కరోనావైరస్: భారత్‌లో కోవిడ్ కేసులు జూన్-జూలై నాటికి 'పీక్'కు చేరుకుంటాయా?

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జూన్-జులైలో కరోనావైరస్ కేసులు భారత్‌లో పీక్ (గరిష్ఠ స్థాయి)కి చేరుకుంటాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులెరియా చెప్పినట్లు వార్తా చానల్స్‌లో, సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ కరోనావైరస్ కేసుల్లో పీక్ ఇంకా రాబోతుందని అన్నారు.

‘‘నేను నిపుణుడిని కాదు. కానీ, కేసుల్లో పీక్ ఇంకొంత ఆలస్యంగా వస్తుంది. అది జూన్, జులై, ఆగస్టు ఇలా ఎప్పుడు వచ్చినా, లాక్‌డౌన్ నుంచి ట్రాన్సిషన్‌కు మనం సిద్ధంగా ఉండాలి’’ అని రాహుల్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తే కరోనావైరస్ కేసుల్లో పీక్ ఇక రాకపోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగ్రవాల్ అన్నారు.

అసలు ఈ పీక్ అంటే ఎంటి? అదే వస్తే రోజూ ఎన్ని కేసులు నమోదవుతాయి?

చాలా మందికి ఈ సందేహాలున్నాయి? కొందరేమో లాక్‌డౌన్‌ను ఇంకా పొడగిస్తారని అనుకుంటున్నారు. ఇంకొందరు దుకాణాలు మళ్లీ మూతపడతాయని అంటున్నారు. ఇలా ఎవరికి అర్థమైన రీతిలో వాళ్లు అంచనాలు వేసుకుంటున్నారు.

రణ్‌దీప్ గులెరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాక్టర్ రణ్‌దీప్ గులెరియా

రణ్‌దీప్ గులెరియా ఏం చెప్పారంటే...

ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులెరియా మాట్లాడిన అన్ని విషయాలనూ బీబీసీ శ్రద్ధగా విన్నది. ఆయనను, ‘‘భారత్‌లో కరోనావైరస్ పీక్ ఇంకా రావాల్సి ఉందా?’ అని అడిగారు.

గులెరియా దానికి బదులిస్తూ, ‘‘ఇప్పుడైతే కేసులు పెరుగుతున్నాయి. పీక్ వస్తుంది. కానీ, అది ఎప్పుడు వస్తుందనేది మెడికల్ డేటాపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది నిపుణులు దీనిపై డేటా మోడలింగ్ చేశారు. వారిలో భారత నిపుణులు ఉన్నారు. విదేశీ నిపుణులు ఉన్నారు. ఎక్కువ మంది జూన్-జులైలో పీక్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టులోనూ వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు లెక్కగట్టారు’’ అని గులెరియా అన్నారు.

‘‘మోడలింగ్ డేటా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదట్లో మోడలింగ్ డేటా మేలో పీక్ వస్తుందని సూచించింది. లాక్‌డౌన్ పొడగింపు విషయాన్ని వాటిలో పరిగణనలోకి తీసుకోలేదు. ఆ అంశాన్ని కూడా తీసుకుంటే, పీక్ వచ్చే సమయం ఇంకా ముందుకు వెళ్తుంది. ఇదంతా డైనమిక్ ప్రొసెస్. అంటే నిత్యం మారే ప్రక్రియ. వారం తర్వాత అంచనాలు మరోలా ఉండవచ్చు’’ అని చెప్పారు.

రణ్‌దీప్ గులెరియా మేథమెటికల్ డేటా మోడలింగ్‌ ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

కానీ, ఆయన ఏ డేటా మోడలింగ్ ఆధారంగా మాట్లాడారు? దాన్ని ఎవరు చేశారు? ఆయనే స్వయంగా చేశారా?

ఈ ప్రశ్నలు ఆయన్ను ఎవరూ అడగలేదు. ఆయన కూడా ఆ విషయాలు వివరించలేదు.

ఆయన నుంచి ఈ వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ కథనం రాసే సమయానికి గులెరియా నుంచి స్పందన రాలేదు.

కరోనా కేసులు

ఫొటో సోర్స్, Twitter/Prof. Shamika Ravi

ఫొటో క్యాప్షన్, మే 7 వరకు కరోనావైరస్ సోకినవారి వివరాలు

డేటా మోడలింగ్ ఎలా చేస్తారు?

ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రొఫెసర్ శమికా రవితో బీబీసీ మాట్లాడింది. ఆమె ఆర్థిక నిపుణురాలు. ప్రభుత్వ విధానాలపై పరిశోధనలు చేస్తుంటారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల మండలి సభ్యురాలిగానూ పనిచేశారు. కరోనావైరస్ విషయంలో ప్రతి రోజూ ఆమె గ్రాఫ్‌ను అధ్యయనం చేస్తూ ట్విటర్‌లో తన విశ్లేషణలను వెల్లడిస్తూ ఉంటారు.

