కరోనావైరస్: పాకిస్తాన్‌లో హాస్పిటల్లో బెడ్ దొరక్క చనిపోయిన డాక్టర్.. భార్యకూ సోకిన వైరస్

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో గడిచిన మూడు వారాల్లోనే కరోనావైరస్ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.

పాకిస్తాన్‌లో గత మూడు వారాల్లోనే కరోనా సోకిన వారి సంఖ్య మూడురెట్లు పెరిగింది. అదనంగా రెండు వేల పడకలతో ఆస్పత్రులు ఏర్పాటు చేసినా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ కరోనాను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

సాక్షాత్తూ ఒక డాక్టర్‌కే ఏ ఆస్పత్రిలోనూ బెడ్ దొరకలేదు. కోవిడ్-19తో బాధపడుతున్న ఆ డాక్టర్ చివరికి వైద్య సహాయం అందక చనిపోయిన ఘటనపై బీబీసీ ప్రతినిధి ఉమర్ నంగానియా అందిస్తున్న కథనం.

డాక్టర్ ఫుర్ఖాన్ ఉల్ హక్ తన ఊపిరితిత్తులకు కరోనా సోకినప్పటికీ హాస్పిటల్ వెళ్లేందుకు మొదట నిరాకరించారు. కానీ పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేయాల్సి వచ్చింది. కానీ, ఆయనను అడ్మిట్ చేసుకునేందుకు మూడు హాస్పిటల్స్ తిరస్కరించాయి. అక్కడ బెడ్లు లేవు. డాక్టర్ ఫుర్ఖాన్ తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది.

ఆ తర్వాత శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారింది. తన పరిస్థితి విషమిస్తోందన్న విషయం ఒక డాక్టర్‌గా ఆయనకు అర్థమైంది. హాస్పిటల్‌లో తన కోసం ఒక బెడ్‌ వెతకాలని తోటి డాక్టర్‌ను సాయం కోరారు. కానీ, ఎవరూ ఆయనకు సాయం రాలేదు.

కొద్ది గంటల తర్వాత డాక్టర్ ఫుర్ఖాన్ తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తమకు ఎవ్వరూ సాయం చేయలేదని డాక్టర్ భార్య బీబీసీతో చెప్పారు. ఇప్పుడు ఆమెకు కూడా వైరస్ ఉంది.

"మా దగ్గర బెడ్లు లేవంటూ తిరస్కరించారు. అక్కడి హాస్పిటల్ బెడ్స్ నిండిపోయాయి. నేను ఒక ప్రైవేటు హాస్పిటల్‌కి ఫోన్ చేస్తే కాల్ కట్ చేశారు. ఆయనను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాను. నేనే స్ట్రెచర్‌పై పడుకోబెట్టాను. సాయం కావాలని అడుగుతూనే ఉన్నాను, కానీ ఎవరూ ముందుకు రాలేదు" అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

డాక్టర్ మృతిపై జరిగిన 24 గంటల విచారణ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ డాక్టర్ నిర్లక్ష్యమే ఆయన మరణానికి కారణమని తేల్చింది.

డాక్టర్ ఫుర్ఖాన్ తమ వద్దకు వచ్చారని కానీ, ఫోన్ చేశారని గానీ ధ్రువీకరించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ నిరాకరించాయి.

డాక్టర్ ఫుర్ఖాన్ కేసు పాకిస్తాన్‌లోని ప్రజారోగ్య వ్యవస్థ దుస్థితికి నిలువెత్తు నిదర్శనం. అది కుప్పగూలిపోయే దశలో ఉంది.

రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి తాత్కాలిక ఫీల్డ్ హాస్పిటల్స్‌లో ప్రభుత్వం అదనపు బెడ్లను ఏర్పాటు చేస్తోంది. కానీ సదుపాయాలు, శిక్షితులైన సిబ్బందికి మాత్రం ఇంకా కొరతగానే ఉంది.

కరోనా రోగుల కోసం పాకిస్తాన్ ఇప్పటివరకు మొత్తం 20 వేల బెడ్లను ఏర్పాటు చేసింది. అందులో ఇప్పటికే సగం వరకు నిండిపోయాయి.

పాకిస్తాన్ ఆరోగ్యశాఖ మంత్రి డా.అజ్రా ఫజల్ పెచ్చూహు, "దురదృష్టవశాత్తూ తగినన్ని బెడ్లను హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకోలేకపోయాయి. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ వల్ల మొత్తం వ్యవస్థ కుప్పకూలుతోంది. మా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందికి కూడా కరోనా సోకుతోంది" అని ఆయన అన్నారు.

ఏడువారాలపాటు కొనసాగిన లాక్‌డౌన్‌ను పాకిస్తాన్ ఇప్పుడు సడలించడం ప్రారంభించింది. ప్రజలు మార్కెట్లు, బజార్లకు వెళ్లడం మొదలైంది. రంజాన్ జరుపుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ సడలింపు వల్ల కరోనా కేసులు పెరిగి బెడ్ల అవసరం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)