కరోనావైరస్ లాక్‌డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్లాడియా హామండ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
కరోనావైరస్ లాక్ డౌన్ ప్రకటించగానే వివిధ దేశాలలో రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు ప్రజలను ఇళ్లలోనే ఉండమని తమ ప్రసంగాలు, ప్రకటనల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి.
కొంత మంది ఇంట్లో హాయిగా కుర్చీలో కూర్చుని టీవీలో ఇష్టమైన కార్యక్రమం చూస్తూ ఉండటానికి ఇబ్బంది ఏమిటని కూడా ప్రశ్నించారు.
మనకు చేయడానికి అంతగా ఆసక్తి లేని కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించమని, వ్యాయామం చేయమని , ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోమని చెబుతున్న ఆరోగ్య సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం.
ఇవన్నీ మనలో బద్ధకాన్ని తట్టి లేపే ఆలోచనలకు ఊతమిస్తాయి.
కానీ, వీటిని పాటించడం అంత సులభమేమీ కాదు. లాక్ డౌన్ లో కొన్ని రోజులు గడిచేటప్పటికే ఇవన్నీ చేయడం కష్టమని తేలిపోతుంది.
నిజానికి మానవ శరీరం పని చేయడం వల్ల, పనికి, విశ్రాంతికి మధ్య ఒక సమతుల్యత పాటించడం వల్లనే ఎక్కువ ఉత్తేజితంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మనం ఎప్పుడూ సులభంగా పూర్తయిపోయే పనుల వైపు మొగ్గు చూపడం సహజం.
రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నప్పుడు లేచి వెళ్లి టీవీ లో చానళ్ళు మార్చాలని అనుకోము. కారు ఉండగా సైకిల్ మీద ఎందుకు సూపర్ మార్కెట్ కి వెళతాం? మీ సహోద్యోగి కన్నా సగం పని చేయగలిగే వెసులుబాటు మీకున్నప్పుడు అంత కన్నా ఏమి కావాలి?
ఏ పనిలోనైనా మానసిక, శారీరక శక్తి ఖర్చవుతుంది. ఎక్కడ వీలయితే అక్కడ అధికంగా శ్రమ పడటాన్ని తప్పించుకుంటూ ఉంటాం.
దీనినే జిప్ ఎఫ్ లా అంటారు. దీనిని ఎవరూ ఉల్లఘించాలని అనుకోరని మీరు భావించవచ్చు. కానీ, దీనిని మనం ఎప్పటికప్పుడు ఉల్లఘింస్తూనే ఉంటాం.
మీరెప్పుడైనా ఏ పనీ చేయకుండా, సీలింగ్ వైపు చూస్తూ, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ గడపాలని కలలు కన్నారా?
ఇది వినడానికి అందంగా ఉంటుంది కానీ, అలా ఉండటం వలన ఎటువంటి ఆనందం ఉండదు. వర్జీనియా యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో కొంత మంది వ్యక్తులను ఫోన్, పుస్తకాలు, టీవీ లేని ఒక గదిలోకి పంపించి వారిపై అధ్యయనం చేశారు.
ఆ సమయంలో వారు ఏ పనీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. వారికి ఎలక్ట్రిక్ షాక్ తీసుకునేందుకు ఒక పరికరాన్ని అమర్చారు.
అక్కడ ఏమి జరిగింది ?

ఫొటో సోర్స్, Getty Images
వారికి, ఒక వేళ ఎలక్ట్రిక్ షాక్ తగలాలంటే ఏ స్విచ్ నొక్కాలో వివరించారు. ఒక్కసారి ప్రయత్నించాక రెండవ సారి ప్రయత్నించరని మీరనుకుంటే పొరపాటే.
అలా ఒంటరిగా ఉన్నప్పుడు 71 శాతం మంది పురుషులు, 25 శాతం మంది మహిళలు కనీసం ఒక్క సారన్నా ఎలక్ట్రిక్ షాక్ పెట్టుకున్నారు. ఒక వ్యక్తి అయితే కనీసం 190 సార్లు తనని తాను షాక్ కి గురి చేసుకున్నారు.
చాలా మంది వేరే ఆలోచనలు రాకుండా తమని తాము హింసించుకున్నారు.
కొన్ని సార్లు మనం పరిస్థితులను తేలికగా తీసుకుంటాం. కానీ, మనం ఎక్కువ శ్రమించాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు ఎక్కువ విలువిస్తాం.
ఈ ప్రయోగం ఒక ఉదాహరణ మాత్రమే.
కానీ, నిత్య జీవితంలో చాలా మంది తమకి అవసరం లేని పనులు చాలా చేస్తూ ఉంటారు.
