కరోనావైరస్ రోగులకు చికిత్స అందించే ఓ నర్సు, ఆమె కుమారుడు.. ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచించారు?

కరోనావైరస్ నర్స్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, అమృతా దూర్వే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసుపత్రుల్లో కోవిడ్-19 రోగులకు సేవలందించే వైద్య సిబ్బంది భావోద్వేగ పరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు? వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా వాళ్ల పిల్లలు ఏమని అనుకుంటున్నారు?

కరోనావైరస్ వార్డులో సేవలందిస్తున్న ఓ నర్సు, ఆమె కుమారుడి మనసులో మాటలకు అక్షర రూపం ఇస్తూ రాసిన ఉత్తరాలు ఇవి.

line

నేను కోవిడ్ వార్డులో నర్సును.

ఆ రోజు ఆసుపత్రిలో మాకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కోవిడ్ రోగులను ఆసుపత్రిలో చేర్చుకుంటున్నామని, అందుకు మానసికంగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అవసరానికి తగ్గట్లు వార్డులను మార్చడం మొదలుపెట్టాం. కస్తూర్భా ఆసుపత్రి నుంచి కొందరు రోగులు మా ఆసుపత్రికి వచ్చారు. వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. నేను పనిచేసే విభాగాన్ని కోవిడ్ వార్డుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు నాకు తర్వాత తెలిసింది.

మార్చి 20 నుంచి కస్తూర్భా ఆసుపత్రిలో రోగులను చేర్చుకోవడం మొదలుపెట్టాం. అంతకుముందు మిగతా విభాగాల్లో ఇలాంటి కేసుల విషయంలో నేను పనిచేశా. అందుకే, నేను భయపడలేదు. ఏం అవసరమో, ఎలాంటి ఏర్పాట్లు చేశారో మేం చదువుతూ ఉన్నాం.

వార్డులో మేం చేయాల్సింది అదే పని. కానీ, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని అర్థమైంది.

మా అబ్బాయి అప్పుడే పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్నాడు. మార్చి 24న వాడి 15వ పుట్టినరోజు. అందుకోసమని చాలా రోజుల ముందే నేను సెలవు పెట్టా. ఏవేవో చేయాలని ప్రణాళికలు వేసుకున్నా.

నా భర్త పాత్రికేయుడు. మేం ఇద్దరం తీరిక లేకుండా పనిచేస్తూనే ఉన్నాం.

కరోనావైరస్ నర్స్

ఫొటో సోర్స్, Getty Images

మా అబ్బాయి పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే కోవిడ్ రోగులు మా వార్డుకు రావడం మొదలైంది. నా భర్తతో చెప్పి, మా అబ్బాయిని వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపించా.

మార్చి 24న పెట్టిన లీవ్ రద్దు చేసుకుని, ఆసుపత్రికి వెళ్లా. ఆ రోజు రాత్రి 8 దాకా ఆసుపత్రిలో ఉన్నా. పనిలో పడిపోయి, మా అబ్బాయి పుట్టినరోజు గురించి మరిచిపోయా. ఆచారం ప్రకారం పుట్టిన రోజునాడు చేయాల్సిన విషయాలు వదిలేయండి. వాడిని కనీసం విష్ కూడా చేయలేదు.

వాడు మా అమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నాడు కదా. పుట్టిన రోజున మా ఆచారం ప్రకారం వాళ్లే ఓవలనీ (దీపాన్ని చుట్టూ తిప్పడం) చేశారు. మేం ఆగలేకపోయాం. రాత్రి 11 గంటలకు వాడిని కలవడానికి వెళ్లాం. అర్ధరాత్రి దేవుడికి దణ్నం పెట్టుకున్నాం.

వాడి పుట్టిన రోజున తల్లిగా నేను ప్రత్యేకంగా ఏదీ చేయలేకపోయా. అయితే, వాడు దీని గురించి కోపం తెచ్చుకోలేదు. ఏమీ అడగలేదు. ''ఇదంతా అయిపోయాక, పుట్టిన రోజు జరుపుకుందాంలే'' అంటూ నన్నే ఓదార్చాడు.

