కరోనావైరస్ లాక్‌డౌన్: తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు బయలుదేరిన వలస కార్మికుల తొలి రైలు

వలస కార్మికులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత్‌లో లాక్‌డౌన్ ములంగా లక్షలాది కార్మికులు దూర ప్రాంతాలలో చిక్కుకుపోయారు.
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది వలస కార్మికులతో 24 బోగీల ప్రత్యేక రైలు బయల్దేరింది. ఆ రైలులో బయలుదేరిన వారంతా ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్మాణ పనులు చేసే ఝార్ఖండ్ వాసులు.

ఝార్ఖండ్ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రైలును ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. దేశంలో వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో ఈ ఏర్పాటు చేశారు.

“వారంతా హైదరాబాద్ ఐఐటీ క్యాంపలో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు. అక్కడ దాదాపు 2,400 మంది ఉన్నారు. వారిలో 1,230 మంది ఝార్ఖండ్ వారు. నిన్న రాత్రి చాలా తక్కువ సమయంలో రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలులో వెళ్లేవారందరికీ క్యాంపులోనే స్క్రీనింగ్ చేశాం. తరువాత వారిని బస్సుల్లో స్టేషన్‌కు తరలించాం’’ అని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఈ మొత్తం ప్రక్రియను ఆయనే పర్యవేక్షించారు. ఈ కార్మికుల ప్రయాణ ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు ధ్రువీకరించారు.

వలస కార్మికులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రయాణికులు సామాజిక దూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని, వారికి ఆహారం కూడా అందిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

అయితే, హైదరాబాద్‌లోని వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తోన్న స్వచ్ఛంద సంస్థ ఝార్ఖండ్ సమాజ్ సంఘ్ మాత్రం తమకు ఈ రైలు గురించి ఏమాత్రం సమాచారం లేదని అంటోంది.

“మేం ఇళ్లకు వెళ్లడానికి రైళ్ల కోసం ఓపికగా ఎదురు చూస్తున్నాం. మాలో చాలామందిమి ఇతరుల సాయంపై ఆధారపడి బతుకుతున్నాం. ఆ రైలు గురించి మాకెవరికీ సమాచారం లేదు. కానీ, ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారన్న వార్త వినగానే, మా వాట్సాప్ గ్రూపులో చాలా మందికి నిస్సహాయత, కోపం వచ్చాయి’’ అని అజయ్ కుమార్ అన్నారు.

తమకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశాలకు చెందిన వలస కార్మికులు అంటున్నారు.

హైదరాబాద్ ఐఐటీలో పనిచేస్తోన్న ఈ కార్మికులు తాము స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల భారీ ఆందోళన చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. వారంతా నిర్మాణ సంస్థ ఎల్‌ఎండ్‌టీ కింద పనిచేస్తున్నారు. అయితే, గత రెండు నెలల నుంచీ వారికి జీతం రాలేదని చెబుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ కార్మికులపై వారి కుటంబాలు ఆధారపడి ఉంటాయని, వెంటనే వారికి జీతాలు చెల్లించాలని యాజమాన్యాన్ని ఆదేశించినట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావు తెలిపారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

“ఐఐటీ హైదరాబాద్‌లో భవనాల నిర్మాణం కొనసాగించేందుకు అనుమతి రాగానే వారిని పనిలోకి రావాలని పిలిచారు. అప్పుడే ఈ నిరసన జరిగింది. కానీ, గత రెండు నెలల డబ్బూ అందకపోవడంతో గొడవ మొదలైంది. చాలామంది తమను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేశారు” అని జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 27న వివరించారు.

ప్రస్తుతానికి వారికి మార్చి నెల జీతాలు చెల్లించినట్లు తెలిసింది.

వలస కార్మికులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రైల్లోకి ఎక్కించే మందు ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించారు.

రైలులో వారంతా సామాజిక దూరం పాటించేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకున్నామని రైల్వే పోలీస్ ఫోర్స్ డీజీ అరుణ్ కుమార్ తెలిపారు.

“వాళ్లను లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చే ముందే స్థానిక అధికారులు వారిని స్క్రీన్ చేశారు. ఇది నాన్ స్టాప్ రైలు. లింగంపల్లి నుంచి హతియా వరకూ మధ్యలో ఎక్కడా ఆగదు. ప్రతీ బోగీలో మామూలుగా 72 మంది ప్రయాణించే వీలుంటుంది. ఇప్పుడు 54 మంది మాత్రమే వెళ్తున్నారు. వారితో పాటూ రైలులో ఆర్పీఎఫ్ స్క్వాడ్ కూడా ప్రయాణిస్తోంది. భోజనం, మాస్కులు అన్నీ చూసుకున్నాం” అని ఆయన వివరించారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)