కరోనావైరస్-లాక్‌డౌన్: హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయా? ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి?

- రచయిత, అబినాష్ కంది
- హోదా, బీబీసీ ప్రతినిధి
వినాయక చవితి వస్తోందంటే హైదరాబాద్‌లో చాలా సందడి కనిపిస్తుంది. ప్రతి గల్లీలో గణేశ్ మండపాలు కొలువుదీరుతాయి.
రకరకాల వేషధారణల్లో విగ్రహాలు, రంగురంగుల అలంకరణలతో మండపాలు, భజనలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు... ఇలా ఎంతో హడావుడి కనిపిస్తుంది.
ఖైరతాబాద్ లాంటి ప్రాంతాలైతే, పుణ్య క్షేత్రాలుగా మారిపోతాయి.
ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ విగ్రహాల ఊరేగింపులు, జనంతో కిటకిటలాడుతాయి.
కానీ, ఇప్పుడు కరోనావైరస్ తెలంగాణలో విజృంభిస్తోంది.
రోజుకు దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. వాటిలో చాలా వరకూ జీహెచ్ఎంసీ పరిధిలోనే వస్తున్నాయి.
ఇంతటి సంక్షోభం మధ్య ఈసారి హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయా? ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితేంటి?
హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు అనగానే అందరికీ మొదటగా గుర్తుకువచ్చేది ఖైరతాబాద్‌లో ఏర్పాటయ్యే భారీ వినాయక విగ్రహమే.
రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇక్కడి గణేశుడు చాలా ఫేమస్.
ఏటా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
దాదాపు 65 ఏళ్లుగా ఇక్కడ నిరాటంకంగా గణేశ్ ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి.
1954లో తొలిసారిగా ఖైరతాబాద్‌లో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి విగ్రహం ఎత్తును ఏడాదికి ఒక అడుగు చొప్పున పెంచుకుంటూ వచ్చారు.
2014లో విగ్రహం ఎత్తు 60 అడుగులకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది నుంచి మళ్లీ ఏడాదికి ఒక్కో అడుగు చొప్పున తగ్గించడం మొదలుపెట్టారు. గత ఏడాది మాత్రం 61 అడుగుల ఎత్తుతో విగ్రహం ఏర్పాటు చేశారు.
కరోనావైరస్ వ్యాప్తి ముప్పు నేపథ్యంలో ఈసారి 27 అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ మార్గదర్శకాలు రాలేదు
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించబోమని ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఎస్. సుదర్శన్ బీబీసీతో చెప్పారు.
భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ, కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
‘‘ఈసారి ‘ధన్వంతరి’ అవతారంలో వినాయకుడి విగ్రహం ఉండబోతుంది. కరోనావైరస్ ముప్పు తొలగిపోవాలని ఆశిస్తూ, ఇలా చేస్తున్నాం. శిల్పి రాజేందర్ నేతృత్వంలో దీన్ని తీర్చిదిద్దే పనులు జరుగుతాయి’’ అని చెప్పారు.
గణేశ్ ఉత్సవాల నిర్వహణ గురించి ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదని కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. రాజ్ కుమార్ బీబీసీతో అన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
‘’65 ఏళ్లుగా నిరాటంకంగా జరుగుతున్న ఉత్సవాలు అలాగే కొనసాగాలన్నది మా ఉద్దేశం. ప్రభుత్వం ఎలా చెబితే, అలా ముందుకు సాగుతాం’’ అని ఆయన అన్నారు.
లైవ్ స్ట్రీమింగ్‌లో దర్శనం
ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తామని రాజ్ కుమార్ చెప్పారు.
ప్రతిసారీ ఖైరతాబాద్ వినాయకుడు చేతిలో భారీ లడ్డూతో కనిపిస్తాడు. పోయిన ఏడాది ఏకంగా ఇందుకోసం ఆరు వేల కిలోల బరువున్న లడ్డూను తయారుచేశారు.
ఈసారి విగ్రహం సైజు తగ్గుతుండటంతో, దీని పరిమాణం కూడా తగ్గొచ్చు.
లడ్డూ గురించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని... ప్రభుత్వం అనుమతులు వచ్చిన తర్వాత, అన్ని విషయాలపై ఒక స్పష్టత వస్తుందని రాజ్ కుమార్ చెప్పారు.
ఎప్పుడూ భారీ ఊరేగింపు మధ్య ఖైరతాబాద్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు.
కానీ, ఈ సారి అలా చేయబోవడం లేదని సుదర్శన్ చెప్పారు.
విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటనే అభిషేకాలు నిర్వహించి, నిమజ్జనం చేయాలని అనుకుంటున్నామని అన్నారు.