నేను అలాగే చిన్నబుచ్చుకునే ఉన్నా. అయితే నేను వాడికి మాటలు చెప్పాల్సింది పోయి, వాడే నాకు చెప్పాడు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

అప్పటి నుంచి కోవిడ్-19 రోగులకు చికిత్స అందించడంలో నేరుగా భాగమయ్యాను. నా మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తుండేవి. ఈ వ్యాధి నాకు గానీ, నా బృందంలోని సభ్యులకు గానీ సోకే అవకాశం ఉందని నాకు తెలీదు. మొట్ట మొదటిసారిగా రోగి నా వార్డులోకి ప్రవేశించగానే నా టీం మొత్తాన్ని పిలిచాను. వాళ్లందర్నీ ఆప్యాయంగా హత్తుకొని.. "ఇకపై ఈ పరిస్థితిని మనమే ఎదుర్కోవాలి. మన బృందానికి నాయకత్వం వహించే వ్యక్తిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా విధి. ఇప్పటి నుంచి మనకు మనం జాగ్రత్త పడుతూ రోగుల్ని కూడా బాగా చూసుకోవాలి" అని చెప్పాను.

ఈ మాటలు చెబుతున్నప్పుడు నా కన్నీళ్లను నేనే ఆపుకోలేకపోయాను. ఈ సమాజానికి మనం ఎంతో కొంత రుణపడి ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్ను చూపకూడదని ఆ సమయంలో నేను నిర్ణయించుకున్నాను.

మొదటి రోగి పరిస్థితి మెరుగుపడేసరికి మాకు కాస్త ధైర్యం వచ్చింది. అయితే మా అబ్బాయిని వాళ్ల అమ్మమ్మగారి ఇంటికి పంపినా, నా భర్త మాత్రం ఇంట్లోనే ఉంటున్నారు. మరి ఆయన పరిస్థితేంటి?

నేను ఒక వేళ ఇంటికి వెళ్తే నా వల్ల ఏ ఒక్కరైనా వ్యాధికి గురి అవుతారా? మా సొసైటీలో మిగిలిన వాళ్లు సమస్యలు ఎదుర్కొంటారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నన్ను వేధిస్తుండేవి. నా మనసు దుఃఖంతో నిండిపోయేది. కొన్నిసార్లు అసలు ఇంత పెద్ద బాధ్యతను నేను మోయగలనా అన్న సందేహం కలిగేది.

కరోనావైరస్ నర్స్

ఫొటో సోర్స్, Getty Images

అలా నా మనసు వికలమైన ఓ సమయంలో మా అబ్బాయిని ఓసారి పిలిచాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మేం ఉంటున్న ఇంటికి రావద్దని, అలాగే మీ నాన్న కూడా నిన్ను కలవడానికి రారని కరాఖండిగా చెప్పేశాను. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి రోజూ నా భర్త నన్ను ఆస్పత్రి దగ్గర దించి తన పని చేసుకోడానికి తాను వెళ్లిపోయేవారు.

అయితే మా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న మా అబ్బాయి అందుకు తగ్గట్టు మానసికంగా సిద్ధమయ్యాడన్న విషయం వాడి కళ్లల్లోనే కాదు, మాటల్లో కూడా తెలిసేది.

"అమ్మా నువ్వు వచ్చి నన్ను కలవకపోయినా ఫర్వాలేదు. నువ్వేం అధైర్యపడకు" అంటూ నాకు ధైర్యాన్ని చెప్పేవాడు. అప్పటికీ నేను ఏడుస్తుంటే.. "అమ్మా ఒక్క నిమిషం, నువ్వు ఏడవొద్దు" అని ఓదార్చే వాడు.

పదిహేను నిమిషాల తర్వాత, తలుపు దగ్గర నిల్చొని తన చేతుల్లోకి నా చేతిని తీసుకొని నన్ను కూర్చోబెట్టి ఇలా అన్నాడు.

"అమ్మా నువ్వు ఏడవకు. నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు. నాన్న, తాతయ్య, అమ్మమ్మ, మామయ్య అందరం నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం. నువ్వు నర్స్‌గా పని చేస్తున్నావని తెలిసి నా స్నేహితులు కూడా నిన్ను ప్రశంసిస్తున్నారు. నువ్వు ఏడవకూడదు. నువ్వు ఈ పనిని కచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తావన్న నమ్మకం నాకు ఉంది" అంటూ వాడు నన్ను సముదాయిస్తుంటే... ఆ క్షణం నా పదిహేనేళ్ల బిడ్డ ఎంతో ఎత్తుకి ఎదిగినట్టు నాకు అనిపించింది.

