కరోనావైరస్: గల్ఫ్ దేశాల్లో దిక్కు తోచని స్థితిలో భారతీయ వలస కార్మికులు

- రచయిత, సమీర్ హష్మి
- హోదా, మిడిల్ ఈస్ట్ బిజినెస్ కరెస్పాండెంట్, దుబాయ్
ప్రదీప్ కుమార్, 8 నెలల గర్భిణి అయిన ఆయన భార్య గతవారం రెండు రాత్రులు పార్కింగ్ స్థలంలో తలదాచుకున్నారు.
నిజానికి వారు అదే భవనంలో అద్దెకు ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. అద్దె చెల్లించలేకపోవడంతో ఇంటి యజమాని వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. చివరకు ఒక స్థానిక స్వచ్ఛంద సంస్థ వారిని ఆదుకుంది.
కుమార్ పని చేసే హోటల్ ఫిబ్రవరిలో మూత పడింది. అప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఒక్కసారిగా ఆదాయం పడిపోవడంతో ఆ హోటెల్ తన కార్యకలాపాలను నిలిపి వేసింది. కుమార్ పని చేసిన చివరి నెల జీతం కూడా యాజమాన్యం చెల్లించలేదు.
అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు ఎలాగైనా తమ సొంత ఊరు మదురైకి వచ్చేయాలని చేయని ప్రయత్నం లేదు. గర్భంతో ఉన్న ప్రేమలతకు డయాబెటిస్ వచ్చింది.
“నా భార్య ప్రసవానికి నా దగ్గర డబ్బు లేదు. అలాగని వెళ్లిపోదామంటే విమాన చార్జీలు కూడా లేవు” అని బీబీసీకి చెప్పారు కుమార్.
తల్లి కాబోతున్న ప్రేమలత 33వారంలో అడుగు పెట్టిన తర్వాత ప్రయాణం చేస్తే ఆమెకు, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించినట్లు కుమార్ చెప్పారు. ఇప్పుడు ఎలాగైనా తన వారిని బతికించుకోవాలన్నదే ఆయన తపన.

ఫొటో సోర్స్, Reuters
పీకల్లోతు కష్టాల్లో లక్షలాది మంది కార్మికులు
కోవిడ్-19 మహమ్మారి కారణంగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవడంతో కుమార్ వంటి లక్షలాది వలస కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు.
వారిలో ఎక్కువ మంది అంతంత మాత్రం ఆదాయం ఉండే కూలీలే. సొంత ఊరిలో ఆర్థికంగా కుదేలైన తమ కుటుంబాలను ఎంతో కొంత పైకి తీసుకురావాలన్న లక్ష్యంతో చాలా మంది ఉపాధి వెతుక్కుంటూ ఈ ప్రాంతాలకు వలస వచ్చారు.
గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో దశాబ్దాలుగా ఈ వలస కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, ఆతిథ్యం, రియాల్టీ, ట్రావెల్ రంగాల్లో వారు తమ సేవలను అందిస్తున్నారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఒ) లెక్కల ప్రకారం “గల్ఫ్ పరస్పర సహకార మండలి(జీసీసీ)”లోని ఆరు దేశాలైన సౌదీ అరేబియా, ది యునైటెడ్ ఎమిరేట్స్(యూఏఈ), ఖతర్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌లలో సుమారు 2కోట్ల 30 లక్షల మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. వారిలో ఆసియా దేశాలకు చెందిన వారి సంఖ్యే ఎక్కువ.
ఉపాధి కోల్పోయిన ఆ కార్మికులంతా ఇప్పుడు తమ తమ స్వదేశాలకు తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ప్రయాణికుల్ని తీసుకెళ్లే అన్ని విమానాలు నిలిచిపోయాయి.

