రైతు బంధు ఎవరికి చేరుతోంది? కేసీఆర్ ప్రభుత్వం సీలింగ్ ఎందుకు పెట్టడం లేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అబినాష్ కంది
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. కరోనావైరస్ సంక్షోభంతో ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేసింది.
వానాకాలం కోసం రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున వారికి ఉన్న భూమిని బట్టి డబ్బులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 54.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ.6,889 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.
రైతు బంధును స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం తెచ్చింది. కేంద్రం ఇచ్చే సాయానికి మరికొంత కలిపి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పేరుతో దీన్ని అమలు చేస్తోంది.
అయితే, ఈ పథకాలకు తెలంగాణలోని రైతు బంధుకు మధ్య ఓ ప్రధానమైన తేడా ఉంది. అదే, సీలింగ్.

ఫొటో సోర్స్, KALVAKUNTLACHANDRASHEKARRAO/FB
ఎంత భూమి ఉంటే అంత భూమికీ...
కిసాన్ సమ్మాన్ నిధి కింద ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదిలో గరిష్ఠంగా రూ.6వేలు ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిమాణంతో సంబంధం లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి కింద వచ్చే రూ.6వేలకు అదనంగా మరో రూ.7,500, అంటే మొత్తంగా రూ.13,500 అందుతున్నాయి.
తెలంగాణలో రైతు బంధు కింద ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నారు. దీనిపై సీలింగ్ లేదు. భూ పరిమాణం ఎంత ఉంటే, అంత మొత్తానికీ ఆ భూ యజమాని రైతు బంధు కింద పెట్టుబడి సాయం పొందవచ్చు.
తెలంగాణలోని భూ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పేరిట గరిష్ఠంగా 51 ఎకరాల వరకూ వ్యవసాయ భూమి, 21 ఎకరాల వరకూ బీడు భూమి ఉండొచ్చు.
ఈ లెక్కన 51 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న వ్యక్తి ఖాతాలో రైతు బంధు కింద ఏడాదికి రూ. 5,10,000 పెట్టుబడి సాయం పడుతుంది.

ఫొటో సోర్స్, facebook/maheshBabu
లబ్ధిదారుల్లో మంత్రులు, సినీ ప్రముఖులు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులకు, వ్యవసాయాన్ని మానేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నవారికి, విదేశాల్లో ఉంటున్నవారికి కూడా రైతు బంధు ద్వారా లబ్ధి జరుగుతోంది.
వారి పేరిట వ్యవసాయ భూమి ఉండటమే ఇందుకు కారణం.
సినీ నటుడు మహేశ్ బాబు కుటుంబానికి కూడా రైతు బంధు కింద ఇదివరకు చెక్కులు వచ్చాయి. వాటిని తిరిగి వాళ్లు ప్రభుత్వానికి అందజేశారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
కౌలుకు ఇచ్చిన భూములపై రైతు బంధు కింద సాయం పొందుతున్నవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.
''ఊళ్లో మాకు వ్యవసాయ భూమి ఉంది. కానీ, మేం వ్యవసాయం మానేసి, చాలా రోజులైంది. కొన్నేళ్లుగా భూమిని కౌలుకు ఇస్తున్నాం. రైతు బంధు కింద మాకు డబ్బులు జమ అవుతున్నాయి. వాటిని ఎందుకు వద్దనుకుంటాం?'' అని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, krgreddy/fb
'అసలు రైతులను వదిలేశారు': కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రైతు బంధు కింద లాభం పొందుతున్నవారిలో ఎక్కువ మంది అసలు రైతులే కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీబీసీతో అన్నారు.
నిజంగా వ్యవసాయం చేసేవారిని వదిలేసి, భూస్వాములకు ప్రభుత్వం ఈ పథకంతో లాభం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదివరకు రైతు బంధు కింద తన కుటుంబానికి కూడా రూ.3 లక్షలు వచ్చాయని, తనలా ఆర్థికంగా బాగున్నవారికి ప్రభుత్వ సాయం ఎందుకని రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాజాగా మళ్లీ తమకు రైతు బంధు కింద డబ్బులు వచ్చాయని ఆయన బీబీసీతో చెప్పారు.
''నా భార్య పేరిట దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని మేం కౌలుకు ఇచ్చాం. మాకు రూ.1.9లక్షలు రైతు బంధు కింద ఇచ్చారు. క్రితం సారే దీని గురించి నేను అసెంబ్లీలో ప్రశ్నించా. నాకు అందిన డబ్బును పేద రైతులకు పంచాను. మళ్లీ వచ్చాయి. నా లాంటి వారికి ప్రభుత్వం సాయం చేయడం అవసరమా? అసలు రైతు బంధు కింద లబ్ధి పొందుతున్నవారిలో ఎక్కువ మంది రైతులే కాదు. భూములు కౌలుకు ఇచ్చి, పట్టణాల్లో ఉంటున్నవారే ఎక్కువగా ఉన్నారు'' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఖాతాల్లో డబ్బులు వేస్తూ రైతులను భిక్షగాళ్లలా చూడటానికి బదులు, వారికి నిజంగా చేయూతనిచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేద, చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
''రైతు బంధు పేరిట ఏటా రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే డబ్బుతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వండి. సబ్సిడీపై ఎరువులు ఇవ్వండి. పంటలకు మద్దతు ధర కల్పించండి. ఈ మూడు పనులు చేస్తే, అసలు రైతులు బాగుపడతారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే, వ్యవసాయం వదిలేసినవాళ్ల జేబులు నిండుతాయి'' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SINGIREDDY NIRANJANREDDY
'స్వచ్ఛందంగా వదులుకోవచ్చు, సీలింగ్ ఆలోచన లేదు'
రైతు బంధు మొదలైన తర్వాత కొందరు రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆ పథకం కింద తమకు వచ్చిన చెక్కులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు.