ఆ రోజు నుంచి ప్రతిరోజూ నాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. "ఇంటికి చేరుకున్నావా? భోజనం చేశావా? ఆస్పత్రిలో ఇవాళ ఏం జరిగింది? నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నావా?" ఇలా ఎన్నో ప్రశ్నలు వేసేవాడు. వాడితో మాట్లాడుతున్నప్పుడల్లా కన్నీటి పర్యంతమయ్యేదాన్ని. వాడు నన్ను ఓదార్చుతూ ఉండేవాడు. వీడియో కాల్ చేసినప్పుడు "చూడు నేను అన్ని పనులు బాగా చేస్తున్నాను. బాగా ఫిట్‌గా కూడా ఉన్నా" అనేవాడు. వాడి మాటలకు నేను నవ్వేదాన్ని.

కరోనావైరస్ నర్స్

ఫొటో సోర్స్, Getty Images

నేను పీపీఈ కిట్ ధరిస్తున్నాను కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదని కొన్నిసార్లు అనుకునేదాన్ని. నా బిడ్డ దగ్గరకు వెళ్లి కలవచ్చని భావించేదాన్ని. కానీ అలాంటి సమయంలో నా భర్త.. "ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు వాడిని కలవడానికి వెళ్తే వాడితో పాటు ఉంటున్న వృద్ధులైన నీ తల్లిదండ్రులకు ప్రమాదం ఎదురుకావచ్చు, జాగ్రత్త!" అని హెచ్చరించేవారు.

14 రోజుల పాటు రోజూ పది పన్నెండు గంటలసేపు ఆస్పత్రిలో పని చేశాను. నా వార్డు మొత్తం కోవిడ్-19 రోగులతో నిండిపోయింది. కానీ ఎప్పటికప్పుడు నా వాళ్లు చేసే ఫోన్ కాల్సే నాకు బలాన్ని ఇచ్చాయి.

ఈ మహమ్మారి ఎప్పుడు అదుపులోకి వస్తుందో నాకు తెలియదు. అప్పటి వరకు మా అబ్బాయి అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండాల్సి రావచ్చు. అప్పటి వరకు వాణ్ని నేను కలవలేకపోవచ్చు కూడా.

నా 14 రోజుల విధులు పూర్తైన తర్వాత నన్ను మరో 14 రోజుల పాటు ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంచారు. ఇంట్లో ఒంటరిగా నా భర్త, నేనేమో హోటల్లో, మా అబ్బాయి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో.. ఇలా ముగ్గురం మూడు వేర్వేరు చోట్ల ఉన్నాం.

అదృష్టవశాత్తు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మమ్మల్ని ఆదుకున్నాయి. మేం ఒకరినొకరు చూసుకోగలిగాం. మళ్లీ ఎప్పుడు అందరం కలిసి ఒకేచోట కూర్చొని కబుర్లు చెప్పుకునే పరిస్థితి వస్తుందో నాకు తెలియదు.

లాక్ డౌన్

ఫొటో సోర్స్, ANI

క్వారంటైన్ పూర్తైన తర్వాత మళ్లీ నాకు కోవిడ్-19 పరీక్షలు చేస్తారు. అందులో నెగిటివ్ వస్తే నేను ఇంటికి తిరిగి వెళ్లవచ్చు. పరీక్షల్లో నెగిటివ్ అని తేలిన సమయంలో నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 12 మంది రోగులతో ఉంటూ వారికి చికిత్స అందిస్తూ, 14 రోజుల పాటు వారితో గడిపినప్పటికీ నాకు కరోనావైరస్ సోకలేదన్న మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.

నా భర్తకు ఏ విషయమూ చెప్పలేదు. నేరుగా మా అమ్మగారి ఇంటికి వెళ్లాను. నెల రోజుల తర్వాత నా ఎదురుగా ఉన్న నా బిడ్డ నా కళ్లకు చాలా ఎదిగినట్టు కనిపించాడు. రోజూ నేను ఫోన్లో చూసినట్టు లేడు. ఒక్క నెల రోజుల్లోనే చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది.

నాకు కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ వాడిని నేను దగ్గరకు తీసుకోలేదు. ఏదో మూల ఓ రకమైన భయం నెలకొని ఉండటమే అందుకు కారణం.

నా బిడ్డ ఎప్పుడూ తన మనసులో భావాలను నేరుగా వ్యక్తపరచడు. కానీ నాకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అది చూశాక వాణ్ని గట్టిగా గుండెలకు హత్తుకొని మనసు తీరా ఏడవాలనిపించింది. నువ్వు నా కన్నా ఎంతో పరిణతి చెందావని, నిజానికి నాలో అంత పరిణతి లేదని చెప్పాలనిపించింది.

