కడప యురేనియం ప్రాజెక్టు: 'మా పంటలు పోయినట్టే... ఎక్కువ రోజులిక్కన్నే ఉంటే మనుషులం కూడా పోయేట్టున్నాం'

    • రచయిత, డి.ఎల్.నరసింహ
    • హోదా, బీబీసీ కోసం

"ఇక్కడ యురేనియం ఫ్యాక్టరీ పెట్టకముందు వానలు కురిసినప్పుడో.. బోర్లలో నీళ్లతోనో ఏదోరకంగా పంటలు పండించుకునేటోళ్లం. దానికితోడు పశువులు, జీవాలు పెట్టుకొని ఏదోరకంగా బతికేవాళ్లం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మూలంగా నీళ్లు కలుషితమైనాయి. భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోయినాయి. లక్షలు ఖర్చుపెట్టినా దిగుబడులు రావడంల్యా.

కడప యురేనియం ప్రాజెక్టు

మూడెకరాల్లో ఎదిగిన అరిటిచెట్లు వేళ్లు కుళ్లిపోయి నిలువునా కూలిపోయినాయి. నా ఒళ్లుమీద చూడండి సార్ గడ్డలు.. కురుపులు వస్తన్నాయి. వారానికోసారి డాక్టర్లొచ్చి ఏవో రెండు మాత్తర్లిచ్చి పోతారుగానీ దానివల్ల మాకేమీ ఉపయోగముండడంలేదు.

అందరూ వచ్చేటోళ్లు.. పోయేటోళ్లేగాని మా గురించి ఎవరూ పట్టిచ్చుకోవడంలేదు. ఊళ్లో శానామందికి ఇట్నే వస్తన్నాయి. దద్దుర్లు, నవ్వలతో అల్లాడిపోతన్నాం. మా బతుకులు ఘోరంగా తయారైనాయి. ఎక్కువరోజులిక్కన్నే ఉంటే పంటలు పోయినట్టే మనుషులం కూడా పోయేట్టున్నాం సార్."

ఇది కడప జిల్లాలోని వేముల మండలం కె.కె.కొట్టాల గ్రామానికి చెందిన కొట్టే రాయుడు అనే రైతు ఆవేదన. యురేనియం శుద్ధి కర్మాగారం పరిధిలో ఉన్న గ్రామమిది.

కడప యురేనియం ప్రాజెక్టు

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. యురేనియం తవ్వకాలవల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ప్రజాసంఘాలు, మేధావులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ పరిధిలోని నల్లమలలో యురేనియం అన్వేషణకు జారీచేసిన అనుమతులు రద్దుచేసి గిరిజనులు, వన్యప్రాణులకు ఆవాసమైన నల్లమలను కాపాడాలని "సేవ్ నల్లమల" పేరుతో అటు సోషల్ మీడియాలోనూ యూజర్లు భారీగా పోస్టులు పెడుతున్నారు. కడపజిల్లాలోని యురేనియం ప్లాంటును మూసివేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో యురేనియం అన్వేషణ కోసం బోర్లు వేస్తుండటంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కడపజిల్లాలో గత పన్నెండేళ్లుగా కొనసాగుతున్న యురేనియం శుద్ధి కర్మాగార పరిసరప్రాంతాలు ఎలా ఉన్నాయి? అక్కడి ప్రజల అభిప్రాయమేంటి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

కడప యురేనియం ప్రాజెక్టు

రాయుడు నివసిస్తున్న ఈ కె.కె.కొట్టాల గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని తుమ్మలపల్లిలో 2007లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్ ) యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ భూగర్భం నుంచి ముడి ఖనిజాన్ని వెలికితీసి శుద్ధి చేస్తుంది. ఈ కర్మాగారం నుంచి వచ్చే వ్యర్థాలను నింపేందుకు కొట్టాల గ్రామానికి అర కిలోమీటరు దూరంలోనే టెయిలింగ్ పాండును నిర్మించింది.

