బడ్జెట్ 2019: ‘రైతులకు రూ.6 వేలు ’ ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే..

పియూష్ గోయెల్

ఫొటో సోర్స్, Getty Images

2019 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక వరాలను ప్రకటించింది. రూ. 75,000 కోట్లతో ఏర్పాటు చేసే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ. 6,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది.

ఈ పథకానికి అర్హులైన రైతులకు మూడు విడతల్లో డబ్బును వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు.

తాత్కాలిక కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మాట్లాడుతూ..

ఈ పథకం ద్వారా 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారని అన్నారు.

ఈ పథకం 2018 డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తామని పియూష్ అన్నారు.

ఈ పథకానికి పోలిన పథకాన్ని రైతు బంధు పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది.

కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతుకు ఏడాదికి 8,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. సీజన్‌కు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ. 8,000 చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ. 10,000కు పెంచనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.

కిసాన్ సమ్మాన్ పథకం ప్రకారం అయిదెకరాలు లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున జమ చేస్తారు. 2018 డిసెంబర్ నుంచే ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించింది. అంటే, 2018-19 ఆర్థిక సంవత్సరానికే 'రైతుకు ఆర్థిక మద్దతు' ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ఖర్చు చేయనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)