చైనాకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు.. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, కెనడా - హాంకాంగ్ కొత్త చట్టం

ఫొటో సోర్స్, Reuters
హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలు చేయాలన్న చైనా నిర్ణయాన్ని చాలా దేశాలు విమర్శిస్తున్నాయి.
హాంకాంగ్‌లో ఉన్న 30 లక్షల మందికి బ్రిటన్ తమ దేశంలో స్థిరపడేందుకు ఆఫర్ ఇవ్వగా, అటు అమెరికా ప్రతినిధుల సభ హాంకాంగ్‌కు సంబంధించి కొత్త ఆంక్షలను ఆమోదించింది.
అమెరికా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానంలో చైనా అధికారులతో వ్యాపారం చేసిన బ్యాంకులకు జరిమానా విధిస్తామని చెప్పారు.
అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి వెళ్లే ముందు ఈ తీర్మానం సెనేట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఇటు కొత్త భద్రతా చట్టం ద్వారా హాంకాంగ్ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తున్నారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఈ చట్టానికి ప్రభావితమైన వారు బ్రిటన్ రావచ్చని ప్రతిపాదన చేశారు. హాంకాంగ్ మొదట బ్రిటన్ వలస రాజ్యంగా ఉండేది.
కానీ దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. బ్రిటన్‌కు అలా అనడానికి ఏ హక్కూ లేదని, ఆ దేశం చర్యలను అడ్డుకోడానికి చైనా తగిన చర్యలు చేపడుతుందని బ్రిటన్‌లోని చైనా రాయబారి చెప్పారు.
“ఇది రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. కొత్త చట్టాన్ని బ్రిటన్ విమర్శించడం బాధ్యతారాహిత్యం, అనవసరం” అని చైనా రాయబారి ల్యూ షియావొమింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ నిర్ణయం ఏంటి?
బ్రిటన్ తాజా నిర్ణయంతో హాంకాంగ్‌లో బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉన్న సుమారు మూడున్నర లక్షల మంది, మరో 26 లక్షల మంది ఐదేళ్లపాటు బ్రిటన్‌లో ఉండడానికి రావచ్చు. తర్వాత ఏడాదికి, అంటే ఆరేళ్లు పూర్తైన తర్వాత వారందరూ బ్రిటన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
హాంకాంగ్‌లో ఓవర్‌సీస్ పాస్‌పోర్టుతో ఉన్న బ్రిటన్ పౌరులకు 1980లో ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ ప్రస్తుతం వారి హక్కులు పరిమితంగా ఉన్నాయి. వారు వీసా లేకుండా ఆరు నెలలు మాత్రమే బ్రిటన్‌లో ఉండగలరు.
బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకారం ప్రవాస బ్రిటన్ పౌరులు, వారిపై ఆధారపడిన అందరికీ బ్రిటన్‌లో నివాస హక్కు కల్పిస్తారు. ఇందులో ఐదేళ్లపాటు పనిచేయడం, చదువుకునే హక్కు కూడా ఉంటాయి. ఆరేళ్ల తర్వాత వారు ఆ దేశ పౌరసత్వ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
హాంకాంగ్‌లో కొత్త భద్రతా చట్టం అమలు చేయడం 1985లో చైనా-బ్రిటన్ జాయింట్ మేనిఫెస్టోను తీవ్రంగా ఉల్లంఘించడమే అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెబుతున్నారు. ఆ ఒప్పందం చట్టపరంగా దానికి బాధ్యత వహిస్తుందని, హాంకాంగ్ స్వాతంత్ర్యానికి సంబంధించి కొన్ని అంశాలకు 50 ఏళ్ల పాటు (చైనా 1997లో సౌర్వభౌమాధికార దేశంగా ప్రకటించినప్పటి నుంచి) రక్షణ కల్పిస్తుందని అందులో చెప్పారని తెలిపారు.
ఈ చట్టం హాంకాంగ్ ఉన్నత స్థాయి స్వయంప్రతిపత్తి ఉల్లంఘనే అని, జాయింట్ మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన హక్కులు, స్వేచ్ఛకు ముప్పు ఏర్పడవచ్చని బ్రిటన్ ప్రధాని చెప్పారు.