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 30-8-2019న నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం.. ఈ కర్మాగారంలో సంవత్సరానికి తొమ్మిది లక్షల టన్నుల యురేనియం ధాతువును వెలికితీస్తున్నారు. దీన్ని శుద్ధి చేయటం ద్వారా సంవత్సరానికి 256.4 టన్నుల సోడియం డై యురనేట్ ఉత్పత్తి అవుతోంది. దీనితోపాటు 29,187 టన్నుల సోడియం సల్ఫేట్ కూడా ఉత్పత్తి అవుతోంది. ఈ సోడియం సల్ఫేటును ప్రస్తుతం కర్మాగార ప్రాంగణంలోనే నిల్వ చేస్తోంది యూసీఐఎల్.

అయితే, రాయుడు వంటి అనేకమంది గ్రామస్తులు, రైతులు గత కొన్నేళ్లుగా యూసీఐఎల్ కార్యాకలాపాలను వ్యతిరేకిస్తున్నారు. యురేనియం శుద్ధి కర్మాగారంవల్ల వాతావరణ కాలుష్యం జరిగి తమను రోగాలు చుట్టుముడుతున్నాయని, టెయిల్ పాండులో నింపుతున్న వ్యర్థాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతింటున్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ.

కర్మాగారానికి సమీప గ్రామాలైన మబ్బుచింతలపల్లి, కణంపల్లి, రాచకుంటపల్లి, భూమయ్యగారిపల్లికి చెందిన అనేకమంది కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, టెయిల్ పాండు వ్యర్థాలతో నిండిపోవటంతో రెండో దశ విస్తరణ పనులకు కొన్ని నెలల క్రితం యూసీఐఎల్ శ్రీకారం చుట్టింది.

అప్పట్లో ప్రజాసంఘాల మద్దతుతో ఆయా గ్రామాల ప్రజలు టెయిల్ పాండ్ విస్తరణ పనులను అడ్డుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆయా ప్రాంతాలను పరిశీలించి.. యూసీఐఎల్ అధికారులతో మాట్లాడి కాలుష్య నియంత్రణకు చర్యలకు తీసుకుంటామని, నష్ట పరిహారం చెల్లించేలా చూస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన సద్దుమణిగింది.

అయితే, ఎంతకాలమైనా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోవటం, అనారోగ్య సమస్యలు పెరుగుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు మరోసారి యూసీఐఎల్‌కు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు.

కడప యురేనియం ప్రాజెక్టు

"చస్తూ బతకలేం.. మా గ్రామాలను తీసుకుని పరిహారం, పునరావాసం కల్పించండి"

కె.కె.కొట్టాల గ్రామంలో జయమ్మ అనే మహిళను బీబీసీ పలకరించగా ఆమె తన పాదంపై ఉన్న పుండును చూపుతూ, "టెయిల్ పాండు దిక్కు అక్కడ మాకు చేన్లు ఉండాయి సార్. మేమక్కడపోతా.. పొలంలోకి దిగుతా.. అట్లాయిట్లా ఉంటే.. ఏదో ఉలిత్తలంగా కాలికి వాపొచ్చింది. చిన్నగా పోతాదిలే అనుకుంటే, ఏమిజేసినా పోలేదు. కానీ ఆస్పిటలుకు తీసుకుపోయి సూపిచ్చే.. ఏదో పుండులాగుందని సర్జరీ చేసినారు. మోకాలు పైన చర్మం తీసి ఇక్కడ అతికిచ్చినారు. అయినా మానలేదు సార్. అదట్లే నవ్వులు బెట్టడం, నొప్పులు రావడం అట్నే ఉందిసార్. ఈ చేతులు కూడా దురదలు పెట్టడం, ఒళ్లంతా దద్దులు రావడం ఎక్కువగా ఉంది సార్. నాకేగాదు.. నాలాంటివాళ్లకు ఎంతోమందికి ఇట్ల గడ్డలు రావడం.. దద్దులు రావడం.. నవ్వులు రావడం.. నొప్పులు రావడం ఉంది ఈ నీళ్ల వల్ల.. ఈ టెయిలింగు పాండు వల్ల. ఈ క్యాన్షల్ వల్ల కూడా ఇద్దరు.. ముగ్గురు చనిపోయినారు సార్. మేము చాలా ఇబ్బందికరంగా ఉండాం. ఈ టెయిలింగు పాండు, ఈ కంపెనీ పెట్టకముందు బాగానే ఉండేవాళ్లం. ఏదో పెట్టినారు బాగుంటుందిలే అనుకున్నాం. కానీ ఇప్పుడు బాగుండడంలేదు. మాకు సమస్యలు వచ్చినాయి కాబట్టి మాకు న్యాయం చేయవాల" అని కోరారు.

