అన్‌లాక్ 2: జులై 1 నుంచి ఏమేం తెరుచుకుంటాయి, ఏమేం మూతపడనున్నాయి

రైలు ప్రయాణాలు

ఫొటో సోర్స్, BISHWARANJAN MISHRA

అన్‌లాక్ 2 కింద కంటైన్‌మెంట్ జోన్స్ మినహా, మిగతా ప్రాంతాల్లో ఇంతకు ముందు కంటే ఎక్కువ సడలింపులు ఇవ్వడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గనిర్దేశకాలు విడుదల చేసింది.

కరోనా సంక్షోభంతో అమలు చేసిన లాక్‌డౌన్‌ నుంచి ఇంతకు ముందు అన్‌లాక్ 1 కింద సడలింపులు ఇచ్చారు.

అన్‌లాక్ 2.0లో ప్రధాన అంశాలు

  • దేశీయ విమాన సేవలను ఇంతకు ముందే పరిమిత సంఖ్యలో ప్రారంభించారు. కానీ, ఇప్పుడు వాటిని మరింత విస్తరిస్తారు.
  • నైట్ కర్ఫ్యూలో సడలింపులు ఇచ్చారు. ఇక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుంది. రాత్రిళ్లు పారిశ్రామిక విభాగాలు, అవసరమైన వస్తువులు తీసుకువెళ్లే వాహనాలు, రైళ్లు, విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతిస్తారు.
  • షాపులు తమకు అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఒకేసారి ఐదు, అంతకంటే ఎక్కువ మందిని లోపలికి అనుమతించవచ్చు. కానీ వినియోగదారులు తగిన శారీరక దూరం పాటించాల్సి ఉంటుంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలు జులై 15 నుంచి తెరుచుకుంటాయి. దీనికి సంబంధించి విడిగా విస్తృత మార్గదర్శకాలు విడుదల చేశారు.
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించిన తర్వాత స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లను జులై 31 వరకూ మూసి ఉంచాలని నిర్ణయించారు.
  • 'వందే భారత్ మిషన్' కింద అంతర్జాతీయ విమాన ప్రయాణాలను పరిమిత సంఖ్యలో ప్రారంభించారు. ఇప్పుడు దానిని ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తారు.
ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

వీటిపై ఇంకా నిషేధం

కంటైన్‌మెంట్ జోన్స్ బయట, దిగువ ఇచ్చిన అన్ని కార్యకాలాపాలపై నిషేధం ఉంటుంది. మిగతావి కొనసాగుతాయి.

1. మెట్రో రైళ్లు

2.సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్ లాంటి ఇతర ప్రాంతాలు.

3. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, అకడమిక్, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, మిగతా భారీ సంబరాలు.

పరిస్థితిని అంచనా వేసిన తర్వాత వీటన్నిటినీ ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనేది ప్రత్యేకంగా నిర్ణయిస్తారు.

జులై 31 వరకూ కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుంది. కంటైన్‌మెంట్ జోన్ కాని ప్రాంతాల్లో సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.

పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కంటైన్‌మెంట్ బయట కూడా కొన్ని కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు.

అయితే, రాష్ట్రాల్లో, లేదా వేరు వేరు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు లేదా వస్తువుల రవాణాపై ఎలాంటి నిషేధం ఉండదు. ఇలాంటి రాకపోకల కోసం ప్రత్యేక అనుమతులు లేదా ఈ-పర్మిట్ అవసరం లేదు.

ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)