భార‌త్‌-చైనా ఉద్రిక్త‌త‌లు: చైనా చ‌ర్య‌ల‌పై భార‌త్‌కు నిఘా స‌మాచారం అంద‌లేదా?

భారతీయ సైనికుడు

ఫొటో సోర్స్, Yawar Nazir/Getty Images

ఫొటో క్యాప్షన్, "ఈ దాడి కోసం బ‌హుశా మార్చి-ఏప్రిల్‌ల నుంచే చైనా సిద్ధ‌మ‌వుతూ ఉండొచ్చు"
    • రచయిత, జుగ‌ల్ పురోహిత్‌
    • హోదా, బీబీసీ ప్ర‌తినిధి

భార‌త్ నిఘా విభాగాల ప‌నితీరు‌పై స‌మీక్ష నిర్వ‌హించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సైనిక‌ నిఘా విభాగం మాజీ అధిప‌తి, విశ్రాంత జ‌న‌ర‌ల్ అమ‌ర్‌జీత్ బేదీ అభిప్రాయ‌ప‌డ్డారు. చైనా సంక్షోభం ముగిసిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.

గల్వ‌ాన్ లోయ‌లో చైనా చ‌ర్య‌ల‌పై ముందుగానే భార‌త్ సైన్యానికి నిఘా విభాగం నుంచి హెచ్చ‌రిక‌లు అందుండాల్సింద‌ని బీబీసీకి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న వివ‌రించారు.

"చైనా సైనికుల క‌ద‌లిక‌ల‌పై మ‌న సైనికుల‌కు ముందుగానే స‌మాచారం అందుండాల్సింది. ఈ సంక్షోభం ముగిసిన వెంట‌నే.. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి. అస‌లు సైన్యానికి ఎందుకు నిఘా స‌మాచారం అంద‌లేదో తెలుసుకోవాలి. మ‌న వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌ర‌చుకోవ‌డం భ‌విష్య‌త్తుకు చాలా అవ‌స‌రం. ఈ విచార‌ణ సైన్యంతోపాటు ఇత‌ర నిఘా సంస్థ‌ల్లోనూ నిర్వ‌హించాలి. కార్గిల్ యుద్ధం త‌ర్వాత కూడా ఇలాంటి విచార‌ణ కోసం ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు" అని ఆయ‌న అన్నారు.

చైనా అనుస‌రించిన దూకుడు విధానాలు, భార‌తీయ సైనికుల‌ను దారుణంగా హ‌త‌మార్చిన తీరును గ‌మ‌నిస్తే.. ఈ దాడి పక్కా ప్ర‌ణాళిక‌ ప్ర‌కారం జ‌రిగిన‌ట్లు అనిపిస్తోంద‌ని బేదీ వివ‌రించారు.

"నాకు తెలిసినంత‌వ‌ర‌కు చైనా దీని కోసం చాలా కాలం ముందే ప్రణాళిక‌లు సిద్ధంచేసి ఉండొచ్చు. బ‌హుశా మార్చి-ఏప్రిల్‌ల నుంచే దీని కోసం సిద్ధ‌మ‌వుతూ ఉండొచ్చు" అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

గల్వ‌ాన్ లోయ‌లో దాడిని ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రిగిన దాడిగా భార‌త విదేశాంగ శాఖ కూడా పేర్కొంది.

వీడియో క్యాప్షన్, వీడియో: భారత్, చైనాల మధ్య యుద్ధ భయాలు నిజమేనా?

ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసే దాడుల‌పై సైన్యానికి స‌మాచారం అందించే సామ‌ర్థ్యం భార‌త్ నిఘా సంస్థ‌ల‌కు లేదా?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. "ఇది నిఘా సంస్థ‌లు లేదా ప‌ర్య‌వేక్ష‌ణ సంస్థ‌ల వైఫ‌ల్యంగా చూడ‌లేం. మ‌నం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం.. అయితే ఇదివ‌ర‌కు కుదిరిన ఒప్పందాల ప్ర‌కారం చైనా న‌డుచుకుంటుంద‌ని భావించాం. కానీ అలా జ‌ర‌గ‌లేదు" అని బేదీ చెప్పారు.

మార్చి వ‌ర‌కు భార‌త్ సైనిక‌ నిఘా విభాగం అధిప‌తిగా బేదీ ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో చైనా ప్ర‌ణాళిక‌ల గురించి ఏమైనా స‌మాచారం ఉందా?

ఈ ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. "మౌలిక పెట్టుబ‌డులు, సైనిక విన్యాసాలు ఇత‌ర అసాధార‌ణ చ‌ర్య‌ల‌కు సంబంధించి చైనాలో జ‌రుగుతున్న అన్ని చ‌ర్య‌ల‌పై స‌మాచారం ఉంది. అయితే మార్చి నాటికి చైనా సైనికులు యుద్ధ విన్యాసాలు చేస్తున్న‌ట్లు కొన్ని సంకేతాలు వ‌చ్చాయి. ఆ విష‌యాన్ని మేం ఇత‌ర విభాగాల‌కు తెలియ‌జేశాం"అని బేదీ వివ‌రించారు.

చైనా సైనికులు

ఫొటో సోర్స్, TPG

ఫొటో క్యాప్షన్, "భార‌త్‌తో పోలిస్తే.. చైనా ద‌గ్గ‌ర నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉప‌గ్రహాలున్నాయి"

చైనా నిఘా సంస్థ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ విభాగాల సామ‌ర్థ్యం గురించి జ‌న‌ర‌ల్ బేదీ ఏమ‌నుకుంటున్నారు?

ఈ ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. "నిస్సందేహంగా చైనా త‌మ వ‌న‌రుల‌ను భారీగా పెంచుకుంద‌ని చెప్పొచ్చు. కొంత‌కాలంగా చైనా త‌న సైనిక సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూ వ‌స్తోంది. భార‌త్‌తో పోలిస్తే.. చైనా ద‌గ్గ‌ర నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉప‌గ్రహాలున్నాయి. భార‌త్ కంటే చైనా ముందుంద‌ని దీన్నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే మ‌నం కూడా అంత తీసిక‌ట్టుగా ఏమీలేము. భార‌త్ కూడా కొంత‌కాలంగా త‌న‌ సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటూ వ‌స్తోంది" అని బేదీ వివ‌రించారు.

చైనా-భార‌త్‌ల మ‌ధ్య తీవ్ర‌మైన ఉద్రిక్త‌త‌లు చెల‌రేగిన ప్ర‌స్తుత త‌రుణంలో స‌రిహ‌ద్దుల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల స‌మాచారాన్ని మ‌న ఉప‌గ్ర‌హాలు స్ప‌ష్టంగా అందించ‌గ‌ల‌వా?

"గ‌త ఎనిమిది-తొమ్మిది సంవ‌త్స‌రాల్లో మ‌న భూభౌగోళిక వ‌న‌రులు చాలావ‌ర‌కు మెరుగుప‌డ్డాయి. అయితే మ‌నం అనుకున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. కాలాలు, వాతావ‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా అన్ని స‌మ‌యాల్లోనూ క్షేత్ర స్థాయి స‌మాచారం అందించేలా మ‌న ఉప‌గ్ర‌హాలు ఉండాలి" అని బేదీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)