ఫొటో సోర్స్, AFP
అయితే, గల్ఫ్ దేశాల ఒత్తిడి మేరకు భారత్, పాకిస్తాన్ దేశాలు అక్కడ ఉంటున్న తమ దేశాలకు చెందిన కార్మికుల్ని వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. నిజానికి అది కూడా సవాలుతో కూడుకున్న పనే.
కేవలం ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే సుమారు 2 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత వారంలో సుమారు 2 వేల మందికి భారత్‌కు వచ్చారు.
రానున్న వారాల్లో మరిన్ని విమానాలను నడుపుతామని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే స్వల్పకాలిక వీసాలపై వెళ్లి అక్కడ చిక్కుకున్న వారు, వైద్య పరంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు, అలాగే గర్భిణులు, వృద్ధులు ఇలా ప్రాధాన్య క్రమంలో మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే, కొద్ది సంఖ్యలో మాత్రమే విమాన సీట్లు ఉండటంతో జాబితాలో ఉన్నవారికి కూడా టిక్కెట్టు దొరకడం కష్టమైపోతోంది.
భారత్‌కు వచ్చిన వాళ్లంతా కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అయితే క్వారంటీన్ సమయంలో వసతి, భోజన ఖర్చులు వాళ్లే భరించాలి. దీంతో అటు విమాన చార్జీలు, ఇటు క్వారంటీన్ ఖర్చులు రెండింటిని భరించడం కొందరికి ఇబ్బందిగా మారుతోంది.

ఫొటో సోర్స్, AFP
మరిన్ని విమానాలను నడపాలి
మహమ్మద్ అనస్, మరో 9 మంది భారతీయ కార్మికులతో కలిసి ఉంటున్నారు. వాళ్లంతా ఓ ట్రావెల్ కంపెనీలో పని చేస్తున్నారు. కానీ వారు పని చేసే సంస్థ ఫిబ్రవరిలోనే మూత పడింది. అనస్‌కు ఇంకా 2 నెలల జీతం రావాల్సి ఉంది.
“గత వారంలో భారత్‌కు బయలుదేరిన విమానాల్లో ఏదో ఒక దానికి టికెట్ దొరుకుతుందని ఆశించాను. కానీ స్థానిక భారత రాయబార కార్యాలయం నుంచి నాకు పిలుపు రాలేదు. నాకు ఉద్యోగం లేదు. డబ్బులు కూడా లేవని వాళ్లకు ఓ లేఖ రాశాను” అని ఆయన తన బాధను చెప్పుకున్నారు.
రానున్నమూడు, నాలుగువారాల్లోప్రపంచవ్యాప్తంగాఉన్నసుమారు 2 లక్షలమంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మే 16 నుంచి 23 తేదీల మధ్యలో గల్ఫ్ ప్రాంతం నుంచి 35 విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒక్క యూఏఈ నుంచే 9 వేల మందిని స్వదేశానికి రప్పించింది. స్థానికంగా ఉండే ఆ దేశ రాయబార కార్యాలయం అందించిన సమాచారం మేరకు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సుమారు 60 వేలకు పైగా పాకిస్తానీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం మరిన్ని విమానాలను నడపాలని యూఏఈలో ఉంటున్న బాబర్ వంటి చాలా మంది పాకిస్తానీలు కోరుతున్నారు. ఉద్యోగం లేకుండా అక్కడ బతకడం చాలా కష్టమవుతోందన్నది వారి ఆవేదన.
హనీఫ్, దుబయ్‌లో 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన పని చేస్తున్న కంపెనీ ఆయనను వేతనం లేని నిరవధిక సెలవుపై వెళ్లమని ఆదేశించింది.
గడిచిన కొన్ని వారాలుగా ఆయన స్వదేశాలకు వెళ్లే విమానాల్లో టిక్కెట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.
“ఇక్కడ ఖర్చుల్ని నేను భరించలేకపోతున్నాను. ఇప్పటికే చాలా సార్లు పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాను. కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు” అని ఆయన బీబీసీకి చెప్పారు.
దక్షిణాసియాకు చెందిన చాలా మంది కార్మికులు సాయం చెయ్యాలంటూ తమను సంప్రదిస్తున్నారని స్థానిక స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. స్థానిక అధికారుల సాయంతో ఆ సంస్థలు వారికి ఆహారాన్ని అందిస్తున్నాయి.
“ఇక్కడ ఉన్న చాలా మంది కార్మికులకు వేతనాలు అంతంత మాత్రమే. అలాంటి వాళ్లే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నారు” అని దుబయ్‌లో పీసీటీ హ్యుమానిటి పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న జోగిందర్ సింగ్ సలారియా అన్నారు.