సుమారు పదిహేను నిమిషాల పాటు మా అమ్మ ఇంట్లో గడిపాను. రెండు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ నా విధుల్లో చేరిపోయాను. మళ్లీ 14 రోజుల పాటు ఉద్యోగం, మరో 14 రోజుల పాటు క్వారంటైన్.. ఆపై మరోసారి కోవిడ్-19 పరీక్షలు... ఈ ప్రక్రియ నాకు తప్పదు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితులన్నీ మామూలుగానే ఉంటాయని, మళ్లీ మేం అందరం కలుస్తామని నేను బలంగా నమ్ముతున్నాను.

- సోనమ్ గౌమి

line

సోనమ్ గౌమీ 15 ఏళ్ల కుమారుడు శార్దూల్ సోనల్ సునీల్ కూడా తన మనసులోని భావాలను ఇలా రాసుకొచ్చారు.

నా తల్లి కోవిడ్ వార్డులో పని చేస్తోంది.

కోవిడ్-19 ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంపైనా ఏదో రకంగా ఇది ప్రభావం చూపుతోంది. అలాగే నా జీవితంపై కూడా.

ఈ మహమ్మారి విస్తరిస్తున్నప్పుడు సరిగ్గా నా పదో తరగతి పరీక్షలు మధ్యలో ఉన్నాయి. రానున్న వేసవి సెలవుల కోసం నా స్నేహితుల్లా నేను కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. సెలవుల్లో ఏ రోజు ఏం చెయ్యాలో ముందుగానే చాలా ప్లాన్లు వేసుకున్నాను.

కానీ ఒక్కసారిగా ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. నిజానికి ఆ నిర్ణయం పట్ల నేను అంత సంతోషంగా లేను. అప్పటికి ఈ వ్యాధి తీవ్రతను నేను గుర్తించలేకపోయాను.

నా తండ్రి ఓ జర్నలిస్ట్. నా తల్లి ముంబయిలోని ఓ పెద్ద ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. వాళ్లిద్దరి ఉద్యోగాలు తప్పనిసరి సేవల కిందే వస్తాయి. కాబట్టి వాళ్లిద్దరూ కూడా లాక్ డౌన్ సమయంలో తమ విధుల్ని నిర్వర్తించి తీరాల్సిందే.

శార్దూల్ చేసిన పోస్ట్

ఫొటో సోర్స్, SHARDUL GHUME

ఫొటో క్యాప్షన్, శార్దూల్ చేసిన పోస్ట్

ఇక మా అమ్మ విషయానికొస్తే కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స అందించాల్సిన బృందంలో ఆమె బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. మా అమ్మ వల్ల నాకు, నా తండ్రికి వ్యాధి సోకుతుందని అంతా భయపడ్డారు. అందుకే నన్ను మా అమ్మమ్మగారి ఇంటికి పంపించేశారు.

ఆ సమయంలో మా నాన్న అప్పుడప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వచ్చేవారు. కానీ ఇంట్లోకి మాత్రం వచ్చేవారు కాదు. బయట ఉండే కాసేపు మాట్లాడి తిరిగి ఆఫీసుకు వెళ్లిపోయేవారు.

మొదటి విడత విధులు పూర్తైన తర్వాత మా అమ్మను ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంచారు. నెల రోజుల పాటు ఆమెను నేరుగా కలవలేకపోయాను. ఈ కొద్ది రోజులూ.. మా నాన్న మా ఇంట్లో, నేను అమ్మమ్మ ఇంట్లో, ఒంటరిగా హోటల్ గదిలో క్వారంటైన్లో మా అమ్మ.. అదీ మా ముగ్గురి పరిస్థితి.

కరోనావైరస్ నర్స్

ఫొటో సోర్స్, Getty Images

ముందు జాగ్రత్తలో భాగంగా మా అమ్మ కరోనా పరీక్షలు చేయించుకుంది. మా అందరిలోనూ ఒక్కటే టెన్షన్. అమ్మతో పాటు పని చేస్తున్న ఒకరికి పాజిటివ్ అని రావడంతో మేం మరింత ఆందోళన చెందాం.

