కరోనా వైరస్: భవిష్యత్‌లో మన ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి

శంషుద్ధీన్ గడిచిన 40 ఏళ్లుగా టూర్ గైడ్‌గా పని చేస్తున్నారు. ఆయన జీవితంలో ఇప్పటి వరకు 40 మంది ప్రముఖులతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించి వారికి ఆ అద్భుత కట్టడం యొక్క విశేషాలను పూసగుచ్చినట్టు అందించడంలో గైడ్‌గా వ్యవహరించారు.
ఆ ప్రముఖుల్లో ప్రిన్సెస్ డయానా కూడా ఉన్నారు. కొన్నాళ్ల పాటు మనం కరోనావైరస్‌తో సహజీవనం చెయ్యాల్సిందేనని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది, దీంతో భవిష్యత్ పర్యాటకంలో కచ్చితంగా పెను మార్పులు వస్తాయని శంషుద్ధీన్ భావిస్తున్నారు.
భవిష్యత్తులో మరిన్ని లాక్ సడలింపులు ప్రకటించినప్పటికీ, మునుపటిలా పర్యాటకం మళ్లీ కళకళలాడాలంటే కచ్చితంగా కొన్ని నెలలు, ఏళ్లు పడుతుందని ఆయన అభిప్రాయడ్డారు. ఇకపై బృంద పర్యటనలు ఉండవని, అయితే ఎవరికి వారు లేదంటే జంటలుగా మాత్రమే వస్తారని శంషుద్ధీన్ అన్నారు.
“ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్ ముందు నిల్చొని ముఖానికి మాస్కు వేసుకొని ఫోటో దిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి”.
కేవలం తాజ్ మహల్ వద్ద మాత్రమే కాదు... ప్రపంచ వ్యాప్తంగా అన్ని పర్యాటక కేంద్రాలు, చారిత్రక ప్రదేశాల వద్ద ఇకపై మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కానుంది. అంతేకాదు పరిమిత సంఖ్యలో మాత్రమే పర్యాటకుల్నిఅనుమతిస్తారు.

విమాన ప్రయాణాలు
విమాన ప్రయాణాల విషయంలో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) బయోసెక్యూరిటీ ఫర్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ పేరిట ఒక ప్రోటోకాల్‌ను విడుదల చేసిందని వైమానిక రంగ నిపుణులు అశ్వని ఫడ్నవిస్ చెప్పారు.వైమానిక రంగాన్ని పునఃప్రారంభించడంలో భాగంగా అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణీకుల వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక రోడ్ మ్యాప్ రూపొందించారు. అదే నియమ నిబంధనల్ని భారతీయ విమానయాన మంత్రిత్వ శాఖ కూడా రూపొందిస్తోంది.
ప్రయాణీకులు టెర్మినల్‌లో అడుగు పెట్టగానే వారిని స్క్రీనింగ్ చేసేందుకు విదేశీ విమనాశ్రయాల్లో ఉన్నట్టు కంప్యూటర్లను ఏర్పాటు చేసే యోచనలో భారత్ ఉంది. ఈ విషయంలో వీలైనంత వరకు అధికారుల ప్రమేయాన్ని తగ్గించాలనుకుంటోంది.
వెబ్ చెక్ ఇన్ కూడా తప్పనిసరి కానుంది. అలాగే ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణీకులు ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ తీసుకువెళ్లడం ద్వారా విమానాశ్రయంలో ఎవరికి వారే తమ లగేజ్‌ను చెక్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది.
“విమానాల్లో ఇకపై ఎయిర్ హోస్టెస్‌ల అందమైన చిరునవ్వులు ఇక మనకు స్వాగతం పలకకపోవచ్చు. ఎందుకంటే కొన్ని విమానయాన సంస్థలు క్యాబిన్ సిబ్బందికి పీపీఈ కిట్లు ధరించడం తప్పనిసరి చేశాయి” అని అశ్విని తెలిపారు.

