కరోనావైరస్: కేరళలో సీన్ రివర్స్.. సామాజిక వ్యాప్తి వల్ల మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్-19 కేసులు

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్‌ను కట్టడి చెయ్యడంలో రోల్ మోడల్‌గా నిలిచిన కేరళలో ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.
కేరళలోని సముద్రతీర ప్రాంతాల్లో ఒక్కసారిగా అనేక కోవిడ్-19 కేసులు బయటపడడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తిరువనంతపురం జిల్లాలోని కోస్తా ప్రాంతమైన పూంతుర గ్రామంలో మళ్లీ పూర్తి లాక్‌డౌన్ విధించారు. ఆ ప్రాంతానికి రాకపోకలు నిషేధిస్తూ, రవాణా సౌకర్యాలు నిలిపివేసారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటరాకూడదని, వ్యాపారాలు, దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
అరేబియా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పూంతురలో దాదాపు నాలుగు వేల మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ నెల మొదట్లో ఈ గ్రామంలో 100కు పైగా కోవిడ్-19 కేసులు బయటపడ్డాయి. స్థానికంగా ఉన్న చేపల బజారుకు వెళ్లినవారివల్ల ఈ వైరస్ సామాజిక వ్యాప్తి చెంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనితో కేరళలో కోవిడ్-19 కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
రెండు నెలలకు ముందు కరోనావైరస్ కేసులను నేలమట్టం చేస్తూ కేరళ మోడల్ ఇండియాలో విజేతగా నిలిచింది. కానీ గత కొద్ది వారాల్లో మళీ కేసుల సంఖ్య పెరుగుతూ, సామాజిక వ్యాప్తి చెందుతోంది.

కేరళ - కోవిడ్-19
దేశంలో మొట్టమొదటి కోవిడ్-19 కేసు కేరళలో నమోదయ్యింది. జనవరిలో వుహాన్ నుంచి సొంత రాష్ట్రానికి తిరిగిచ్చిన ఒక మెడికల్ విద్యార్థితో మొదలుకొని ఈ మహమ్మారి కేరళ రాష్ట్రమంతా వ్యాపించింది. అయితే మార్చి కల్లా దేశంలో మిగతా రాష్ట్రాల్లో కేరళకన్నా ఎక్కువ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
మే నెలకల్లా ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడంలో కేరళ ప్రభుత్వం పూర్తి విజయం సాధించింది. అట్టడుగు స్థాయినుంచీ కట్టుదిటమైన చర్యలు ప్రారంభించి కచ్చితమైన లాక్‌డౌన్ పాటిస్తూ, టెస్టులు పెంచి, వ్యాధి సోకినవారిని ట్రేస్ చేస్తూ విధిగా క్వారంటైన్ పాటించేలా విధానాలు రూపొందించి కరోనావైరస్‌ను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. మే నెలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాని రోజులు ఉన్నాయి.
"ఇదొక వైరల్ మిరకిల్(అద్భుతం)" అని ప్రముఖ ఎపిడమాలజిస్ట్ జయప్రకాష్ ములియిల్ వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. కేరళలో మొదటి వెయ్యి కేసులు నమోదవ్వడానికి 110 రోజులు పట్టింది కానీ ఇప్పుడు రోజుకి 800 కేసులు నమోదవుతున్నాయి.
జూలై 20 నాటికి 12,000 కేసులకు పైగా నమోదయ్యాయి. 43 మరణాలు సంభవించాయి. 1,70,000 మందికి పైగా ఇళ్లల్లోనూ, ఆస్పత్రులలోనూ క్వారంటైన్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
కారణాలేంటి?
గల్ఫ్ దేశాల నుంచి, దేశంలో ఇతర రాష్ట్రాలనుంచీ దాదాపు 5 లక్షల జనాభా సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వర్కింగ్ ఏజ్ జనాభాలో 17% మంది కేరళ రాష్ట్రం బయట పని చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల చాలా కంపెనీలు, వ్యాపారాలు మూతబడిపోవడంతో అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా వెనక్కు తిరిగి రావడం కరోనావైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.
"లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత చాలామంది ఇళ్లకు తిరిగొచ్చేసారు. వారిలో వైరస్ ఉన్నవారిని గుర్తించి, వారి రాకను కటడి చెయ్యడం అసాధ్యమయ్యింది. వీరితోపాటూ ప్రయాణించినవారికి కూడా వైరస్ సోకి సామాజిక వ్యాప్తికి కారణమయ్యింది" అని పార్లమెంట్ సభ్యులు శశి థరూర్ అన్నారు.
ఇంటికి తిరిగొచ్చేవారిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. చట్టప్రకారం వారికి సొంత రాష్ట్రం చేరుకునే హక్కు ఉంది. కానీ కోవిడ్-19 కేసులు పెరగడానికి ఇదొక ముఖ్య కారణమయ్యింది అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు వైరస్ స్థానికంగా ఒకరినుంచీ ఒకరికి వ్యాప్తి చెందుతోంది. "లాక్‌డౌన్ తరువాత, చాలామంది ఉద్యోగాలకు వెళుతున్నారు. బయట తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండమని, సురక్షిత పద్ధతులు పాటించమని మేము పదే పదే హెచ్చరిస్తున్నాం" అని ప్రభుత్వ సలహాదారులు బీ. అక్బల్ అన్నారు.
కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తరువాత టెస్టుల సంఖ్య కూడా తగ్గించారని, అది కూడా ప్రస్తుత వ్యాప్తికి ఒక కారణమని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
"టెస్టుల సంఖ్య బాగా పెరిగింది. కానీ ఎంత చేసినా సరిపోనట్టే అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కవర్ చెయ్యడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడదు" అని ఎర్నాకుళం మెడికల్ కాలేజ్ క్రిటికల్ కేర్ అధిపతి డాక్టర్ ఫతాహుదీన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే కరోనావైరస్‌ను ఎదుర్కొనే విషయంలో కేరళ బాగా వ్యహరించిందని, మరణాల సంఖ్య చాలా తక్కువ ఉందని కేరళలో పటిష్టమైన పబ్లిక్ హెల్త్ వ్యవస్థ ఉందని నిపుణులు భావిస్తునారు.
ప్రస్తుతం పెరుగుతున్న కేసుల దృష్ట్యా కోవిడ్-19 చికిత్సా కేంద్రాలను పెంచుతూ, ఆక్సిజన్ సరఫరా చెయ్యగలిగే బెడ్స్ పెంచుతూ కేరళ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఫొటో సోర్స్, facebook/pinarai vijayan
కరోనావైరస్ లాంటి మహమ్మారిని పూర్తిస్థాయిలో మట్టుబెట్టడం అసాధ్యమని, కేసులు పెరుగుతూ, తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయని, ఎప్పటికప్పుడు నివారణా చర్యలు చేపడుతూ ముందుకు సాగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"ఇది ట్రెడ్‌మిల్ మీద పరిగెత్తడం లాంటిది. వేగం పెరుగుతున్నప్పుడల్లా పరుగు పెంచుతూ ఉండాలి. చాలా అలిసిపోతాం, కానీ తప్పదు. పరిగెత్తడం తప్ప మరోమార్గం లేదు" అని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నుంచి రిటైర్ అయిన వైరాలజీ ప్రొఫెసర్ టీ జాకబ్ జాన్ అన్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