అయితే, రానురానూ అలా ప్రభుత్వ సాయాన్ని వెనక్కి ఇస్తున్నవారి సంఖ్య తగ్గిపోతూ వస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
అవసరం లేని వారు స్వచ్ఛందంగా రైతు బంధు లబ్ధిని వదులుకునే ప్రక్రియను కూడా ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో సూచించింది.
'గివ్ అప్' పేరుతో ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించింది.
అవసరం లేని వారికి సాయాన్ని నిలిపివేసే అవకాశం ప్రభుత్వం దగ్గరే ఉన్నప్పుడు ఇంత ప్రయాస ఎందుకని విమర్శలు వస్తున్నాయి.
రైతు బంధుపై కొన్ని ఎకరాల వరకూ పరిమితి పెట్టి, ఆ మేరకే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి.
అయితే, సీలింగ్ ప్రతిపాదనపై ముందు నుంచీ తెలంగాణ ప్రభుత్వం విముఖతతో ఉంది.
సీలింగ్ పెట్టే యోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
వ్యవసాయ భూమి నిరుపయోగంగా ఉండకూడదని, ప్రతి ఎకరమూ సాగులోకి రావాలన్న ఉద్దేశంతోనే సీలింగ్ పెట్టడం లేదని ఆయన అన్నారు.
ప్రభావం ఏంటి?
తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక-2017 ప్రకారం తెలంగాణలో రెండు హెక్టార్ల (సుమారు ఐదు ఎకరాల) కుపైగా వ్యవసాయ భూమి ఉన్నవాళ్లు 14.2%. వీరి ఆధీనంలో 44.6% వ్యవసాయ భూమి ఉంది.
ఈ లెక్కన ఈ 14.2% మందికి రైతు బంధు కింద వచ్చే సాయంలో 44.6% వాటా అందుతుందన్న మాట. మిగతా 55.4% వాటాను 85.8% మంది పంచుకోవాలి.
నాలుగు హెక్టార్ల (సుమారు పది ఎకరాల)కు మించి భూమి ఉన్నవారు 3.3% మంది ఉన్నారు. వీరి ఆధీనంలో 19% భూమి ఉంది. అంటే, రైతు బంధు సాయంలో 19% వాటా వీరికే వెళ్తుంది.
ఈ నివేదికను 2010-11 వ్యవసాయ సెన్సెస్ ప్రకారం రూపొందించారు. కాబట్టి, ఇప్పుడు గణాంకాలు మారిపోయి ఉండొచ్చు.
కానీ, తక్కువ భూమి కలిగిన వారి కన్నా ఎక్కువ భూమి కలిగినవారు ప్రభుత్వ సాయంలో ఎక్కువ వాటా పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
'అసమానతలను విస్మరించారు'
భూ యాజమాన్యం విషయంలో ఉన్న అసమానతలే సమాజంలోని అసమానతలకు మూలమని, రైతు బంధు సాయం విషయంలో ఈ అసమానతలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకుడు విస్సా కిరణ్ అన్నారు.
''భూమి కొన్ని కులాల దగ్గర పోగుపడింది. స్వాతంత్ర్యం వచ్చాక అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొంతవరకూ అవి సఫలమయ్యాయి. అయితే, రైతు బంధులో పాటిస్తున్న పద్ధతి మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. తక్కువ భూమి ఉన్నవారికి తక్కువ లబ్ధి, ఎక్కువ భూమి ఉన్నవారికి ఎక్కువ లబ్ధి చేకూరేలా విధానం పెట్టారు. దీని వల్ల అసమానతలు మరింత పెరుగుతాయి'' అని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ భూమి అంతా సాగులోకి తీసుకురావడం కోసం సీలింగ్ విధించట్లేదన్న ప్రభుత్వ వాదనను కూడా కిరణ్ తప్పుపట్టారు.
''మొత్తం భూమి సాగులోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న సాయమైతే, నిజంగా సాగు చేస్తున్నవారికి అందించాలి. కౌలు రైతులకు ఇవ్వాలి. కేవలం భూ యజమానులు అన్న కారణంతో ఇవ్వకూడదు. సీలింగ్ తప్పకుండా అవసరమే. శ్లాబులు కూడా పెట్టవచ్చు. ఐదు ఎకరాల వరకూ ఎకరానికి రూ. 10,000 చొప్పున, ఐదు నుంచి పది ఎకరాలకు రూ. 5,000 చొప్పున సాయం ఇవ్వొచ్చు'' అని అన్నారు.
సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కౌలు రైతులను ప్రభుత్వం రైతు బంధు నుంచి పక్కనపెట్టిందని కిరణ్ అన్నారు.
''కౌలు రైతులకు కనీసం పరోక్షంగానైనా లాభం కలగడం లేదు. రైతు బంధు డబ్బులు వస్తున్నాయని ఏ భూ యజమానీ కౌలు తగ్గించడం లేదు. కౌలుకు ఇచ్చిన భూములకు రైతు బంధు ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్పి ఉంటే, కనీసం ఆ భయంతోనైనా వారికి కాస్త మేలు జరిగేది. కానీ, భూమి ఉన్నవారికే డబ్బులు అన్నట్లుగా కేసీఆర్ చాలా సార్లు మాట్లాడారు'' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- జులై 1 నుంచి ఏమేం తెరుచుకుంటాయి, ఏమేం మూతపడనున్నాయి
- టిక్‌టాక్, హలో, షేరిట్, కామ్ స్కానర్ సహా 59 చైనా యాప్‌లపై భారత్ నిషేధం.. నిషేధించిన యాప్‌ల జాబితా ఇదీ
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










