బడ్జెట్ 2019: కేంద్రం ‘రైతు బంధు’... ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి... 2 హెక్టార్లలోపు రైతులకు రూ.6 వేలు

పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, lOK SABHA TV

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉదయం నుంచి ముగింపు వరకు.

12.46

బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. సోమవారానికి లోక్‌సభ వాయిదా.

వ్యక్తిగత పన్ను మినహాయింపు

12.30

రూ.5 లక్షల లోపు వ్యక్తిగత వార్షిక ఆదాయం కలిగిన వారికి పన్ను మినహాయింపు.

దీని ద్వారా 3 కోట్ల మంది మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

6.5 లక్షల రూపాయల గ్రాస్ ఆదాయం పొందే వారికి కూడా ఎలాంటి పన్నూ ఉండదు. అయితే వాళ్లు ఆ మేరకు గర్తింపు పొందిన వాటిపై పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

నెలకు రూ. 50 వేల వరకు వేతనం అందుకునే వారికి టీడీఎస్‌ ఉండదు.

బ్యాంకు, పోస్టాఫీసు డిపాజిట్ల ద్వారా లభించే వడ్డీపై పన్ను పరిమితి ఇకపై 40 వేలకు పెంపు. గతంలో ఇది 10 వేలు ఉండేది.

ఇంటి అద్దె ద్వారా లభించే ఆదాయంపై పన్ను ఉపశమనం రూ.1.8 లక్షల నుంచి రూ.2.4 లక్షలకు పెంపు.

గ‌ృహ రుణం, విద్యా రుణం మొదలైన వాటిపైన లభిస్తున్న పన్ను రాయితీలు కూడా కొనసాగుతాయి.

12.25

జీఎస్టీ ద్వారా పేదలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరింది. పేద, మధ్య తరగతి ప్రజలు రోజువారీగా వినియోగించే చాలా వస్తువుల ధరలు 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలోనే ఉన్నాయి.

గృహ కొనుగోలుదారులకు లబ్ధి చేకూర్చే విషయంపై మంత్రుల బృందం ఆలోచిస్తోంది.

12.20

2019 జనవరిలో జీఎస్టీ రాబడి రూ. 1 లక్ష కోట్లు దాటింది.

12.19

ప్రపంచంలో ఫోన్ కాల్, ఇంటర్నెట్ డేటా ఛార్జీలు అత్యంత తక్కువ ఉన్న దేశం భారత్.

గత ఐదేళ్లలో డేటా వినియోగం 50 రెట్లు పెరిగింది.

దేశంలో మొబైల్, మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలు 2 నుంచి 268కి పెరిగాయి.

గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.

12.17

ఈశాన్య రాష్ట్రాలకు కేటాయింపును రూ.58,166 కోట్లకు పెంచాలనుకుంటున్నాం.

12.15

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. గత అయిదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 10 రెట్లు పెరిగింది. ఈ రంగంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి.

రోడ్లు

ఫొటో సోర్స్, Getty Images

12.05

ప్రపంచంలో అత్యంత వేగంగా రహదారులను నిర్మిస్తున్న దేశం భారత్. దేశంలో ప్రతి రోజూ 27 కిలోమీటర్ల రహదార్లు నిర్మితమవుతున్నాయి.

దేశంలో రాకపోకలు జరుగుతున్న విమానాశ్రయాలు 100కు పైగా ఉన్నాయి. దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య గత ఐదేళ్లలో రెట్టింపు అయ్యింది.

12.00

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మూడు రెట్లు పెంచాం.

ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 15.8 లక్షల గ్రామాలను పక్కా రోడ్లతో అనుసంధానించాం.

11.56

భారతదేశం స్టార్టప్‌లకు ప్రపంచంలోనే అతిపెద్ద హబ్‌గా మారింది.

చిన్న, మధ్య తరహా సంస్థలకు కేవలం 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తున్నాం.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారత ప్రజలకు వేగం, సేవలు, భద్రత ఇవ్వటంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు కూడా గొప్ప మేలు చేస్తుంది.

భారతదేశం రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కానుంది. రాబోయే ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలన్నదే మన ధ్యేయం.

11.55

త్వరలో నేషనల్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పోర్టల్ ప్రారంభిస్తాం.

11.53

ఆయుష్మాన్ భారత్ పథకం కింద 10 లక్షల మంది లబ్ధి పొందారు. ఈ పథకం వల్ల పేద ప్రజలకు రూ.3 వేల కోట్ల సొమ్ము ఆదా అవుతుంది.

11.50

8 కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు చేపట్టిన 'ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన' కింద ఇప్పటికే 6 కోట్ల కనెక్షన్లు ఇచ్చామని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

అంగన్‌వాడీ సిబ్బంది వేతానాన్ని 50 శాతం పెంచుతున్నాం. 'ప్రధాన్‌ మంత్రి ముద్రా యోజన' పథకం లబ్ధిదారుల్లో 75 శాతం మంది మహిలే అన్నారు.

