నరేంద్ర మోదీ:లాక్‌డౌన్-4 వివరాలు త్వరలో ... రూ. 20 లక్షల కోట్లతో 'ఆత్మనిర్భర భారత్ అభియాన్'

మోదీ

ఫొటో సోర్స్, ANI

ఒక్క వైరస్ ప్రపంచం మొత్తాన్నీ సమస్యల్లోకి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు కూడా అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ ఏమన్నారంటే...

కరోనావైరస్‌పై ప్రపంచ పోరాటం నాలుగు నెలలుగా సాగుతోంది.

ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవితాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యావత్తు ప్రపంచం ఒక రకమైన యుద్ధం చేస్తోంది.

ఇదివరకు ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు. వినలేదు.

మానవ జాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతమిది.

కానీ, అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరు.

మోదీ

ఫొటో సోర్స్, ANI

మనల్ని మనం కాపాడుకోవాలి. ముందుకు సాగాలి.

కరోనా సంక్షోభం మొదలైనప్పుడు భారత్‌లో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదు. ఎన్95 మాస్కులు నామమాత్రంగా ఉత్పత్తయ్యేవి. కానీ ఇప్పుడు భారత్‌లో ప్రతి రోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు తయారుచేస్తున్నాం.

ఆపదను అవకాశంగా భారత్ మార్చుకోవడంతోనే ఇది సాధ్యమైంది.

మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది. 21వ శతాబ్దం భారతదేనని మనం గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం.

కరోనావైరస్ సంక్షోభానికి ముందు పరిస్థితులను చూశాం. తర్వాత పరిస్థితులను చూస్తున్నాం.

ఇవన్నీ చూస్తుంటే, 21వ శతాబ్దం భారత్ కల మాత్రమే కాదు, బాధ్యత కూడా.

ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి స్వయం సమృద్ధ భారతే దీనికి మార్గమని చెబుతోంది.

ఆర్థిక కేంద్రిత గ్లోబలైజేషన్ స్థానంలో మానవ కేంద్రిత గ్లోబలైజేషన్ గురించి చర్చ ఇప్పుడు సాగుతోంది.

ప్రపంచానికి భారత్ ఆశా కిరణంలా కనిపిస్తోంది. భారత సంస్కృతి, ఆచారాలు ప్రపంచమంతా ఒకటే కుటుంబమని చాటుతాయి.

భారత్ స్వయంసమృద్ధిలో ప్రపంచం గురించి కూడా పాటుపడుతుంది. ప్రపంచాన్ని కుటుంబంలా భావిస్తుంది. ప్రాణులందరి బాగు కోరుకుంటుంది. భూమిని తల్లిలా భావిస్తుంది.

భారత్ అభివృద్ధిలో ఎప్పుడూ ప్రపంచ అభివృద్ధి కలిసి ఉంటుంది.

భారత్ లక్ష్యాలు, చర్యలు ప్రపంచం ముందుకు కదిలేందుకు తోడ్పడతాయి. టీబీ అయినా, పోలియో అయినా, భారత్ చేపట్టే కార్యక్రమాల ప్రభావం ప్రపంచంపై ఉంటుంది.

చావు బతుకుల కోసం పోరాటం చేస్తున్న ప్రపంచానికి భారత్ ఔషధాలు ఓ కొత్త ఆశను చిగురింపజేస్తున్నాయి.

ప్రపంచానికి భారత్ ఎంతో చేయగలదని, మానవాళికి ఎంతో ఇవ్వగలదని ప్రపంచానికి నమ్మకం ఏర్పడుతోంది.

130 కోట్ల భారతీయుల ఆత్మనిర్భర భారత్ సంకల్పమే ఇది సాకారం చేసే మార్గం.

వై2కే సంక్షోభం వచ్చినప్పుడు భారతీయ నిపుణులే దాన్ని గట్టెక్కించారు.

ఆత్మ నిర్భర భారత్ ఐదు స్తంభాలపై నిల్చుంటుంది. వాటిలో మొదటిది క్వాంటం వేగంతో వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ. రెండోది మౌలిక వసతులు. మూడోది ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యవస్థ. నాలుగోది మన జనాభా. ఐదోది డిమాండ్.

కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొంనేందుకు ఓ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తున్నా.

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. అన్ని రకాల ఉద్యోగులకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకే ఈ ప్యాకేజీ ప్రకటనే చేస్తున్నాం. ఈ ప్యాకేజీ మన దేశ జీడీపీలో 10శాతం. ఈ ప్యాకేజీ విలువ దాదాపు రూ.20 లక్షల కోట్లు.

భూమి, కార్మికులు, లిక్విడిటీ, చట్టాలు.. ఇలా అన్నింటికీ ఈ ప్యాకేజీ ఊతమిస్తుంది.

ఈ పథకం మేకిన్ ఇండియా లక్ష్యాన్ని కూడా సాధించేందుకు దోహదం చేస్తుంది.

దేశ పౌరుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్మికులు, రైతుల కోసం... నిజాయతీగా పన్ను చెల్లించే మధ్య తరగతి ప్రజల కోసం... దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న పరిశ్రమల కోసం ఈ ప్యాకేజీ. రాబోయే రోజుల్లో ఈ ప్యాకేజీ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి వివరాలు వెల్లడిస్తారు.

భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పూర్తిగా పేదలు, రైతుల జేబుల్లోకి చేరాయి. అది కూడా అన్ని సేవలు వ్యవస్థలు మూసుకుపోయినప్పుడు. జన్‌ధన్‌కు సంబంధించిన ఓ సంస్కరణ వల్ల ఇది సాధ్యమైంది. ఇలాంటి సంస్కరణలు అన్నింటిలో తెస్తాం.

కరోనావైరస్ చాలాకాలం పాటు మన జీవితాల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ అలా జరగకుండా చేయాలి. ఈ వైరస్ మనల్ని మన లక్ష్యాల నుంచి దూరంగా వెళ్లనివ్వకుండా మనం జాగ్రత్త పడాలి.

కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి లాక్ డౌన్-4 అవసరం. అయితే ఇది విభిన్న నిబంధనలతో, సరికొత్తగా ఉంటుంది.

రాష్ట్రాల నుంచి మాకు వస్తున్న సూచనల ఆధారంగా నిర్ణయిస్తాం. దీని గురించి సమాచారాన్ని మే 18లోపు వెల్లడిస్తాం.

భారత్‌ను ఆత్మ నిర్భర్ భారత్ చేయగలుగుతాం. చేసి తీరుతాం.

మోదీ

ఫొటో సోర్స్, ANI

ఇప్పటివరకూ ఏం జరిగింది?

భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనావైరస్‌ మహమ్మారికి సంబంధించి ఐదోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

మార్చి 24 నుంచి అమల్లో ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది.

రెండోసారి విధించిన లాక్ డౌన్ వాస్తవానికి మే 3తో ముగియాల్సి ఉండగా, మరో రెండువారాల పాటు పొడిగిస్తూ మే 1న హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

మే 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 10కి పైగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇప్పటికే మే 12 నుంచి రైలు ప్రయాణాలకు కేంద్రం అనుమతించింది. మే 15 లోపు దేశీయ విమానాలను ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)