కొట్టే రాయుడు, జయమ్మనే కాకుండా ఒక్క కనంకింద కొట్టాల (కె.కె.కొట్టాల) గ్రామంలోనే పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా పదుల సంఖ్యలో చర్మరోగాలతో బాధ పడుతున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది. కొందరికి గొంతులోనూ, కొందరికి తలపైన, కొందరికి వీపుపైన, మరి కొందరికి కాళ్లు చేతులపైనా గడ్డలు కనిపిస్తున్నాయి. ఇవి కేన్సర్ గడ్డలేమోనన్న భయం వారిలో నెలకొంది.

కడప యురేనియం ప్రాజెక్టు

కనంపల్లెకు చెందిన గొర్రెల పెంపకందారులు కొందరు తమ పరిస్థితి బీబీసీకి వివరించారు. తమ గ్రామంలో గత మూడేళ్లుగా జీవాలకు (గొర్రెలు, మేకలు) జబ్బులొస్తున్నాయని తెలిపారు. "మొదట శరీరంపై బొచ్చు ఊడిపోతుంది. తరువాత పుండ్లు ఏర్పడి జబ్బు చేస్తున్నాయి. ఆ తరువాత నోటిలోనుంచి నురగ కారుతూ చనిపోతున్నాయి. నెరడు వాసి గుండెకు చిల్లులు పడుతున్నాయి. నావి 32 గొర్రెలు, 40 పిల్లలు చనిపోయాయి. నాలుగు లక్షలకుపైగా నష్టపోయినాను. ఇక్కడ చెరువులు, కుంటలు ఏమీలేవు. మా జీవాలు మా బోర్లల్లో నీళ్లే తాగుతాయి. బోర్లల్లో యురేనియం ఫ్యాక్టరీ నీళ్లు కలిసి ఈ విధంగా జీవాలు చనిపోతున్నాయి. మూడేళ్ల నుంచే ఇలా జరుగుతోంది. అంతకముందు ఇలా జరగలేదు. ఉన్న గొర్లు అమ్ముకుందామన్నా ఎవరు కొనటంలేదు. మా జీవాల్లో యురేనియం ఉంది.. జబ్బులున్నాయని చెప్పి కొనడంలేదు" అని రామాంజీనాయక్ అనే గొర్రెల పెంపకందారు ఆవేదన వ్యక్తం చేశారు.

కనంపల్లి, కనంకింద కొట్టాల గ్రామాలకు చెందిన కొందరు అరటి, టమాటా రైతులు బీబీసీ తరపున వచ్చిన ప్రతినిధికి తమ తోటలు, పొలాల్లో నేలపై, బోర్ల దగ్గర, డ్రిప్పు పైపులమీద పేరుకున్న తెల్లటి తెట్టులాంటి దానిని చూపిస్తూ.. "ఇదే మా పంటలను నాశనం చేస్తోంది. టెయిల్ పాండులోని వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలిసి బోర్ల ద్వారా ఇలా మా పొలాల్లోకి చేరుతున్నాయి" అని తెలిపారు కుమార్ నాయక్, నాగేంద్ర అనే రైతులు.

