కాలుష్యం: ‘పొట్టి పిచ్చుక పొట్ట నిండా ప్లాస్టిక్ ముక్కలే’

ఫొటో సోర్స్, Charles Tyler
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ పర్యావరణ రంగ ప్రతినిధి
నదీ తీరాల్లో నివసిస్తున్న పక్షుల కడుపులోకి ప్రతి రోజూ సూక్ష్మమైన ప్లాస్టిక్ ముక్కలు వందలాదిగా చేరుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి చెప్తోంది.
నదుల్లో ప్లాస్టిక్ కాలుష్యాలు వన్యప్రాణుల్లోకి చేరుతూ ఆహార గొలుసులో పైకి వెళుతున్నాయనేందుకు ఇది తొలి స్పష్టమైన ఆధారమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఐదు మిల్లీమీటర్లు, అంతకన్నా తక్కువ పరిమాణంలోని పాలియస్టర్, పాలీప్రొపీలీన్, నైలాన్ సహా ప్లాస్టిక్ ముక్కలు (సూక్ష్మ ప్లాస్టిక్‌లు) నదులను కలుషితం చేస్తున్నాయి.
వీటిని తింటున్న వన్యప్రాణుల మీద ఆ ప్రభావం ఎలా ఉందనే అంశంపై స్పష్టత లేదు.
కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు.. డిప్పర్ అనే )పిచ్చుక తరహా) పక్షిలో కనిపించిన ప్లాస్టిక్ కలుషితాలను పరిశీలించారు. ఆ పక్షి ఆహారం కోసం నీటి అడుగున ఉండే క్రిములను వెదుకుతూ నదుల్లో మునుగుతూ ఉంటుంది.

‘‘ఈ డిప్పర్ల కడుపులోకి ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్లాస్టిక్ ముక్కలు చేరుతున్నాయి. అవి ఆ పదార్థాలను తమ పిల్లలకు కూడా తినిపిస్తున్నాయి’’ అని కార్డిఫ్ యూనివర్సిటీలోని వాటర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ స్టీవ్ ఆర్మెరాడ్ చెప్పారు.
వేల్స్ దక్షిణ ప్రాంతంలో గల నదుల్లో గల క్రిముల్లో దాదాపు సగం వాటిలో సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు గత పరిశోధనలో వెల్లడైంది.
‘‘నదీ క్రిముల్లో ఇంత పెద్ద ఎత్తున ప్లాస్టిక్ కాలుష్యం ఉండటం వల్ల.. ఈ కాలుష్యభరిత క్రిములను తినే చేపలు, పక్షులు, ఇతర జీవుల్లోకీ అవి చేరక తప్పదు. కానీ.. స్వేచ్ఛగా జీవించే నదీ వన్యప్రాణుల్లో ఆహారం ద్వారా ఈ రకమైన బదిలీ విస్పష్టంగా కనిపించటం ఇదే మొదటిసారి’’ అని సహ పరిశోధకుడు డాక్టర్ జోసెఫ్ డిసౌజా పేర్కొన్నారు.
బ్రెకాన్ బీకన్స్ నుంచి సెవర్న్ ఈస్టరీ వరకూ ఉన్న నదీ తీరాల సమీపంలో నివసించే డిప్పర్ పక్షుల రెట్టలను, అవి పొట్టలో నుంచి వెలికి తీసిన ఆహారపు తునకలను పరిశోధకుల బృందం పరీక్షించింది.
వీరు 15 ప్రాంతాల నుంచి 166 పెద్ద పక్షులు, గూళ్లలోనే ఉన్న పిల్ల పక్షులకు సంబంధించిన నమూనాలను పరీక్షించారు. అందులో దాదాపు సగం పక్షుల్లో సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 14 ప్రాంతాలకు చెందిన పక్షుల నమూనాల్లో ఇవి కనిపించాయి.
అయితే.. పట్టణ ప్రాంతాలకు చెందిన పక్షుల నమూనాల్లో ఈ ప్లాస్టిక్ కాలుష్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కాలుష్యల్లో అధికభాగం.. దుస్తుల నుంచి, భవన నిర్మాణ పదార్థాల నుంచి వెలువడిన ఫైబర్లే అధికంగా ఉన్నాయి.
డిప్పర్ల కడుపులోకి ప్రతి రోజూ అవి తినే పురుగుల నుంచి సుమారు 200 సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలు చేరుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
సముద్ర అఖాతాల్లో సైతం సూక్ష్మప్లాస్టిక్‌లు ఉన్నాయని, అవి సీల్ నుంచి పీతలు, సముద్ర పక్షుల వరకూ అన్ని జీవాల శరీరాల్లోకీ చేరుతున్నాయని గత అధ్యయనాల్లో వెల్లడైంది.
సింథటిక్ దుస్తుల ఫైబర్లు, టైర్ల ధూళి తదితర ప్లాస్టిక్ వ్యర్థాల ముక్కలు భూమి నుంచి సముద్రాల్లోకి ప్రయాణించటానికి నదులు ప్రధాన మార్గాలుగా ఉన్నాయి.
గ్లోబల్ చేంజ్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధనను.. గ్రీన్‌పీస్ రీసెర్చ్ లేబరేటరీస్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్సిటర్‌లతో కలిసి నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
- మహాసముద్రాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది
- అక్కడ సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఏడు రెట్లు ఎక్కువ
- ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే
- ఆర్కిటిక్ కాలుష్యం: స్వచ్ఛమైన మంచు ఖండంలో ప్లాస్టిక్ విష పదార్థాలా...
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- 'మా పంటలు పోయినట్టే... ఇంకా ఇక్కన్నే ఉంటే మనుషులం కూడా పోయేట్టున్నాం'
- గ్లోబల్ వార్మింగ్ వెనుక ఉన్న డర్టీ సీక్రెట్ ఇదే
- ఆర్కిటిక్ కాలుష్యం: స్వచ్ఛమైన మంచు ఖండంలో ప్లాస్టిక్ విష పదార్థాలా...
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఇండియా లాక్డౌన్: వైజాగ్, కోల్‌కతా మినహా దేశమంతా విమాన సర్వీసులు... ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలేంటంటే?
- కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా? శాఖాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








