అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన బోరిస్ జాన్సన్ ప్రభుత్వం

బోరిస్ జాన్సన్

ఫొటో సోర్స్, PA Media

అమెరికా దారిలోనే బ్రిటన్ కూడా... చైనాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

హాంకాంగ్‌లో అమల్లోకి తెచ్చిన కొత్త జాతీయ భద్రత చట్టం, వీగర్ ముస్లింలపై వేధింపుల వంటి విషయాలపై తీవ్రంగా స్పందిస్తోంది.

హాంకాంగ్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని బ్రిటన్ రద్దు చేసుకోనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ఈ విషయమై పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్లకు ముందు నుంచే ఉంది.

హాంకాంగ్‌లో నేరాలు చేసినవారు ఎవరైనా బ్రిటన్‌కు వస్తే, వారిని పట్టుకుని తిరిగి హాంకాంగ్‌కు అప్పగించడం ఈ ఒప్పందం ఉద్దేశం.

ఇక హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టానికి స్పందనగా అమెరికా కూడా కొన్ని చర్యలు తీసుకుంది. హాంకాంగ్‌కు కల్పించిన వాణిజ్యపరమైన ప్రత్యేక హోదాను వెనక్కితీసుకుంది.

మరోవైపు అమెరికా, బ్రిటన్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయని చైనా పదేపదే వాదిస్తోంది.

హాంకాంగ్‌ను అమెరికా, బ్రిటన్ అస్థిరపరచాలనుకుంటున్నాయని ఆరోపిస్తోంది.

‘కొత్త జాతీయ భద్రత చట్టం ద్వారా హాంకాంగ్‌లో ఇష్టానుసారం ఎవరినైనా అదుపులోకి తీసుకుని, చైనాకు పంపించే అవకాశం ఉంది’

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ‘కొత్త జాతీయ భద్రత చట్టం ద్వారా హాంకాంగ్‌లో ఇష్టానుసారం ఎవరినైనా అదుపులోకి తీసుకుని, చైనాకు పంపించే అవకాశం ఉంది’

ఎందుకు ఈ చర్యలు

హాంకాంగ్ ఇదివరకు బ్రిటీష్ వలస పాలనలో ఉండేది.

'వన్ కంట్రీ, టూ సిస్టమ్స్' (ఒక దేశం, రెండు వ్యవస్థలు) సూత్రం ప్రకారం 1997లో చైనాలో భాగంగా మారింది.

ఇందుకోసం బ్రిటన్, చైనాల మధ్య ఒప్పందం కుదిరింది.

దీని ప్రకారం చైనాలో భాగంగా ఉన్నా... విదేశాంగ, రక్షణ వ్యవహారాలు తప్ప మిగతా అంశాల్లో హాంకాంగ్‌కు 'అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్తి' 50 ఏళ్లపాటు ఉంటుంది.

ఫలితంగా హాంకాంగ్‌కు సొంతదైన న్యాయవ్యవస్థ, సరిహద్దులు ఏర్పడ్డాయి. చైనాలోని మిగతా ప్రాంతాల ప్రజలకు లేని స్వేచ్ఛ, హక్కులు హాంకాంగ్ ప్రజలకు దక్కాయి.

అయితే, గత కొన్నేళ్లుగా హాంకాంగ్ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటోందంటూ స్థానిక పౌరహక్కుల ఉద్యమ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

హాంకాంగ్ నుంచి చైనాకు నేరస్థులను తరలించే బిల్లుకు వ్యతిరేకంగా గత ఏడాది భారీ స్థాయిలో హాంకాంగ్‌లో నిరసనలు రేగాయి.

హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్యవాదులను, ఉద్యమకారులను ఈ బిల్లును అడ్డం పెట్టుకుని చైనా అదుపులోకి తీసుకుంటుందని ఆందోళనలు వచ్చాయి.

‘కొత్త చట్టంతో హాంకాంగ్ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పు

ఫొటో సోర్స్, ISAAC LAWRENCE/AFP

ఫొటో క్యాప్షన్, ‘కొత్త చట్టంతో హాంకాంగ్ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పు’

హాంకాంగ్‌‌లో తాజాగా తెచ్చిన కొత్త జాతీయ భద్రత... హాంకాంగ్‌లో ఎవరినైనా అదుపులోకి తీసుకుని, చైనాకు తరలించే వీలు కల్పిస్తోందని నిపుణులు అంటున్నారు.

1985లో బ్రిటన్, చైనా మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ చట్టం తీవ్ర ఉల్లంఘన అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

హాంకాంగ్‌లో వచ్చిన కొత్త చట్టంతో అక్కడి న్యాయవ్యవస్థ స్వతంత్రకు ముప్పు రావొచ్చని బ్రిటన్ సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రీడ్ వ్యాఖ్యానించారు.