కడప యురేనియం ప్రాజెక్టు

కుమార్ నాయక్ తన అరటితోటను చూపుతూ "ఇది పదకొండు నెలల చెట్టు.. మామూలుగా పదకొండు నెలలకు గెలలు కటింగ్ చేయాలి కాని ఇది ఇప్పుడు గెల విడుస్తోంది. ఈపాటికి కాయ ఎనిమిది తొమ్మిది అంగుళాల లెన్త్ రావాలి, బాగా పొడవుగా ఉండాలి కాని రెండంగుళాలే వచ్చింది. మూడెకరాల తోట అంతా ఇలా నాసిరకంగానే ఉంది చూడండి. ఇలా ఉంటే వీటిని ఎవరూ కొనరు. మూడుబోర్లు వేశాం. పంటకోసం నాలుగున్నర లక్షలు ఖర్చైంది. కానీ ఇప్పుడు పదివేలు కూడా వచ్చేట్టు లేదు. బోర్లలో యురేనియం కలుషితమైన నీరు వస్తుండటం వల్లే తమ పంటలు సరిగా ఎదగటంలేదు. సరైన దిగుబడులు రాక నష్టపోతున్నాం" అని తెలిపారు.

నాగేంద్ర అనే రైతు మాట్లాడుతూ అధికారులు పరీక్షల కోసం నీటి శాంపిల్స్, మట్టి నమూనాలు తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. నష్టపోతున్న తమకు అటు యూసీఐఎల్ కానీ ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించటం లేదన్నారు. ఇకనైనా తమను ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు.

కడప యురేనియం ప్రాజెక్టు

అరుణ్ కుమార్ అనే యువకుడు తాను బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేశానని పరిచయం చేసుకొని.. తన చిన్నాన్నకు చెందిన టమాటా చేనులో ఎండిపోయిన చెట్టును పీకి చూపిస్తూ.. "ఎక్కడైనా టమాటా చెట్టు గుబురుగా పిల్లవేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ అది లేదు. తల్లి వేరుకూడా పొడిబారి పూర్తిగా ఎండిపోతుంది. ఇక్కడ నైట్రోజన్ డెఫీషియన్సీ వల్లే ఇలా జరుగుతోంది. నైట్రోజన్ డెఫీషియన్సీ ఉన్నచోటే ఈ క్రౌన్ గాల్స్ (వేరుపై వచ్చే బుడిపెలు) కూడా వచ్చి వేరు పూర్తిగా దెబ్బతింటోంది. టెయిల్ పాండులోని యాసిడ్స్ భూమిలోకి, భూగర్భ జలాల్లోకి ఇంకటంవల్ల ఈ నైట్రోజన్ డెఫీషియన్సీ వస్తోంది" అని వివరించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. "పంటలకే కాదు, ఇక్కడి ప్రజలకు కూడా రకరకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పంటలు పండించాలి, ఎలా బ్రతకాలి? మా ఊరిని తీసుకొని చట్ట ప్రకారం మాకు పునరావాసం కల్పించండి. ఇంతకంటే సురక్షిత ప్రాంతానికి పంపండి. మమ్మల్ని బతికించండి. మేం బతుక్కుంటాం" అని యూసీఐఎల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

కడప యురేనియం ప్రాజెక్టు

"సమస్యలున్నాయి.. కారణాలు తెలియాల్సి ఉంది"

యూసీఐఎల్ సమీప గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై సంబంధిత మండల ప్రజా, పశువైద్య అధికారులు, ఉద్యానవన శాఖ అధికారిని బీబీసీ వివరణ కోరింది.

