయన్ను శ్రీనగర్‌లోని సెంట్రల్ జైల్‌కు తరలించారు.
"మమ్మల్ని బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టారు. మేం అడ్దుకోవడానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు" అని ఖాజీ చెప్పారు.
ఖాజీని పీఎస్ఏ చట్టం కింద నిర్బంధించామని చెప్పారు. ఆయన్ను ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జైలుకు తరలించారు.
"మమ్మల్ని వారు సైనిక విమానంలో తీసుకుని వెళ్తున్నప్పుడు, మేము ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన "హమ్ దేఖేంగే" గీతం ఆలపించాం" అని ఖాజీ తెలిపారు.
ఖాజీని ఎక్కడ ఉంచారో తెలియక ఆందోళన చెందుతూ ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రంలోని నాలుగు జైళ్లల్లో వెతికారు. 52 రోజులు వెతికిన తరువాత వారికి ఆయన వివరాలు తెలిశాయి. ఖాజీ అరెస్ట్ అయినప్పుడు ఏ చొక్కా వేసుకుని ఉన్నారో కుటుంబ సభ్యులు ఆయన్ను కలిసినప్పుడు కూడా అదే చొక్కా వేసుకుని ఉన్నారు.
ఖాజీ విడుదల అయ్యాక ఆ టీ షర్ట్‌ను చూపించారు. అది బాగా నలిగిపోయి, చిరిగిపోయి, 119 కన్నాలు పడి ఉంది అది.

ఫొటో సోర్స్, Mukhtar Zohoor
"నేను నిర్బంధంలో ఉన్నప్పుడు ఒక పెన్ను, పేపర్ ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. జైల్లో ఉన్నప్పుడు పడిన బాధ, ఆందోళనల గురించి రాయాలనుకున్నాను" అని ఖాజీ వివరించారు.
ఈ వారం మొదట్లో ఖాజీ రాసిన ఓ కథనానికి సంబంధించి ఆయన్ను మళ్లీ అరెస్ట్ చేశారు. ఆగస్టు 6 తరువాత కర్ఫ్యూ సడలించాక బెయిల్‌కు దరఖాస్తు పెట్టుకోమని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో వేల కుటుంబాలు నిర్బంధంలో ఉన్న తమ ఆప్తుల కోసం అలమటిస్తున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా వారి ఆరోగ్య పరిస్థితులను తలుచుకుని బాధపడుతున్నాయి.
వారిలో వసీం అహ్మద్ షేక్ తల్లి కూడా ఉన్నారు. 2019 ఆగస్ట్ 8 నుంచి వసీం షేక్ జైల్లో ఉన్నారు. ఆయన్ను అంతకుముందు రోజు అర్థరాత్రి పోలీసులు విచారణ కోసం పిలిచారు.
తీవ్రవాదులకు సహాయం చేస్తున్నారని, పోలీసులపై రాళ్లు రువ్వారని వసీం షేక్‌పై అభియోగాలు మోపారు.
ఆయన్ను కూడా ఉత్తర్ ప్రదేశ్‌లోని జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన కుటుంబం ఆయన్ను కలుసుకోలేదు.
వసీం షేక్ తల్లి సారా బేగం తన కొడుకు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొడుకును తను కలుసుకోవడానికి ముందే ఆయన కోవిడ్-19కు బలైపోతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డకు కరోనావైరస్ సోకుతుందేమోనని భయపడుతున్నారు.
"మేము కలిసి మరణించాలని అనుకుంటున్నాం. గత 11 నెలలుగా నా బిడ్డను నేను చూడలేదు" అని ఆ తల్లి బాధపడ్డారు. నా కొడుకును విడుదల చేయకపోయినా సరే, కనీసం శ్రీనగర్ జైలుకైనా తరలించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