ప్రయాణికులు మాస్కుల్లో- విమాన సహాయకులు రక్షణ దుస్తులతో
అదే సమయంలో ప్రస్తుతానికి మనం విమానాల్లోని మధ్య సీట్లలో కూడా ప్రయాణీకుల్ని చూస్తున్నాం. కానీ గతంలో మధ్య సీట్లను ఖాళీగా ఉంచాలని అనుకున్నారు. ఇప్పటికే ఎమిరేట్స్, ఎయిర్ ఖతర్ వంటి అంతర్జాతీయ విమానాల్లో ఆ విధానాన్ని పాటిస్తున్నారు కూడా.
అయితే ఎప్పటికప్పుడు విమానాయాన ప్రోటోకాల్స్ మారిపోతున్నాయి. మరి కొన్ని వారాలు లేదా నెలల్లో మరిన్ని కొత్త నియమనిబంధనల్ని మనం చూడవచ్చు అని అశ్విని చెప్పారు.
దేశీయ విమాన ప్రయాణాల విషయంలో మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ప్రోటకాల్స్‌ను ఏర్పాటు చేసుకుంది. ఉదాహరణకు దిల్లీ నుంచి కోవిడ్-19 ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రయాణించాలే నిబంధనలు చాలా కఠినంగా ఉంటున్నాయి. బహశా లాక్ డౌన్ సడలించిన కొన్ని నెలల తర్వాత కూడా 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ సర్వ సాధారణం కావచ్చు.
ఐఏటీఏ సూచనల మేరకు రానున్న నెలల్లో విమాన ప్రయాణీకులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా తమ ముఖాన్ని కప్పి ఉంచుకోవాలి. క్యాబిన్ సేవలు తగ్గిపోయి.. విమాన సిబ్బందికి, ప్రయాణీకులకు మధ్య పరస్పర సంబంధాలు వీలైనంత తగ్గిపోవడాన్ని మనం చూడనున్నాం.
విమానం బోర్డింగ్‌కు సిద్ధమయ్యే ముందు అల్ట్రా వైలెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విమానాలను శుభ్రపరచడంపై ఆయా సంస్థలకు తగిన సూచనలను ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కొన్ని విమానయాన రంగంలో కొన్ని దశాబ్దాల అనుభవం అశ్విని ఫడ్నవిస్ చెప్పారు.

రైల్వేలు
దేశ జీవన రేఖగా భావించే (లైఫ్ లైన్ ఆఫ్ ది కంట్రీ) రైల్వేల నిర్వహణ విషయానికి వచ్చేసరికి సమస్యలు ఎదురుకావచ్చు.
అయితే భవిష్యత్తులో అవసరమైన మేర భౌతిక దూరం పాటించేలా కంపార్ట్మెంట్లలో, అలాగే ప్లాట్ ఫాంలపై ప్రయాణీకుల సంఖ్యను పరిమితం చేస్తామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు సూచనప్రాయంగా తెలిపారు.
ప్రస్తుతం త్రీటైర్ స్లీపర్ కంపార్ట్మెంట్లలో మధ్యలో ఉన్న బెర్త్‌ను విడిచి పెట్టి ప్రయాణీకుల మధ్య వీలైనంత దూరం ఉండేలా చూస్తున్నారు. అలాగే బాత్రూంలో ఎవరైనా ఉన్నారా ..లేదా అన్న విషయం కూడా మనకు తెలిసేలా కోచ్‌లలో మార్పులు చేర్పులు చేయనున్నారు
రైలు లోపల ప్రయాణం
ఇకపై ప్యాంట్రీ కార్ ద్వారా భోజనం అందించే సదుపాయం ఉంటుందా..? ఉండదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఒక వేళ సరఫరా చేసినప్పటికీ కేవలం ఆహారాన్ని పొట్లం కట్టి మాత్రమే ఇస్తారు.
రైల్లో మనం దూర ప్రయాణం చేసేటప్పుడు మళ్లీ మునుపటి రోజుల్లా మర చెంబుతో నీళ్లు , దిండు, దుప్పటి తీసుకెళ్లాల్సి వస్తుందేమో.
“రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు విమానాశ్రయాల్లా మారిపోయాయి. అక్కడ ఉన్నట్టే రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణానికి నాలుగు గంటల ముందు రిపోర్ట్ చెయ్యాల్సి వస్తోంది. ఎయిర్ పోర్ట్‌లలో ఎలా స్క్రీనింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారో.. రైల్వే స్టేషన్లలో కూడా అదే విధానం అమలు చేస్తున్నారు” అని ఆయన చెప్పారు.
బాత్రుమ్‌ల ముందు శానిటైజర్లు ఉంచుతారు. అలాగే ప్రయాణీకులు కూడా శానిటైజర్లను తమతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ క్రమంగా కొన్ని రైళ్లు నడవటం మొదలయ్యింది. తిరిగి రైళ్ల రాకపోకల్ని పూర్వ స్థితికి తీసుకొచ్చే క్రమంలో రైల్వే శాఖ కొన్ని కొత్త నియమ నిబంధనల అమలు తప్పనిసరి చేయవచ్చు.

