'విజయవాడ, విశాఖపట్నం మెట్రోలపై ఏపీ ప్రభుత్వ అనాసక్తి' - ప్రెస్ రివ్యూ

మెట్రో

ఫొటో సోర్స్, Amaravati Metro Rail Corporation

మెట్రో ప్రాజెక్టులను నిర్మించే విషయంలో ఆంధ్రప్రదేశ్ అనాసక్తి చూపినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారని 'ఆంధ్రజ్యోతి' ఓ వార్త రాసింది.

'మెట్రో విధానం-017' ప్రకారం విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు సవరించిన ప్రతిపాదనలను పంపాలని కేంద్రం కోరినా ఏపీ ప్రభుత్వం పంపలేదని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు.

గురువారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానం చెప్పారు.

విశాఖలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం కింద తేలికపాటి మెట్రో రైల్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు కొరియన్‌ ఎక్సిమ్‌ బ్యాంక్‌ నుంచి విదేశీ ఆర్థిక సహాయం కోరుతూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, కానీ తాము ఆర్థిక సాయం అందించలేమని కొరియా వర్గాలు చెప్పాయన్నారు.

దీంతో మరే ఇతర విదేశీ సంస్థల నుంచైనా రుణ సాయం కోరుతూ ప్రాజెక్టు ప్రతిపాదనలను పంపాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సలహా ఇచ్చామని చెప్పారు.

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దొంగలు పడ్డారు.. డబ్బులు వదిలేసి, ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు..

నల్గొండ జిల్లాలో ఓ దుకాణంలో దొంగలు పడి, ఉల్లిగడ్డలు దోచుకుపోయినట్లు 'సాక్షి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

మిర్యాలగూడలోని పాత బస్టాండ్ వద్ద ఓ దుకాణంలో ఉల్లిగడ్డలు చోరీకి గురయ్యాయి.

ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్న బక్యయ్య బుధవారం రాత్రి ఎప్పటిలాగే దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు.

గురువారం ఉదయం వచ్చి చూసేసరికి దుకాణం తాళం పగులగొట్టి ఉంది. లోపల పది బస్తాల ఉల్లిగడ్డలు (5 క్వింటాళ్లు) కనిపించలేదు.

చోరీ జరిగిందని గుర్తించిన బక్కయ్య, వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణంలో డబ్బుల కౌంటర్‌ ఉన్నా, దొంగలు దాన్ని ముట్టుకోలేదు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

టీఆర్ఎస్ ఎంపీలు

ఫొటో సోర్స్, trspartyonline/twitter

'తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వండి'

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదలచేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు గురువారం దిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖను అందజేశారు.

జీఎస్టీ కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.4,531 కోట్లు విడుదల కావాల్సి ఉందని నామా నాగేశ్వర్‌రావు అన్నారు.

రాష్ట్ర విభజన చట్టం కింద వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు, స్థానిక సంస్థలకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.135 కోట్లు, 2019-20కి సంబంధించి రూ.177 కోట్లు విడుదల కావాలని తెలిపారు.

పట్టణ స్థానిక సంస్థలకు రూ.393 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన ప్రకారం.. రూ.24,205 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు.

టీడీపీ, చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, JaiTDP/twitter.

'ఏపీలో మీడియా గొంతు నొక్కుతున్నారు'

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోందంటూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేసినట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.

చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం సాయంత్రం ఏపీ గవర్నర్‌ను కలిశారు.

శాసనసభ కార్యక్రమాల ప్రసారం విషయంలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడింది బయటకు చూపించడం లేదని, అధికార పక్షం వాదనను మాత్రమే ప్రసారం చేస్తున్నారని తెలియజేశారు.

రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ మీడియా పట్ల ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీవో నెం.2430తో మీడియా గొంతు నొక్కుతోందని ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంలో గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)