ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైల్వే బుకింగ్స్ ప్రారంభం.. దేశవ్యాప్తంగా నడిచే 30 రైళ్లు, వాటి షెడ్యూల్ ఇదే..

రైల్వే బుకింగ్స్ ప్రారంభం

ఫొటో సోర్స్, IRCTC

ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రారంభించింది.

మార్చి 25వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్ అమలవుతోంది. అప్పటి నుంచి అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి.

అయితే, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను ప్రవేశపెట్టింది. మే 1వ తేదీన తొలి శ్రామిక్ రైలు తెలంగాణ నుంచి కార్మికుల్ని తీసుకుని జార్ఖండ్ వెళ్లింది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 468 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపామని, 5 లక్షల మంది కార్మికులను తరలించామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

రైళ్లు, వాటి టైమింగ్

ఫొటో సోర్స్, Indian Railway

దేశవ్యాప్తంగా నడిచే 15 జతల రైళ్లు, వాటి షెడ్యూల్

కాగా, లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

తొలిదశలో 15 జతల రైళ్లు (మొత్తం 30 రైళ్లు) మే 12వ తేదీ నుంచి ప్రయాణాలు ప్రారంభించనున్నాయి.

న్యూ దిల్లీ నుంచి ముంబయి, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, భువనేశ్వర్, హౌరా, డిబ్రూగర్, అగర్తలా, పట్నా, బిలాస్ పూర్, రాంచీ, మడ్‌గావ్, అహ్మదాబాద్, జమ్ముతావీ నగరాలకు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

కాగా, ఈ రైళ్ల రాకపోకలకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్ఓపీ) కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ఇందులో భాగంగా.. కేవలం కన్ఫర్మ్‌డ్ ఈ టికెట్ ఉన్న వారినే స్టేషన్ లోనికి అనుమతిస్తారు. ప్రయాణీకులంతా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఐఆర్‌సీటీసీ

ఫొటో సోర్స్, IRCTC

ప్రయాణీకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైళ్లలో ప్రయాణించే వారంతా కోవిడ్-19 నేపథ్యంలో ఎవరి ఆరోగ్యానికి వారే బాధ్యులని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

ప్రయాణీకులంతా ఫేస్ మాస్కులను ఉపయోగించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఈ రైళ్లలో భోజన (క్యాటరింగ్) సదుపాయం ఉండదు. కాబట్టి, ఈ టిక్కెట్ ఛార్జీలో క్యాటరింగ్‌ రుసుమును వసూలు చేయరు.

రైల్లో కప్పుకోవడానికి దుప్పట్లు, కంబళ్లను కూడా ఇవ్వరు.

మోదీ వీడియో కాన్ఫరెన్స్

ఫొటో సోర్స్, ANI

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ప్రయాణీకుల రైళ్లు నడపొద్దన్న కేసీఆర్

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

సీఎంలతో ప్రధాని మాట్లాడటం మార్చి 25 తర్వాత ఇది ఐదోసారి.

ఈ సమావేశంలో మోదీతో పాటుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారని సీఎం కార్యాలయం తెలిపింది.

‘‘దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు పోతున్నారో తెలియదు. వారికి కరోనా ఉందో లేదో తెలియదు. అందరికీ టెస్టులు చేయడం కుదరదు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దు’’ అని కేసీఆర్ సూచించారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

ఆరోగ్యసేతు యాప్

దేశంలో 9.8 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎంపవర్డ్ గ్రూప్ 9 ఛైర్మన్ అజయ్ సహానీ తెలిపారు.

కాగా, ఈ యాప్ డేటాకు ఎలాంటి భంగం కలగలేదని వెల్లడించారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ఒకే రోజు 4,213 కొత్త కేసులు, మొత్తం బాధితులు 67,152

భారతదేశంలో గత 24 గంటల్లో 4,213 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 67,152కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో మొత్తంగా 44,029 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 20,916 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2,206 మంది కోవిడ్ వ్యాధితో చనిపోయారు.

దేశం మొత్తం మీద అత్యంత దారుణంగా కోవిడ్ ప్రభావానికి గురైన మహారాష్ట్రలో ఇప్పటివరకు 22,171 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుజరాత్‌లో 8,194 పాజిటివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది. దిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,233కు, తమిళనాడులో 7,204కు పెరిగింది.

మహారాష్ట్రలో 832 మంది ఈ వైరస్‌తో చనిపోయారు. గుజరాత్‌లో మృతుల సంఖ్య 493కు చేరింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభతు్వం సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 38 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, రాష్ట్రంలో కరోనావైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 2,018కి చేరింది. వీరిలో 998 మంది డిశ్చార్జి అయ్యారు. 45 మంది చనిపోయారు. ప్రస్తుతం 975 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా

అమెరికాలో ఆగని కోవిడ్ విలయం

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు 41 లక్షలు దాటిపోయాయి. 28.27 లక్షల మంది చనిపోయారు. అమెరికాలో ఇప్పటివరకు 13.29 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు 80 వేలకు సమీపిస్తున్నాయి.