“చైనా ఇదే దారిలో వెళ్తుంటే, ప్రవాస బ్రిటన్ పౌరులు స్వదేశానికి రావడానికి కొత్త దారులు తీసుకువస్తామని మేం స్పష్టంగా చెప్పాం. వచ్చేవారికి పరిమిత కాలంపాటు ఇక్కడ ఉండడానికి, పని చేసుకోడానికి హక్కు అందిస్తామని, తర్వాత వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నాం. ఇప్పుడు మేం అదే చేస్తున్నాం” అని బోరిస్ జాన్సన్ చెప్పారు.
బోరిస్ జాన్సన్ నిర్ణయంపై స్పందించిన చైనా.. బ్రిటన్ తన మాట తప్పిందని ఆరోపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిజియన్ జావో మాట్లాడుతూ.. “బ్రిటిష్ నేషనల్ ఓవర్‌సీస్(బీఎన్ఓ) పాస్‌పోర్ట్ ఉన్నవారితోపాటూ హాంకాంగ్ దేశంలో ఉన్నవారందరూ చైనా పౌరులే. మొదట జరిగిన ఒప్పందంలో బీఎన్ఓ హోల్డర్లకు తమ దేశంలో శాశ్వతంగా ఉండడానికి అనుమతి ఇచ్చేది లేదని బ్రిటన్ మాకు మాట ఇచ్చింది. ఇప్పుడు బ్రిటన్ తన విధానాన్ని మార్చుకోవాలని అనుకుంటోంది. తను ఇచ్చిన మాటనే వెనక్కు తీసుకుంటోంది” అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా ప్రతినిధుల సభ నిర్ణయం ఏమిటి
అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హాంకాంగ్ అటానమీ యాక్ట్ హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా నిరసనలు చేసిన వారిని అణచివేతకు పాల్పడిన అధికారులతో వ్యాపారం చేసే బ్యాంకులపై ఆంక్షల గురించి ప్రస్తావించారు.
“చైనా భద్రతా చట్టానికి సమాధానంగా ఈ చట్టం చాలా అవసరం” అని సభ స్పీకర్ నాన్సీ పెలోసీ చెప్పారు.
హాంకాంగ్ ప్రత్యేక ప్రతిపత్తిని అంతం చేయడం గురించి అమెరికా ఈ బిల్లుకు ముందు నుంచీ చొరవ చూపుతోంది. అందులో రక్షణ ఎగుమతులపై, ఉన్నత సాంకేతిక ఉత్పత్తులను పొందడంపై నిషేధం విధించింది.
అమెరికా గత ఏడాదే మానవ హక్కుల, ప్రజాస్వామ్య బిల్లుకు చట్టరూపం ఇచ్చింది. ఈ చట్టంలో హాంకాంగ్ ప్రజాస్వామ్యాన్ని సమర్థించేవారికి తమ సహకారం ఉంటుందనే విషయం చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దీనిపై చైనా విదేశాంగ మంత్రి తీవ్రంగా స్పందించారు. అమెరికా ప్రతినిధి సభలో హాంకాంగ్ స్వయంప్రతిపత్తి గురించి ఆమోదించిన బిల్లును చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
మిగతా దేశాలు ఏమంటున్నాయి
అమెరికా, బ్రిటన్‌తోపాటూ ఆస్ట్రేలియా కూడా దీనిపై స్పందించింది. హాంకాంగ్ ప్రజలకు తమ దేశంలో ఆశ్రయం కల్పించే విషయం గురించి ఆలోచిస్తున్నామని చెప్పింది.
“దీనికి సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై త్వరలో క్యాబినెట్‌లో చర్చిస్తాం” అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ చెప్పారు.
ఇటు తైవాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి హాంకాంగ్ పర్యటనలకు దూరంగా ఉండాలని, అవసరమైతే తప్ప అక్కడికి ట్రాన్సిట్ వీసా కూడా తీసుకోవద్దని తమ పౌరులకు సూచించారు.
“హాంకాంగ్‌లో అమలు చేసిన కొత్త భద్రతా చట్టం చరిత్రలోనే అత్యంత అభ్యంతరకరమైన చట్టం” అని తైవాన్ మెయిన్‌లాండ్ అఫైర్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ చివ్ చుయ్-చాంగ్ అన్నారు.
అయితే హాంకాంగ్‌లో తమ రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
ఈ చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదట గళం వినిపించిన దేశాల్లో జపాన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడంపై జపాన్ విచారం వ్యక్తం చేసింది.
