కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...

- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ న్యూస్
ముంబయి నగరంలో కరోనావైరస్ సోకిన గర్భిణులు 100 మందికి పైగా బిడ్డలకు జన్మనిచ్చారు. గత నెలలో లోక్ మాన్య తిలక్ హాస్పిటల్లో జన్మించిన 115 మంది శిశువులలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కానీ, వారు వ్యాధి నుంచి కోలుకున్నట్లు తర్వాత నిర్వహించిన పరీక్షలు వెల్లడించాయి.
ఇద్దరు గర్భిణులు కోవిడ్ సోకి మరణించారు. అందులో ఒకామె బిడ్డకు జన్మనివ్వక ముందే మరణించారు. ముంబయిలో ఇప్పటికే 20 వేలకు పైగా మంది కోవిడ్ 19కు గురైనట్లు నమోదు కాగా, 730 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో, భారత ఆర్ధిక రాజధాని కోవిడ్‌కు కేంద్రంగా మారింది.
సియోన్ హాస్పిటల్లో సగం మంది శిశువులు కరోనావైరస్ సోకిన తల్లులకు జన్మించారు. ఇందులో చాలా మందికి సిజేరియన్ చేసి కాన్పు చేయవలసి రాగా, మిగిలినవి సహజ ప్రసవాలు అని వైద్య అధికారులు చెప్పారు.
అందులో 56 మంది మగ శిశువులు ఉండగా 59 మంది ఆడ శిశువులు ఉన్నారు. కరోనావైరస్ సోకిన 22 మంది మహిళలు ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చారు. అయితే, వీరికి వైరస్ ఇంటి వద్ద ఉన్నప్పుడే సోకిందా లేక హాస్పిటల్ వార్డులో సోకిందా అనేది తెలియదు.
40 బెడ్లు ఉన్న ప్రత్యేక వార్డులో 65 మంది డాక్టర్లు, 24 మంది నర్సులతో కూడిన వైద్య బృందాలు గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో గర్భిణుల కోసం హాస్పిటల్ ఇంకొక 34 పడకలను పెంచాలని చూస్తోంది.
డాక్టర్లు, నర్సులు, మత్తు మందు ఇచ్చే అనస్థిస్టులు రక్షణ పరికరాలు ధరించి ఆరు టేబుళ్ల పై మూడు ఆపరేషన్ థియేటర్లలో ఈ డెలివరీలు చేస్తున్నారు.
"వైరస్ పాజిటివ్ వచ్చిన చాలా మంది మహిళల్లో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఒక అదృష్టం” అని గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణ్ నాయక్ చెప్పారు. “కొంత మందికి మాత్రం జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపించాయి. వారికి చికిత్స అందించి కాన్పు తర్వాత ఇంటికి పంపినట్లు" చెప్పారు.
“తల్లులలో చాలా ఆందోళన చెందుతున్నారు. మేం మరణించినా పర్వాలేదు, బిడ్డను మాత్రం బతికించండి అని అడుగుతూ ఉండేవార'ని అన్నారు.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లులను కోవిడ్ 19 ప్రత్యేక వార్డులో ఒక వారం రోజుల పాటు ఉంచి హైడ్రోక్సిక్లోరోక్విన్ మందుని ఇచ్చినట్లు వారు చెప్పారు. తర్వాత క్వారంటీన్లో 10 రోజుల పాటు ఉంచినట్లు చెప్పారు. తల్లులు ఫేస్ మాస్క్లు ధరించి పిల్లలకి తల్లి పాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పిల్లలని తల్లుల నుంచి పూర్తిగా దూరం చేయలేదు.
ఈ వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్‌లో ఒక శిశువుకు పుట్టిన 30 గంటలలోపే వైరస్ సోకినట్లు ఫిబ్రవరిలో నమోదైంది.
మార్చి నెలలో చికాగోలో కోవిడ్‌కు గురై ఏడాది నిండని పాప మరణించింది. కనక్టికట్‌లో కోవిడ్ 19 లక్షణాలతో 6 వారాల చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఈ నెల మొదట్లో 3 సంవత్సరాల చిన్నారి వేల్స్ లో మరణించినట్లు వార్తలు వచ్చాయి.
బిడ్డ తల్లి గర్భంలో ఉండగా తల్లి నుంచి బిడ్డకి వైరస్ సంక్రమించడం అరుదని న్యూ యార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చిన్నపిల్లల అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ డాక్టర్ ఆడమ్ రాట్నర్ చెప్పారు.
అయితే, ఈ పరిస్థితి మారేందుకు అవకాశాలు ఉన్నాయని అయన అన్నారు. ప్రతి రోజు కోవిడ్ లక్షణాలు, వ్యాప్తి గురించి కొత్త సమాచారం అందుబాటులోకి వస్తోందని చెప్పారు.
తల్లి గర్భంలో ఉండే మావి పొరల్లో కూడా కరోనావైరస్ కనిపిస్తోందని కొత్తగా నివేదికలు వస్తున్నాయని అన్నారు. కానీ, అది బిడ్డని ఇన్ఫెక్షన్ కి గురి చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

వైరస్ తీవ్రంగా సోకిన కొంత మంది గర్భిణీల కడుపులోనే శిశువులు మరణిస్తున్న నివేదికలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, అది పూర్తిగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకడం వలనేనని చెప్పడానికి లేదని అన్నారు.
ఒక్కొక్కసారి శిశువులు గర్భంలో ఉండగానే వైరస్ బారిన పడుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయని రాట్నర్ తెలిపారు. "కోవిడ్ 19 సోకిన తల్లులకు పుట్టిన బిడ్డల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉందని" ఆయన అంటున్నారు.
రాట్నర్ తాను స్వయంగా కోవిడ్ సోకిన తల్లులకు పుట్టిన బిడ్డల సంరక్షణను పర్యవేక్షించానని చెప్పారు. వైరస్ తల్లి నుంచి బిడ్డకి సోకకుండా పిల్లలకి తల్లి పాలు ఇప్పించే ఏర్పాట్లు చేశామని. వైరస్ సోకిన చాలా మంది పిల్లలు త్వరగానే కోలుకున్నారని ఆయన చెప్పారు.
ముంబయి హాస్పిటల్లో కోవిడ్ 19 సోకిన తల్లులకు పుట్టిన పిల్లల సంఖ్య అంతే వ్యవధిలో సాధారణంగా జరిగే కాన్పుల కన్నా 20 శాతం ఎక్కువగా ఉంది.
“గత వారం ఒక 28 ఏళ్ళ గర్భిణి ఒక బిడ్డకు జన్మనిచ్చాక మరణించడం మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. ఆమె లివర్ దెబ్బ తినడంతో ఇక కోలుకోవడం సాధ్యపడలేదు” అని నాయక్ చెప్పారు.
“ఆమెకు చికిత్స అందిస్తున్నప్పుడు మేమెంత నిస్సహాయులమో అర్ధమైంది. నన్ను కాపాడటానికి ఏదైనా చేయగలరా? అని ఆమె దీనంగా అడుగుతూనే ఉంది."

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న వదంతులు... వాటిలో నిజమెంత?
- రియాన్స్ వరల్డ్: ఎనిమిదేళ్ల ఈ అబ్బాయి ఏడాదిలో రూ. 184 కోట్లు సంపాదించాడు
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం
- భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








