కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు చేసిన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
“దేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో పారిశ్రామిక విప్లవానికి ముందు ఏ పరిస్థితుల్లో కార్మికులు పనులు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది” అని కార్మిక సంఘాలకు సంబంధించిన కొంతమంది చెబుతున్నారు.
దేశంలో చాలా రాష్ట్రాలు కరోనాపై పోరాటం పేరుతో కార్మిక చట్టాల్లోని చాలా నిబంధనలను మూడేళ్ల వరకూ అటకెక్కించాయి. అంటే, కార్మికుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేకుండా పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలకు మినహాయింపులు ఇచ్చినందుకే వారు అలా చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం తమ మంత్రిమండలి సమావేశంలో వీటిలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్రంలో పెట్టుబడులు పెంచేందుకు ఒక నిర్ణయానికి వచ్చింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తర్వాత రాష్ట్రంలో ఇక కార్మికులకు సంబంధించిన మూడు చట్టాలే అమలవుతాయని, మిగతా చట్టాలు మూడేళ్ల వరకూ అమలులో ఉండవని ప్రకటన జారీ చేశారు.
అమలులో ఉండే ఆ మూడు చట్టాలు- భవన నిర్మాణ కార్మిక చట్టం, వెట్టిచాకిరి వ్యతిరేక చట్టం, కార్మిక పరిహార చట్టంలో ఐదో షెడ్యూల్.

ఫొటో సోర్స్, Getty Images
పన్నెండు గంటల షిఫ్ట్
మారిన పరిస్థితుల ప్రకారం కార్మికులు ఇక 12 గంటల షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణాలో కూడా కార్మికులు 8 గంటలకు బదులు 12 గంటల షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆర్కే తివారి మంత్రిమండలి నిర్ణయాలపై మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రానికి చెందిన చాలామంది వలస కార్మికులు తమ ఇళ్లకు వస్తున్నారు. అంటే వారందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంటుంది” అన్నారు.
అలాగే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కార్మిక ఒప్పంద చట్టాన్ని వెయ్యి రోజుల వరకూ రద్దు చేయాలని నిర్ణయించింది.
దానితోపాటు పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్ కూడా రద్దు చేశారు.
మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక యూనిట్లు, కొత్తగా తెరిచే యూనిట్లకు కూడా వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
యజమాని బాధ్యత
కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాలు సరైన స్థితిలో ఉండేలా చూసుకోవడం యజమానుల బాధ్యత
వారికి ప్రాథమిక సౌకర్యాలు అందించడం కూడా వారి చట్టపరమైన బాధ్యత. కానీ ఇకమీదట అలా జరగదు.
పారిశ్రామికవేత్తల చట్టప్రకారం ఇప్పటివరకూ అంగీకరిస్తూ వచ్చిన బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వారికి విముక్తి కల్పించాయి.
మరో మూడేళ్ల వరకూ రద్దు కానున్న కొన్ని నిబంధనలు:
- పనిచేసే ప్రాంతం లేదా ఫ్యాక్టరీలో అపరిశుభ్రత ఉంటే చర్యల నుంచి యాజమాన్యాలకు ఉపశమనం
- పనిచేసే ప్రాంతంలో వెంటిలేషన్ లేకపోయినా లేదా అది గాలి ప్రసరించే ప్రాంతాల్లో లేకపోయినా వారిపై ఎలాంటి చర్యలు ఉండవు
- కార్మికుల్లో ఎవరైనా పని వల్ల అనారోగ్యానికి గురైతే, ఫ్యాక్టరీ మేనేజర్ లేదా సంబంధిత అధికారికి తెలియజేయాల్సిన అవసరం లేదు
- మరుగుదొడ్లు లేకపోయినా యాజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోరు
- యూనిట్లు తమ సౌలభ్యం, షరతుల ప్రకారం కార్మికులను నియమించవచ్చు, తొలగించవచ్చు
- కార్మికులు దుర్భర స్థితిలో పనిచేస్తుంటే, లేబర్ కోర్టు పట్టించుకోదు, మరో కోర్టులో కూడా దానిని సవాలు చేయలేం
భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత
వీటితోపాటు కార్మికులు ఉండడానికి, విశ్రాంతి తీసుకోడానికి ఏర్పాట్లు, లేదా మహిళా కార్మికుల పిల్లల కోసం క్రెచ్ లాంటివి ఏర్పాటు చేయడం కొత్త కంపెనీలకు తప్పనిసరి కాదు.
ఈ యూనిట్లపై ఎలాంటి ప్రభుత్వ సర్వేలు కూడా ఉండవు.
1984లో భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం కంపెనీలు ప్రతి ఏటా ఒక్కో కార్మికుడికి 80 రూపాయల చొప్పున జమ చేయడం తప్పనిసరి చేశారు.
ఇప్పుడు ఆ నిబంధన కూడా తొలగించాలని నిర్ణయించారు.
ప్రతిపాదనలో ఉన్న కొత్త నిబంధనలపై కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. వీటివల్ల మరోసారి పారిశ్రామిక విప్లవం ముందున్న పరిస్థితులు ఏర్పడుతాయని వారు అంటున్నారు.
ప్రభుత్వాలు కార్మికులను వెట్టిచాకిరీ వైపు నెట్టేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Diwakar Prasad/Hindustan Times via Getty Images
వెట్టిచాకిరీ లాంటి ప్రవర్తన
ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిసి త్వరలో ఈ నిర్ణయాలను కోర్టులో సవాలు చేస్తాయని బీబీసీతో మాట్లాడిన భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సెక్రటరీ రాజీవ్ అరోడా చెప్పారు.
“సుదీర్ఘ పోరాటం తర్వాత కార్మికులు తమ పరిస్థితిని మెరుగ్గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కరోనా మహమ్మారి సాకుతో కార్మిక చట్టాలను యాజమాన్యాల దగ్గర తాకట్టు పెట్టాయి” అని ఆయన అన్నారు.
మరోవైపు, సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా దీనిపై ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“ఇది వెట్టిచాకిరి కంటే ఘోరంగా ఉంది. భారత రాజ్యాంగం అసలు ఉనికిలో ఉందా? దేశంలో ఏదైనా చట్టం అనేది ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనల్ని పురాతన కాలంలోకి నెట్టేస్తోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం” అన్నారు.
ఒక ట్వీట్‌లో మధ్యప్రదేశ్ గురించి ప్రస్తావించిన ఆయన “భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు చేసిన చట్టాలను, అందరి సంక్షేమం కోసం రూపొందించారు” అన్నారు.
కార్మిక చట్టాల్లో మార్పులు
“మహమ్మారి పేరుతో కోట్లాది కార్మికుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టి లాభార్జనను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఏచూరి అన్నారు.
అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిర్ణయాలపై కేంద్రం ఇంకా ఆమోదముద్ర వేయలేదు.
కార్మిక చట్టాల్లో మార్పుల కోసం రాష్ట్రాలు చేసిన ఈ ప్రతిపాదనలు కేంద్రం ఆమోదం తర్వాతే అమలవుతాయి.
కానీ, కార్మిక సంఘాలు ఆ లోపు వాటిని సవాలు చేసేందుకు న్యాయస్థానం తలుపు తట్టే సన్నాహాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- కరోనావైరస్ సోకిన ఇండియన్ నేవీ సిబ్బంది ఎక్కడున్నారు.. వారికి ఎలా సోకింది
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- లాక్డౌన్ కష్టాలు: కొడుకు శవాన్ని చేతుల్లో మోసుకెళ్లిన తండ్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








