ప్రియాంకా గాంధీకి డెడ్‌లైన్.. ఇల్లు ఖాళీ చేయాలన్న కేంద్రం.. ప్రముఖులు 'లుటియన్స్ దిల్లీ' ఎందుకు వదిలివెళ్లరు?

ప్రియాంకా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో 35, లోధీ ఎస్టేట్‌లో ఉన్న ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి నోటీసులు ఇచ్చారు.

ఈ భవనం ఖాళీ చేయడానికి ఆమెకు 2020 ఆగస్టు 1 వరకూ గడువు ఇచ్చారు. దీనికి సంబంధించి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రియాంకా గాంధీకి నోటీసులు పంపింది. జూన్ నెలాఖరు వరకు బాకీ పడిన రూ.3.46 లక్షలను కూడా చెల్లించాలని చెప్పగా, ప్రియాంకా గాంధీ ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించేశారు.

ప్రియాంకా గాంధీకి ఎస్పీజీ భద్రత వెనక్కు తీసుకుని, జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. ఎస్పీజీ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఆమెకు గతంలో ప్రభుత్వ భవనాన్ని కేటాయించారు. జడ్ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్నవారికి ప్రభుత్వ వసతి కేటాయించరు. దీంతో భవనం ఖాళీ చేయాలని చెప్పారు.

లుటియన్స్ దిల్లీలో ఎవరెవరికి వసతి కల్పించవచ్చు అనే విషయంలో హౌసింగ్ క్యాబినెట్ కమిటీ 2000 డిసెంబర్‌లోనే మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త నిర్దేశాల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు ఎవరికీ ఇక్కడ వసతి కేటాయించకూడదు.

కానీ, ఇందులో ఒక మినహాయింపు ఇచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉన్నవారికి మాత్రం ఇక్కడ వసతి కల్పించవచ్చు అని అందులో చెప్పారు.

ఎన్నో ఎకరాల్లో వ్యాపించిన లుటియన్స్ దిల్లీలోని భవనాల్లో నివసించే ఈ ప్రత్యేక కేటగిరీ వారు మార్కెట్ రేటు కంటే 50 రెట్లు ఎక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

దిల్లీ

2019లో ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లు కూడా ఆమోదించింది. ఈ ‘పబ్లిక్ ప్రిమిసెస్(అనధికారంగా ఉన్నవారి తొలగింపు) అమెండ్‌మెంట్ బిల్ 2019’ కోసం 1971లో తీసుకువచ్చిన బిల్లులో చాలా సవరణలు చేశారు.

ఇదే బిల్లులో ఉన్న నిబంధనల ప్రకారం ఇప్పుడు ప్రియాంకా గాంధీకి కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకున్నారు. భారత గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ లుటియన్స్ దిల్లీలో ఉన్న ఈ భవనాలను కేటాయిస్తుంది.

ఇక్కడ వసతి కేటాయింపులకు పార్లమెంటులో ఉభయ సభలతోపాటు ప్రతి మంత్రిత్వ శాఖ కోసం వేరు వేరు పూల్ ఏర్పాటు చేశారు. దాని ప్రకారమే ఈ భవనాలను కేటాయిస్తారు. అంటే, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌తోపాటూ ఎంపీలకు ఈ భవనాలను కేటాయిస్తారు.

వారితోపాటూ ఆర్మీ, జ్యడిషియరీ, ఎగ్జిక్యూటివ్‌ల కోసం రకరకాల పూల్ ఏర్పాటు చేశారు. ఈ పూల్‌లో ఉన్నవారికి ఇక్కడే వివిధ భవనాలను ఎంపిక చేశారు. అంతే కాదు, లుటియన్స్ దిల్లీ భవనాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు కేటాయించే నిబంధనలు కూడా ఉన్నాయి.

లుటియన్స్ దిల్లీ నివాసాల్లో ఉండడానికి ప్రముఖుల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. తమ పదవీకాలం ముగిసినా ఈ భవనాలను ఖాళీ చేయకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు.

గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ ఇదే ఏడాది ఫిబ్రవరిలో అనధికారికంగా ఇక్కడే ఉంటున్న వారి భవనాల, ఇళ్ల జాబితాను రూపొందించింది. అందులో దాదాపు 600 పేర్లు చూసిన శాఖ షాక్ అయ్యింది. వారిలో ప్రస్తుత ఎంపీలతోపాటూ గతంలో ఎంపీలుగా ఉన్నవారు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు, 2001లోనే రిటైరైన అధికారులు కూడా ఉన్నారు.

లుటియన్స్ దిల్లీ

ఫొటో సోర్స్, @NLININDIA

లుటియన్స్ దిల్లీ అంటే ఏంటి?

బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటియన్స్ ఈ ప్రాంతంలోని భవనాలు అన్నింటినీ డిజైన్ చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని ఆయన పేరుతోనే పిలుస్తుంటారు.

లుటియన్స్ దిల్లీలోని భవనాలు కింగ్ జార్జ్ V, బ్రిటన్ మహారాణి మేరీ భారత్‌లో పర్యటించిన సమయం నాటివి.