జాతీయ రహదారులు
నిత్యావసరాల సరఫరా విషయంలోనూ, ప్రజల అంతరాష్ట్ర ప్రయాణాల విషయంలో జాతీయ రహదారులు అత్యంత కీలకం. మార్గ మధ్యంలో ఒక్కసారైనా డాబాల దగ్గర ఆగడం నచ్చిన వంటకాలను రుచి చూడం ప్రయాణీకులకు సర్వ సాధారణం. మెట్రో నగరాల ప్రజలైనా డాబా రుచులకు దాసోహం అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి జాతీయ రహాదారులపై ప్రయాణంలో ఒక రకమైన మజా ఉంటుంది. కానీ మున్ముందు అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
“ఇకపై డాబా కనిపించగానే.. అలా కారును పక్కన ఆపి లోపలికి వెళ్లి కుర్చీలో (మంచాన్ని లాగి )కూర్చోని ఎంజాయ్ చేద్దామంటే కుదరకపోవచ్చు” అని ట్రాన్స్ పోర్ట్ అసోసియేన్ సభ్యులైన రాజీవ్ అరోరా అభిప్రాయపడ్డారు.
హైవేల్లో టీ కొట్లు
భవిష్యత్తులో భౌతిక దూరం పాటించే విషయంలో పరిమితులుంటాయి. అలాగే మానవ సంబంధాల కనీస స్థాయిలో ఉండేలా ప్రయత్నాలు సాగుతాయి.
“మీరు అడిగి ఓ కప్పు టీ వెయిటర్ తీసుకొని రావడానికి బదులు ఓ పొడవైన కర్ర దుంగపై పెట్టి మిమ్మల్నే తీసుకోమని చెప్పవచ్చు. ఇకపై జాతీయ రహదారులపై జీవితంలో మునుపటిలా ఉండదు. అలాగే ట్రక్ డ్రైవర్లు, సిబ్బందికి వేరుగా సాధారణ ప్రయాణీకులకు వేరుగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాల్సి రావచ్చు” అని ఆయన అన్నారు.
జాతీయ రహదారులు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. కనుక ఆయా రాష్ట్రాల నియమ నిబంధనలకు అనుగుణంగా డాబాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