హాంకాంగ్ వాసులు తమ దేశంలో ఉండేందుకు, తమ దేశ పౌరులుగా మారేందుకు అవకాశం కల్పిస్తామని బ్రిటన్ ఇప్పటికే ప్రకటించింది.

తాజా నిర్ణయంతో హాంకాంగ్‌లో బ్రిటిష్ ఓవర్సీస్ పాస్‌పోర్టు ఉన్న సుమారు మూడున్నర లక్షల మంది, ఆ పాస్‌పోర్టు తీసుకునేందుకు అర్హులైన మరో 26 లక్షల మంది ఐదేళ్లపాటు బ్రిటన్‌లో ఉండడానికి రావచ్చు. తర్వాత ఏడాదికి, అంటే ఆరేళ్లు పూర్తైన తర్వాత వారందరూ బ్రిటన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదివరకు వీరి హక్కులు పరిమితంగా ఉండేవి. వీసా లేకుండా బ్రిటన్‌లో ఆరు నెలలు మాత్రమే ఉండేందుకు వీలుండేది.

వీగర్ ముస్లింలు

ఫొటో సోర్స్, Getty Images

తమ దేశంలో 5జీ మొబైల్ సాంకేతికత రంగంలోకి చైనా సంస్థ హువావే అడుగుపెట్టకుండా కూడా బ్రిటన్ నిషేధం విధించింది.

ఈ నిషేధం ప్రకారం బ్రిటన్‌లోని మొబైల్ ప్రొవైడర్లు డిసెంబర్ 31 తర్వాత నుంచి హువావే పరికరాలు కొనుగోలు చేయకూడదు. 2027 వరకూ తమ నెట్‌వర్క్‌లో అన్ని హువావే 5జీ కిట్‌లను తొలగించాలి.

ఈ చర్యలతో బ్రిటన్ చైనాకు గట్టి సందేశం పంపే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా తరహాలో చైనా అధికారులపై ఆంక్షలు విధించే అంశం గురించి కూడా చర్చ జరుగుతోంది. కానీ, బ్రిటన్‌లో ఇలాంటి చర్య తీసుకోవడం సంక్లిష్ఠమైన ప్రక్రియ. చాలా సమయం పడుతుంది.

తమ ఉన్నతాధికారులపై బ్రిటన్ ఏవైనా ఆంక్షలు విధిస్తే, తాము కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది.

మానవహక్కుల విషయమై కూడా చైనాపై బ్రిటన్ విమర్శల దాడిని పెంచింది.

షింజియాంగ్ ప్రావిన్సులో వీగర్ ముస్లింలపై చైనా తీవ్ర వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది.

చైనాలో ముస్లింలకు బలవంతపు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయిస్తుండటం, విస్తృత స్థాయిలో వారిపై వేధింపులకు పాల్పడుతుండటం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయని, చాలా కాలంగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని బ్రిటన్ విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ అన్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA/ERIN SCHAFF / POOL

మరిన్ని దేశాలూ...

వీగర్ ముస్లింల కళ్లకు గంతలు కట్టి, రైళ్లలో ఎక్కిస్తున్నట్లుగా దృశ్యాలున్న ఓ డ్రోన్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియా భద్రత సంస్థలు కూడా దీన్ని ధ్రువీకరించాయి.

చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంబిన్ ఇవన్నీ ‘అబద్ధాల’ని అన్నారు.

హాంకాంగ్, వీగర్ ముస్లింల వ్యవహారాలకు సంబంధించిన చైనా ఉన్నత అధికారులు, సంస్థలపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది.

హాంకాంగ్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని కెనడా కూడా రద్దు చేసుకుంది. సైన్య అవసరాల కోసం చైనా నుంచి వచ్చే దిగుమతుల కోసం చేసుకున్న ఒప్పందాన్ని కూడా సమీక్షించనున్నట్లు ప్రకటించింది.

హాంకాంగ్ కొత్త భద్రత చట్టం నేపథ్యంలో అక్కడికి వెళ్లే తమ దేశ పర్యాటకులకు కెనడా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

కొత్త జాతీయ భద్రత చట్టం ద్వారా హాంకాంగ్‌లో ఇష్టానుసారం ఎవరినైనా అదుపులోకి తీసుకుని, చైనాకు పంపించే అవకాశం ఉందని కెనడా హెచ్చరించింది.

హాంకాంగ్ వాసులకు ఆశ్రయం కల్పించే విషయాన్ని ఆస్ట్రేలియా కూడా పరిశీలిస్తోంది. హాంకాంగ్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

హాంకాంగ్‌తో సంబంధాలను న్యూజీలాండ్ కూడా సమీక్షించుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)