మీ స్నేహితుల్లో మారథాన్ లలో పాల్గొన్న వారెవరైనా ఉంటే ఆరోగ్యం కోసం వారు చేయాల్సిన దాని కన్నా ఎక్కువే చేస్తున్నారని , మీరు గమనించే ఉంటారు.
మంచు పర్వతాలు అధిరోహించే వారు, భూ ధృవాలు చుట్టి వచ్చేవారు, ఈతతో ప్రపంచాన్ని చుట్టే వారి సంగతేమిటి?
కొన్ని సార్లు ప్రయత్నం తర్వాత వచ్చే ఆనందాన్ని షార్ట్ కట్లు ఇవ్వలేవు.
ఒక క్రాస్ వర్డ్ నింపడానికి ఒక్కొక్కసారి కొన్ని గంటల పాటు శ్రమిస్తాం, సెర్చ్ ఇంజన్ లో వెతికి పట్టుకోగలమని తెలిసినా.
దీనినే కష్టపడి నేర్చుకోవడం అని అంటాం.
టొరంటో యూనివర్సిటీ కి చెందిన మైకేల్ ఇంగ్లిక్ట్ దీనినే ప్రయత్నానికి వ్యతిరేకత అని అంటారు.
20 సంవత్సరాల క్రితం నేను యాత్రలు చేస్తున్నప్పుడు ఇండోనేషియాలో కొన్ని సరస్సుల తీరాలలో ఉండే సౌందర్యాన్ని అనుభవించాను.
మేమెంతో కష్టపడి అక్కడికి వెళ్లాల్సి రావడం వలన ఆ సరస్సుల సౌందర్యం నా జ్ఞాపకాలలో నిక్షిప్తమైపోయింది.
కొన్ని రోజుల పాటు బోటులో, బస్సు లో ప్రయాణించి వెళ్ళేవాళ్ళం.
పరిస్థితులు సరిగ్గా లేని ఒక హాస్టల్ లో బస చేసేవాళ్ళం. ఇండోనేషియా లో కెలిముటు దగ్గర ఉన్న సరస్సులు చూడటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది.
బాగా డబ్బున్న పర్యటకులు హెలికాఫ్టర్లలో వచ్చేవారు . కానీ, వారిని చూసి మేమెప్పుడూ అసూయ పడలేదు. మేము ఈ సరస్సుల సౌందర్యం ఆస్వాదించినంత వారు అనుభవించి ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో చాలా శిఖరాగ్రాలు కేబుల్ కారులో కానీ, చైర్ లిఫ్ట్ లో కానీ చేరవచ్చు.
కానీ, పర్వతారోహకులు, మంచు, చలికి ఓర్చుకుంటూ కష్టమైన మార్గం లోనే శిఖరాన్ని అధిరోహించాలని చూస్తారు.
ఇదంతా చూస్తే, మనం ఇంటి దగ్గర ఐసొలేషన్ లో ఉంటూ సోఫా లో కూర్చుని టీవీ చూడటం కేవలం రోజులో మనం సమయాన్ని గడపడంలో ఒక్క భాగం మాత్రమే.
కొన్ని వారాల పాటు బద్ధకంగా గడపడం సరదాగా అనిపించినా , అలా ఉండటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
మనం అనారోగ్యంగా ఉంటే తప్ప బలవంతంగా, నిర్బంధంగా విశ్రాంతి తీసుకోవడం వలన విశ్రాంతి దొరకడం మాట అటుంచి, చికాకు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
లాక్ డౌన్ లో సమతుల్యత పాటించడానికి మనమే ఒక మార్గాన్ని ఎంచుకోవాలి.
వ్యాయామం చేయడం, నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకోవడం, కష్టమైన పనులు చేయడం కూడా చాలా ముఖ్యమే.
పెయింటింగ్, తోట పని, ఆటలు, చేయడం లాంటివి చేస్తే సమయం వేగంగా గడిచిపోతుందని మానసిక నిపుణులు మిహాలీ తన పుస్తకం ‘ది సైకాలజీ ఆఫ్ ఆప్టిమల్ ఎక్స్పీరియన్స్’ లో రాశారు.
సాధారణంగా మనలో చాలా మంది శరీరానికి అవసరమైనంత విశ్రాన్తి తీసుకోరు. లాక్ డౌన్ సమయాల్లో విశ్రాంతి తీసుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
అలా అని, ఈ సమయంలో మనం మరింత బద్ధకంగా తయారవ్వకూడదు.
ఇవి కూడా చదవండి:
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- మే డే: కార్మికులు ఏ దేశాల్లో ఎక్కువ సేపు పనిచేస్తున్నారు?
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