మెట్రో రైళ్లలో జీవితం
దిల్లీలో మెట్రో రైలు ప్రయాణం ప్రారంభమైన తర్వాత నగర వాసులు ప్రయాణం ఎలా ఉండబోతోందన్న విషయంపై దిల్లీ మెట్రో రైల్ అధికార ప్రతినిధి అంజు దయాల్ కృషి చేస్తున్నారు. “ఇకపై ప్రయాణీకుల్ని దూర దూరంగా కూర్చోమని చెబుతాం. అలాగే నిల్చునేందుకు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణీకుల్ని అనుమతిస్తాం” అని బీబీసీతో దయాల్ అన్నారు.
ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే సమయంలో వారిని నియంత్రించడం మెట్రో అధికారులకు తలకు మించిన భారం. ఇక మెట్రో రైల్వే స్టేషన్లలో కూడా విమానాశ్రయాల్లో ఉన్న నియమ నిబంధనలే ఉంటాయి. క్యూ పాటించే సమయంలో భౌతిక దూరం తప్పని సరి. అలాగే శానిటైజింగ్ టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేలపై రౌండ్ సర్కిళ్లు వారికి స్వాగతం పలుకుతాయి. ఆపై థర్మల్ స్కానింగ్, బ్యాగేజీకి ఎక్స్ రే స్క్రీనింగ్ రెండూ తప్పనిసరిగా కొనసాగుతాయి.
మెట్రో స్టేషన్లలో పొడవైన క్యూలు
అంటే ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా మరిన్ని కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే రైళ్ల ఫ్రీక్వెన్సీని కూడా పెంచాల్సి ఉంటుంది.
ప్రతి కోచ్ వద్ద కనీసం ఇద్దరు భద్రతా సిబ్బంది ఉండాలి. పరిమితికి మించిన ప్రయాణీకులు లోపలికి వెళ్లకుండా నియంత్రిస్తూ ఉండాలి. అయితే దిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే రాజీవ్ చౌక్ వంటి మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణీకుల్ని ఎలా అదుపు చెయ్యాలో తెలీక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నిజానికి ఇప్పుడు మెట్రో విషయంలో అధికారుల ముందు ఉన్న ప్రధాన సమస్య ఇదే. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలన్న విషయంపై ప్రస్తుతం అధికారులు చర్చిస్తున్నారు.
ప్రయాణ బీమా
ఇకపై అన్ని ప్రయాణాలకు బీమా తప్పనిసరి అవుతుందని అంటున్నారు దుబయ్‌కి చెందిన ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ జనరల్ సెక్రటరీ అఫ్తాబ్ హసన్.
“కోవిడ్ తర్వాత ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా విమాన టిక్కెట్లు, పర్యాటక టిక్కెట్లపై బీమాను తీసుకునేందుకు యువకులు ఇష్టబడరు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అటువంటి ఆలోచనలో ప్రస్తుతం మార్పు వచ్చింది. మున్ముందు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల్లోనైనా లేదా వ్యక్తిగత ప్రయాణాల విషయంలోనైనా ప్రయాణ బీమా అన్నది తప్పనిసరి కానుంది” అని అన్నారు.
ప్రయాణ బీమా కొనుగోలు
ఇలాంటి మహమ్మారి విషయంలో సాధారణ బీమాలు వర్తించవు. వాటి కోసం అదనంగా కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. కానీ భవిష్యత్తులో కోవిడ్-19 వంటి మహమ్మారి కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో తప్పనిసరిగా భాగం కానుంది అని హసన్ అభిప్రాయపడ్డారు.
ఇక శంషుద్దీన్ విషయాన్నికి వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేమని అంటున్నారు. “అనుకున్న సమయానికి వ్యాక్సీన్ అందుబాటులోకి రాకపోతే ప్రయాణీకుల విషయంలో అన్ని మారిపోతాయి. నాకు చాలా భయం వేస్తోంది. ఏదైనా అద్భుతం జరిగి టీకా త్వరగా అందుబాటులోకి వస్తే మళ్లీ మన జీవితాలు మునుపటిలా మారిపోతాయి” అని ఆయన చెప్పుకొచ్చారు.
(స్టోరీ: సల్మాన్ రావి, ఎడిటింగ్: నికిత మంధానీ, చిత్రాలు: నికిత దేశ్‌పాండే)

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









