కరోనావైరస్: తల్లుల నుంచి అప్పుడే పుట్టిన పిల్లలకు కోవిడ్-19 సోకే అవకాశం తక్కువే

నవజాత శిశువు

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 ఉన్న మహిళలు ప్రసవిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి వారి శిశువులకు వ్యాపించే అవకాశం ఉండదని ఒక చిన్న అధ్యయనం చెబుతోంది.

న్యూయార్కులోని ఆస్పత్రుల్లో కోవిడ్-19 ఉన్న తల్లులకు పుట్టిన 120 మంది శిశువులకు చేసిన, పరీక్షల్లో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.

కొంతమంది తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చిన కొన్ని వారాల తర్వాత ఈ పరీక్షలు చేశారు.

ఈ ఫలితాలు తల్లులకు భరోసాను అందిస్తున్నా, దీనిపై భారీ స్థాయిలో పరీక్షలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

తల్లిపాలు తాగుతున్న బిడ్డ

ఫొటో సోర్స్, Getty Images

తల్లుల చెంతనే శిశువులు

గర్భధారణ సమయంలో, తల్లిపాలు ఇచ్చేటపుడు కోవిడ్-19 వ్యాపించే ప్రమాదం తక్కువే అయినప్పటికీ, గర్భిణులకు, కొత్తగా తల్లికాబోయేవారికి వేరు వేరు సూచనలు ఉన్నాయి.

“తల్లులు తమ బిడ్డలతో ఒకే గదిలో ఉండాలి. కావాలనుకుంటే వారు తమ పిల్లలకు పాలు పట్టవచ్చు. కానీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ చెప్పింది.

తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు, కోవిడ్-19 వ్యాపించే ప్రమాదాన్ని అధిగమిస్తాయని ఆ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి చెబుతోంది.

ఇటు, కరోనా వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించడానికి నవజాత శిశువులను తల్లి నుంచి తాత్కాలికంగా వేరు చేయడం గురించి ఆలోచించాలని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది. ఈ స్థితిలో ఉన్న తల్లులు తమ పాలను బాటిళ్లలో పిండి తాగించడం గురించి ఆలోచించవచ్చని చెప్పింది.

తాజా అధ్యయనంలో తల్లులు, వారి శిశువులను ఒకే గదిలో ఉండడానికి, తల్లులు వారికి పాలుకూడా పట్టేందుకు అనుమతించారు. తల్లులు మాస్కులు ధరించేలా, తరచూ చేతులు కడుక్కునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. శిశువుల ఊయలను తల్లుల పడకలకు ఆరు అడుగుల దూరంలో ఉండేలా చూసుకున్నారు.

అప్పుడే పుట్టిన శిశువు

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధనలో కనుగొన్నవి:

  • ఈ పరిశోధనలో మొత్తం 120 మంది శిశువులకు చేసిన కరోనా పరీక్షల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి.
  • వారం తర్వాత మళ్లీ 82 మంది శిశువులను పరీక్షించారు. అందరికీ నెగెటివ్ వచ్చింది. ఈ శిశువుల్లో ఎక్కువమంది(68) తమ తల్లితో కలిసి ఒకే గదిలో ఉన్నారు. వీరిలో మూడు వంతులు మంది పిల్లలు తల్లిపాలే తాగారు.
  • శిశువుల్లో 72 మందికి పుట్టిన 15 రోజుల తర్వాత పరీక్షలు చేశారు. వారికి కూడా నెగటివ్ వచ్చింది.

వీరిలో దాదాపు మూడింట ఒక వంతు శిశువులకు పుట్టిన తర్వాత అసలు పరీక్షలు చేయించకపోవడం, లేదంటే పాక్షికంగా చేయించడం జరిగింది. ఎందుకంటే, కరోనా సమయంలో తల్లిదండ్రులు వారిని తిరిగి ఆస్పత్రికి తీసుకురావడానికి ఇష్టపడలేదు.

“కొత్తగా తల్లికాబోతున్న వారి నుంచి శిశువులకు కోవిడ్-19 వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని మా అధ్యయనం కొంత భరోసా ఇస్తుందని మేం ఆశిస్తున్నాం” అని దానికి నేతృత్వం వహించిన డాక్టర్ క్రిస్టీన్ సాల్వటోర్ అన్నారు.

అయితే, తల్లి నుంచి శిశువుకు ఇది వ్యాపించే ప్రమాదం ఉందా అనేది మరింత బాగా తెలుసుకోడానికి పెద్ద అధ్యయనాలు అవసరం అన్నారు.

ఈ పరిశోధన ప్రస్తుత మార్గదర్శకాలకు భరోసా, మద్దతు ఇచ్చిందని బ్రిటన్‌లో నేషనల్ సర్వేలెన్స్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ ప్రెగ్నన్సీకి నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ నైట్ అన్నారు.

“బ్రిటన్‌లో SARS-CoV-2 వ్యాపించిన వెయ్యి మందికి పైగా తల్లులు శిశువులకు జన్మనిచ్చారు. వారి పిల్లల్లో 1-2 శాతం మందికి మాత్రమే వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వల్ల శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు కనిపించలేదు” అన్నారు.

కోవిడ్-19 ఉన్న తల్లులు మాస్క్ వేసుకోవడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఈ వైరస్ తల్లి నుంచి శిశువుకు సాధారణంగా వ్యాపించదని కూడా ఈ చిన్న అమెరికా అధ్యయనం సూచించింది.

ఈ అధ్యయనాన్ని ది లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలెసెంట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)