స్విస్‌ నుంచి నల్లధనాన్ని వెనక్కు తెచ్చి పేదలకు పంచనున్న నైజీరియా ప్రభుత్వం

నైజీరియా అబాచా
ఫొటో క్యాప్షన్, నైజీరియా సెంట్రల్ బ్యాంకు నుంచి దాదాపు 2.2 బిలియన్ డాలర్ల డబ్బును అప్పటి సైనిక పాలకుడు అబాచా దోచుకెళ్లినట్టు అంచనా.

నైజీరియా మాజీ సైన్యాధ్యక్షుడు సానీ అబాచా కొల్లగొట్టిన ధనాన్ని దేశంలోని పేద ప్రజలకు పంచనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

అతడు దాచిన దాదాపు రూ.2,000 కోట్లకు పైగా(300 మిలియన్ డాలర్లు) నల్లధనాన్ని స్విట్జర్లాండ్ అధికారులు నైజీరియాకు తిరిగి ఇవ్వనున్నారు. ఆ డబ్బును జూలై నుంచి పేదలకు పంచేందుకు నైజీరియా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

19 రాష్ట్రాల్లో 3 లక్షల కుటుంబాలకు నెలకు 14 డాలర్లు(రూ.958) చొప్పున, దాదాపు ఆరేళ్ల పాటు నగదు బదిలీ చేయనుంది.

అయితే, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం ఈ పని చేస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

1993 నుంచి 1998 మధ్య కాలంలో సైన్యాధిపతిగా ఉన్నప్పుడు దేశ సంపదను లూటీ చేసిన అబాచా విదేశీ బ్యాంకుల్లో దాచారు.

సైన్యాధిపతిగా నైజీరియాను పాలించిన ఆయన.. 1998 జూన్ 8న ఆకస్మికంగా మరణించారు.

పశువులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, దేశంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం నెలవారీగా నగదు బదిలీ చేయనుంది.

అబాచా కొల్లగొట్టిన దేశ సంపదను వెనక్కి రప్పిస్తామంటూ.. 2015 ఎన్నికల సమయంలో ప్రస్తుత నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి హామీ ఇచ్చారు.

గత పదేళ్లలో మొత్తం దాదాపు 100 కోట్ల డాలర్ల ధనాన్ని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నైజీరియాకు అప్పగించినట్టు అంచనా.

ఇప్పుడు 'నైజీరియా నేషనల్ సోషల్ సేఫ్టీ నెట్ ప్రోగ్రాం'లో భాగంగా.. పేద కుటుంబాలకు నెలవారీగా ప్రభుత్వం నగదు బదిలీలు చేయనుంది.

ఈ చెల్లింపులు ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో జరుగనున్నాయి. అవకతవకలు జరగకుండా ప్రతినెలా ఆడిటింగ్ జరుగనుంది.

ఆ నిధులు మళ్లీ పక్కదారి పట్టకుండా చూసేందుకు, నగదు బదిలీల్లో పారదర్శకత పాటించాలని నైజీరియాకు కఠిన షరతులు పెట్టినట్టు స్విట్జర్లాండ్ అధికారి బాల్జరెట్టి బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)