"యూసీఐఎల్ సమీప గ్రామాల్లో ఎక్కువ మంది చర్మవ్యాధులతో బాధపడుతున్నది నిజమే. కొందరికి లైపోమాస్ (చర్మం కింద గుండ్రంగా ఏర్పడే గడ్డలు), నాడ్యూల్స్ (బుడిపెలు) వస్తున్నాయి. సహజంగా వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, ఖనిజ లవణాల లోపం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ కాలుష్యానికి, అక్కడి ప్రజలు చెబుతున్నట్లుగా యూసీఐఎల్ వ్యర్థాలే కారణమనటానికి ఇప్పటి వరకూ మా దగ్గర ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దానిని నిర్ధారించడానికి కావలసిన పరీక్షా కేంద్రాలు గాని, సాంకేతిక నిపుణులు గాని ఇక్కడ అందుబాటులో లేరు. గతంలో సమస్యకు కారణాలను తెలుసుకునేందుకు సెంట్రల్ టీం నీటి శాంపిల్స్ తీసుకెళ్లింది. కానీ వాటి రిపోర్టులు ఇంకా మాకు అందలేదు. ఇక కేన్సర్ విషయానికొస్తే.. 2015 నుంచి 2018 చివరి వరకూ మండలం మొత్తంలో 50 కేసులు నమోదయ్యాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం యూసీఐఎల్ గ్రామాల్లో కేన్సర్ రోగుల సంఖ్య తగ్గింది. ఇంకా ఆ గ్రామాల్లో ఒకటి, రెండు కేసులు ఉన్నాయి. ఒక గ్రామంలో ఒకటి, రెండు కేసులుండటం సాధారణమే" అని తెలిపారు వేముల మండల ప్రజా వైద్యాధికారి ఉమాదేవి.

వేముల మండల ప్రజా వైద్యాధికారిణి ఉమాదేవి, పశువైద్యాధికారిణి శ్రీవాణి
ఫొటో క్యాప్షన్, ఈ కాలుష్యానికియూసీఐఎల్ వ్యర్థాలే కారణమనటానికి తమ దగ్గర శాస్త్రీయ ఆధారాలు లేవని వేముల మండల ప్రజా వైద్యాధికారిణి ఉమాదేవి, పశువైద్యాధికారిణి శ్రీవాణి చెప్తున్నారు

"యూసీఐఎల్ సమీప గ్రామాల్లోని జీవాల్లో చర్మ సమస్యలు, పారుడు రోగం వంటివి గుర్తించాం. బాహ్యపరాన్నజీవుల వల్లకాని, ఖనిజ లవణాల లోపం వల్ల కాని ఇలాంటి సమస్యలు వస్తాయి. ఖనిజ లవణాల లోపం ఏదైనా ఉందా అన్నది తెలుసుకునేందుకు జీవాల స్కిన్ శాంపిల్స్ కూడా పంపించాం. కానీ మాకు సరైన మెటల్ డిటెక్షన్ ఫెసిలిటీస్ (ఖనిజ నిర్ధారణకు సంబధిచిన సౌకర్యాలు) లేకపోవడంతో అక్కడి నుంచి కచ్చితమైన రిపోర్టులు ఇంకా మాకు అందలేదు. బయటి ప్రాంతాలతో పోల్చితే కచ్చితంగా ఇక్కడి జీవాల్లో చర్మ సమస్యలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. అయితే అందుకు కారణమేంటన్నది తెలియాల్సి ఉంది" అని పశువైద్యాధికారి శ్రీవాణి తెలిపారు.

కడప యురేనియం ప్రాజెక్టు

"పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తోంది?"

యురేనియం వ్యర్థాలను నింపే టెయిలింగ్ పాండ్ డిజైన్‌లోనూ నిర్మాణంలోనూ లోపాలున్నాయని,

అందువల్ల భూగర్భ జలాలు కలుషితమౌతున్నాయని 'ప్రజల కొరకు శాస్త్రవేత్తల బృందం' 21.6.2018లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాసింది. వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకకుండా ఉండేందుకు టెయిలింగ్ పాండ్ కింది భాగంలోనే కాకుండా వ్యర్థాలు భూమి పొరలను తాకే ప్రతిచోటా పాలీఇథిలిన్ పొరను వేయాలని, యూసీఐఎల్ అలాంటి రక్షణ పొర వేయకపోవటంవలనే భూగర్భ జలాలు కలుషితమౌతున్నాయని ఆ బృందం ప్రతినిధి, మాజీ ప్రధాన శాస్త్రవేత్త బాబూరావు ఆ లేఖలో వివరించారు.

