కరోనావైరస్ లాక్‌డౌన్: విమాన, రైల్వే ప్రయాణాలకు రంగం సిద్ధం... 'ఈ నెలలోనే సేవలు ప్రారంభం'

ఫొటో సోర్స్, twitter/DelhiAirport
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మళ్లీ ఇవి ఎప్పుడు రాకపోకల్ని ప్రారంభిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు బీబీసీ ఎయిర్ పోర్ట్స్ అథార్టీ, విమానాశ్రయ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించింది. తమ పేర్లు వెల్లడించకూడదన్న షరతుతో కొందరు సమాచారం ఇచ్చారు.
వారు వెల్లడించిన వివరాల ప్రకారం, మే నెలలోనే విమానాలు, రైల్వేల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాలను మే నెల రెండో వారంలో ప్రారంభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైళ్లను కూడా రెండో వారంలో కానీ, మూడో వారంలో కానీ ప్రారంభించే అవకాశాలున్నాయి.
అయితే, వీటిలో ప్రయాణాలు మాత్రం ఇదివరకు ఉన్నట్లు ఉండవు. అవి పూర్తిగా మార్పు చెందుతాయని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

విమాన ప్రయాణాలు ఇలా...
లాక్ డౌన్ తర్వాత విమానాలను ఎలా నడపాలి అన్న అంశంపై ఎయిర్‌పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్-ఎస్ఓపీ) రూపొందించింది. ఈ ఏడు పేజీల నివేదికను బీబీసీ పరిశీలించింది.
దాని ప్రకారం, విమానాల రాకపోకలు తొలుత దేశ రాజధాని నగరం దిల్లీ సహా అన్ని మెట్రో సిటీలు, ఆయా రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాన నగరాలు/పట్టణాలకు నడుస్తాయి.
ప్రతి విమానయాన సంస్థ లాక్ డౌన్‌కు ముందు నడుపుతున్న సర్వీసుల్లో 30 శాతం సర్వీసులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయానికి వచ్చే, విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి విమానానికీ మధ్య కనీసం 3 గంటల సమయం పాటించే అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయంలో ఎన్ని టెర్మినళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఒక టెర్మినల్ నుంచి మాత్రమే విమానాలు నడుస్తాయి.
సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలను పాటించడం... అంటే మాస్కులు ధరించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్లు వాడటం అటు ప్రయాణీకులకు, ఇటు సిబ్బందికి తప్పనిసరి.
ప్రతి విమానయాన సంస్థ తాము ఎన్ని విమానాలను నడపాలనుకుంటున్నదీ, ఏఏ మార్గాల్లో నడపాలనుకుంటున్నదీ ముందుగానే డీజీసీఏకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా నగరాల్లో లాక్ డౌన్ ఎత్తేయడం, లేదా నిబంధనలు సడలిస్తేనే ప్రయాణాలు జరుగుతాయి. అలాగే, ఆయా విమానాశ్రయాల్లో రద్దీ ఏర్పడకుండా ముందుగానే డీజీసీఏ ఒక షెడ్యూల్ ప్రకారం విమానాల రాకపోకలకు అనుమతులు జారీ చేస్తుంది.
విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు తగినన్ని శానిటైజర్లను అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి విమానాశ్రయాల్లో జీఎంఆర్ సంస్థ ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేస్తోంది. లగేజీ బ్యాగులను కూడా క్రిమి రహితం చేసేలా ఆటోమేటిక్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే, ఇప్పటికే దాదాపు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకులు కూర్చునే సదుపాయాల్లో మార్పులు చేశారు. సామాజిక దూరం ప్రమాణాలను పాటించేలా కుర్చీకి కుర్చీకి మధ్య రెండు కుర్చీల దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైన చోట్ల కుర్చీల వరుసలను తొలగిస్తున్నారు.

ఫొటో సోర్స్, RGIAHyd

ఫొటో సోర్స్, RGIAHyd

ఫొటో సోర్స్, RGIAHyd
విమానాశ్రయాల్లో మొదటి దశలో టీ, కాఫీ మాత్రమే లభిస్తాయి. రెస్టారెంట్లు, బార్లు, ఇతర షాపింగ్ దుకాణాలను మూసివేస్తారు. అయితే, ఆహారాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాతి దశలో సామాజిక దూరం పాటిస్తూ అక్కడే కూర్చుని తినే వెసులుబాటు కల్పిస్తారు. ఆల్కహాల్ అమ్మకాలు మాత్రం స్థానిక ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మొదలవుతాయి. స్పాలు, మసాజ్ కేంద్రాలను తదుపరి ఆదేశాల వరకూ తెరిచేందుకు అవకాశం లేదు.
విమానాశ్రయాల్లో ఎక్కడా రద్దీ అనేది ఏర్పడకుండా తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచాలి. విమానాశ్రయాల్లో చెకిన్ కూడా నిర్ణీత గడువు కంటే ముందే ప్రారంభం అవుతుంది. దీనికి తగిన ఏర్పాట్లు ముందుగానే చేయాల్సి ఉంటుంది. ప్రయాణీకులు కూడా గతంలో కంటే ముందుగానే విమానాశ్రయాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో ప్రతి చోటా సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ మేరకు అవసరమైన సంకేతాలను ఇప్పటికే కొన్ని విమానాశ్రయాల్లో ఏర్పాటు చేశారు.
విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులను పరీక్షించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. వారు పరీక్షించిన తర్వాతే ప్రయాణీకులను లోనికి అనుమతిస్తారు. ఒకవేల ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేకంగా ఉంచేందుకు కూడా తగినంత మంది వైద్యులు, సిబ్బంది, ప్రత్యేక ప్రదేశాన్ని ముందుగానే సిద్ధం చేస్తారు.
ప్రతి ప్రయాణీకుడూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనలో ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేవని ప్రమాణ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. తన వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు తగినన్ని ప్రమాణ పత్రాలను, ప్రయాణీకులు వాటిని నింపేందుకు తగినన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
విమానాశ్రయాల లోపల కానీ, బయట కానీ ఎక్కడా రద్దీ పెరగకుండా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయాల్లో చెత్తను, కరోనావైరస్ నుంచి రక్షణ కోసం ధరించే మాస్కులు, గౌన్లు ఇతరత్రా వాడిపారేసిన వ్యర్థాలను తగిన రీతిలో ప్రమాణాల ప్రకారం మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, twitter/DelhiAirport

