హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా.. ఇంతకీ ఇండియాలో హైస్పీడ్ రైలు ఉందా

నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం రెండేళ్ల కిందట రూపొందించిన నమూనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం రెండేళ్ల కిందట రూపొందించిన నమూనా
    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా ఉన్న విజయవాడకు, దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు మధ్య హైస్పీడ్ రైలు అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.

ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైలు అవసరం ఉందని, అందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల అనడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌కు, విజయవాడకు మధ్య దూరం సుమారు 270 కి.మీ.లు. 65వ నెంబర్ జాతీయ రహదారి ఈ రెండు నగరాలనూ కలుపుతూ వెళ్తోంది.

ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు ఎక్కువే. రెండింటి మధ్య బస్సులతో పాటు రైళ్లు, విమానాలు కూడా నడుస్తున్నాయి.

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/ktr

అయితే, హైస్పీడ్ రైలు వస్తే జాతీయ రహదారి వెంబడి అభివృద్ధి ఊపందుకుంటుందని కేటీఆర్ అన్నారు.

నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడే హైదరాబాద్-విజయవాడ హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడలేదు.

హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద నగరాల మధ్యలో హైస్పీడ్ రైలు అవసరం ఉందని హైదరాబాద్ మెట్రో సంస్థ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ‘బీబీసీ’తో అన్నారు.

ఆర్థికంగానూ ఇది ఆచరణ సాధ్యమయ్యేదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

రైలు ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

7 గంటల ప్రయాణం... గంటన్నరకు తగ్గవచ్చు

లాక్‌డౌన్ అమల్లోకి రాకముందు హైదరాబాద్, విజయవాడ మధ్య రోజూ దాదాపు 40 రైళ్లు నడిచేవి.

ప్రయాణానికి సగటున ఏడు గంటల సమయం పట్టేది.

హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఉద్యోగులు రోజూ విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఓ ప్రత్యేక రైలు కూడా వేశారు.

హైదరాబాద్, విజయవాడ మధ్య వేగంగా నడిచే రైలు ప్రస్తుతానికి ఇదే. దీనిలో ప్రయాణం ఐదున్నర గంటల్లో పూర్తవుతుంది.

ఆర్టీసీ బస్సులో వెళ్లాలన్న 5 నుంచి 7 గంటలు ప్రయాణించాలి.

విమానంలోనైతే 45 నిమిషాల్లో ప్రయాణం ముగుస్తుంది. కానీ, హైదరాబాద్ విమానాశ్రయం శంషాబాద్‌లో, విజయవాడ విమానాశ్రయం గన్నవరంలో ఉన్నాయి. ఇవి రెండూ ఆయ నగరాలకు కాస్త దూరంగానే ఉన్నాయి. ఫలితంగా ప్రయాణ సమయానికి కనీసం 2-3 గంటలైనా అదనంగా సమయం పడుతుంది.

ఒకవేళ హైదరాబాద్, విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది.

గంటన్నర లోపే ప్రయాణం పూర్తయ్యే అవకాశాలున్నాయి.

కానీ, అది సాధ్యమేనా?

జపాన్ సహకారంతో దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణాన్ని భారత ప్రభుత్వం తలపెట్టింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జపాన్ సహకారంతో దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణాన్ని భారత ప్రభుత్వం తలపెట్టింది

2007-08 బడ్జెట్‌లో ప్రస్తావన

ఇప్పటికైతే భారత్‌లో హైస్పీడ్ రైళ్లు లేవు. గంటకు 250 కి.మీ.ల వేగం దాటి వెళ్లే రైళ్లను హైస్పీడ్ రైళ్లుగా పరిగణిస్తారు. వీటినే బులెట్ ట్రెయిన్లు అని కూడా పిలుస్తున్నారు.

2007-08 రైల్వే బడ్జెట్‌లో తొలిసారిగా భారత్‌లో హైస్పీడ్ రైళ్ల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో ఐదు కారిడార్లలో హైస్పీడ్ రైళ్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు అధ్యయనం నిర్వహించాలని ప్రతిపాదించారు.