రాజ దంపతులు 1911 డిసెంబర్ 15న కింగ్స్ వే క్యాంప్ దగ్గర ‘దిల్లీ దర్బార్‌’కు పునాదులు వేశారు. దాని నిర్మాణ పనులు 1912లో ప్రారంభించి, 1931 ఫిబ్రవరి 10న పూర్తి చేశారు. తర్వాత వీటిని అధికారికంగా ప్రారంభించారు.

భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఆంగ్లేయ పాలకులు వెళ్లిపోయారు. కానీ, దేశంలోని రాజకీయ నాయకులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు లాంటి ప్రముఖులు, ప్రభావవంతమైన వ్యక్తులు అప్పటినుంచి లుటియన్స్ దిల్లీలోనే ఉంటూ వచ్చారు.

2015లో భారత పార్లమెంట్ ఒక ఆర్డినెన్సు ద్వారా ‘దిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్’ ఏర్పాటు చేసింది. దీనికి ప్రొఫెసర్ పీఎస్ఎన్ రావును అధ్యక్షుడుగా చేశారు.

లుటియన్స్ దిల్లీలో చాలా ప్రాంతాలను చేర్చాలని, కొన్ని ప్రాంతాలను దీన్నుంచి తీసేయాలని ఈ కమిషన్ తమ రిపోర్టులో చెప్పింది. ఇందులో చాలా పురాతన భవనాలను విస్తరించాలని, ఒక అంతస్తు ఇళ్లను రెండు అంతస్తులుగా మార్చాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

ఎంపీలు, మంత్రులు, సీనియర్ నేతలు లేదా అధికారులు, జడ్జిల కోసం వివిధ కేటగిరీల భవనాలను కేటాయించాలని గుర్తించారు. ఈ నివాసాలను టైప్ 4 నుంచి టైప్ 8 వరకూ వివిధ కేటగిరీలుగా విభజించారు.

ప్రస్తుత కేటాయింపుల విషయానికి వస్తే మొదటిసారి ఎన్నికైన ఎంపీలకు టైప్-4 నివాసాన్ని కేటాయిస్తారు. అందులో నాలుగు బెడ్‌రూంలు, ఒక రీడింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ ఉంటాయి.

ఒకటికంటే ఎక్కువసార్లు ఎంపీ అయినవారికి లేదా మంత్రులకు టైప్-8 భవనంలో వసతి కేటాయిస్తారు. అందులో తోట కూడా ఉంటుంది. పనివారు, సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి తగిన ఏర్పాట్లు కూడా ఉంటాయి.

లాల్‌కృష్ణ అద్వానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతంలో ఎంపీలుగా పనిచేసిన పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికీ లుటియన్స్ దిల్లీలోనే నివాసం ఉంటున్నారు

లుటియన్స్ దిల్లీలోని మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం 5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

ఇక ఎంపీల విషయానికి వస్తే, నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పదవీకాలం ముగిసిన నెలలోపు వారు తమ భవనం ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ, వసతి కల్పించడానికి ఏర్పాటైన కేంద్ర కేబినెట్ కమిటీ దీనికి కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు. కొంతమంది ప్రముఖులకు వసతి కేటాయించాలని ప్రతిపాదించవచ్చు.

అయితే, సోనియా గాంధీ తను ఉండే నివాసం, అంటే 10 జన్‌పథ్‌లో గత మూడు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇక లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీమనోహర్ జోషి ఎంపీలు కాకపోయినా ఇప్పటికీ అక్కడి భవనాల్లోనే ఉంటున్నారు.

భద్రతా కారణాల వల్లే ఇద్దరు నేతలను వారి నివాసాల్లో ఉండడానికి అనుమతించామని హోంమంత్రిత్వ శాఖ చెబుతోంది. అయితే వారి భద్రతకు కూడా ఎస్పీజీని కేటాయించలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ పరిధిలో ఇక్కడ వసతి కేటాయించే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ దగ్గర, ఈ కేటాయింపులకు సంబంధించిన ఎలాంటి డేటాబేస్ లేదు.

దాంతో, సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందాలనుకునే వారికి ఈ శాఖ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతోంది. పార్లమెంటుకు తన సొంత ఎస్టేట్ విభాగం ఉందని, వివరాలన్నీ అందులో ఉంటాయని చెబుతోంది. కానీ పార్లమెంటు ఎస్టేట్ విభాగం మాత్రం తమ దగ్గర ప్రస్తుత సభ్యుల సమాచారం మాత్రమే ఉందని అంటోంది.

ఇలాగే ప్రతి మంత్రిత్వ శాఖకు తమకంటూ వేరు వేరు పూల్ ఉన్నాయి. వాటికి వేరు వేరు ఎస్టేట్ విభాగాలు, వాటి దగ్గర రకరకాల సమాచారాలు ఉన్నాయి.

సమాచార, సాంకేతిక విప్లవం కొనసాగుతున్న ఈ కాలంలో ఒక దగ్గర ఇలాంటి సమాచారం లేకపోవడం అనేది ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)