కరోనావైరస్: "క్వారంటైన్ కోసం ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు సిద్ధం చేశాం" - ఏపీ సీఎం జగన్

ఫొటో సోర్స్, AP I & PR
కరోనావైరస్ లాంటి మహమ్మారిని కేవలం క్రమశిక్షణతోనే ఎదుర్కోగలం. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కొన్ని దేశాలను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి, ఇప్పుడు కొంచెం కష్టమైనా అందరూ ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను సవినయంగా కోరుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరోనావైరస్ వ్యాప్తి నిరోధం గురించి గురువారం సాయంత్రం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆయన, "నిన్న రాత్రి జరిగిన కొన్ని ఘటనలు నా మనసును కలచివేశాయి. తెలంగాణ నుంచి చాలామంది ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు మనవాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదా? అని మనసుకు బాధేస్తుంది" అని అన్నారు.
"ఇప్పుడు ఎక్కడున్నవారు అక్కడికే పరిమితం కాకపోతే, ఈ వ్యాధిని అరికట్టలేం" అని చెప్పిన జగన్, "అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోండి. లేదంటే అందరూ అలా వచ్చేస్తే, వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది" అన్నారు.
సీఎం ఇంకా ఏమన్నారంటే...
అందరూ ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోతేనే దీనిని కట్టడి చేయడం సాధ్యమవుతుంది.
ఏప్రిల్ 14 దాకా మనం కాస్త ఎక్కడికీ తిరగకుండా ఎక్కడివాళ్లం అక్కడే ఉండిపోతే, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
దయచేసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారు, ఏపీలోనే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేవారు అందరూ ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోండి.
నిన్న సరిహద్దు దాకా వచ్చారు కాబట్టి కాదనలేక వారిని అనుమతించాం. వారందరూ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. లేదంటే వారిలో ఏ ఒక్కరికి వైరస్ సోకి ఉన్నా, ఇక్కడ చాలామందికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వారిని క్వారంటైన్‌లో ఉంచక తప్పడంలేదు.
మీరు నిర్లక్ష్యంగా తిరిగితే మీ బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా మాట్లాడాను. తెలంగాణలో ఉన్న ఎవరికీ ఇబ్బంది రాకుండా చూస్తామని కేసీఆర్ చెప్పారు.

ప్రస్తుతానికి మన రాష్ట్రంలో 10 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఆ సంఖ్య పెరగకుండా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
విదేశాల నుంచి వచ్చిన 27,819 మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాం. గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఆశా వర్కర్లు చాలా గొప్ప సేవలు అందిస్తున్నారు. వారందరికీ అభినందనలు చెబుతున్నాను.
ప్రజలు వీరి సేవలు అందకుంటూనే, క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉంది.
60 ఏళ్లకు పైబడిన వారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కాబట్టి, మనం బాధ్యతగా ఉండాలి.
రాష్ట్రంలోని 4 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 470 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశాం. ఆస్పత్రిలో చికిత్స అవసరమయ్యే వారికోసం ఇప్పటికే ప్రతి జిల్లాలో 200 చొప్పున బెడ్లు ఏర్పాటు చేశాం.
క్వారంటైన్ కోసం ప్రతి నియోజకవర్గంలో 100 పడకలు సిద్ధంగా ఉంచాం. ప్రవేటు ఆస్పత్రుల్లో ఈ కరోనావైరస్ రోగుల కోసమే 213 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది.
ఆరోగ్య సమస్యలు కాకుండా మిగతా సహాయం సహాయం కోసం 1902 నంబరుకు ఫోన్ చేయండి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి మరోసారి సర్వే చేయాలని గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లకు చెప్పాం. ఏ ఇంట్లో ఎవరికి జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలున్నా గుర్తిస్తారు. వారికి వెంటనే వైద్యులు పరీక్షలు చేస్తారు.
ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాం. మంత్రులు ఆ కంట్రోల్ రూంలకు సమన్వయ కర్తలుగా పనిచేస్తున్నారు.
నిత్యావసర సరకుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఏ ఇబ్బందీ పడాల్సిన అవసరం లేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరకులు కొనుక్కోవచ్చు.
వ్యవసాయ పనులకు తప్పనిసరి అయితే వెళ్లండి. వెళ్తే తప్పనిసరిగా సామాజిక దూరం పాటించండి. గుంపులుగా ఉండకండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








