కరోనావైరస్ అప్‌డేట్స్: మే 12 నుంచి రైలు ప్రయాణాలు.. వెల్లడించిన పీయూష్ గోయల్

ఫొటో సోర్స్, Getty Images
మే 12 నుంచి రైలు ప్రయాణాలను ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
"మే 12 నుంచి రైలు ప్రయాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మే 11 సాయంత్రం 4 గంటల నుంచి ఈ రైళ్లలో ప్రయాణానికి టికెట్ల బుకింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా దిల్లీ నుంచి ప్రధాన నగరాలకు ఈ రైళ్లు ప్రారంభమవుతాయి" అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
న్యూ దిల్లీ నుంచి ముంబయి, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, భువనేశ్వర్, హౌరా, డిబ్రూగర్, అగర్తలా, పట్నా, బిలాస్ పూర్, రాంచీ, మడ్‌గావ్, అహ్మదాబాద్, జమ్ముతావీ నగరాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
మరి కొన్ని రోజుల తర్వాత కోచ్‌ల లభ్యతను బట్టి మరిన్ని ప్రాంతాలకు కూడా రైళ్ల రాకపోకల్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం 20 వేల కోచ్‌లను కోవిడ్-19 కేర్ సెంటర్లుగా మార్చారు. వలస కార్మికుల కోసం శ్రామిక్ స్పెషల్ పేరిట రైల్వే శాఖ రోజూ 300 రైళ్లను నడుపుతోంది.
మే12 నుంచి ప్రారంభయ్యే రైళ్లకు మే 11 సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే సదుపాయం ఉంది. రైల్వే స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్లు మూసే ఉంటాయి. అలాగే ప్లాట్ ఫాం టిక్కెట్లను కూడా అమ్మరు.
కన్ఫర్మ్ టిక్కెట్ ఉన్న వాళ్లను మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తారు. ప్రయాణికులంతా తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలి. స్టేషన్లలోకి అడుగు పెట్టే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
రైళ్ల షెడ్యూల్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 40 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 2.77 లక్షలకు చేరుకుంది. అందులో మూడో వంతు కేసులు, నాల్గో వంతు మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి.
అయితే వాస్తవానికి కేసుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
భారత్‌లో మొత్తం కేసులు సంఖ్య 63వేలకు చేరువవుతోంది. ప్రభుత్వం ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం 62,939 మందికి పాజిటివ్ అని నిర్థరణైంది. ఇప్పటివరకూ 2,109 మంది మరణించారు. గతం 24 గంటల్లో 3277 కేసులు నమోదు కాగా, 127 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో 925 మంది డిశ్ఛార్జ్ కాగా 1010 మంది చికిత్స పొందుతున్నారు. 45 మంది మరణించారు.
తెలంగాణలో 33 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1196కు చేరుకుంది. వీటిలో 415 యాక్టివ్ కేసులున్నాయి. 751 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ 30 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
చేప ప్రసాదం పంపిణీ రద్దు
ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున తమ కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం చేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు.
చేప ప్రసాదం కోసం ఈసారి ఎవరూ రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె నాటికి లాక్ డౌన్ ముగిసినా గానీ ఈసారి చేప ప్రసాదం పంపిణీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బ్రిటన్లో 178 మంది మృతి
కోవిడ్-19 కారణంగా ఆస్పత్రుల్లో మరో 178 మంది మృతి చెందినట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 23,150కి చేరింది. స్కాట్లాండ్‌లో మరో 10 మంది, వేల్స్‌లో 12 మంది, ఉత్తర ఐర్లాండ్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
బ్రిటన్లో లాక్ డౌన్ నిబంధనల్ని త్వరగా సడలించాలని భావిస్తే ముప్పు ఎదుర్కోక తప్పదని శాస్త్రీయ సలహాదారులు ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. అదే జరిగితే ఈ ఏడాది చివరినాటికి మృతుల సంఖ్య లక్ష దాటే ప్రమాదం ఉందని వారు అన్నట్లు తెలిపింది.
రష్యాలో 2 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు
రష్యాలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,012 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 88 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 209,688కి చేరుకోగా... మరణాల సంఖ్య 1,915కి చేరుకుంది.
గత వారం రోజులుగా రష్యాలో రోజుకి పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే సామూహిక పరీక్షల సంఖ్య భారీగా పెరడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
నెల తర్వాత వుహాన్లో మరో కోవిడ్-19 కేసు
చైనాలోని కరోనావైరస్ పుట్టుకకు కేంద్రమైన వుహాన్లో సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ కోవిడ్-19 కేసు నమోదైంది. చైనా జాతీయ ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన 14 కేసుల్లో ఇది కూడా ఒకటి. వైరస్ సోకిన వ్యక్తి 89 ఏళ్ల వృద్ఢుడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఆయనలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండానే పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టు స్థానిక మీడియా తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రేక్షకులు లేకుండానే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్
అమెరికాలో దాదాపు రెండు నెలల తర్వాత ఓ స్పోర్టింగ్ ఈవెంట్ జరిగింది. ఫ్లోరిడాలో జరిగిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఈవెంట్‌కు ప్రేక్షకుల్ని అనుమతించలేదు. కేవలం టీవీల్లో మాత్రమే ప్రసారం చేశారు. అయితే ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు నిర్వహించిన పరీక్షల్లో ఓ క్రీడాకారునితో సహా మరో ఇద్దరికి పాజిటివ్ అని తేలడంలో వారిని మ్యాచ్ నుంచి బహిష్కరించారు.
స్పెయిన్‌లో 2 నెలల్లో తొలిసారిగా తక్కువ మరణాలు
సుమారు 2 నెలల తర్వాత అతి తక్కువ సంఖ్యలో కోవిడ్-19 మరణాలు నమోదైనట్టు స్పెయిన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో కేవలం 143 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్-19 మృతుల సంఖ్య 26,621కి చేరుకుంది. ఏప్రిల్ 2న అత్యధికంగా ఒకే రోజులో 950 మంది మరణించారు.
జర్మనీలో రెండోసారి వైరస్ సోకేవారి సంఖ్యలో పెరుగుదల
ఓసారి కోవిడ్-19 బారిన పడి కోలుకున్న తర్వాత కూడా మళ్లీ ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వారి శాతం జర్మనీలో పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇది ఒక్క శాతంగా ఉందని రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ తెలిపింది. ఇది ఒక శాతం పైబడి పెరుగుతున్నట్టయితే వ్యాధి బారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వైట్ హౌస్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యులు
వైట్ హౌస్‌లోని కోవిడ్-19 టాస్క్ ఫోర్స్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోని ఫౌచీ సహా మరో ఇద్దరు సభ్యులు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల వైరస్ సోకిన వ్యక్తిని కలవడమే అందుకు కారణం. తాజాగా జరిపిన పరీక్షల్లో 79 ఏళ్ల ఫౌచీకి నెగిటివ్ అని తేలింది. అయితే వారికి తరచూ పరీక్షలు నిర్వహిస్తామని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
మళ్లీ కేసులు పెరుగుతుండటంపై దక్షిణ కొరియా ఆందోళన
ఓ వైపు దక్షిణ కొరియా క్రమంగా కరోనా ఆంక్షల్ని సడలిస్తుండగా మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే కొత్తగా 34 కేసులు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇదే అత్యధికం.
ఇవి కూడా చదవండి.
- పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








