విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: పాడైపోయిన ఆకు కూరలు, కూరగాయలు.. సాగు నష్టపోయిన 400 రైతు కుటుంబాలు

- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ ప్రతినిధి
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన సమీప ప్రజలపైనే కాదు స్థానిక వ్యవసాయంపై కూడా తీవ్రంగా పడింది. చేతికొచ్చిన పంటను నేలపాలు చెయ్యాల్సిన దుస్థితి కల్పించింది.
గ్యాస్ లీకేజీ బాధితులను ఆదుకున్న ప్రభుత్వం చుట్టు పక్కల సాగు మీదే ఆధారపడ్డ చిన్న, సన్న కారు రైతుల విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు.
స్టైరీన్ ప్రభావం ఆయా గ్రామాల్లో సాగు చేసే కూరగాయలు, ఆకు కూరలు, చెరువుల్లోని చేపలు, పశువుల పాలపై కూడా ఉంటుందని, కాబట్టి వాటిని తినొద్దు, తాగొద్దని చాటింపు వేసిన అధికారులు, దానివల్ల ఉపాధి, ఆదాయం కోల్పోయిన రైతులపై పడిన ప్రభావాన్ని మాత్రం పట్టించుకోలేదు.
400 కుటుంబాలకు ఉపాధి
ఎల్జీ పాలిమర్స్‌ను ఆనుకొని ఉన్న వెంకటాపురం, కంపరపాలెం, పద్మనాభనగర్, నందమూరి నగర్ గ్రామాలతో పాటుగా పెందుర్తి, నియోజకవర్గ పరిధిలోని పొర్లుపాలెం, లక్ష్మీపురం, చీమలాపల్లి, చింతల అగ్రహారం తదితర గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాల్లో రైతులు పశుగ్రాసం, ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్నారు.
విశాఖ నగరానికి వస్తున్నఆకుకూరల్లో దాదాపు 20 శాతంకు పైగా ఈ ప్రాంతాల నుంచే సరఫరా అవుతాయి. కూరగాయలు, ఆకు కూరల సాగుపై దాదాపు 400 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారిలో చాలా మందికి అర ఎకరం నుంచి మూడు ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే.

మహిళా రైతులే ఎక్కువ
గతంలో 1977లో మేఘాద్రి గడ్డ నిర్మించే సమయంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఆ తరువాత, రైల్వే ట్రాక్ నిర్మించే సమయంలో కూడా మరి కొందరు రైతుల నుంచి భూములను సేకరించారు.
ఇలా చాలా అవసరాలకు పోగా రైల్వే ట్రాక్‌కు, మేఘాద్రి గడ్డకు మధ్య ఉన్న కొద్దిపాటి భూములే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని పురుషులు ఇతర పనులకు వెళుతుండగా, మహిళలే ఆకు కూరలు, కూరగాయల సాగు చేస్తున్నారు.
తాజాగా జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో వెలువడిన స్టైరీన్ గ్యాస్ ప్రభావం వల్ల చాలా వరకు పంటలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి.
ఆకు కూరలు నల్లగా మాడిపోగా, మునగ, బీర, ముల్లంగి, సొరకాయ వంటి పంటలు పూర్తిగా పాడయ్యాయి. దీంతో పనికి రాకుండా పోయిన ఆ పంటల్ని తీసేసి మళ్లీ నారు పోస్తున్నారు.
కూరగాయలు, ఆకు కూరలు కొనొద్దని చాటింపు వేయించిన అధికారులు
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీలో విడుదలైన స్టైరీన్ వాయువు ప్రభావం దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉంటుందని జీవీఎంసీ అధికారులు అంచనా వేశారు. అందువల్ల ఫ్యాక్టరీకి 5 కిలోమీటర్ల పరిధిలో పండించిన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని జీవీఎంసీ అధికారులు స్థానిక గ్రామాల్లో చాటింపు వేయించారు.
అలాగే ఆయా గ్రామాలనుంచి సరఫరా అయ్యే పాలను, మేఘాద్రి గడ్డలోని నీటిని కూడా నెల రోజుల పాటు ఉపయోగించవద్దని అధికారులు స్పష్టం చేశారు.