ఫొటో సోర్స్, twitter/RGIAHyd
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
''ఒక్క ఇండిగో తప్ప మిగతా అన్ని విమానయాన సంస్థలూ ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి. రాకపోకల్ని ఆపేసి ఐదు వారాలవుతోంది. మరో నెల రోజులు కనుక పరిస్థితులు ఇలాగే కొనసాగితే చాలా విమానయాన సంస్థలు తిరిగి కోలుకోలేనంతగా నష్టాల్లో కూరుకుపోతాయి. కాబట్టే కేంద్ర ప్రభుత్వం విమానాల రాకపోకల్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది'' అని విమాన ప్రయాణాలను పునరుద్ధరించే వ్యవహారాల్లో భాగమైన ఒక అధికారి బీబీసీతో చెప్పారు.
''మాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మే 15వ తేదీ నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. జూన్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కావొచ్చు'' అని ఆ అధికారి తెలిపారు.
''విమానాల్లో కూడా సామాజిక దూరం పాటించాలన్న అంశంపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. కచ్చితంగా పాటించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొన్ని సీట్లను ఖాళీగా వదిలేస్తే తమపై పడే భారాన్ని విమానయాన సంస్థలు కొంత ప్రయాణీకుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొచ్చు. మరికొంత ప్రభుత్వమే చెల్లించాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి. వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు'' అని సంబంధిత అధికారి వివరించారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు



ఫొటో సోర్స్, V Sankar/BBC

ఫొటో సోర్స్, V Sankar/BBC
రైల్వే ప్రయాణాలు ఇలా..
గత కొన్ని రోజులుగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆయా రైల్వే జోన్ల మేనేజర్లతోను, ఉన్నతాధికారులతోనూ వీడియో కాన్ఫరెన్సులు జరుపుతున్నారు.
''ఎప్పట్నుంచి ప్రారంభించమన్నా ప్రారంభించేందుకు మేం అన్ని రకాల ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాం'' అని ఒక రైల్వే అధికారి తెలిపారు.
విమానాశ్రయాల్లో పాటిస్తున్న నిబంధనల తరహాలోనే రైల్వే స్టేషన్లలో కూడా సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలను పాటించనున్నారు. ఇప్పటికే దేశంలోని చాలా రైల్వే స్టేషన్లలో సామాజిక దూరానికి సంబంధించిన సంకేతాలను (మార్కింగ్) సిద్ధం చేశారు. ప్రతి ప్రయాణీకుడూ సంబంధిత గుర్తులో మాత్రమే నిలబడాల్సి ఉంటుంది.
''ఎన్ని రైళ్లు నడపాలి? ఒక్కో కంపార్ట్ మెంట్‌లో ఎంతమంది ప్రయాణీకులను ఎక్కించాలి? అందుకు వారి దగ్గర్నుంచి ఎంత ధర వసూలు చేయాలి? అన్న వాటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు'' అని ఈ పరిణామాల్లో భాగమైన ఒక అధికారి చెప్పారు.
కేవలం స్లీపర్ కోచ్‌లను మాత్రమే నడపాలని, ఏసీ కోచ్‌లను నడపకూడదని ఆలోచిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో సాధారణంగా ఎనిమిది మంది ప్రయాణీకులు ఉంటారని, ఇప్పుడు వారి సంఖ్యను మూడు లేదా ఐదుకు పరిమితం చేయాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే, బెర్తుల సంఖ్యను కూడా కుదించాలని, మధ్యలో ఉండే బెర్తును ఉపయోగించరాదని కూడా ఆలోచిస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ప్రతి రైల్వే జోన్ ఇందుకు ఏర్పాట్లు చేసిందని అధికారులు వెల్లడించారు. దీనికి అయ్యే ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలన్న షరతుపై ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అదనపు సమాచారం: వి. శంకర్, బీబీసీ కోసం
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లాక్‌డౌన్: తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరిన వలస కార్మికుల తొలి రైలు
- ఖైదీలకు కనీసం సూర్యరశ్మి సోకకూడదు.. జైలర్లలకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడి ఆదేశాలు
- రిషి కపూర్: సీన్ ఓకే అయ్యేసరికి నా బుగ్గలు నల్లగా కమిలిపోయాయి.. కన్నీళ్లు ఆగలేదు
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్‌డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- విమానాల్లో సోషల్ డిస్టెన్సింగ్: మిడిల్ సీట్లు ఖాళీగా వదిలేసి తిరిగి ప్రయాణాలు ప్రారంభించవచ్చా?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