‘‘ఇలాంటి డేటా మోడలింగ్‌లను రెండు రకాల నిపుణులు చేస్తుంటారు. వైద్య రంగంలో ఉన్న ఎపిడెమియాలజిస్ట్‌లు నిపుణులు ఇచ్చిన ఇన్ఫెక్షన్ రేటు డేటా ఆధారంగా అంచనాలు వేస్తారు. వీటిలో ఎక్కువవరకూ థియరాటికల్ మోడల్‌లే ఉంటాయి.

మరోవైపు ఆర్థిక నిపుణులు కూడా అప్పటివరకూ ఉన్న సమాచారాన్ని బట్టి సరళిని అర్థం చేసుకుని, అంచనా వేసేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను బట్టి విశ్లేషణలు జరుపుతారు. ప్రమాణాలను బట్టి ఇవి ఉంటాయి’’ అని ఆమె చెప్పారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

గులెరియా వ్యాఖ్యలు తాను వినలేదని, ఆయన ఏ మోడల్ ఆధారంగా మాట్లాడారో తనకు తెలియదని శమికా అన్నారు.

‘‘ఎపిడెమియాలజికల్ డేటాలో కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని సార్లు అవి రెండు నెలల క్రితం చేసినవై ఉంటాయి. అలాంటప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. దేశంలో మార్చిలో చేసిన అధ్యయనం మేలో పీక్ వస్తుందని చెప్పొచ్చు. కానీ, నిజాముద్దీన్ మర్కజ్ అంశాన్ని, లాక్‌డౌన్ పొడగింపు, మద్యం దుకాణాలను తెరవడం వంటి అంశాలను అందులో పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చు’’ అని ఆమె అన్నారు.

‘‘ఎపిడమాలజికల్ మోడల్‌ చాలా కొలమానాలపై డేటా ఆధారపడి ఉంటుంది. గ్రామీణ-పట్టణ తేడాలు, ప్రజల వయసు వివరాలు, కుటంబ పరిస్థితులు... ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోకుంటే సరైన ఫలితాలు రావు’’ అని శమికా అన్నారు.

‘‘భారత్‌కు వర్తించే సమాచారం తీసుకోవాలి. కానీ, చాలా అధ్యయనాలు యూరప్‌ సమాచారం మీద ఆధారపడతాయి. అందుకే మోడలింగ్ డేటా అంచనాలు ఒక్కోవారం ఒక్కోలా ఉంటున్నాయి’’ అని ఆమె చెప్పారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

జూన్-జులై పీక్‌ను ఎంతవరకూ నమ్మవచ్చు?

మోడలింగ్ డేటాలోని విషయాలను భారత్‌లోని వైద్యులు ధ్రువీకరించనంతవరకూ, అవి ఈ దేశానికి వర్తిస్తాయని అనుకోలేమని శమికా రవి అన్నారు.

గత మూడు రోజులుగా దేశంలో రోజూ 3వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పది రోజుల ముందు రోజూ 1500-2000 మధ్య కేసులు నమోదయ్యేవి.

కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం కూడా తగ్గుతోంది. ఇదివరకు 12 రోజులుగా ఉన్న డబ్లింగ్ వ్యవధి, ఇప్పుడు సుమారు 10 రోజులకు తగ్గింది.

లాక్‌డౌన్ మొదటి రెండు విడతలు కొన్ని ఘటనలు మినహా కఠినంగా అమలైంది. మూడో విడతలో మినహాయింపులు ఇచ్చారు. మద్యం దుకాణాలు తెరవడంతో, వాటి ముందు జనాల బారులు తీరుతూ కనిపించారు. వలస కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలుతున్నారు. విదేశాల నుంచి కూడా జనాలను తీసుకువస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనావైరస్ కేసులు పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి.

‘‘కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు చికిత్స లేదు. అది సంక్రమించేందుకు పట్టే సమయాన్ని మాత్రమే తగ్గించగలుగుతాం. లాక్‌డౌన్‌లు విధిస్తూ పోలేం. ఏర్పాట్లకు అవసరమైన సమయం ప్రభుత్వానికి లభించింది. ఇలాగే పరిస్థితి కొనసాగించడం కుదరదు. దేశంలోని వైద్యులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని శమికా అభిప్రాయపడ్డారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరిస్థితుల్లో ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవి...

  • జూన్-జులైలో పీక్ వస్తుందని ఏ మోడలింగ్ డేటా ఆధారంగా గులెరియా చెప్పారు?
  • ఏదైనా ప్రభుత్వ సంస్థ ఆ సమాచారం ఇచ్చిందా? లేక ఎయిమ్స్ డైరెక్టర్ స్వయంగా ఇచ్చారా?
  • ఏ అంశాల ఆధారంగా పీక్‌ను అంచనా వేశారు?
  • భారతీయ ప్రమాణాల ఆధారంగానే ఈ అంచనా వేశారా?
  • ఈ అధ్యయనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జరిగింది?
  • లాక్‌డౌన్ మూడో విడతలో జనాలను రైళ్లు, విమానాల్లో తరలిస్తున్న విషయాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారా?
  • అసలు పీక్‌ను ఏమని నిర్వచించారు?

పైనున్న ప్రశ్నలకు జవాబులు దొరికేంతవరకూ, ఆ అంచనాలను నమ్మవచ్చా, లేదా అన్నదానిపై ఓ నిర్ధరణకు రాలేం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)