చివరకు మేఘాద్రి గడ్డలోని చేపల్ని తిన్నా ప్రస్తుతం ప్రమాదమేనని హెచ్చరించారు. మేఘాద్రి గడ్డ నీటి శాంపిల్స్‌ను నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్(NEERI)కు పంపించారు.
మరోవైపు గ్యాస్ ప్రభావం వల్ల ఎల్జీ పాలిమర్స్‌ను ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పశువులకు కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి నెల కొని ఉంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి
ఇప్పుడు ఆయా గ్రామాల్లో ఏ రైతును కదిపినా కన్నీటి కథలే వినిపిస్తాయి. వారిలో మెజార్టీ రైతుల పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వేల రూపాయలు నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో మడికి సుమారు పది వేలు పెట్టుబడి పెట్టామని, పంట చేతికొస్తోందనుకుంటున్న సమయంలో ఇలా జరిగిందని దేవుడమ్మ అనే మహిళా రైతు బీబీసీతో అన్నారు.
“కంపెనీ నుంచి వచ్చిన గ్యాస్ వల్ల మా పంటలు అన్నీ పోనాయి, ఆకుకూరలు మాడిపోయినాయి. పోనీ ఉన్నవైనా శుభ్రంగా మార్కెట్‌కు అట్టికెల్లి అమ్ముదామంటే ఏ ఒక్కలూ కొనడం లేదు. ఒక్కో మాలకు (అర ఎకరం మడి) పదేసి వేలు పెట్టుబడి ఎట్టాము. నాను రెండు మాలలు ఆకుకూరలు సాగు సేత్తాను. పెట్టిన పెట్టుబడంతా పోనాది. ఇప్పుడు దాన్ని గోకేస్తన్నము. మళ్లీ పెట్టుబడి పెట్టాలి. ఇంత వరకూ ఏ అధికారులు ఇక్కడకు రాలేదు మా గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు” అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.
వెంకటాపురం గ్యాస్ లీక్ ప్రమాదం వల్ల తమ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా పోయిందని నాగమణి అనే మహిళా రైతు బీబీసీతో అన్నారు.
“పూర్ణామార్కెట్‌కు, రైతు బజార్లకు తీసుకెళ్లినా పోర్లుపాలెం కూరగాయలు అంటే ఎవ్వరూ కొనడంలేదు. ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాల పరిసరాల్లో పండిన కూరగాయలు ఏవీ కొనేది లేదని చెబుతున్నారు. రోజూ తీసుకెళ్లడం ఏ ఒక్కరూ కొనకపోవడంతో ఎక్కడో ఒక చోట వాటిని పడేసి వస్తున్నాం. మా ఊరు అంతా ఈ ఆకుకూరల మీదనే ఆధారపడి బతుకుతున్నాం. రెండో ఆదరువు (వేరే పని) ఏం లేదు. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి కూడా రూపాయి లేదు. అన్ని గోకి పాడేస్తున్నం. ఈ కరోనా ప్రభావంతో అసలే ధరలు లేవు అనుకుంటే ఇప్పుడు ఇదొకటి . ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. కనీసం విత్తనాలకైనా సాయం చేస్తే మళ్లీ వ్యవసాయం చేస్తాం” అని నాగ మణి అన్నారు.
ముత్యాలమ్మ అనే మహిళ మాట్లాడుతూ “మేఘాద్రి గడ్డ పక్కనే పంటలు పండిస్తున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే మమ్మల్ని కూడా ఊరు నుంచి తరలించారు. మూడు రోజుల తరువాత వచ్చి చూస్తే మేం పడించిన ఆకుకూరలను ఎక్కడా అమ్మకూడదని చెప్పారు. దీంతో ఎవ్వరూ మేం పడించిన పంటల్ని కొనడం లేదు. ఒక్కొక్కరం రూ.10 నుంచి రూ.15 వేల పెట్టుబడిని పెట్టాం. ప్రభుత్వమే ఆదుకోవాలి” అని ఆమె కోరారు.