ఆ ఐదు కారిడార్లలో హైదరాబాద్-డోర్నకల్-విజయవాడ-చెన్నై కారిడార్ కూడా ఉంది. ఇది 664 కి.మీ.ల పొడవైన మార్గం. దీనిపై జపాన్‌కు చెందిన కన్సార్షియానికి అధ్యయన బాధ్యతలను అప్పగించారు.

2009లో భారత పార్లమెంటుకు రైల్వే శాఖ తమ లక్ష్యాలను పేర్కొంటూ సమర్పించిన ‘విజన్ 2020’ పత్రంలోనూ ఈ కారిడార్ల ప్రస్తావన ఉంది. కానీ, ఆ తర్వాత వీటిని ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నది లేదు.

విజయవాడ, హైదరాబాద్‌ల మధ్య రైలు ప్రయాణానికి సగటున ఏడు గంటలు పడుతుంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విజయవాడ, హైదరాబాద్‌ల మధ్య రైలు ప్రయాణానికి సగటున ఏడు గంటలు పడుతుంది

దేశంలో అన్నీ సెమీ హైస్పీడ్ రైళ్లే

భారత్‌లో సెమీ హైస్పీడ్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. వీటి వేగం గంటకు 160-180 కి.మీ.ల మధ్య ఉంది.

ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా వెళ్లగలిగే రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్. దిల్లీ, వారణాసిల మధ్య నడిచే ఈ రైలు గంటకు 180 కి.మీ.ల వేగం అందుకోగలదు. కానీ, భద్రతా కారణాల రీత్యా దీని వేగంపై గంటకు 130 కి.మీ.లు మించి వెళ్లకుండా పరిమితి విధించారు.

భారత్‌లో అత్యంత వేగంగా వెళ్తున్న రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్. గంటకు 160 కి.మీ.ల వేగంతో వెళ్లే ఈ రైలు దిల్లీ, ఝాన్సీల మధ్య నడుస్తోంది.

దేశంలో హైస్పీడ్ రైళ్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలైతే ఉన్నాయి.

జపాన్ సహకారంతో ముంబయి, అహ్మదాబాద్‌ల మధ్య దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణాన్ని భారత ప్రభుత్వం తలపెట్టింది. కానీ, ఈ పనులు ఇంకా మొదలు కాలేదు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.1 లక్ష కోట్లు

రైలు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడున్న రైళ్ల వేగం పెంచొచ్చా?

ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మధ్య ఉన్న ట్రాక్‌ల్లో రైళ్లు గరిష్ఠంగా 120 కి.మీ.ల వేగం అందుకోగలవు. అయితే, అంత వేగంతో నడిచే వీలు వాటికి ఉండదు.

ఉన్న మార్గాల్లోనే రైళ్ల వేగం పెంచాలంటే, కోచ్‌లను ఆధునికీకరించాలి. ఇంజిన్‌ల సామర్థ్యం పెంచాలి.

ముఖ్యంగా ట్రాక్‌లను బలోపేతం చేయాలి. కానీ, ఇందుకోసం ట్రాక్‌ల వినియోగం ఆపి, పనులు చేపట్టాల్సి ఉంటుంది.

రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, విజయవాడ లాంటి స్టేషన్లున్న మార్గంలో రాకపోకలను నిలిపివేసి పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఉంటాయి.

హైదరాబాద్, విజయవాడ మధ్య ఉన్న మార్గంలో రైళ్ల వేగం పెంచడం కోసం అవసరమైన చర్యలను రైల్వే తీసుకుంటోందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ బీబీసీతో చెప్పారు.

హైస్పీడ్ రైళ్ల గురించి రైల్వే బోర్డు స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయని, హైదరాబాద్-విజయవాడ మధ్య అలాంటి రైళ్ల ప్రతిపాదనపై తన వద్ద సమాచారం లేదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)