"క‌రోనావైర‌స్‌ వ్యాక్సీన్ అంద‌రికీ అందాలంటే రెండున్న‌రేళ్లు ప‌డుతుంది" - డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌త్యేక రాయ‌బారి డేవిడ్ న‌బారో

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్ర‌తినిధి

క‌రోనావైర‌స్ వ్యాక్సీన్ అంద‌రికీ చేరువ‌య్యేందుకు దాదాపు రెండున్న‌రేళ్లు ప‌డుతుంద‌ని కోవిడ్‌-19పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) ప్ర‌త్యేక రాయ‌బారి డేవిడ్ న‌బారో తెలిపారు.

"సుర‌క్షిత‌, శ‌క్తిమంత‌మైన వ్యాక్సీన్ త‌యారీకి కనీసం ఎనిమిది నెల‌లు ప‌డుతుంద‌ని అంచ‌నాలు చెబుతున్నాయి. అలాంటివి చాలా ఉత్ప‌త్తి చేయాల్సి ఉంటుంది. భారీగా త‌యారు చేయ‌డంతోపాటు 780 కోట్ల మందికి వీటిని వేయాలంటే మ‌రో సంవ‌త్స‌రం కంటే ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది"అని ఆయ‌న బీబీసీకి చెప్పారు.

"కొన్నేళ్ల త‌ర‌బ‌డి ప్ర‌య‌త్నిస్తున్నా కొన్ని వైర‌స్‌ల‌ను అడ్డుకొనే సుర‌క్షిత వ్యాక్సీన్లు ఇప్ప‌టికీ అందుబాటులోకి రాలేద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తుపెట్టుకోవాలి" అని డేవిడ్ చెప్పారు. లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజీలో గ్లోబ‌ల్ హెల్త్ ప్రొఫెస‌ర్‌గానూ ఆయ‌న ప‌నిచేస్తున్నారు.

"సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించి భార‌త్ మంచి ప‌నిచేసింది. జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో సామాజిక దూరం, వ్య‌క్తిగ‌తంగా ఐసోలేష‌న్‌లోకి వెళ్ల‌డం లాంటి నిబంధ‌న‌లను ముందుగా ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ రోజులే ఇక్క‌డ‌ పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యంగా ముంబ‌యి, చెన్నై, కోల్‌క‌తా, దిల్లీ లాంటి మ‌హా న‌గ‌రాల‌కు ఇది త‌ప్ప‌నిసరి. లేక‌పోతే జ‌న సాంద్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో వైర‌స్‌కు క‌ళ్లెం వేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది" ఆయ‌న వివ‌రించారు.

డేవిడ్ నబారో

ఫొటో సోర్స్, Getty Images

జ‌న‌వ‌రి చివ‌రి వారంలో భార‌త్‌లో తొలి కోవిడ్‌-19 కేసు న‌మోదైంది. మార్చి 24కు కేసుల సంఖ్య‌ ఇక్క‌డ 550కు పైబ‌డ‌టంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు.

అత్య‌వ‌స‌ర స‌ర‌ఫ‌రాల‌పై నెమ్మ‌దిగా ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తూ.. ఈ లాక్‌డౌన్‌ను మూడుసార్లు పొడిగించిన‌ప్ప‌టికీ.. కేసుల సంఖ్య 74 వేలు దాటిపోయింది. రెండు వేల‌కు పైచిలుకు మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

టెస్టులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కేసులు పెరిగాయా? ఇవి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందా? అని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న అవున‌నే స‌మాధానం ఇచ్చారు.