నేను ప్రతిరోజూ అమ్మకు ఫోన్ చేసేవాణ్ని. కొన్నిసార్లు వీడియో కాల్ చేసేవాడిని. ఒంటరితనంతో బాధపడుతోందన్న విషయం నాకు అర్థమయ్యేది. ఆమెను ఏదో విధంగా సంతోషపెట్టేందుకు నేను, మా కుటుంబ సభ్యులం ప్రయత్నించేవాళ్లం. అప్పుడప్పుడు నేను జోకులేసి ఆమెను నవ్వించేందుకు ప్రయత్నించేవాడిని. కానీ రోజూ ఆమె లోలోపల తీవ్ర వేదన అనుభవిస్తోందన్న సంగతి మాకు తెలియదు.

కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందన్న విషయాన్ని అమ్మ ఫోన్ చేసి మాకు చెప్పగానే హమ్మయ్య అనుకున్నాం. ప్రమాదం నుంచి బయట పడిందన్న విషయం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత వచ్చి కలుస్తానని అమ్మ నాకు చెప్పింది. కానీ ఏప్రిల్ 21న సడన్‌గా అమ్మమ్మ ఇంట్లో అమ్మ ప్రత్యక్షమైంది. ఇంట్లోకి రాగానే చేతులు, నోరు శుభ్రంగా కడుక్కొని తుడుచుకుంది. ఆ తర్వాత వచ్చి సోఫాలో కూర్చుంది.

నాలో ఓ వైపు ఆశ్చర్యం.. మరోవైపు సంతోషం. ఇంత త్వరగా అమ్మ వస్తుందని నేను అనుకోలేదు. అమ్మను గట్టిగా వాటేసుకోవాలనుకున్నాను. కానీ అమ్మ మాత్రం తనకు దూరంగా ఉండమని నాకు చెప్పింది.

తనకు కూడా నన్ను హత్తుకొని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని ఉన్నప్పటికీ ఆమె ఆ పని చెయ్యకూడదు. కానీ అమ్మను అలా అంత దగ్గరగా చాలా రోజుల తర్వాత చూడటమే నాకు చాలా గొప్ప విషయం.

నా వరకు ఈ ఏడాదిలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ క్షణాలు అవే.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

అమ్మ, నన్ను ఎంతగా ప్రేమిస్తోందో నాకు ఆరోజే తెలిసింది. ఇక అమ్మ నాతోనే ఉంటుందని నేను సంబరపడిపోయాను. కానీ అలా జరగలేదు. రెండు రోజుల తర్వాత ఆమె మళ్లీ విధుల్లో చేరాల్సి ఉంది. రెండు వారాల పాటు ఉద్యోగం, ఆపై మరో రెండు వారాల పాటు హోటల్లో క్వారంటైన్.. అదీ ఆమె షెడ్యూల్.

నిజానికి నాకైతే ఆమెను మళ్లీ పంపాలని లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా ఆమె తిరిగి విధుల్లో చేరాలి. ఎందుకంటే ఇప్పటికే నర్సుల కొరత తీవ్రంగా ఉంది.

"డ్యూటీ ఫస్ట్" అన్న విషయాన్ని ఆమె నుంచే నేను నేర్చుకున్నాను. ఇలాంటి బాధ్యతాయుతమైన తల్లిదండ్రులకు బిడ్డగా పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.

ఇవాళ మనం ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతోందని అనుకోవచ్చు. మన హక్కులన్నింటినీ ఎవరో తీసుకెళ్లిపోయారని బాధపడొచ్చు. కానీ కరోనావైరస్ వ్యాప్తిని ఛేదించాలంటే లాక్ డౌన్‌కు సహకరించడం తప్పనిసరి.

కరోనావైరస్ వార్డ్

ఫొటో సోర్స్, ANI

కనీసం ఇప్పటి నుంచి అయినా చిన్న చిన్న అవసరాలకోసం బయటకి వెళ్లాలనుకునేవాళ్లు, రాత్రీపగలు, తమ కుటుంబాలను వదిలేసి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తూ కరోనావైరస్‌తో పోరాటం చేస్తున్న నా తల్లిదండ్రుల వంటి వాళ్ల గురించి ఒక్కసారి ఆలోచించండి.

అలాంటి వాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మనందరం బాగుండాలని వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. మీరు ఇంట్లోంచి అడుగు బయటపెట్టే ముందు కోవిడ్‌పై పోరాటం చేస్తున్న తమవారి ఆరోగ్యం కోసం నిరంతరం వేదన పడుతున్న వారి కుటుంబాల గురించి ఆలోచించండి.

ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి.

-శార్దూల్ సోనల్ సునీల్ గౌమి

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

line

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)