ఫొటో సోర్స్, AFP
అడుగడుగునా కరోనా ముప్పు
అదే సమయంలో కిక్కిరిసిన శిబిరాల్లో ఉన్న కార్మికులకు కరోనావైరస్ సోకకుండా చూసేందుకు గల్ఫ్ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
చాలా శిబిరాల్లో ఒక్కో గదిలో ఆరుగురు నుంచి పన్నెండు మంది వరకు ఉంటున్నారు. అలాంటి చోట పరిశుభ్రతను పాటించడం, భౌతిక దూరాన్ని ఆశించడం అసాధ్యమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది.
“ఏ ఒక్కరూ ఇటువంటి పరిస్థితుల్లో నివసించకూడదు. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో తక్షణం ఆ శిబిరాల్లోని పరిస్థితిని మెరుగు పరచాలి” అని ఆ మానవ హక్కుల సంఘం హెచ్చరించింది.
శిబిరాలను ఎక్కడికక్కడ లాక్ డౌన్ చేసిన స్థానిక అధికారులు, మరింత ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని శిబిరాల్లో జనాలను తగ్గిస్తున్నారు కూడా.
అయితే, వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం శనివారం నాటికి యూఏఈలో 21,831 కరోనా కేసులు నమోదయ్యాయి. 210 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలో 49,176 కేసులు నమోదు కాగా, 292 మంది మరణించారు.

ఫొటో సోర్స్, AFP
స్వల్ప ఆదాయం ఉండే వలస కార్మికులపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపిస్తోందని యూఏఈ ప్రభుత్వం తెలిపింది. అయితే వారికి అన్ని విధాలా సాయం అందిస్తున్నామని కూడా స్పష్టం చేసింది.
“వారిని అన్ని విధాల ఆదుకుంటున్నాం, వీసాల కాల పరిమితిని ఆటోమేటిగ్గా పొడిగిస్తున్నాం. వసతి, ఆహార సౌకర్యాన్ని అందిస్తున్నాం. ఉచిత వైద్య సౌకర్యం కూడా కల్పించడం ద్వారా వారికి వీలైనంత సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. కోవిడ్-19 పరీక్ష పథకం కింద కూడా వారు లబ్ది పొందుతున్నారు. అందులో భాగంగా వారు ఉండే శిబిరాల వద్దే వారికి కరోనావైరస్ పరీక్షల్ని నిర్వహిస్తున్నాం” అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
గత కొద్ది వారాలుగా, యూఏఈ, సౌదీ ప్రభుత్వాలు కూడా వాణిజ్య కార్యకలాపాలపై ఉన్న ఆంక్షల్ని సడలిస్తూ వస్తున్నాయి. అలాగే, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఉద్దీపనల్ని కూడా ప్రకటిస్తున్నాయి.
అయితే, కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో ఆంక్షల్ని సడలించినప్పటికీ ఎప్పటిలా వ్యాపార కార్యకలాపాలు నడవటం ఇప్పట్లో కష్టమే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు దొరకడం అసాధ్యమని అనస్ వంటి చాలా మంది వలస కార్మికులు భావిస్తున్నారు.
“ఎన్నో కలలతో ఇక్కడకు వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం తిరిగి నా వాళ్ల దగ్గరకు వెళ్లిపోవాలనుకుంటున్నాను. నా సంపాదన తగ్గినా నేను పెద్దగా పట్టించుకోను” అని అనస్ చెప్పారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్‌తో పోరాడే ఔషధాన్ని తయారు చేయనున్న భారత్, పాకిస్తాన్లలోని అయిదు కంపెనీలు
- మద్యం దుకాణాల ముందు భారీ క్యూల వెనుక చీకటి నిజం ఏమిటి?
- వలస కూలీలకు ప్రస్తుతం అందిస్తున్న సహాయం సరిపోదు.. రాష్ట్రం మరిన్ని చర్యలు చేపట్టాలి - ఏపీ హైకోర్టు ఆదేశాలు
- కరోనావైరస్ రోగులకు చికిత్స అందించే ఓ నర్సు, ఆమె కుమారుడు.. ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచించారు
- కరోనావైరస్ వ్యాక్సిన్: కోతులపై ప్రయోగంలో పురోగతి.. మానవులపైనా టీకా ప్రయోగాలు
- సముద్రపు ముసుగు దొంగలు తుపాకుల మోతతో దాడి చేసి కిడ్నాప్ చేసిన రోజు...
- కరోనావైరస్: రోహింజ్యా శరణార్థి శిబిరంలో రెండు కోవిడ్ కేసులు... దాదాపు రెండు వేల మందికి ఐసోలేషన్
- ‘భారత్‌లో హిందువులకు, ముస్లింలకు... పాకిస్తాన్లో ముస్లింలకు, వాళ్లకు’ : బ్లాగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