"టెస్టులు చేసిన‌ప్పుడు మాత్ర‌మే ఈ కేసుల‌ను గుర్తించ‌గ‌లం. అయితే అన్ని చోట్లా టెస్టులు నిర్వ‌హించ‌డం సాధ్య‌ప‌డ‌టం లేదు. అది భార‌త్‌లో కావ‌చ్చు.. లేదా మ‌రెక్క‌డైనా అవ్వొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఆసుప‌త్రుల్లో ఏం జ‌రుగుతోందో చూడండి. క‌రోనావైర‌స్ సోకిన రోగులు పోటెత్తుతున్నారు. మ‌నం చేస్తున్న ప్ర‌య‌త్నాల కంటే వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉంది. ఈ స‌మ‌యంలో ఆరోగ్య సిబ్బందిని ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దించ‌డం, ఆరోగ్య బీమా చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి"అని డేవిడ్ వివ‌రించారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

దేశ వ్యాప్తంగా ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా లాక్‌డౌన్ విధించ‌డంతో ల‌క్ష‌ల మంది వ‌ల‌స కార్మికులు.. ఉండేందుకు చోటు, తినడానికి ఆహారం లేక ఎక్క‌డిక‌క్క‌డే చిక్కుకుపోయారు. దీంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ అంశంపై డేవిడ్ స్పందిస్తూ.. ఆర్థిక అంశాల‌తోపాటు మాన‌వ‌తా విలువ‌లు ముడిప‌డివున్న ఈ అంశంపై చ‌ర్చ‌లు జ‌రిపి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌‌ని అన్నారు.

"ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు ఎందుకు జారీ చేయలేద‌ని అడుగుతున్నారు. ఎందుకు స‌త్వ‌ర‌మే స్పందించ‌లేక‌పోయార‌ని స్పెయిన్‌, ఇట‌లీ, బ్రిట‌న్‌, అమెరికా ప్ర‌జ‌లు అడుగుతున్నారు. నిజ‌మే.. ముందుగా స్పందించి ఉంటే మెరుగ్గా చ‌ర్య‌లు తీసుకొనే వాళ్లం. భార‌త్‌లోనూ తొలి కేసు బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడే విధాన‌ప‌ర‌మైన ఆంక్ష‌లు అమ‌లు చేసుంటే త‌క్ష‌ణ‌మే కోట్ల మంది తీవ్ర ఇబ్బందుల్లో ప‌డేవారు. వెన‌క్కి వెళ్లి అన్నింటిపైనా స‌మాలోచ‌న‌లు జ‌ర‌పాల‌నుకుంటే.. రాజ‌కీయ కోణంలోనూ దీన్ని చూడాల్సి ఉంటుంది" అని ఆయ‌న అన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

భార‌త్‌లో కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ప్ప‌టికీ 50 నుంచి 70 శాతం రోగుల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌ని‌పించ‌డం లేదు. బ‌ల‌మైన రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ వ‌ల్ల ఇలాంటి రోగుల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలూ బ‌య‌ట‌ప‌డ‌టం లేదు. అయితే వీరిని ముందుగా గుర్తించ‌క‌పోతే వైర‌స్ వ్యాప్తి మ‌రింత ఎక్కువ‌య్యే ముప్పుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి ల‌క్ష‌ణాలు లేని రోగులు భార‌త్‌లో ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎదుర‌య్యే స‌వాళ్ల‌పైనా డేవిడ్ మాట్లాడారు.

"భార‌త్‌లో ఎక్కువ కేసుల్లో కోవిడ్‌-19 ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ట్లేదు. లేదా స్ప‌ల్ప స్థాయిలో ఉంటున్నాయి. దీంతో వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు సిద్ధంచేసిన వ్యూహాలు అమ‌లు చేయ‌డం క‌ష్టం అవుతోంది. మ‌రోవైపు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌క‌పోయినా ఐసోలేష‌న్‌లోకి వెళ్లండి, ఉద్యోగాల‌కు సెల‌వుపెట్టండ‌ని చెప్ప‌డమూ క‌ష్ట‌మే. ప్ర‌పంచవ్యాప్తంగా ఈ వైర‌స్ విజృంభణ ఒక్కోచోట ఒక్కోలా ఉంది. దీంతో ఇన్ఫెక్ష‌న్‌కు క‌ళ్లెం వేయ‌డం మ‌రింత క‌ష్టం అవుతోంది" అని ఆయ‌న వివ‌రించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)