ఈ చట్టం హాంకాంగ్ ‘ఒక దేశం-రెండు వ్యవస్థల’ సిద్ధాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుందని జపాన్ విదేశాగ మంత్రి తోషీమిత్సు మోటేగీ అన్నారు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ కూడా ఈ చట్టాన్ని విమర్శించారు. దీనివల్ల న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, చట్ట అమలుపై హానికరమైన ప్రభావం పడుతుందని అన్నారు.
కెనడా కూడా హాంకాంగ్‌లో పర్యటించేవారికి ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది. హాంకాంగ్‌లో ఇప్పుడు జాతీయ భద్రతా చట్టం ఆధారంగా తమ ఇష్టానుసారం ఎవరినైనా అరెస్టు చేయవచ్చని, వారిని చైనాకు పంపించవచ్చని చెబుతోంది.
మరోవైపు చైనా తమపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తోంది. హాంకాంగ్ అంశంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటోంది.

ఫొటో సోర్స్, NURPHOTO
బీబీసీ రాజకీయ ప్రతినిధి నిక్ ఆర్డ్ లీ విశ్లేషణ
భద్రతా చట్టం విషయంలో చైనా తన వైఖరిని మార్చుకునేలా బ్రిటన్ ప్రభుత్వం మొదటి నుంచీ ఆ దేశంపై ఒత్తిడి తెస్తోంది. కానీ అలా జరగలేదు.
అందుకే ఇప్పుడు అది తన మాటను పూర్తి చేసింది. ఇది చాలా కీలక చర్య. బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయంతో గట్టి సందేశాన్ని ఇవ్వాలనుకుంటోంది.
కానీ చైనాతో సంబంధాల విషయంలో మిగతా అంశాలపై కూడా పునరాలోచించాలని బ్రిటన్ మీద ఒత్తిడి ఉంటుంది.
వీటిలో ఒకటి చైనా వివాదిత కంపెనీ హువావే. టోరీ పార్టీ ఎంపీలు చాలా మంది మొదటి నుంచీ దీనిని వ్యతిరేకించేవారు. ఈ నిర్ణయం తర్వాత వారి ఆందోళన మరింత పెరగనుంది.
కొత్త చట్టం కింద ఎన్నో అరెస్టులు
హంకాంగ్ ప్రజలు బ్రిటన్ రావచ్చనే ప్రతిపాదనపై మాట్లాడిన విదేశాంగ మంత్రి డొమెనిక్ రాబ్ “సంఖ్య, కోటా గురించి ఎలాంటి పరిమితులు ఉండవు, దరఖాస్తు ప్రక్రియ సాధారణంగా ఉంటుంది. కానీ ప్రవాస బ్రిటన్ పౌరులు తమ దేశం రావడానికి అనుమతించాలని చైనాపై ఒత్తిడి తీసుకురాలేం” అన్నారు.
హాంకాంగ్‌లో ప్రస్తుతం బ్రిటన్ నేషనల్ ఓవర్‌సీస్ పాస్‌పోర్ట్ ఉన్న వారు వెంటనే బ్రిటన్ రావచ్చు. కానీ వారు తప్పనిసరిగా స్టాండర్డ్ ఇమిగ్రేషన్ దర్యాప్తు ప్రక్రియను ఎదుర్కోవాలి. ప్రధానమంత్రి జాన్సన్ అధికారిక ప్రతినిధి ఈ సమాచారం చెప్పారు.
హాంకాంగ్ కొత్త భద్రతా చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం చాలా మందిని అరెస్టు చేశారు.
ఈ చట్టం గురించి వస్తున్న అన్ని విమర్శలను చైనా కొట్టిపారేస్తోంది. అది తమ అంతర్గత విషయం అని చెబుతోంది.
అటు బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమెనిక్ రాబ్ మాత్రం “చైనా మాట తప్పుతోందని” అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- హాంకాంగ్ - జుహాయ్ మార్గం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
- హాంకాంగ్: ఇక్కడ పాఠశాల విద్య ఖర్చు ఏడాదికి రూ.94 లక్షలు
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- చైనా దాడిపై భారత్‌కు నిఘా సమాచారం అందలేదా?
- హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయా? ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి?
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