కడప యురేనియం ప్రాజెక్టు

స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి కూడా యూసీఐఎల్ సమీప గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అందుకు గల కారణాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో పీసీబీ అధికారులు, యూసీఐఎల్ సమీప గ్రామాల్లోని బోర్లలో నీటిని పరీక్షించి ప్రమాదకర స్థాయిలో యురేనియం నీటిలో కలుస్తున్నట్లు గుర్తించారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ 14.9.2018న ఒకసారి, 19.11.2018న మరోసారి యూసీఐఎల్‌కు నోటీసులు ఇచ్చారు.

తమ సూచనలు పాటించలేదన్న కారణంగా పీసీబీ 7.8.2019న యూసీఐఎల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తరువాత ప్రజలతో కలసి ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించటంతో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం పీసీబీని ఆదేశించారు. 30.8.2019న పదకొండు మంది నిపుణులతో పీసీబీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

కడప యురేనియం ప్రాజెక్టు

కమిటీ ఏం తేల్చింది?

నిపుణుల కమిటీ యురేనియం కర్మాగారం, టెయిలింగ్ పాండుతోపాటు గ్రామాల్లో పరిశీలించింది. ప్రజల సమస్యలను, వారి అభిప్రాయాలను తెలుసుకుని పీసీబీకి నివేదిక సమర్పించింది.

అంతకుముందు యూసీఐఎల్ గ్రామాల్లోని ప్రజలు ఒకే రకమైన చర్మ సమస్యలు, గడ్డలతో బాధపడుతున్నట్లు గుర్తించామని కమిటీ కన్వీనర్ పీఎస్ఎస్ బాబు మీడియాకు తెలిపారు.

పీసీబీకి సమర్పించిన నివేదికలోనూ అనారోగ్య సమస్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థలతో గ్రామాల్లో పర్యావరణ సాంక్రమిక రోగాలు, విషపూరిత కీటకాల ప్రభావంపై అధ్యయనం చేయించాలని కమిటీ సూచించింది.

టెయిలింగ్ పాండులో వ్యర్థజలాలు ఇంకకుండా నిరోధించగల స్థాయిలో లైనింగ్ వేసిన దాఖలాలు లేవని గుర్తించినట్లు స్పష్టంగా పేర్కొంది. నీటి కాలుష్యానికి టెయిలింగ్ పాండులోని వ్యర్థజలాలు భూమిలోకి ఇంకి భూగర్భజలాల్లో కలవటం కూడా ఓ కారణమై ఉండవచ్చంటూనే.. టెయిలింగ్ పాండు పర్యవేక్షణ బోర్లనుంచి, సమీప గ్రామాల్లోని బోర్లనుంచి సేకరించిన నీటి నాణ్యత, నీటిమట్టాలకు సంబంధించి ప్రస్తుతం అటు పీసీబీ దగ్గర గాని ఇటు యూసీఐఎల్ దగ్గర గాని సరైన డేటా లేదని, అందుచేత నీటి కాలుష్యానికి గల కారణాలను కచ్చితంగా నిర్ధరించలేకపోయినట్లు కమిటీ నివేదిక చెబుతోంది.

