నిర్మలా సీతారామన్: స్వయం సమృద్ధ భారత్ సాకారమే ఆత్మనిర్భర్ అభియాన్ ఉద్దేశం

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, ANI

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజీ వివరాలు వెల్లడిస్తున్నాం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

అసలు ఆత్మనిర్భర్ అంటే స్వీయ ఆధారిత అని అర్థం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.

నిర్మల ఇంకా ఏం వివరించారు?

ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని ముందుంటారు. గుజరాత్ భూకంపం నుంచి ప్రస్తుత ప్యాకేజీ ప్రకటన వరకూ అది నిరూపణవుతూనే ఉంది.

ప్రధాని మోదీ తన ప్రసంగం ద్వారా తన దార్శనిక ఆలోచనలను దేశ ప్రజల ముందుంచారు. ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఈ ప్యాకేజీతో ముందుకొచ్చారు. అనేక రంగాలకు చెందిన ప్రజలతో కూడా మాట్లాడి, వారి ఆలోచనలను, సూచనలను కూడా ఈ పథకం రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారు.

అందరితో చర్చించిన తర్వాతే రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.

ఆర్థికవ్యవస్థ, మౌలిక వసతులు, టెక్నాలజీ, డెమోగ్రఫీ, డిమాండ్‌లపైనే ఇది ఆధారపడి ఉంది.

స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ డిమాండ్ కల్పించడమే ఈ పథకం ఉద్దేశం.

పీపీఈ కిట్లు, మాస్కుల ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభించడమే మన సామర్థ్యానికి నిదర్శనం.

జన్‌ధన్, ఆధార్, మొబైల్ వినియోగం భారత్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

నగదు బదిలీ, ఉజ్వల్ వంటి పథకాలు విజయవంతంగా అమలయ్యాయి. వీటి ఫలాలు పేదలు అనుభవిస్తున్నారు.

స్వచ్ఛ్ భారత్ అభియాన్ వంటి ఎన్నో పథకాలు గణనీయమైన ఫలితాలు తీసుకొచ్చాయి.

విద్యుత్ రంగ సంస్కరణల కారణంగా కోతలు లేని నిరంతర విద్యుత్ సాధ్యమైంది. ఇలాంటి ఎన్నో సంస్కరణలు, వాటి ద్వారా పొందిన ఫలితాలే ఈ ఆత్మనిర్భర్ అభియాన్‌కు మూలం.

లాక్ డౌన్ ప్రారంభించిన వెంటనే... పేదలెవరూ ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోదీ పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించారు.

రూ.52,606 కోట్ల రూపాయలు నేరుగా 41 కోట్ల జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్లలోకి నగదు బదిలీ చేశాం. రూ.18 వేల కోట్ల విలువైన బియ్యం, గోధుమలను 69 కోట్ల రేషన్ కార్డుదారులకు అందించాం. దివ్యాంగులు, వృద్ధులకు పించన్లు అందించాం.

స్వయం సమృద్ధ భారత్ అనే కల సాకారం కోసం... అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేలా ఈ ప్యాకేజీ రూపొందించాం.

18000 కోట్ల రూపాయలను పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ల రూపంలో చెల్లించాం. దీనివల్ల 14లక్షల ట్యాక్స్ చెల్లింపుదారులు లబ్దిపడ్డారు.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, ANI

ఆత్మనిర్భర్ అభియాన్‌లో ఏముంది?

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగపడేలా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం.

కొలేటరల్ అవసరంలేని రుణ సౌకర్యం కల్పిస్తున్నాం. రూ.25 కోట్ల రుణం ఉండి, రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఇది అక్టోబర్ 31 వరకూ అమలులో ఉంటుంది.

రూ.20000 కోట్ల రూపాయలను ఇబ్బందుల్లో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అందిస్తాం. దీంతో 2 లక్షల పరిశ్రమలు లాభపడతాయి. ఎన్‌పీఏలు, అన్ని ఎంఎస్ఎంఈలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రూ.50000 కోట్ల రూపాయలను ఈక్విటీ ఇన్‌ఫ్యూజన్ కింద ఎంఎస్ఎంఈలు తమ సామర్థ్యాన్ని విస్తరించుకోవడానికి అందిస్తాం. ఇప్పటికే పనితీరు బాగున్నవాటికి ఇది ఉపయోగపడుతుంది.

ఇంతకీ ఎంఎస్ఎంఈ అంటే?

ఈ పథకం ద్వారా ఎక్కువమంది లబ్ది పొందాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని కూడా కొత్తగా రూపొందించాం.

గతంలో రూ.25 లక్షల పెట్టుబడి ఉంటే మైక్రో యూనిట్ అనేవారు. ఇప్పుడు ఈ పరిధిని రూ.కోటికి పెంచుతున్నాం. అంటే రూ. కోటి పెట్టుబడి ఉండి, టర్నోవర్ రూ. 5 కోట్లకు లోబడి ఉంటే దాన్ని మైక్రో యూనిట్ అంటారు.

రూ.200 కోట్ల లోపు టెండర్లు ఇకనుంచి గ్లోబల్ టెండర్లుగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్లకు ఇది కచ్చితంగా వర్తిస్తుంది.

కోవిడ్-19 సంక్షోభం తర్వాత ట్రేడ్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లను ఈ-మార్కెట్లతో లింక్ చేస్తాం. దీనిద్వారా వారి ఉత్పత్తులను సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ఈపీఎఫ్ చెల్లింపులకు కూడా సడలింపులు కల్పిస్తున్నాం. గతంలో కల్పించిన ప్రయోజనాన్ని ఆగస్టు 31 వరకూ పొడిగిస్తున్నాం. అంటే, ఉద్యోగి వైపు నుంచి చెల్లించే 12శాతం ఈపీఎఫ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది.

స్టాట్యుటరీ పీఎఫ్ చెల్లింపులను 12 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నాం. అంటే సంస్థలు 10శాతం పీఎఫ్ చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల సంస్థల చేతులో నగదు లభ్యత ఉంటుంది. ఇది కూడా వచ్చే 3 నెలలకు వర్తిస్తుంది.

నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్‌లకు సంబంధించి రూ. 30000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ స్కీమ్ ప్రవేశపెడుతున్నాం. ఈ మొత్తంతో ఈ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు, అలానే ఎంఎస్ఎంఈలకు రుణాలు కల్పించవచ్చు.

మార్చి 2021 వరకూ టీడీఎస్, టీసీఎస్ చెల్లింపులను 25శాతం తగ్గిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.50000 కోట్లు ప్రజల చేతుల్లోకి వస్తాయి.

ఐటీ రిటర్నుల దాఖలకు గడువును నవంబర్ 30 వరకూ పొడిగిస్తున్నాం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)