“నాను నాలుగు మడులు సెత్తన్నా. గ్యాస్ లీసేజీ వల్ల మొత్తం పోనాది. దాన్ని గోకేసి పాడేసినాము. ముప్పై ఏల్లుగా ఎవసాయం సేత్తన్నా. ఏదో రూపంలో మా భూముల్లో కొంత ప్రభుత్వానికి, మరి కొంత ఫ్యాక్టరీలకు ఇచ్చేసినాం. ఇప్పుడు ఉన్నవాటిలోనే ఎవసాయం చేస్తున్నాం. ఇప్పుడు మేం పండించిన పంటను ఎవ్వరూ కొనవద్దని చెబుతున్నారు. రూ.30-40 వేలు పెట్టినాను. అంతా పోనాది” అని రామప్ప అనే మరో రైతు బీబీసీకి వివరించారు.

పంట నష్టం గురించి పట్టించుకోని ప్రభుత్వం!
ఈ నెల 8వ తేదీన విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.10 లక్షలు, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వల్ల ప్రభావితమైన 5 గ్రామాల్లో మనిషికి రూ.10 వేల చొప్పున జమ చేసింది ప్రభుత్వం.
కానీ పంట నష్టం ఎంత జరిగింది అన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అంచనాలు వెయ్యలేదు. ఈ విషయం గురించి పెందుర్తి ఎమ్మార్వో, జీవీఎంసీ కమీషనర్‌లతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు.
సాగు దెబ్బతిన్న రైతుల విషయంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌ను సంప్రదించగా.. ‘‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఇప్పుడు దీనిపై నేను స్పందించను’’ అన్నారు.
ప్రస్తుతం నష్టాన్ని భరిస్తూనే అప్పులు చేసి మరీ మరో పంట వేసేందుకు సిద్ధపడుతున్నారు రైతులు. సాధారణంగా ఆకు కూరలు నెల రోజుల్లోనే అందుబాటులోకి వస్తాయి. ఈ నెల రోజుల్లోగా ప్రభుత్వం ఏ సాయమైనా చెయ్యకపోతుందా అన్నది వాళ్ల ఆశ.
ప్రభుత్వం తరపున రైతులకు సాయం చేస్తాం - పెందుర్తి ఎమ్మెల్యే
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇంకా అందలేని మాట వాస్తవమే అన్నారు పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజ్. బీబీసీతో ఆయన మాట్లాడుతూ.. పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ఒక్కో వ్యక్తికి 10 వేల రూపాయల సాయం ఇప్పటికే అందించామని తెలిపారు. కానీ, ఎల్జీ పాలిమర్స్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లోని భూముల్లో పండించి పంటలను వాడొద్దని కమిటీ రిపోర్టు ఇవ్వడం వల్ల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ముఖ్యంగా లక్ష్మీపురం, పొర్లుపాలెం, గవర పాలెం కాలనీ, చింతల అగ్రహారం తదితర గ్రామాలకు చెందిన రైతులు నష్టపోయారని, వీరిని ప్రభుత్వం వైపు నుంచి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల విషయాన్ని ఇప్పటికే జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ దృష్టికి తీసుకు వెళ్లామని, కచ్చితంగా రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి
- భోపాల్ నుంచి వైజాగ్ ఎల్జీ పాలిమర్ వరకు... ప్రాణాలు తీస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులను పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలను వేధిస్తున్న ప్రశ్న
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనా లాక్డౌన్: రాయలసీమ నుంచి వేలాది వలస కార్మికుల రైలు ప్రయాణం
- లాక్డౌన్: రాత్రింబవళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎందుకు చూస్తాం.. టీవీకి ఎందుకు అతుక్కుపోతాం
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- వీడియో, రానా పెళ్లి కుదిరింది.. లాక్డౌన్ సమయంలో మా కుటుంబానికి శుభవార్త : ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో దగ్గుబాటి సురేశ్ బాబు, 13,28
- ‘పొట్టి పిచ్చుక పొట్ట నిండా ప్లాస్టిక్ ముక్కలే’
- కరోనావైరస్ సెకండ్ వేవ్: ఆసియా దేశాల నుంచి ప్రపంచ దేశాలు ఏం నేర్చుకోవాలి
- ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