జయశ్రీ
ఫొటో క్యాప్షన్, జయశ్రీ, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

సమస్యను తేల్చేందుకు సైన్సే లేదా.. నిపుణుల కమిటీ సచ్ఛీలతపై అనుమానాలు

నిపుణుల కమిటీ నివేదికపై 'ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం', మానవ హక్కుల వేదిక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భూగర్భం ఎందుకు కలుషితమౌతోందో.. దానికి కారణమెవరో స్పష్టంగా తేల్చాల్సిన కమిటీ ఆ పని సవ్యంగా పూర్తి చేయలేదని విమర్శించాయి. కమిటీ పనితీరు, దాని నివేదిక చూస్తుంటే... కాలుష్య నియంత్రణ మండలి, నిపుణుల కమిటీ యూసీఐఎల్ సంస్థతో కుమ్మక్కయ్యాయనే అభిప్రాయానికి రాకతప్పటంలేదంటున్నాయి.

యూసీఐఎల్ కారణంగా తాము అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి ప్రజలు గత రెండేళ్లుగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నా.. యూసీఐఎల్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవటంలేదని కనీసం వాళ్లను మనుషులుగా కూడా చూడటంలేదని మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ విమర్శించారు. దేశ రక్షణ పేరుతో యూసీఐఎల్ దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. యుద్ధ ఖైదీలకు కూడా అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం మంచి ఆహారం, మంచి వాతావరణం, కావలసిన న్యాయ సహాయం అందజేస్తామని... అలాంటిది ఇక్కడి ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోవటంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.

యూసీఐఎల్ తప్పులను ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోందని ఆమె ఆరోపించారు.

"ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సైన్సే లేదా.. చంద్రయాన్ పేరుతో చంద్రుడిపైకి పోయినందుకు చంకలు గుద్దుకుందామా లేక పేద ప్రజలకు బతుకు లేకుండా చేస్తున్నందుకు సిగ్గుపడదామా" అని ప్రశ్నించారు జయశ్రీ.

యూసీఐఎల్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.రావు
ఫొటో క్యాప్షన్, యూసీఐఎల్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.రావు

"టెయిలింగ్ పాండ్ లీకేజీ అవాస్తవం.. ఆరోపణలు నిర్ధారణ కాలేదు"

యూసీఐఎల్ సమీప గ్రామాల ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజల కొరకు శాస్త్రవేత్తల ఫోరం, మానవ హక్కుల ఫోరం ఆరోపణలను యూసీఐఎల్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.రావు ఖండించారు.

"ఈ మధ్య కొంతమంది అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఏదైతే యురేనియం ఉందంటున్నారో.. ఆ యురేనియం, బాడీలో బోర్ హోల్స్ ద్వారా ఇంటర్‌సెక్ట్ అవ్వటంవల్ల వచ్చిందే. న్యాచురల్‌గా, సహజ సిద్ధంగా ఉన్న యురేనియం వ్యాల్యూసే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. టెయిలింగ్ పాండ్ వాటర్ బాడీ ఫ్లో డైరెక్షన్లో మానిటరింగ్ బోర్‌వెల్స్ వేశాం. ఆ బోర్‌వెల్స్ రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నాం. ఇప్పటి వరకూ ఆ బోర్‌వెల్స్ ద్వారా టెయిలింగ్ పాండ్ లీకై వెళ్లిన దాఖలాలేమీ లేవు. యూసీఐఎల్‌ను ఆట్రిబ్యూట్ చేస్తూ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ కూడా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ శాంపిల్సులో ఇప్పటివరకూ ఏమీ లీకైనట్లుగా తేలలేదు. ఇక్కడ హెల్త్ ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ఉంది. వాళ్లు కూడా రెగ్యులర్‌గా బోర్‌వెల్స్ మానిటరింగ్ చేస్తావుంటారు. వాటర్, గాలి, సాయిల్ టెస్టులు చేస్తావుంటారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే.. ఏవైతే ఆరోపణలున్నాయో.. అవి ఇప్పటి వరకూ ప్రూవ్ అవ్వలేదు.. నిర్ధారణ కాలేదు. రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తావున్నాము. కాకపోతే ప్రజల్లో ఇంకా కొంచెం అవేర్‌నెస్ పెంచే దిశగా మేం ప్రయత్నిస్తాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)