‘అందరూ బాగుండేందుకు అవసరమైనట్లుగానే ఉత్సవాలు’
హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశుడు కూడా చాలా మందికి తెలుసు. ఇక్కడి లడ్డూ వేలం ఏటా వార్తల్లోకెక్కుతూ ఉంటుంది.
పోయిన ఏడాది వేలంలో లడ్డూ రూ.17.6 లక్షలు పలికింది.
ఈ సారి బాలాపూర్ గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఇక్కడి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘ఆ దేవుడిని పూజించేది అందరూ బాగుండాలనే కదా! అందరూ బాగుండేందుకు అవసరమైనట్లుగానే ఉత్సవాలు జరగాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతికూల పరిస్థితులు ఉంటే, ఉత్సవాలను ఆడంబరాలకు పోకుండా జరుపుకోవడం ఉత్తమమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని నిరంజన్ రెడ్డి చెప్పారు.
‘‘ఇప్పటివరకూ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చెప్పలేదు. ట్యాంక్‌బండ్ వరకూ ఊరేగింపులు ఉంటాయో, లేదో తెలియదు. మా కమిటీ కూడా సమావేశమవ్వాల్సి ఉంది. ఇంకా ఏ విషయంపైనా స్పష్టత లేదు’’ అని ఆయన అన్నారు.
లడ్డూ వేలం ఎలా నిర్వహించాలన్నది కూడా కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని నిరంజన్ రెడ్డి వివరించారు.
యథావిధిగా జరుపుకోనివ్వాలి’
ఏటా గణేశ్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లో లక్షా యాభై వేల వరకూ గణేశ్ మండపాలు వెలుస్తాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని మండపాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, యథావిధిగా మండపాలను ప్రభుత్వం అనుమతించాల్సిందేనని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు అంటున్నారు.
పౌరులందరికీ ‘ఆరాధించే హక్కు’ ఉందని ఆయన వాదిస్తున్నారు.
‘‘ఉత్సవాలు మొదలయ్యేందుకు ఇంకా సమయం ఉంది. అప్పటివరకూ వైరస్ వ్యాప్తి తగ్గుతుందేమో. ఒకవేళ తగ్గకపోతే, కోవిడ్ విషయంలో ప్రభుత్వం విధించే మార్గదర్శకాలను అనుసరించి ఉత్సవాలు జరుపుకుంటాం. ఉత్సవాలు తప్పకుండా ఉంటాయి. ఏ స్థాయిలో చేసుకోవాలన్నది పరిస్థితులను బట్టి ఉంటుంది’’ అని భగవంత్ రావు బీబీసీతో అన్నారు.
మతవిశ్వాసాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు, వెసులుబాట్లు చేయాలని ఆయన కోరారు.
ఇక గణేశ్ ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని, ఇప్పుడే ఈ విషయంపై తానేమీ మాట్లాడలేనని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ బీబీసీతో చెప్పారు.

భౌతిక దూరం సాధ్యమేనా?
గణేశ్ ఉత్సవాలను అనుమతించే విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు.
మండపాల ఏర్పాటుకు కఠినమైన, కచ్చితమైన నిబంధనలు పెట్టాలని ప్రజా ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సంతోష్ ప్రభుత్వానికి సూచించారు.
‘‘విగ్రహం ఎత్తుపై పరిమితి పెట్టాలి. కచ్చితంగా భౌతిక దూరం అమలయ్యేలా చూసేందుకు అన్ని మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమనాలి. మండపం నిర్వాహకుల సంఖ్యను ఐదుగురికి మించకుండా చూడాలి.వారందరికీ కోవిడ్ పరీక్షలు చేసి, నెగిటివ్‌గా తేలితేనే అనుమతించాలి. వీటిలో ఏవీ లేకున్నా, మండపాలను అనుమతించకూడదు’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
మండపాల్లోకి వెళ్లే భక్తుల సంఖ్యపై కూడా గంటకు ఇంతమంది అని పరిమితి పెట్టాలని సంతోష్ అభిప్రాయపడ్డారు.
భక్తులు ఇళ్లలోనే వినాయక పూజలు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా అన్నారు.
‘‘పూజించుకునే స్వేచ్ఛ భక్తులకు ఉంది. కానీ, ఇళ్లలో ఆ పని చేస్తే అందరికీ మేలు’’ అని సంతోష్ వ్యాఖ్యానించారు.
టాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనం చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ఇక్కడ భౌతిక దూరం పాటించేలా చేయడం చాలా కష్టం.
అయితే, నిమజ్జనం జరిగే రోజుల వ్యవధిని ఇరవై రోజులకు పెంచాలని, అలా రద్దీ కొంత తగ్గించవచ్చని సంతోష్ అభిప్రాయపడ్డారు.
‘‘ట్యాంక్‌బండ్ వరకూ వచ్చే అవసరం లేకుండా, ఖైరతాబాద్ వినాయకుడి తరహాలో మట్టి విగ్రహాలైతే ఎక్కడిక్కడే నిమజ్జనం చేసేయొచ్చు. అలాంటి విగ్రహాలను మాత్రమే అనుమతించడం కూడా మంచి ఆలోచనే. ప్రభుత్వం ఇది ప్రయత్నించి చూడొచ్చు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- Chingari, Roposo: టిక్‌టాక్ స్థానాన్ని ఈ దేశీయ యాప్‌లు దక్కించుకుంటాయా?
- ‘ఆగస్టు 15 నాటికి కరోనావైరస్ వ్యాక్సిన్’.. హైదరాబాద్ నుంచే టీకా ఉత్పత్తి
- రూ.50,000కి దాటిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








