క‌రోనావైర‌స్: రోహింజ్యా శరణార్థి శిబిరంలో రెండు కోవిడ్ కేసులు... దాదాపు రెండు వేల మందికి ఐసోలేషన్

రోహింజ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ వద్ద ఆశ్రయం పొందిన రోహింజ్యా శరణార్థులు

బంగ్లాదేశ్‌లోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద శ‌ర‌ణార్థి శిబిరంలో ఇద్ద‌రు రోహింజ్యాల‌కు క‌రోనావైర‌స్ సోకిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది రోహింజ్యాలు త‌ల దాచుకుంటున్న‌ కాక్స్ బ‌జార్‌లో న‌మోదైన తొలి కేసులు ఇవేన‌ని ప్ర‌భుత్వ వైద్యుడు ఒక‌రు తెలిపారు.

వీరిద్ద‌రినీ విడిగా ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని వివ‌రించారు. మ‌రో 1,900 మంది శ‌ర‌ణార్థుల‌ను ఐసోలేష‌న్‌‌లో ఉంచిన‌ట్లు చెప్పారు.

శ‌ర‌ణార్థుల‌తో కిక్కిరిసిన కాక్స్ బ‌జార్లో మార్చి 14న లాక్‌డౌన్ విధించారు.

శ‌ర‌ణార్థుల‌కు భారీ సంఖ్యలో ఆశ్ర‌యమిచ్చిన గ్రీస్‌లోనూ క‌రోనావైర‌స్ సోకే ముప్పున్న 16 వేల మందిని ఇతర ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

గ‌త వారంలో గ్రీస్‌లోని లెస్‌బోస్ దీవిలో అడుగుపెట్టిన ఇద్ద‌రు వ‌ల‌సదారుల‌కు కోవిడ్‌-19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఈ ఇద్ద‌రినీ ఐసోలేష‌న్‌లో పెట్టారు.

మియన్మార్, ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Reuters

కాక్స్ బ‌జార్‌లో ముప్పు ఏ స్థాయిలో ఉంది?

ప‌రిశుభ్ర‌మైన మంచి నీటికీ నోచుకోని ఇక్క‌డి కిక్కిరిసి‌న శిబిరాలను క‌రోనావైర‌స్ తీవ్రంగా ప్ర‌భావం చూపే ముప్పుంద‌ని స‌హాయ‌క సంస్థ‌లు ఎప్ప‌టినుంచో హెచ్చ‌రిస్తున్నాయి.

"కాక్స్ బ‌జార్‌లోని ప్ర‌పంచంలోనే అతిపెద్ద శ‌ర‌ణార్థుల శిబిరాల్లోకి కూడా వైర‌స్ ప్ర‌వేశించింది. ఇక్క‌డ వేల సంఖ్య‌లో శ‌ర‌ణార్థులు కోవిడ్‌-19తో చ‌నిపోయే ముప్పుంది" అని బంగ్లాదేశ్‌లోని సేవ్ ద చిల్డ్ర‌న్స్ హెల్త్ సంస్థ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ష‌మీమ్ జ‌హాన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

"ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల బంగ్లాదేశ్ కొన్ని ద‌శాబ్దాల వెన‌క్కి వెళ్లిపోయే ముప్పుంది"

ఇక్క‌డ చ‌ద‌ర‌పు కిలో మీట‌రుకు 40,000 నుంచి 70,000 మంది వ‌ర‌కు రోహింజ్యాలు ఉంటార‌ని బంగ్లాదేశ్‌లోని అంత‌ర్జాతీయ స‌హాయ‌క చ‌ర్య‌ల క‌మిటీ డైరెక్ట‌ర్ మ‌నీశ్ అగ‌ర్వాల్ చెప్పారు.

"చైనాలోని ఊహాన్ న‌గ‌రంలో వైర‌స్ తీవ్రంగా విజృంభించినప్ప‌టితో పోలిస్తే.. జ‌పాన్ తీరంలోని డైమండ్ ప్రిన్సెస్ నౌక‌లో నాలుగు రెట్లు వేగంగా వైర‌స్ వ్యాప్తి చెందింది. అయితే డైమండ్ ప్రిన్సెన్ నౌక కంటే.. రోహింజ్యా శిబిరాల్లో జ‌న సాంద్ర‌త 1.6 రెట్లు ఎక్కువ‌" అని రాయిట‌ర్స్ వార్తా సంస్థ‌కు ఆయ‌న వివ‌రించారు.

రోహిజ్యాలు ఎవ‌రు?

మ‌య‌న్మార్‌లో త‌రాల త‌ర‌బ‌డి అణ‌చివేత‌కు గుర‌వుతున్న మైనారిటీల్లో రోహింజ్యాలు ఒక‌రు. 2017లో వీరి సంఖ్య దాదాపు ప‌ది లక్ష‌ల వ‌ర‌కూ ఉండేది.

అయితే, 2017 ఆగ‌స్టులో రోహింజ్యా అతివాద సంస్థ‌కు చెందిన‌ కొంద‌రు మ‌య‌న్మార్‌లో 30కిపైగా పోలీస్ చెక్‌పోస్ట్‌ల‌పై విధ్వంస‌క‌ర‌ దాడులు చేశారు. దీంతో ప్ర‌భుత్వ ప్ర‌తిచ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డి, ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని పెద్ద‌యెత్తున రోహింజ్యాలు బంగ్లాదేశ్‌కు త‌ర‌లిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)