కరోనావైరస్ సోకిన వారి సంఖ్య విషయంలో అమెరికా తరువాత స్పెయిన్ (2.24 లక్షలు), బ్రిటన్ (2.2 లక్షలు), ఇటలీ (2.19 లక్షలు) దేశాలు ఉన్నప్పటికీ, మృతుల సంఖ్యలో బ్రిటన్ రెండో స్థానంలో ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనావైరస్ రిసోర్స్ సెంటర్ తాజా సమాచారం ప్రకారం బ్రిటన్‌లో 31,930 మంది చనిపోయారు. అయితే, ఇక్కడ మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. ఇక, ఇటలీలో 30,560 మంది, స్పెయిన్‌లో 26,621 మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు.

రెండు లక్షల కరోనా కేసులున్న దేశాల జాబితాలోకి వేగంగా వచ్చిన రష్యాలో మరణాలు రెండు వేలకు చేరువవుతున్నాయి.

భారతదేశంలో కరోనా కేసులు 62,939కి చేరుకున్నాయి. 2,109 మంది చనిపోయారు. ఇప్పటివరకూ దేశంలో 19,358 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఆదివారం నాటికి 20,228 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 770 మంది మరణించారు.

మహారాష్ట్ర తరువాత దిల్లీలో అత్యధికంగా 6,542 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 6,535 మందికి వ్యాధి నిర్ధరణ అయింది. దిల్లీలో 73 మంది, తమిళనాడులో 44 మంది కోవిడ్‌తో చనిపోయారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, AFP

చైనాలోని షులాన్ నగరం మరో వూహాన్ అవుతుందా?

చైనాలో కొత్తగా కరోనావైరస్ వేవ్ వస్తుందేమోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య చైనాలోని షులాన్ నగరాన్ని హైరిస్క్ జోన్‌గా ప్రకటించిన తరువాత ఈ భయాలు మొదలయ్యాయి.

అయితే, చైనాలో ఇప్పటివరకు కోవిడ్ కేసులు పూర్తిగా అదుపులో ఉన్నాయి. సోమవారం నాటి డేటా ప్రకారం 17 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏడు దిగుమతి అయిన కేసులు. ఎలాంటి లక్షణాలు పైకి కనిపించకుండా కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినవారు 12 మంది. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు.

కొత్త వాటిల్లో అయిదు కేసులు వూహాన్ నగరంలో నమోదయ్యాయి. వైరస్ కేసులు తొలుత ఈ నగరంలోనే భారీ సంఖ్యలో విస్తరించాయన్న సంగతి తెలిసిందే. అయితే, మార్చి 11 తరువాత ఒకే రోజు ఇన్ని కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు.

షులాన్ నగరంలో 11 కొత్త కేసులు నమోదు కావడంతో అక్కడ లాక్‌డౌన్ విధించారు. మొత్తం 11 కేసులకు, లాండ్రీలో పని చేసే ఒక మహిళతో సంబంధం ఉందని అధికారులు తెలిపారు. ఆ 45 ఏళ్ళ మహిళ ద్వారా ఆమె భర్తకు, ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. అయితే, ఆమె ఇటీవలి ప్రయాణ చరిత్ర ఏమీ లేదు.

దాంతో, అధికారులు అప్రమత్తమై నగరాన్ని హైరిస్క్ జోన్‌గా ప్రకటించారు. ప్రజలందరినీ ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు.

స్మితా గిరీశ్

ఫొటో సోర్స్, Smitha Girish

తమ వారికి డబ్బు పంపలేకపోతున్న ప్రవాస భారతీయులు

స్మితా గిరీశ్ కేరళలో తన కుమారుడు ఇషాన్‌తో పాటు ఉంటున్నారు. ఆమె భర్త దుబాయిలో ఉన్నారు. కోవిడ్-19 మూలంగా ఆయన గృహ నిర్బంధంలో చిక్కుకున్నారు. ఉద్యోగం పోయింది.

"నెల రోజులుగా ఆయన తన గదిలో ఖాళీగా కూర్చుంటున్నారు. కొత్త ఉద్యోగంలో చేరలేకపోతున్నారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయడానికీ వీలుపడడం లేదు. మా ఫ్లాట్‌కు మేం చాలా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. పరిస్థితులేమో ఇలా ఉన్నాయి" అని స్మిత వాపోయారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు విదేశాల నుంచి వచ్చే డబ్బే ఆధారం. కానీ, కరోనావైరస్ మూలంగా ప్రవాసులు డబ్బు పంపించలేక పోతున్నారు. దాంతో, చాలా మందికి జీవనాధారం లేని పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)