'మాతృత్వ యోజన' పథకం ద్వారా మహిళా ఉద్యోగులకు 26 వారాల సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు.

రైతు కూలీలు

ఫొటో సోర్స్, Getty Images

11.45

ఈఎస్‌ఐ పరిధి రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంపు.

11.40

అసంఘటి రంగంలో పనిచేస్తున్న కార్మికులు నెలకు రూ.100 చెల్లిస్తే.. వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3000 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ పథకం పేరు 'ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మంధన్'.

11.38

కోటి 53 లక్షల గృహాలు నిర్మించాం. 143 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశాం. దాంతో, రూ.50,000 కోట్లు ఆదా అవుతుంది.

11.37

జీడీపీలో 50 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 42 కోట్ల మంది కార్మికుల నుంచే వస్తోంది.

11.36

ఉద్యోగులకు పదవీ విరమణ, ఉద్యోగం నుంచి తప్పుకునే సమయానికి లభించే గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.30 క్షలకు పెంపు.

11.35

రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు కేటాయింపును రూ.750 కోట్లకు పెంచాం.

'రైతు బంధు' పథకం ప్రకటించిన కేంద్రం

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 1

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 1

11.25

ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6,000 చొప్పున నగదు బదిలీ చేసే పథకాన్ని ప్రారంభిస్తున్నామని పీయూష్ గోయల్ ప్రకటించారు.

'ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' కింద ఆ నగదును మూడు దఫాలుగా(రూ.2000 చొప్పున) నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని తెలిపారు.

ఈ పథకం 2 హెక్టార్లు (5 ఎకరాల) లోపు సాగు భూమి కలిగిన రైతులకు మాత్రమే వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు.

దీని ద్వారా 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకానికి రూ.75,000 కోట్లు అవుతుందన్నారు.

దీనివల్ల రైతులు గౌరవంగా జీవించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు.

పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, LOK SABHA TV

సైనికులకు

11.20

దేశ సైనికులే మన గుర్తింపు.. మన గౌరవం. గత 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్, వన్ పెన్షన్ పథకాన్ని మేం అమలు చేశాం.

దీనిద్వారా ఇప్పటికే రూ.35 వేల కోట్లు పంపిణీ చేశాం. ఆర్మీలో పనిచేసే వాళ్ల వేతనాలను గణనీయంగా పెంచాం.

రక్షణ బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లకంటే ఎక్కువ చేశాం.

11.15

పేదలకు అందుబాటు ధరలో ఆహార ఉత్పత్తులు అందించేందుకు రూ.1,70,000 కోట్లు ఖర్చు చేశాం.

11.12

బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు చర్యలు చేపట్టాం. నిరర్థక ఆస్తులను తగ్గించాం. సుమారు రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలను రాబట్టాం.

11.10

2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 3.4 శాతానికి తగ్గించాం.

బడ్జెట్.. పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, Getty Images

11.08

2009- 14 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 10.1% ఉండేది. దాన్ని మేము భారీగా తగ్గించగలిగాం. 2018 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 2.1‌% మాత్రమే.

11.02 బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన పీయూష్ గోయల్

11.00 ప్రారంభమైన లోక్‌సభ

10.55 బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

10.50 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు వెలుపల తెలుగు దేశం పార్టీ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

10.30

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఫొటో సోర్స్, PIB_India

9.55

ఆర్థిక మంత్రి పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు ఆయన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

9.50

పార్లమెంటు భవనం వద్దకు చేరుకున్న బడ్జెట్ ప్రతులు

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రైతులకు, గ్రామీణ ప్రజలకు ప్రయోజనం కలించే ప్రకటనలు చేయడంతో పాటు, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పెద్దఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. దాంతో, ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

బడ్జెట్ అర్థమవ్వాలంటే.. ఈ 6 విషయాలు తెలుసుకోవాలి

1. ఆర్థిక సంవత్సరం

భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ సంవత్సరానికి (జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు) మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

2. జీడీపీ- స్థూల దేశీయోత్పత్తి

ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టి చూపే కీలకాంశాల్లో ఇది ఒకటి.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 2

3. ద్రవ్య లోటు

ప్రభుత్వ మొత్తం వ్యయాలు, మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అని వ్యవహరిస్తారు. ద్రవ్య లోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.

ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

4. కరెంటు ఖాతా లోటు

వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.

5. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు

పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను- ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు.

పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు. విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో గత ఏడాది ప్రవేశపెట్టిన జీఎస్‌టీ- పరోక్ష పన్నులకు ఉదాహరణలు.

6. పెట్టుబడుల ఉపసంహరణ

ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని 'పెట్టబడుల ఉపసంహరణ' అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)